ఇద్దరూ ఇద్దరే.. నటనలో ఉద్దండులే
ఈ ఇద్దరు నేతల నైజం తెలిసిన వారు ఈ స్నేహం ఎంతకాలం నిలుస్తుందంటున్నారు. నిజంగానే వారు తెలుగు ప్రజలందరి బాగును కోరితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఇంకో రకంగా ఉండేవి. పక్క రాష్ర్టంతో చెలిమే నిజంగా చంద్రబాబు లక్ష్యమైతే ఓట్లకు కోట్లు వ్యవహారం జరిగి ఉండేది కాదు. టీడీపీ ఎమ్మెల్యేలను, ఇతర నేతలను కేసీఆర్ ఎడాపెడా కొనుగోలు చేసేవారూ కారు. ఏదేమైనా ఈ స్నేహం వెల్లివిరుస్తుండగానే రెండు రాష్ట్రాల ప్రజలకూ మేలు కలిగే పనులు కొన్నయినా జరగాలని కోరుకుందాం.
రాజకీయాలు, రాజకీయ నాయకుల గురించి పెద్దలు చాలా మాటలు చెపుతుంటారు. వాటిలో బాగా ప్రచారం పొందినవి రెండు. ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులూ ఉండరు’ అనేది మొదటిది కాగా, ‘రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు తప్ప’ అన్నది రెండవది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఆయన ఇంటికి వెళ్లి మరీ కలుసుకుని ముచ్చట్లాడారు. తాము నిర్మించనున్న నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావలసిందిగా ఆహ్వానిం చారు. చంద్రశేఖర్‌రావు కూడా తన ఒకప్పటి నాయ కుడు, సహచరుడు అయిన చంద్రబాబును సాదరంగా ఆహ్వా నించి, సకల మర్యాదలు చేశారు.
అమరావతి శంకుస్థాపన వేడుకకు తప్పక హాజరవుతానని తెలిపి పంపించారు. ఇదొక ప్రత్యేకమయిన సందర్భం. మీడియాకయితే ఎక్కడలేని ఆసక్తి కలిగించిన ఘటన. ఒక రాష్ర్ట ముఖ్యమంత్రి ఇంకో రాష్ర్ట ముఖ్య మంత్రిని కలుసుకున్నారు, ఇందులో అంత అపురూపమయిన విషయం ఏముంది అని మరే సందర్భంలోనైతే అనుకోవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి అలాంటిది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం విడి పోయి ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా ఏర్పడి పదహారు మాసాలవు తోంది. ఈ కాలమంతటా రెండు తెలుగు రాష్ట్రాలలో పారిన కృష్ణా. గోదావరి నదీ జలాలన్నీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల, వారి ప్రభుత్వాల, నాయకుల మధ్య రగిలిన విద్వేషాల విషంతో కలుషితమయ్యాయి. అటూ ఇటూ కూడా ప్రజల మధ్య తీవ్ర విభేదాల గోడలు దడికట్టి నిలిచాయి, పరస్పర విద్వేషాల నీడలు కమ్ముకున్నాయి.
‘రాజకీయాల్లో ఏదీ తప్పు కాదు’
ఈ పదహారు మాసాల కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకున్నది రెండు సందర్భాలలోనే. అయితే కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకున్నది మాత్రం ఒక్కసారే. ఇప్పుడు మళ్లీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం రూపంలో ఈ ఇద్దరు నేతల కలయిక ఇలా జరిగింది. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మొన్నటి కలయిక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు అనడానికి తాజా ఉదాహరణ. ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈయనా ఆ మర్యాద నిలపడానికి వెళతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూటికి నూరు శాతం రాజకీయ జీవి. రాజకీయాల్లో ఏదీ తప్పు కాదు అనుకునే నాయకుడు. మన రాజకీయ ప్రయో జనాల కోసమైతే ఎవరితోనైనా కలవవచ్చు, ఎవరినయినా దూరంగానైనా పెట్టవచ్చు అని మనసా వాచా కర్మణా నమ్మే వ్యక్తి. అదే నిజం కాకపోతే పదేళ్ల ఎడ బాటు తరవాత మళ్లీ ఆయన భారతీయ జనతా పార్టీతో దోస్తీ చేస్తారా? తాను ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీని రాష్ర్టంలోకి అడుగుపెట్టనిచ్చేది లేదు అన్న మనిషే ఆయనకు స్నేహ హస్తం చాచేవారా? గోధ్రా తరవాత జరి గిన గుజరాత్ అల్లర్ల తదుపరి నాడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, మోదీని రాష్ర్టంలో అడుగు పెట్టనిచ్చేది లేదని ప్రకటించిన విషయం ఇంకా ఎవరూ మరచిపోలేదు. నరేంద్ర మోదీ అంతకన్నా రెండాకులు ఎక్కువే చదువుకున్నవారు. కాబట్టే ఆ అవమానాన్ని పక్కన పెట్టి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో చంద్ర బాబుతో చేయి కలిపారు.
కపటత్వంలో ఎవరికి ఎవరూ తక్కువ కారు
రాజకీయ కపటత్వం ప్రదర్శించడంలో ఎవరూ తక్కువ తిన్నవారు కారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కూడా వీళ్లకు సమ ఉజ్జీగానే నిలుస్తారు. రాజకీయ అవసరాలు నెరవేర్చుకోడానికి ఆయన ఎంత దూరమైనా వెళ్లగలరు. తెలంగాణ రాష్ర్ట సాధన పేరిట కాంగ్రెస్, వామ పక్షాలతో చెలిమి చేయడమూ, కాంగ్రెస్‌ను వదిలేసి తెలుగుదేశం, వామ పక్షాలతో కలసి మహా కూటమి కట్టడమూ, ఆ కూటమి భవిష్యత్తు ఇంకా బ్యాలట్ బాక్సుల్లో ఉండగానే లూధియానాకు వెళ్లి బీజేపీ ఎన్నికల వేదిక ఎక్కడమూ ఆయనకే చెల్లింది.
తెలంగాణ రాష్ర్ట సమితి సాగించిన మలి విడత ఉద్యమం తొలి రోజుల్లో వామపక్షాలతో స్నేహం కోసం తాపత్రయపడ్డ ఆయనే నేడు అదే వామపక్షాలను దిక్కుమాలిన పార్టీలు అని చీదరించు కుంటుండటం చరిత్ర పుటల్లో నమోదవుతూనే ఉంది. ఇటువంటి విషయాల్లో మోదీ, బాబుల కంటే చంద్రశేఖర్‌రావు ఏ విధంగానూ తక్కువేమీ కాదని తెలంగాణ రాష్ర్టం ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అస్తిత్వమే కోల్పోయిన కాంగ్రెస్‌కు, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి బాగా తెలుసు. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనేది.
స్నేహం వికసిస్తుండగానే ఏదైనా మేలు చేస్తారా?
అయితే ఏంటి? ఇప్పుడు ఎంతో పెద్ద కార్యక్రమం పెట్టుకున్న చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రిని కలుసుకోవడం తప్పా? అని ఎవరయినా అనొచ్చు. అది ఎంత పెద్ద కార్యక్రమమో పక్కకు పెడితే... అలా పిలవడం ఎంత మాత్రం తప్పు కాదు. కానీ ఈ ఇద్దరు నేతల రాజకీయాలు తెలిసిన వారు ఈ స్నేహం, సౌహార్ద్రత ఎంత కాలం నిలిచేది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే వారిద్దరూ తెలుగు ప్రజలందరి బాగు కోరితే ఈ పదహారు మాసాల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాల తీరు తెన్నులు ఇంకో రకంగా ఉండేవి. పక్క రాష్ర్టంతో చెలిమే నిజంగా చంద్ర బాబు లక్ష్యమైతే ఆయన నేతృత్వంలోనే తెలంగాణలో ఓట్లకు కోట్లు వ్యవ హారం జరిగి ఉండేది కాదు.
ఎమ్మెల్యేలను కొనాలనే ఆలోచనే వచ్చేది కాదు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లను, ఇతర నాయకులనూ ఎడాపెడా కొనుగోలు చెయ్యనూ కూడదు. ఇంకా అనేక విషయాల్లో మర్యాదకరమైన ప్రవర్తన సరిహద్దులను దాటి, తమ స్థాయిని మరచి ఇరువురు ముఖ్య మంత్రులూ ఒకరి మీద ఒకరు చేసిన విమర్శలు, దూషణలూ చరిత్ర నుంచి చెరిగి పోయేవేవీ కాదే. ఈ నేపథ్యంలోంచి చూస్తే మొన్న ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి బేగంపేట విడిది లాన్స్‌లో విరిసిన ఈ స్నేహ పుష్పం ఎంత కాలం వికసిస్తూ ఉంటుందో వేచి చూడాలి. ఈ స్నేహం వెల్లివిరుస్తుండగానే రెండు రాష్ట్రాల ప్రజలకూ మేలు కలిగే పనులు కొన్నయినా జరగాలని కోరుకుందాం.
టీఆర్‌ఎస్ నెత్తిన పాలు పోసిన నాయక్
ఇక రాజకీయాలు, రాజకీయ నాయకుల గురించిన రెండో నానుడి దగ్గరికి వద్దాం. రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయి అనే మాట బహుశా బలరాం నాయక్ వంటి కాంగ్రెస్ నాయకుల తీరును చూసే పుట్టిందేమో. గిరిజనులకు కేటాయించిన మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో బలరాం నాయక్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. గిరిజనుడు అయినంత మాత్రాన ఆయనకు ఏమీ తెలియదనుకుంటే పొరపాటు. ఆయన చదువుకున్నారు, పోలీసుశాఖలో కొంత కాలం ఉద్యోగం కూడా చేశారు.
పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాక స్వల్ప కాలమే అయినా కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. రాష్ట్రాన్ని విభజించి కూడా కాంగ్రెస్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఓడిపోయింది. పార్టీతో బాటే ఆయనా ఓడిపోయారు. ఇప్పుడు అదే జిల్లాలో వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించకపోతే తెలంగాణను మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో కలిపేస్తామని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఆ నియోజకవర్గ ప్రజలను బెదిరించారు. సభా వేదిక మీదున్న మిగిలిన కాంగ్రెస్ నాయకులు వారించినా వినకుండా మళ్లీ అదే మాట రెట్టించారు.
అరవై సంవత్సరాల సుదీర్ఘ మధనం తర్వాత జరిగిన ఈ విభజనను ఒక ఉప ఎన్నికలో... అదీ కూడా కాంగ్రెస్ గెలిస్తే కాదు ఓడిపోతే తిరగరాస్తాం అన్న ఆయన మాటల ఫలితం ఏమిటి? తాడ్వాయి ఎన్‌కౌంటర్ సహా పలు కారణాల చేత వరంగల్ ఉపఎన్నిక నాటికి ప్రజల్లో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను చూసి ఆందోళన చెందుతున్న టీఆర్‌ఎస్ నెత్తి మీద పాలు పోసినట్టయింది. రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని బలరాం నాయక్ మరోమారు రుజువు చేశారు.
datelinehyderabad@gmail.com
- దేవులపల్లి అమర్