ఆదిలాబాద్: కెరమెరి మండలంలోని అనార్‌పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆరురోజుల క్రితం ఇద్దరు విద్యార్థులకు కళ్ల కలక వ్యాధి సోకింది. పరీక్షించిన పీహెచ్‌సీ వైద్యాధికారి వినోద్‌కుమార్ వైద్యం చేసి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి పంపించారు.
శనివారం అదే ఆశ్రమ పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించగా 11 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో ఆ పాఠశాలలో కలకలం రేగింది. ఈ ఒక్క పాఠశాలనే కాదు జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో విద్యార్థులు, చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు.
కళ్ల కలక (కంజెక్టివైటీస్) వ్యాధి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వ్యాపించింది. ముఖ్యంగా చిన్నారులకు అధికంగా సోకుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 213 కేసులు నమోదయ్యా యి. దగ్గు జలుబు, మాదిరి సీజనల్‌లాగా వచ్చే వ్యాధి. వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రభా వం చూపుతుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వ్యాపించింది.
ఎక్కువగా చిన్నారులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధి సోకిన వారి కళ్లను తదేకంగా చూడడం వల్ల కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయితే రోగిని ప్రత్యేక గదిలో ఉంచాలి. రోగి వాడిన టవల్, ఇతర వస్తువులు ఇతరులు ఉపయోగించకూడదు. పెద్ద ప్రమాదం ఏమీ లేకపోయినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాధి లక్షణాలు
వ్యాధి సోకిన వారి కళ్లు మంట అనిపిస్తాయి. కళ్లవెంట నీరుకారడం, దురద, రెప్పలు వాపెక్కడం, ఊసులురావడం, నిద్రపోయిన సమయంలో రెప్పలు అతుక్కోవడం కళ్ల కలక లక్షణాలు. ఒక కన్నుతో మొదలై మరోకంటికి వ్యాపిస్తుంది. ఒకరితో మొదలై ఏకకాలంలో పలువురికి వ్యాప్తి చెందుతుంది. రోగ నిరోధకశక్తి ఆధారంగా మూడు నుంచి వారం రోజుల పాటు వేధిస్తుంది. వాతావరణం ఒక్కసారిగా మారడంతో వ్యాధి ప్రభావం అధికంగా చూపుతోంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వ్యాధి సోకిన వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. రోగి టవల్, సబ్బు ఇతరులు వాడవద్దు. బయటికి వెళ్లినప్పుడు నల్ల కళ్లద్దాలు పెట్టుకోవాలి. ఇతరులకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు సోకితే వ్యాధి తగ్గేవరకూ ఇంటివద్దే ఉండాలి. వైద్యుల సూచనలతో యాంటీబయాటిక్స్ డ్రాప్స్ వాడాలి.
ఆందోళన చెందవద్దు
కళ్ల కలక వ్యాధి సోకినవారు ఆందోళన చెందవద్దు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధికి సంబంధించిన డ్రాప్స్ అందుబాటులో ఉన్నాయి. వ్యాధి సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలి. రోగి కళ్లల్లోకి చూసినా అతను వాడిన టవల్ ఉపయోగించినా ఇతరులకు వ్యాధి సోకే ప్రమాదం ఉంది. – రామకృష్ణ, జిల్లా వైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment