చారిత్రక నాటక వైభవానికి నాందీవాక్యం
కొమురం భీం ప్రదర్శనపరంగా ప్రేక్షకులను విశేషంగా కదిలించింది. కానీ ఇతివృత్తాన్ని బట్టి మరింత యోగ్యంగా ప్రదర్శించే అవకాశాలు ఈ నాటకానికి ఉన్నాయి.
ప్రయోగం కూడా మూస స్థాయికి చేరుకుందని పరిషత్ నాటకాల మీద వచ్చిన విమర్శ. ప్రయోగం కోసం ప్రయోగం అన్న ధోరణితో పరిషత్ నాటకాలు కొద్దికాలంగా ఆకర్షణను కోల్పోయిన మాటను ఎవరూ కాదనలేరు. 80వ దశకంతో చూస్తే ఇవాళ పరిషత్ నాటకం చాలా వెనుకబడిందనే అనాలి. నిజానికి రంగస్థలమే ఆదరణను కోల్పోయింది. కానీ ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలు మాత్రం ప్రయోగాన్నీ, సంప్రదాయాన్నీ కూడా గౌరవిస్తున్నాయి. మే నెలలో రాజమండ్రిలో జరిగిన నంది నాటకోత్సవాలు దీనినే రుజువు చేశాయి. ఇందులో చారిత్రక ఇతివృత్తాలతో వచ్చిన రెండు నాటకాలకు (డొక్కా సీతమ్మ, కొమురం భీం) ప్రేక్షకులు నీరాజనాలు పట్టడం ఆహ్వానించదగిన పరిణామం.
చారిత్రక ఘట్టాలను ప్రతిభావంతుడైన రచయిత నాటకంగా మలిస్తే ఆ రచన కావ్య స్థాయికి చేరి, ప్రేక్షకులకు రసానుభూతిని కలిగిస్తుంది. మంచి దర్శకుడి చేయూత ఉంటే ప్రదర్శన కూడా చరిత్రాత్మకమవుతుంది. ‘డొక్కా సీతమ్మ’ నాటకం అలాంటిదే. ఉత్తమ ప్రదర్శనకు ఇచ్చే బంగారు నంది సహా పలు విభాగాలలో ఈ నాటకానికి పురస్కారాలు లభించాయి. గంగోత్రి, పెదకాకాని బృందం ఈ నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. ‘ఖుర్బానీ’, ‘బొమ్మా-బొరుసా’, ‘ప్రేమకు పద్దెనిమిదేళ్లు’, ‘హంస కదా నా పడవ’ (ఉత్తమ రచన), ‘పేదోడు’ వంటి నాటకాలు కూడా ఈ విభాగంలో పోటీ పడినాయి.
రచన పరంగా డొక్కా సీతమ్మ మంచి ప్రమాణాలతో కనిపిస్తుంది. ప్రేక్షకులను వర్తమానం నుంచి గతంలోకి రచయిత ‘పినాకపాణి’ (రామకృష్ణరాజు) తీసుకుపోయే తీరు హృద్యంగా ఉంది. నాయుడు గోపి దర్శకత్వం వహించారు (సీతమ్మ భర్త జోగన్నపంతులు పాత్ర కూడా ఆయనే ధరించారు). ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా అక్కడి పార్లమెంట్‌లో డొక్కా సీతమ్మ చిత్రపటం చూసి, విస్తుపోయిన జీఎంసీ బాలయోగి (ఒకప్పుడు లోక్‌సభ స్పీకర్, తరువాత దుర్మరణం పాలైనారు) స్వదేశం వచ్చాక ఆమె కుటుంబీకుల ద్వారా ఆమె గాథను తెలుసుకున్నట్టు రచయిత చిత్రించారు. అనన్య సామాన్యమైన సీతమ్మ (1841-1909) దాతృత్వాన్ని విని ఎడ్వర్డ్ ప్రభువు ‘ద మోస్ట్ చారిటబుల్ ఉమెన్ ఆఫ్ సౌత్ ఇండియా’ అని కీర్తించి ఆమె చిత్రపటాన్ని బ్రిటిష్ పార్లమెంట్‌లో ఆవిష్కరించడం చారిత్రక వాస్తవం. తూర్పు గోదావరి జిల్లా, లంకల గన్నవరం అనే కుగ్రామంలో ఆమె అన్నదాన కార్యక్రమం నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగింది. ఆమెకు కులమత భేదాలు లేవు. ఎవరి దగ్గరా నయాపైసా తీసుకోలేదు. పైగా గోదావరి జిల్లాలను మలమలలాడించిన కరువు కాలంలో ఆమె నిరంతరాయంగా అన్నదానం చేసి చరిత్రకెక్కారు. అందుకు సంబంధించిన ఉదంతాలను నేటికీ ఆ ప్రాంతంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. గోదావరి పొంగింది. అలాంటి సమయంలో అవతలి ఒడ్డు నుంచి ‘సీతమ్మ తల్లీ, ఆకలి’ అన్న ఆర్తనాదం వినిపించింది.
అతడొక దళితుడు. సీతమ్మ వెంటనే అన్నం, బట్టలు పట్టుకుని, భర్త జోగన్నపంతులును తీసుకుని ఆవలి తీరానికి వెళ్లి అతడికి అన్నం పెట్టింది. ఇది కల్పనకు సైతం అందని వాస్తవ ఘటన. ఇలాంటి వాటితో నిండిన ఈ నాటకంలో కరుణరసం గోదారి పొంగులాగే కనిపించింది. ‘నువ్వు సముద్రం కన్నా పెద్ద అమ్మవు. మన పిల్ల గోదారి నీ దయను అడ్డుకోగలదా?’ వంటి మాటలు నాటకానికి వన్నె తెచ్చాయి. ‘అంతా దోచుకుపోయినా ఫర్వాలేదు. ఆకలితో మాత్రం వెళ్లకండి!’ అని దొంగలను కూడా ప్రేమతో కట్టడి చేసిన తల్లి సీతమ్మ. దీనితో పాటు, సర్ ఆర్థర్ కాటన్‌ను ఆమె సత్కరించే సన్నివేశం కూడా ప్రేక్షకులను అలరించింది.
కొమురం భీం ప్రదర్శన పరంగా ప్రేక్షకులను విశేషంగా కదిలించింది. కానీ ఇతివృత్తాన్ని బట్టి మరింత యోగ్యంగా ప్రదర్శించే అవకాశాలు ఈ నాటకానికి ఉన్నాయి. స్వాతంత్య్రేచ్ఛను వ్యక్తీకరించే ఇలాంటి ఇతివృత్తానికి అవసరమైన లోతు కొద్దిగా లోపించిందని అనిపిస్తుంది. నిజాం ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన గిరిజన నాయకుడు భీం కథకు చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉద్వేగాలను ప్రదర్శించడమే చారిత్రక నాటకానికి కీలకమన్న భావన ఇందులోని చిరు లోపం. దీనితో ఇతివృత్తం ఆత్మ ప్రేక్షకునికి అందకుండా పరారైపోతుంది. ఖుర్బానీ తృతీయ ఉత్తమ ప్రదర్శనకు ఎంపికైంది. మరుగున పడిందని భావిస్తున్న చరిత్రను ఇలా రంగస్థలం అక్కున చేర్చుకోవడం శుభపరిణామం. ఈ పంథా కొనసాగాలి.
- కల్హణ
ఫొటోలు: గరగ ప్రసాద్