
ఈ ‘కుల’కలం ఫలితాలనిస్తుందా?
జననేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నితీష్ ఈ లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. జాతీయ రాజకీయ హీరోగా ఆవిర్భవించాలనే స్వప్నం ఫలించదని అర్థమైంది. రాజకీయ అస్తిత్వం కోసం పాతమిత్రులతో పొత్తు తప్పదని గ్రహించారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని తెలి సిందే. బీహార్ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉంటున్న మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ), నితీష్ కుమార్ (జేడీయూ) తమ విభేదాలను పక్కనబెట్టి 10 శాసనసభ స్థానాలకు ఆగస్టు 21న జరగనున్న ఉప ఎన్నికల్లో చే తులు కలిపారు. బీజేపీని ఐక్యంగా ఎదుర్కొనే ప్రాతిపదికన పొత్తు కుదుర్చుకుంటున్నామని నితీష్ ప్రకటించారు. సార్వ త్రిక ఎన్నికల్లో తల బొప్పి కట్టిన కాంగ్రెస్ కూడా పొత్తుకు సై అంది. కోల్పోయిన చోటే దొరకబుచ్చుకోవాలన్న ఈ ఆరా టానికి ప్రాతిపదిక ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీలకు బీహార్‌లో 44.3 శాతం ఓట్లు రాగా, అధికారం దక్కించుకున్న ఎన్డీయేకి 38.8 శాతం ఓట్లు వచ్చాయి. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌కు మొత్తం ఓట్లలో 49.83 శాతం రాగా, బీజేపీ, ఎల్జేపీలకు 23.21 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఐక్య పోరాటం ద్వారానే రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోగలమని పై మూడు పార్టీలూ గ్రహించాయి.
గత పదేళ్లుగా మీడియాలో మోతాదుకు మించి లభిం చిన ప్రచారంతో నితీష్ ఏకంగా ప్రధాన మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. సోషలిస్టుగా చెప్పుకునే నితీష్, ఒక ప్పటి మిత్రుడు లాలూను వీడి, మతతత్వ పార్టీగా పేరుమో సిన బీజేపీతో చెయ్యి కలిపి 17 సంవత్సరాలుగా ఎన్డీయేతో కలిసి బీహార్ రాజకీయాల్లో వెలిగారు. లాలూ, కాంగ్రెస్‌లను వరుస ఎన్నికల్లో ఓడించారు. ప్రధాని పదవిపై ఆశతో నరేం ద్రమోడీకి వ్యతిరేకంగా నిలిచి, ఎన్డీయేను వీడారు. లోక్‌సభ ఎన్నికల్లో దానికి భారీ మూల్యం చెల్లించారు. రాష్ట్రంలోని 40 ఎంపీ స్థానాల్లో 38 స్థానాలను ఎగురేసుకుపోయిన ఎన్డీఏ కూటమి నితీష్ సీఎం పదవికే ఎసరు తెచ్చింది.
దీంతో నితీష్‌కు కొత్త పొత్తు అవసరమైంది. చేపట్టిన అభివృద్ధి పనులు మాత్రమే ఓట్లు సాధించి పెట్టవని గ్రహిం చారు. అలాగే, పశు దాణా కుంభకోణంలో అప్రతిష్టపాలైన లాలూ, 2004 కేంద్రంలో రైల్వే మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఒక్క బీహార్ రాష్ట్రానికే రూ. 52 వేల కోట్ల విలువైన రైల్వే తదితర అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకువచ్చారు. అయితే ఇవేవీ లాలూను కాపాడలేదు. ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ఇద్దరు నేతలకు తమ ఒకప్పటి మైత్రి, సోష లిస్టు, సెక్యులర్ భావజాలం గుర్తుకొచ్చింది.
పార్లమెంటు ఎన్నికల ముందు పెట్టుకోవలసిన పొత్తును అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఏర్పర్చుకోవడంలో అర్థం ఏమి టన్నది సందేహం. నిజానికి ఈ పొత్తు తాత్కాలికం కాదు. లోక్‌సభ ఎన్నికలు దేశంలో కుల సమీకరణలకు సంబం ధించి కొత్త కోణాన్ని ముందుకు తీసుకువచ్చాయి. కుల ప్రాతిపదికన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో పాతుకుపో యిన రాజకీయ పార్టీల కంచుకోటలను బీజేపీ, సంఘ్ పరి వార్ బద్దలు కొట్టాయి. ప్రజల్లోని అభివృద్ధి కాంక్షకు విలువ ఇవ్వనిదే హిందుత్వ రాజకీయాలు విజయవంతం కావని అవి గుర్తించాయి. ముస్లింలతో సహా అన్ని కులాలు, కమ్యూ నిటీలను సమీకరించాలనే వ్యూహాన్ని అమలు పర్చడం ద్వారా వీరు మతాన్ని, అభివృద్ధిని విజయ మంత్రంగా మార్చారు. ఉత్తర భారతాన్ని కుల రాజకీయాలతో శాసి స్తున్న అన్ని పార్టీలకూ ఇది సవాలుగా మారింది. అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాతినిధ్యం లభించనందునే బీసీలు, దళిత నేతల పాలనను ఓటర్లు తిరస్కరించారని ఎన్నికలు తేల్చి చెప్పాయి. 2015లో బీహార్‌లో, 2017లో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఈ మారుతున్న కుల సమీకరణాలతోటే మరో యుద్ధానికి తెర తీయనున్నాయి.
లాలూ, నితీష్ మధ్య కుదిరిన పొత్తు ఉప ఎన్నికలకు పరిమితం కాదు. మత అస్తిత్వ రాజకీయాలను కుల అస్తిత్వ రాజకీయాలతో అడ్డుకోగలమనే పకడ్బందీ వ్యూహంలో భాగంగానే వీరి మధ్య పొత్తు కుదిరింది. ఈ ఫార్ములాను లాలూ మరింత స్పష్టంగా ముందుకు తెచ్చారు. మండల్ ద్వారానే కమండలాన్ని నిలువరిద్దాం అనే నినాదాన్ని ప్రతిపాదించారు. నితీష్ తన ముఖ్యమంత్రి పదవిని త్యజించడం కూడా ఈ వ్యూహంలో భాగంగానే జరిగింది. ఎన్నికల్లో ఎందుకు దెబ్బతిన్నామన్న గ్రహింపుతో, రాష్ట్రంలో బాగా వెనుకబడిన ముషాహర్ కులానికి చెందిన జితన్ మజికి సీఎం పదవిని కట్టబెట్టారు. అయితే తనకు బలమైన పునాదిగా నిలిచిన మహా దళిత్ సామాజిక బృందాలకు, తాను కొత్తగా కూడగడుతున్న యాదవులు, భూమిహార్లకు మధ్య సమతూకం ఎలా సాధిస్తారనే అంశంపైనే నితిన్ భవిష్యత్తు ఆధారపడనుంది. దేశాన్ని కుదిపేసిన మండల్, మందిర్ రాజకీయాల కాలంలో లాలూ ప్రసాద్, నితీష్‌లు ఒక వెలుగు వెలిగారు. పాతికేళ్ల తర్వాత అదే మండల్ రాజకీయాల పునరుద్ధరణతో కమండల రాజకీయాలను నిలువరించాలని వీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనే ప్రశ్నకు కాలమే జవాబు చెప్పాలి.
- కె.రాజశేఖరరాజు