దబాయింపుల రూటు కలంపై వేటు! | government duel stands on land grabbing in AP proposed capital Amaravathi | Sakshi
Sakshi News home page

దబాయింపుల రూటు కలంపై వేటు!

Published Wed, Mar 23 2016 2:17 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

దబాయింపుల రూటు కలంపై వేటు! - Sakshi

దబాయింపుల రూటు కలంపై వేటు!

డేట్‌లైన్ హైదరాబాద్
 
రాజధాని భూముల అక్రమాల గురించి రాసిన మీడియా మీద కూడా కేసులు పెడతామని ఏపీ సీఎం పత్రికా గోష్టిలోనే బెదిరించారు. సోమవారం పోలీసులు కృష్ణా, గుంటూరు జిల్లాల సాక్షి విలేకరులను పిలిపించి, భూకుంభకోణం కథనాలకు ఆధారాలను తెలపాలని కోరారు. ఇది జర్నలిస్టులను బెదిరించే ప్రయత్నమే. ఇంతకంటే ఏదైనా మంచి మార్గంలో ప్రభుత్వం ఈ వ్యవహారంలో తమకంటిన కళంకాన్ని తొలగించుకుంటే మంచిది. మీడియా స్వేచ్ఛ జోలికి పోతే ఏం జరుగుతుందో చెప్పే గత అనుభవాలు చాలానే ఉన్నాయి.
 
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏ ప్రాంతంలో వస్తుందో అధికారికంగా నిర్ణయం కాక ముందే, ఆ రాష్ర్ట ప్రజలకు ఎవరికీ తెలియక ముందే ప్రభుత్వంలోని కొందరు పెద్దలు, వారి సన్నిహితులు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, వారిలో కొందరు మంత్రులు, శాసన సభ్యులు సహా ఇతర ప్రముఖులు ఉన్నారని సాక్షి మీడియా కొద్ది రోజుల క్రితం కొన్ని వార్తా కథనాలను ప్రచురించింది. అవి సాక్షి టీవీలోనూ ప్రసార మయ్యాయి. ఆ భూములను కొన్నారని ఎవరెవరి పేర్లు బయటికొచ్చాయో వారు... ఇదంతా పచ్చి అబద్ధం, సాక్షి మీడియా అభూత కల్పన అని ఖండించ లేదు. పైగా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎందుకు కొన్నారో చెప్పు కునే ప్రయత్నం చేశారు. తాము చేసిన దానిలో ఏ తప్పూ లేదని, అధికార పక్షానికి దగ్గరగా ఉన్నామనే తమను అప్రతిష్టపాలు చెయ్యడానికి ప్రయత్ని స్తున్నదని నిందించారు.

దబాయింపులే సమాధానాలా?
అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తే దాని చుట్టు పక్కల ఏ భూముల ధరలు తక్షణం రెక్కలు కట్టుకుని నింగికి ఎగరగలవో అలాంటి భూములనే ఈ పెద్దలు కొన్నారన్నది సాక్షి వాదన. అందుకు ఆధారాలు తన వద్ద ఉన్నా యని కూడా సాక్షి పేర్కొంది. ఇటువంటప్పుడు ఏం జరగాలి? నిజంగానే ఇందులో తమ ప్రమేయమేమీ లేకపోతే ప్రభుత్వ పెద్దలు ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించి, నిజానిజాలు నిగ్గు తేల్చాలి. ఆరోప ణలు ఎదుర్కొంటున్న వారు నిజంగా ఈ కొనుగోళ్ళు చెయ్యలేదా లేక రాజ ధాని ప్రకటన తరువాతనే వాటిని కొనుక్కున్నారా? అనేది విచారణలో తేలు తుంది. కాబట్టి వారంతా పులు కడిగిన ముత్యాల్లా ఈ వివాదం నుంచి బయ టికి రావొచ్చు.

నిరాధారమైన కథనాలను ప్రచురించి ఉంటే, సాక్షి విశ్వ సనీయతకే భంగం వాటిల్లి ఉండేది. కానీ ఏపీ ప్రభుత్వం ఆ పని చెయ్యలేదు. శాసనసభ లోపలా వెలుపలా కూడా దబాయింపునే అస్త్రంగా ఎంచుకున్నది. ఇదంతా ప్రతిపక్షం కుట్రనీ, పెట్టుబడులు రాకుండా అడ్డుకోడానికి ప్రతిపక్ష నాయకుడు ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించడానికే పరిమితం అయ్యింది. అసలు ఇప్పుడు ఏం జరిగినా దాని వెనక ప్రతిపక్ష నాయకుడి హస్తమే కనిపి స్తున్నది ఏపీ పాలక పక్షానికి. ఒక ఏపీ మంత్రి కుమారుడిని తెలంగాణ పోలీసులు ఒక మహిళను వేధించిన కేసులో అరెస్ట్ చేస్తే... ఆ మంత్రి పత్రికా సమావేశం పెట్టి ఇదంతా జగన్‌మోహన్‌రెడ్డి చేయించారని ఆరోపించారు!

కలంపై కత్తి దూసే నేత... తోక ఊపే మర్కటం
సాక్షి మీడియా గ్రూప్ ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి సంబంధించినదే, అందులో దాపరికం ఏమీ లేదు. ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పత్రికను, టీవీ చానల్‌ను ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో అందరికీ తెలుసు. నిష్పక్షపాతంగా నిజాలే రాస్తాం, మాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదంటూ... ఆ ముసు గులో తమ కుల, వర్గ రాజకీయాలను ప్రచారం చేసే, ప్రయోజనాలను రక్షించుకునే మేక వన్నె పులి వంటి యాజమాన్యాల కంటే ఇది ఎలా చూసినా మెరుగే. అయితే సాక్షి మీడియాలో పని చేస్తున్న వారంతా, ముఖ్యంగా జర్న లిస్టులు ప్రతిపక్ష నాయకుడి పార్టీ కార్యకర్తలనే అభిప్రాయాన్ని కలిగించగలి గితే చాలు... అది బయట పెట్టే అధికారపార్టీ అవకతవకలు, తప్పులన్నీ ఒప్పులయి పోతాయనుకుంటే పొరపాటు.

సాక్షిలో పని చేసే జర్నలిస్టులే కాదు, మొత్తంగా ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్‌ల సంఘం (ఏపీయూడబ్ల్యూజే) కూడా ప్రతిపక్ష నాయకుడి పక్షం వహించిందని బాహాటంగా విమర్శించే దుస్సాహసం ఏపీ సీఎం, మంత్రులు, నాయకులూ చేస్తున్నారు. సాక్షి సహా రాష్ర్టంలోని అన్ని మీడియా సంస్థల జర్నలిస్టులందరి సమస్యల మీద 60 ఏళ్ళుగా రాజీలేని పోరాటాలు చేస్తూ సమరశీల ఉద్యమ సంస్థగా అపార విశ్వ సనీయతను సంపాదించుకున్న జర్నలిస్టుల సంఘంపైనే విరుచుకుపడటం వారి అసహనానికి పరాకాష్ట. అది చాలదని... మేమే ఓకే సంఘం పెట్టాం అందులో చేరండి మీకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం అని సాక్షాత్తూ సీఎం బహిరంగ వేదికల మీద జర్నలిస్టులను కోరడాన్ని మించిన దిగజారుడు ఇంకే ముంటుంది? రాజకీయాల్లో  ఉన్న వారిలో కొందరు స్వతంత్ర వ్యవస్థల విశ్వ సనీయతను దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తుంటారు. వారిలో ఏపీ సీఎం సిద్ధహస్తులు.

ఆయన ఏం మాట్లాడినా తోకాడించే పత్రికాధిపత మర్కటం ఒకటి జర్నలిస్టుల ఉద్యమ నాయకుడు సాక్షిలో ఉద్యోగం చేస్తున్నాడనే (‘జగన్ కొలువులో’) వెక్కిరింతతో తన ప్రభుభక్తిని చాటుకుంది. దాదాపు రెండేళ్ళు తెలంగాణ ప్రభుత్వం తనను వేధిస్తే ఆ నాయకుడే, అదే జగన్ కొలువు నుంచి నడిచొచ్చి పోరాటం ముందు భాగాన నిలిచిన విషయం ఆ మర్కటానికి ఇప్పుడు గుర్తుకు రాదు. మీడియా సంస్థల మీద దాడి జరిగిన ప్రతిసారీ జర్నలిస్టు ఉద్యమం ముందు నిలిచింది. సరే, మర్కటాల గొడవ అలా వదిలేద్దాం. అవి ఎప్పుడెలాటి చేష్టలు చేస్తాయో చెప్పలేం కదా?

ముఖ్యమంత్రి తీరు విస్మయకరం
రాజధాని భూముల వ్యవహారానికే వస్తే, ముందే చెప్పినట్టు ప్రభుత్వ పక్షం దబాయింపునే ఎంచుకున్నది. శాసన సభ్యులు, మంత్రులు, నాయకులు సహా సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఇదే పద్ధతిని ఎంచుకున్నారు. శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ జరిగి నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఈ భూముల వ్యవహారాన్ని ప్రస్తావిస్తే సీఎం ఊగిపోయారు, సంయమనం కోల్పోయారు. తన ఇద్దరు మంత్రుల మీద వచ్చిన ఆరోపణలకు ఆధారాలను అందించనంత వరకు సభ సాగే ప్రసక్తే లేదని భీష్మించారు. మా వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, కొనుక్కున్నారు. వ్యాపారం చేసుకోవడం తప్పా? అని ఎదురు తిరిగారు. వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఏ వ్యాపారం ఎట్లా చేస్తున్నారన్నది ముఖ్యం.

సీఎం, ఆయన కుమారుడూ, కొందరు అధికార పక్ష పెద్దలకు బినామీలుగా ఉన్న వారు ముందే ఉప్పందుకుని ఇక్కడ పెద్ద ఎత్తున భూములు కొన్నారన్న సాక్షి వార్తా కథనాల్లో నిజానిజాలు తేల్చడానికి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించ కుండా, ఆధారాలు ఇవ్వందే సభ నడవడానికి వీల్లేదని సీఎం భీష్మించుకు కూర్చోవడం ఆశ్చర్యపరిచింది, ఎబ్బెట్టుగా అనిపించింది. దర్యాప్తునకు అంగీ కరించకపోగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను అర్ధంతరంగా క్లోజర్ మోషన్‌తో ముగించారు. మన శాసన సభ చరిత్రలో 35 ఏళ్ళ తరువాత మొదటిసారి జరిగిందిలా.

పాత్రికేయ స్వేచ్ఛ జోలికి వస్తే....
శాసనసభ వెలుపల సైతం ముఖ్యమంత్రి నిజాలు నిగ్గుతేల్చుతామనే భరోసా ఇవ్వలేదు. రాజధాని భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని రాసిన మీడియా మీద కూడా కేసులు పెడతాం అని ఆయన పత్రికా గోష్టిలోనే బెదిరించారు. నేరం చేసిన వాడి మీదనే ఎందుకు, మీ మీద కూడా కేసు పెట్టాలి అని ఆయన అన్న మాటలు రికార్డయి ఉన్నాయి. ప్రభుత్వం రచించిన ఈ పథకంలో భాగంగానే సోమవారం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సాక్షి విలేకరులు కొందరిని మంగళగిరి పోలీసులు పిలిపించి తమకు అందిన కొన్ని ఫిర్యాదుల దృష్ట్యా ఈ భూకుంభకోణానికి సంబంధించిన వార్తలకు ఆధారాలను తెలపాలని కోరారు. వార్తలకు ఆధారాలను (న్యూస్ సోర్సెస్) అడిగే అధికారం పోలీసులకు ఎంత మాత్రం లేదు. తమ సోర్స్‌ను రక్షించుకోడం కోసం జైలుకు వెళ్ళడానికి సైతం సిద్ధపడ్డ జర్నలిస్టుల ఉదాహ రణలు ఎన్నో ఉన్నాయి. జర్నలిస్ట్‌లు తమ సోర్స్‌ను వెల్లడించడానికి ఇష్టపడక పోతే, వారిని బలవంత పెట్టకూడదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం లోనే ఉంది.

అంతే కాదు, జస్టిస్ పీబీ సావంత్ ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన జర్నలిస్టులను సోర్స్ బయటపెట్టాలని వత్తిడి చెయ్యొ ద్దని న్యాయస్థానాలకు సలహా పూర్వక నోట్‌లను కూడా పంపారు. మరి మంగళగిరి డీఎస్‌పీ జర్నలిస్టులను సోర్స్ చెప్పండని ఏ అధికారాలతో అడుగు తున్నారు? ఇది కేవలం ఖాకీ బలం చూపించి జర్నలిస్టులను బెదిరించే ప్రయత్నమే. ఇటువంటి ప్రయత్నాలు బెడిసి కొడతాయి. ఇంత కంటే మంచి మార్గం ఏదయినా ఎంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని భూముల వ్యవహారంలో తమ వారికి వచ్చిన కళంకాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తే మంచిది. మీడియా స్వేచ్ఛ జోలికి పోతే ఏం జరుగుతుందో చెప్పడానికి పాలకులకు గత అనుభవాలు చాలానే ఉన్నాయి.


- దేవులపల్లి అమర్
 datelinehyderabad@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement