K. Rajasekhara raju
-
గాంధారదేశంలో ‘మగమ్మాయిలు’
పాలన, z అవసరాల కోసం మగవేషం ధరించిన రాజకుమార్తెలు, సామాన్య మహిళలు చరిత్రకు కొత్త కాదు. మన దేశంలో కాకతి రుద్రమ, ఫ్రాన్స్‌లో జోన్ ఆఫ్ ఆర్క్ ఇందుకు ఉదాహరణలు. కాని ఆప్ఘనిస్థాన్‌లో పలు కుటుంబాలు ఆడపిల్లను అబ్బాయిల్లా పెంచుకోవడం ఆర్థిక అవసరమవుతోంది. మగ సంతానమే కావాలని డిమాండ్ చేసే సమాజాల్లో కుమార్తె జుత్తు కురచ చేసి మగపేరును పెట్టడం కద్దు. ఇలా కుటుంబాలలో ‘మగమ్మాయిలు’ ఉండటం చరిత్రకు కొత్తది కాదు కానీ, ఆప్ఘనిస్థాన్‌లో ఇది ప్రస్తుతం కొత్త పోకడలు పోతోంది. రాజధాని కాబూల్‌లోనే, పాఠశాలల్లో అంతవరకు ఆడపిల్లలుగా కనిపించిన వారు తరగతి మారగానే మగపిల్లల వేషంలో కనిపిస్తున్నారు. ఇలా అబ్బాయిలను పోలిన అమ్మాయిలు రికార్డులలో ఉండకపోవచ్చు. కానీ పొరు గువారు, బంధువులు, సహోద్యోగి లేదా కుటుంబంలో ఎవరో ఒకరు తమ కూతురిని కుమారుడిగా పెంచడం అక్కడ వాడుకైపోయింది. ఇలాంటి పిల్లలను స్థానికంగా ‘బచా పోష్’ అని పిలుస్తు న్నారు. అంటే అబ్బాయిల్లా బట్టలు ధరించడమని అర్థం. సంపన్నులు, నిరుపేదలు, విద్యావంతులు, నిరక్షరాస్యులు అందరూ ఇంటికొక్క ‘బచా పోష్’ను పెంచుకుంటున్నారు. కుమార్తెలను చిన్నచూపు చూసే సమాజంలో కుమారుల కోసం కుటుంబాల అవసరంలోంచే ‘బచా పోష్’లు ఉనికిలోకి వస్తున్నారు. బాలికలను పనికి అనుమతించని చోట, అబ్బాయిల ద్వారా ఆదాయం అవసరమయ్యే కుటుంబాలకు ఈ మగమ్మాయిలు చేదోడుగా ఉంటున్నారు. సంపన్న కుటుంబాలకంటే పేద కుటుంబాలకే మగవేషం లోని అమ్మాయిల అవసరం ఎక్కువగా ఉంటోంది. ఎటొచ్చీ రజస్వల కావడానికి ముందే ‘అతడు’ మళ్లీ ‘ఆమె’ రూపంలోకి తప్పకుండా మారాలి. పెళ్లికి, పిల్లలను కనడానికి ఇది ఓ ముందు షరతు. బహిరంగంగా తరగతి గదుల్లో సంవత్సరాలపాటు ఆడ పిల్లలు మగవేషంలో ఉండటం, పని స్థలాల్లోనూ మారు రూపంలో మెలగడం చాలా కష్టం. ఇది తాను ఆడపిల్లను అనే ఎరుకతో ఉంటూనే బయటి సమాజంలో అచ్చం అబ్బాయిలా మెలగడం. అబ్బాయి వేషం దాల్చినప్పటినుంచి ఆమె కుట్టడం, బొమ్మలాటలు మానేయాలి. వాటికి బదులు సైక్లింగ్, సాకర్, పరుగు పందేలలో పాల్గొనాలి. సగటు అబ్బాయికి భిన్నంగా ఆమె ప్రవర్తన ఉండరాదు. అలాగని వయసొచ్చిన అబ్బాయి లకు సన్నిహితంగా ఉండకూడదు. పొరపాటున వారు ఆమెను తాకినా, ఆమే వారిని తాకినా ఆమె అపవిత్రురాలై పోతుంది. గుట్టు బయటపడితే కుటుంబం పరువు పోవడంతోపాటు ఇక పెళ్లయ్యే అవకాశం కూడా ఉండదు. అందుకే మైనర్ బాలికలే ఆ దేశంలో ‘బచా పోష్’లుగా ఉంటున్నారు. తమ మధ్యన కూర్చున్నది అబ్బాయి రూపంలోని అమ్మాయి అని తెలిస్తే విద్యార్థులు భోజనం కూడా ముట్టరు. ఇక బయట పనిచేయవ లసిన బచా పోష్లకు మరీ కష్టం. షెల్ఫ్ పైనుంచి సరకులను తీసేటప్పుడు తన లోపల దాగిన ఆడతనం బయటపడకూడదు. పైగా దుకాణాల్లో కస్టమర్లకేసి నేరుగా చూస్తే తన మారు వేషం బయటపడొచ్చు. చివరకు ఎక్కువ మాట్లాడినా కష్టమే. ఎందుకంటే మాట్లాడితే అమ్మాయి గొంతు అని తెలిసిపోతుంది. ఇంత కష్టపడి ఆమె సంపాదించే రోజుకూలీ ఎనిమిదిమంది అక్కాచెల్లెళ్లున్న కుటుంబానికి ఏమాత్రం సరిపోదు. పైగా పుస్తూన్ మహిళలు, బాలికలు కొట్లలో పనిచేయడం నిషిద్ధం. పదేళ్లలోపు అమ్మాయి, అబ్బాయి అవతారమెత్తితే ఇన్ని ప్రమాదాలను ఎదుర్కోవాలి. వయసు పెద్దదయితే ఆమె తన కొత్త వేషం వదులుకోవాలి. ఆమె చెల్లి ఇకపై అబ్బాయిగా మారుతుంది. నిత్య ఘర్షణలతో నలిగిపోతున్న ఆప్ఘనిస్తాన్‌లో కుటుంబానికి కాసింత ఆసరా ఏ మూలనుంచి లభించినా అది కొండంత సహాయమే మరి. దేశంలోని అన్ని గ్రామాల్లో స్కూళ్లలో, స్టోర్లలో, హోటళ్లలో ఇలా ప్రతి చోటా వీరి ఉనికి కనబడుతోంది. చరిత్రలో ‘మగమ్మాయిలు’: ప్రాచ్య, పాశ్చాత్య దేశాల చరి త్రలో ఇలాంటి మగమ్మాయిలకు కొదవలేదు. ప్రాచీన కాలంలో పలువురు మహిళలు సైనికులుగా అవతరించారు. క్రీ.శ తొలి శతాబ్దంలోనే రోమ్ రాణి ట్రయారియా తన చక్రవర్తి భర్తతో కలిసి పురుషవేషంతో యుద్ధంలో పాల్గొన్నది. మూడో శతాబ్దంలో సిరియా రాణి జెనోబియా సైనిక దుస్తులతో రోమన్ సామ్రాజ్యంతో యుద్ధం చేసింది. ఇదే కాలంలో చైనాలో హువా ములన్ తన తండ్రి స్థానంలో అతడి దుస్తులు ధరించి యుద్ధంలోకి దిగింది. 1424లో ఇంగ్లండ్‌పై ఫ్రాన్స్ యుద్ధంలో జోన్ ఆఫ్ ఆర్క్ సైనికుడిలా పాల్గొని చరిత్రకెక్కింది. మన కాకతీయ సామ్రాజ్యంలో గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవి పురుష వేషంలోనే రాజ్యాన్ని పాలించింది. పురుషులకు, తమకు మధ్య ఉన్న తేడా ఏమిటిని అడిగితే ‘స్వతంత్రం’ అని నేడు ఆప్ఘన్ మహిళలు ముక్తకంఠంతో జవాబిస్తున్నారు. అక్కడ పురుషులకు ఉన్నదీ, మహిళలకు లేనిదీ ఆ మూడక్షరాలే. వారికి పుట్టుక మాత్రమే వాస్తవం. లైంగికత, స్వతంత్రం అనేవి కేవలం ఆదర్శాలు. ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి తమ లైంగికతను పరిత్యజించడం తప్పనప్పుడు... పొడుగు జడలు, కురచ జుత్తు, ప్యాంట్, స్కర్ట్ వంటి వాటి గురించి ఎవరు పట్టించుకుంటారు? ఖైదీగానో, బానిస గానో ఇంట్లో పడి ఉండటమే జీవితం అవుతున్న చోట మారు రూపంలో గడప దాటడానికి ఎవరు సంశయిస్తారు? ఆప్ఘనిస్తాన్‌లో అబ్బాయిల్లా జీవిస్తున్న మెహ్రాన్, షబ్నమ్, నీమా వంటి వేలాదిమంది అమ్మాయిలకు ఇష్టంలేని పెళ్లిని తప్పించుకో వడం, ఇల్లు దాటి బయట అడుగుపెట్టడమే నేడు స్వతంత్రం. కె.రాజశేఖరరాజు -
ఈ ‘కుల’కలం ఫలితాలనిస్తుందా?
జననేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నితీష్ ఈ లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. జాతీయ రాజకీయ హీరోగా ఆవిర్భవించాలనే స్వప్నం ఫలించదని అర్థమైంది. రాజకీయ అస్తిత్వం కోసం పాతమిత్రులతో పొత్తు తప్పదని గ్రహించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని తెలి సిందే. బీహార్ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉంటున్న మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ), నితీష్ కుమార్ (జేడీయూ) తమ విభేదాలను పక్కనబెట్టి 10 శాసనసభ స్థానాలకు ఆగస్టు 21న జరగనున్న ఉప ఎన్నికల్లో చే తులు కలిపారు. బీజేపీని ఐక్యంగా ఎదుర్కొనే ప్రాతిపదికన పొత్తు కుదుర్చుకుంటున్నామని నితీష్ ప్రకటించారు. సార్వ త్రిక ఎన్నికల్లో తల బొప్పి కట్టిన కాంగ్రెస్ కూడా పొత్తుకు సై అంది. కోల్పోయిన చోటే దొరకబుచ్చుకోవాలన్న ఈ ఆరా టానికి ప్రాతిపదిక ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీలకు బీహార్‌లో 44.3 శాతం ఓట్లు రాగా, అధికారం దక్కించుకున్న ఎన్డీయేకి 38.8 శాతం ఓట్లు వచ్చాయి. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌కు మొత్తం ఓట్లలో 49.83 శాతం రాగా, బీజేపీ, ఎల్జేపీలకు 23.21 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఐక్య పోరాటం ద్వారానే రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోగలమని పై మూడు పార్టీలూ గ్రహించాయి. గత పదేళ్లుగా మీడియాలో మోతాదుకు మించి లభిం చిన ప్రచారంతో నితీష్ ఏకంగా ప్రధాన మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. సోషలిస్టుగా చెప్పుకునే నితీష్, ఒక ప్పటి మిత్రుడు లాలూను వీడి, మతతత్వ పార్టీగా పేరుమో సిన బీజేపీతో చెయ్యి కలిపి 17 సంవత్సరాలుగా ఎన్డీయేతో కలిసి బీహార్ రాజకీయాల్లో వెలిగారు. లాలూ, కాంగ్రెస్‌లను వరుస ఎన్నికల్లో ఓడించారు. ప్రధాని పదవిపై ఆశతో నరేం ద్రమోడీకి వ్యతిరేకంగా నిలిచి, ఎన్డీయేను వీడారు. లోక్‌సభ ఎన్నికల్లో దానికి భారీ మూల్యం చెల్లించారు. రాష్ట్రంలోని 40 ఎంపీ స్థానాల్లో 38 స్థానాలను ఎగురేసుకుపోయిన ఎన్డీఏ కూటమి నితీష్ సీఎం పదవికే ఎసరు తెచ్చింది. దీంతో నితీష్‌కు కొత్త పొత్తు అవసరమైంది. చేపట్టిన అభివృద్ధి పనులు మాత్రమే ఓట్లు సాధించి పెట్టవని గ్రహిం చారు. అలాగే, పశు దాణా కుంభకోణంలో అప్రతిష్టపాలైన లాలూ, 2004 కేంద్రంలో రైల్వే మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఒక్క బీహార్ రాష్ట్రానికే రూ. 52 వేల కోట్ల విలువైన రైల్వే తదితర అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకువచ్చారు. అయితే ఇవేవీ లాలూను కాపాడలేదు. ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ఇద్దరు నేతలకు తమ ఒకప్పటి మైత్రి, సోష లిస్టు, సెక్యులర్ భావజాలం గుర్తుకొచ్చింది. పార్లమెంటు ఎన్నికల ముందు పెట్టుకోవలసిన పొత్తును అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఏర్పర్చుకోవడంలో అర్థం ఏమి టన్నది సందేహం. నిజానికి ఈ పొత్తు తాత్కాలికం కాదు. లోక్‌సభ ఎన్నికలు దేశంలో కుల సమీకరణలకు సంబం ధించి కొత్త కోణాన్ని ముందుకు తీసుకువచ్చాయి. కుల ప్రాతిపదికన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో పాతుకుపో యిన రాజకీయ పార్టీల కంచుకోటలను బీజేపీ, సంఘ్ పరి వార్ బద్దలు కొట్టాయి. ప్రజల్లోని అభివృద్ధి కాంక్షకు విలువ ఇవ్వనిదే హిందుత్వ రాజకీయాలు విజయవంతం కావని అవి గుర్తించాయి. ముస్లింలతో సహా అన్ని కులాలు, కమ్యూ నిటీలను సమీకరించాలనే వ్యూహాన్ని అమలు పర్చడం ద్వారా వీరు మతాన్ని, అభివృద్ధిని విజయ మంత్రంగా మార్చారు. ఉత్తర భారతాన్ని కుల రాజకీయాలతో శాసి స్తున్న అన్ని పార్టీలకూ ఇది సవాలుగా మారింది. అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాతినిధ్యం లభించనందునే బీసీలు, దళిత నేతల పాలనను ఓటర్లు తిరస్కరించారని ఎన్నికలు తేల్చి చెప్పాయి. 2015లో బీహార్‌లో, 2017లో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఈ మారుతున్న కుల సమీకరణాలతోటే మరో యుద్ధానికి తెర తీయనున్నాయి. లాలూ, నితీష్ మధ్య కుదిరిన పొత్తు ఉప ఎన్నికలకు పరిమితం కాదు. మత అస్తిత్వ రాజకీయాలను కుల అస్తిత్వ రాజకీయాలతో అడ్డుకోగలమనే పకడ్బందీ వ్యూహంలో భాగంగానే వీరి మధ్య పొత్తు కుదిరింది. ఈ ఫార్ములాను లాలూ మరింత స్పష్టంగా ముందుకు తెచ్చారు. మండల్ ద్వారానే కమండలాన్ని నిలువరిద్దాం అనే నినాదాన్ని ప్రతిపాదించారు. నితీష్ తన ముఖ్యమంత్రి పదవిని త్యజించడం కూడా ఈ వ్యూహంలో భాగంగానే జరిగింది. ఎన్నికల్లో ఎందుకు దెబ్బతిన్నామన్న గ్రహింపుతో, రాష్ట్రంలో బాగా వెనుకబడిన ముషాహర్ కులానికి చెందిన జితన్ మజికి సీఎం పదవిని కట్టబెట్టారు. అయితే తనకు బలమైన పునాదిగా నిలిచిన మహా దళిత్ సామాజిక బృందాలకు, తాను కొత్తగా కూడగడుతున్న యాదవులు, భూమిహార్లకు మధ్య సమతూకం ఎలా సాధిస్తారనే అంశంపైనే నితిన్ భవిష్యత్తు ఆధారపడనుంది. దేశాన్ని కుదిపేసిన మండల్, మందిర్ రాజకీయాల కాలంలో లాలూ ప్రసాద్, నితీష్‌లు ఒక వెలుగు వెలిగారు. పాతికేళ్ల తర్వాత అదే మండల్ రాజకీయాల పునరుద్ధరణతో కమండల రాజకీయాలను నిలువరించాలని వీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనే ప్రశ్నకు కాలమే జవాబు చెప్పాలి. - కె.రాజశేఖరరాజు -
‘గల్ఫ్’ అంతర్జాతీయ భూకబ్జా
సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాలు ‘విదేశాల్లో ఆహార ఉత్పత్తి’పై పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాయి. పెట్రో డాలర్లతో సాగిస్తున్న విదేశీ పంట భూముల కబ్జాను ‘దీర్ఘకాలిక జాతీయ ఆహార భద్రత వ్యూహం’గా పిలుస్తున్నారు. భూముల కబ్జాలు, భూ దందాలు ఇప్పుడు జాతీయ సరిహద్దులను దాటిపోయాయి. అంతర్జాతీయ స్థాయిలో సాగే భూ కబ్జా వ్యవహారాలను నాజూకుగా భూముల ‘‘కొనుగోళ్లు’’, ‘‘ఒప్పందాలు’’ అని పిలుస్తున్నారు. అమెరికా, ఈయూ దేశాల ఆగ్రో బిజినెస్ గుత్త సంస్థలు, చైనా, తదితర దేశాలు ఆఫ్రికా ఖండంలో సాగిస్తున్న భూ కబ్జాపై అంతర్జాతీయ మీడియా ఇప్పటికే పలు కథనాలను ప్రచురించింది. వ్యవసాయ బహుళ జాతి సంస్థలు, దేశాలు కలసి 2011లో.. ఒక్క సంవత్సరంలోనే విదేశాల్లో కనీసం 8 కోట్ల హెక్టార్ల భూ ఒప్పందాలను కుదుర్చుకున్నాయని ప్రపంచ బ్యాంకు సమాచారం. ఈ విదేశీ భూ ఒప్పందాలన్నీ ప్రైవేట్ రంగంలోనే జరిగాయి. విదేశీ భూ లావాదేవీల్లో గల్ఫ్ దేశాలు ఇటీవలి కాలంలో ప్రముఖ స్థానంలో నిలవడం సంచలనం రేపుతోంది. 2011లో కుదిరిన ప్రపంచవ్యాప్త భూ ఒప్పందాల్లో యూఏఈ 12 శాతం, ఈజిప్టు 6%, సౌదీ అరేబియా 4% ఒప్పందాలను చేజిక్కించు కున్నాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్య దేశాలు 25 నుంచి 99 ఏళ్ల వ్యవధిలో దీర్ఘకాలిక లీజుకు సిద్ధపడ్డాయి. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్‌లు తమ పౌరులను కూడా ‘విదేశాల్లో ఆహార ఉత్పత్తి’పై పెట్టుబ డులను పెట్టవలసిందిగా ప్రోత్సహిస్తున్నాయి. విదేశీ పంట భూములను పెట్రో డాలర్లతో స్వాధీనం చేసుకోవడాన్ని ‘దీర్ఘకా లిక జాతీయ ఆహార భద్రత వ్యూహం’ అని పిలుస్తున్నారు. నేపథ్యం: 2008లో ఏర్పడ్డ అంతర్జాతీయ ఆహార సంక్షోభం గల్ఫ్ ప్రాంత విధాన నిర్ణేతల కళ్లు తెరిపించింది. సౌదీ అరేబి యాలాంటి సంపన్న దేశం కూడా, పెట్రో డాలర్లు ఎన్ని ఉన్నా తిండి గింజలు లేకపోతే ప్రమాదమని గుర్తించక తప్పలేదు. ఆహార ధాన్యాల దిగుమతులకు బదులుగా వ్యవసాయ దేశాల కు చమురు ఎగుమతులను చేసే సంప్రదాయక పద్ధతులు నేటి గ్లోబలైజేషన్ యుగంలో కాలం చెల్లిపోయినవిగా మారిపోయా యి. అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ మార్కెట్లలో గుత్త సంస్థల ఆధిపత్యం, ఫ్యూచర్ ట్రేడింగ్ మాయలు కలసి ఆహార ధరలను నిత్యం అస్థిరతకు గురిచేస్తున్నాయి. దీంతో తిండిగిం జల మార్కెట్లలోని అస్థిర పరిస్థితులను తట్టుకోవాలంటే ‘సొంత వ్యవసాయం’ ‘సొంతంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి’ అవసరమని జీసీసీ దేశాలు భావిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు క్రమక్రమంగా క్షీణించి పోయే ధోరణి కనిపిస్తోంది. జనాభా పెరుగుదలతో పాటు, వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ ఉత్పత్తులలో ఎగుడు దిగుడులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఒకటికి మించి పలు దేశాల్లో, వీలైతే పలు ఖండాల్లో ‘సొంత ధాన్యాగారాలను’ ఏర్పాటు చేసుకుంటేనే ‘దీర్ఘకాలిక ఆహార భద్రత’ సాధ్యం! అందుకనే చమురు సంపన్న గల్ఫ్ దేశాలు విదేశాల్లోని భూములను కొనుగోలు చేస్తున్నాయి. వచ్చే రెండు దశాబ్దాల కాలంలో అదనంగా పెరగబోయే ఆహార ఉత్పత్తిలో 80 శాతానికి పైగా వర్ధమాన దేశాల్లోనే జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘అగ్రికల్చరల్ అవుట్‌లుక్ 2014-23’ తెలిపింది. అలా అని ప్రపంచంలోని నిరుపేదలకు తిండిగింజలు అందుబాటులోకి రావని, అందుకు అధిక ఆహార ధరలే కారణమని ఓయీసీడీ సెక్రటరీ జనరల్ ఏంజెలా గుర్రియా అన్నారు. అధిక ఆహార ధరల వల్ల చిన్న రైతులకు మేలు జరగకపోగా వారు తిండిగింజలను కొనుక్కో లేని పరిస్థితులు తలెత్తుతాయని ఆమె హెచ్చరించారు. తిండి గింజలు పండే దేశంలో ప్రజలకు తిండి గింజలపై హక్కు ఉండని పరిస్థితులను ఈ భూకబ్జాలు సృష్టించబోతున్నాయి. భారీ ఎత్తున సాగుభూములను కైవసం చేసుకోవడం ఆయా దేశాల స్థానిక ప్రజలపై తీవ్రమైన ప్రభావం కలిగి స్తోంది. తరతరాలుగా తమ స్వాధీనంలో ఉన్న సాగుభూముల కు వీరు శాశ్వతంగా దూరమవుతున్నారు. విదేశీ కంపెనీలతో భారీ భూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న జాతీయ ప్రభుత్వా లను స్థానిక సంస్థలు సవాలు చేస్తున్నాయి. సెర్బియాలో రైతులు ఇప్పటికే తమ భూములను హస్తగతం చేసుకున్న అబూ దుబాయ్ కంపెనీ ‘అల్ రాఫెద్ అగ్రికల్చర్’పై ఫిర్యాదు చేశారు. దీంతో భారత్ వంటి వర్ధమాన దేశాల్లో రాజకీయ పార్టీల మనుగడకు ఆహార భద్రత కీలకాంశంగా మారుతోంది. దేశ జనాభాలో 80 కోట్ల మందికి ఆహార భద్రతను కల్పిం చాలని ప్రయత్నిస్తున్న మన ప్రభుత్వం కూడా మారుతున్న పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. - కె. రాజశేఖర రాజు