‘గల్ఫ్’ అంతర్జాతీయ భూకబ్జా | Gulf Countries International Land Grabbing | Sakshi
Sakshi News home page

‘గల్ఫ్’ అంతర్జాతీయ భూకబ్జా

Published Tue, Aug 5 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM

‘గల్ఫ్’ అంతర్జాతీయ భూకబ్జా

‘గల్ఫ్’ అంతర్జాతీయ భూకబ్జా

సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాలు ‘విదేశాల్లో ఆహార ఉత్పత్తి’పై పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాయి. పెట్రో డాలర్లతో సాగిస్తున్న విదేశీ పంట భూముల కబ్జాను ‘దీర్ఘకాలిక జాతీయ ఆహార భద్రత వ్యూహం’గా పిలుస్తున్నారు.
 
భూముల కబ్జాలు, భూ దందాలు ఇప్పుడు జాతీయ సరిహద్దులను దాటిపోయాయి. అంతర్జాతీయ స్థాయిలో సాగే భూ కబ్జా వ్యవహారాలను నాజూకుగా భూముల ‘‘కొనుగోళ్లు’’, ‘‘ఒప్పందాలు’’ అని పిలుస్తున్నారు. అమెరికా, ఈయూ దేశాల ఆగ్రో బిజినెస్ గుత్త సంస్థలు, చైనా, తదితర దేశాలు ఆఫ్రికా ఖండంలో సాగిస్తున్న భూ కబ్జాపై అంతర్జాతీయ మీడియా ఇప్పటికే పలు కథనాలను ప్రచురించింది. వ్యవసాయ బహుళ జాతి సంస్థలు, దేశాలు కలసి 2011లో.. ఒక్క సంవత్సరంలోనే విదేశాల్లో కనీసం 8 కోట్ల హెక్టార్ల భూ ఒప్పందాలను కుదుర్చుకున్నాయని ప్రపంచ బ్యాంకు సమాచారం. ఈ విదేశీ భూ ఒప్పందాలన్నీ ప్రైవేట్ రంగంలోనే జరిగాయి.

విదేశీ భూ లావాదేవీల్లో గల్ఫ్ దేశాలు ఇటీవలి కాలంలో ప్రముఖ స్థానంలో నిలవడం సంచలనం రేపుతోంది. 2011లో కుదిరిన ప్రపంచవ్యాప్త భూ ఒప్పందాల్లో యూఏఈ 12 శాతం, ఈజిప్టు 6%, సౌదీ అరేబియా 4% ఒప్పందాలను చేజిక్కించు కున్నాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్య దేశాలు 25 నుంచి 99 ఏళ్ల వ్యవధిలో దీర్ఘకాలిక లీజుకు సిద్ధపడ్డాయి. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్‌లు తమ పౌరులను కూడా ‘విదేశాల్లో ఆహార ఉత్పత్తి’పై పెట్టుబ డులను పెట్టవలసిందిగా ప్రోత్సహిస్తున్నాయి. విదేశీ పంట భూములను పెట్రో డాలర్లతో స్వాధీనం చేసుకోవడాన్ని ‘దీర్ఘకా లిక జాతీయ ఆహార భద్రత వ్యూహం’ అని పిలుస్తున్నారు.

నేపథ్యం: 2008లో ఏర్పడ్డ అంతర్జాతీయ ఆహార సంక్షోభం గల్ఫ్ ప్రాంత విధాన నిర్ణేతల కళ్లు తెరిపించింది. సౌదీ అరేబి యాలాంటి సంపన్న దేశం కూడా, పెట్రో డాలర్లు ఎన్ని ఉన్నా తిండి గింజలు లేకపోతే ప్రమాదమని గుర్తించక తప్పలేదు. ఆహార ధాన్యాల దిగుమతులకు బదులుగా వ్యవసాయ దేశాల కు చమురు ఎగుమతులను చేసే సంప్రదాయక పద్ధతులు నేటి గ్లోబలైజేషన్ యుగంలో కాలం చెల్లిపోయినవిగా మారిపోయా యి. అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ మార్కెట్లలో గుత్త సంస్థల ఆధిపత్యం, ఫ్యూచర్ ట్రేడింగ్ మాయలు కలసి ఆహార ధరలను నిత్యం అస్థిరతకు గురిచేస్తున్నాయి. దీంతో తిండిగిం జల మార్కెట్లలోని అస్థిర పరిస్థితులను తట్టుకోవాలంటే ‘సొంత వ్యవసాయం’ ‘సొంతంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి’ అవసరమని జీసీసీ దేశాలు భావిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు క్రమక్రమంగా క్షీణించి పోయే ధోరణి కనిపిస్తోంది. జనాభా పెరుగుదలతో పాటు, వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ ఉత్పత్తులలో ఎగుడు దిగుడులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఒకటికి మించి పలు దేశాల్లో, వీలైతే పలు ఖండాల్లో ‘సొంత ధాన్యాగారాలను’ ఏర్పాటు చేసుకుంటేనే ‘దీర్ఘకాలిక ఆహార భద్రత’ సాధ్యం! అందుకనే చమురు సంపన్న గల్ఫ్ దేశాలు విదేశాల్లోని భూములను కొనుగోలు చేస్తున్నాయి.

వచ్చే రెండు దశాబ్దాల కాలంలో అదనంగా పెరగబోయే ఆహార ఉత్పత్తిలో 80 శాతానికి పైగా వర్ధమాన దేశాల్లోనే జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘అగ్రికల్చరల్ అవుట్‌లుక్ 2014-23’ తెలిపింది. అలా అని ప్రపంచంలోని నిరుపేదలకు తిండిగింజలు అందుబాటులోకి రావని, అందుకు అధిక ఆహార ధరలే కారణమని ఓయీసీడీ సెక్రటరీ జనరల్ ఏంజెలా గుర్రియా అన్నారు. అధిక ఆహార ధరల వల్ల చిన్న రైతులకు మేలు జరగకపోగా వారు తిండిగింజలను కొనుక్కో లేని పరిస్థితులు తలెత్తుతాయని ఆమె హెచ్చరించారు. తిండి గింజలు పండే దేశంలో ప్రజలకు తిండి గింజలపై హక్కు ఉండని పరిస్థితులను ఈ భూకబ్జాలు సృష్టించబోతున్నాయి.

భారీ ఎత్తున సాగుభూములను కైవసం చేసుకోవడం ఆయా దేశాల స్థానిక ప్రజలపై తీవ్రమైన ప్రభావం కలిగి స్తోంది. తరతరాలుగా తమ స్వాధీనంలో ఉన్న సాగుభూముల కు వీరు శాశ్వతంగా దూరమవుతున్నారు. విదేశీ కంపెనీలతో భారీ భూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న జాతీయ ప్రభుత్వా లను స్థానిక సంస్థలు సవాలు చేస్తున్నాయి. సెర్బియాలో రైతులు ఇప్పటికే తమ భూములను హస్తగతం చేసుకున్న అబూ దుబాయ్ కంపెనీ ‘అల్ రాఫెద్ అగ్రికల్చర్’పై ఫిర్యాదు చేశారు. దీంతో భారత్ వంటి వర్ధమాన దేశాల్లో రాజకీయ పార్టీల మనుగడకు ఆహార భద్రత కీలకాంశంగా మారుతోంది.  దేశ జనాభాలో 80 కోట్ల మందికి ఆహార భద్రతను కల్పిం చాలని ప్రయత్నిస్తున్న మన ప్రభుత్వం కూడా మారుతున్న పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

 - కె. రాజశేఖర రాజు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement