
జీఎం పంటల్లోనూ గోప్యతేనా?
సందర్భం
సహజంగా పండే పంటలకు జన్యుమా ర్పిడి చేస్తున్నామంటూ కొన్ని కంపెనీలు కొత్త హైబ్రిడ్ జీవ పదార్థాలను పర్యావరణంలోకి వదులుతున్నాయి. రైతులు వాటిని పండించాలని మార్కెట్ చేస్తున్నారు. అవి పర్యావరణపరంగా భద్రమైనవా కావా అని తేల్చి ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం బాధ్యత పర్యావరణ మంత్రిత్వ శాఖపైన ఉంది. వీటికి సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ప్రజలకు మొత్తం సమాచారం ఇచ్చి ప్రయోగాలు జరిపి, అభ్యంతరాలు విని, వాటిని నిపుణుల ద్వారా పరిశీలింపచేసిన తరువాత అమ్మకాలకు అనుమతించాలని చెబుతున్నాయి. ఉత్పత్తి దారుడి వాణిజ్య ప్రయోజనాలను కూడా రక్షించేందుకు కొంత గోప్యనీయత అవసరం. ఏది గోప్యనీయం ఏది కాదు అని నియమాలను కూడా రూపొందించారు. పర్యావరణ రక్షణ చట్టం కింద కూడా ఈ సమాచారం ఇవ్వవలసిందే.
ఆవాలకు సంబంధించి జన్యుమార్పిడి ప్రయోగాల సమాచారం మొత్తం ఇవ్వాలని కవితా కురుగంటి పర్యావరణ మంత్రిత్వ శాఖను సమాచార హక్కు చట్టం కింద అడిగారు. జన్యుమార్పిడి ఆవాల పంట విషయంలో క్షేత్ర స్థాయి పరీక్షలు ప్రయోగాలు జరుగు తున్నాయని కాని అవి ఇంకా పూర్తి కాని ప్రక్రియకు సంబంధించిన సమాచారం కనుక రహస్యాలని, ఇవ్వడం సాధ్యం కాదని అధికా రులు జవాబిచ్చారు. ప్రయోగాలు పూర్తికాకముందే సమాచారం ఇస్తే పాక్షిక సమాచారం అవుతుందని వాదించారు.
ఇది వరకు జన్యుమార్పిడి వంకాయలకు సంబంధించిన ప్రయోగ సమాచారాన్ని ఈ విధంగానే దాచివేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్లవలసి వచ్చిందని, వాటి వల్ల ప్రజల భద్రతకు ముప్పువాటిల్ల బోదనే గ్యారంటీ లేకపోవడం వల్ల ఆ సమాచారం పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన తరువాత గానీ పర్యావరణ శాఖ ఆ సమాచారాన్ని ప్రజాబాహుళ్యంలోకి తేలేదని, మరోసారి అటువంటి పొరపాటు చేయవద్దని కవిత కోరారు. చివరకు జన్యుమార్పిడి పదార్థాలను కంపెనీలు జనం మీద రుద్దితే బాధితు లయ్యేది ప్రజలే కనుక వారికి సమాచారం ఇవ్వడంలో లోపం ఉండకూడదని కవిత కోరారు. జన్యుమార్పిడి పరిశీలన సంఘం జీఈఏసీ కూడా వంకాయ జన్యుమార్పిడి వివరాలు ఇచ్చిందని వివరించారు. కనుక జీఈఏసీ పరిశీలనకు సమర్పించిన అజెండా వివరాలు వారి నిర్ణయ సమావేశంలో నిర్ణయ వివరాలు (మినిట్స్) కూడా ఇవ్వాలని ఆమె కోరారు.
జన్యుమార్పిడి చేసిన ఆవాలు హైబ్రిడ్ డీఎంహెచ్ 11, సీజీఎం సీపీ వారి పర్యావరణ పరమైన విడుదల కోసం ఢిల్లీ విశ్వవిద్యా లయం దక్షిణ క్యాంపస్ ప్రయోగాలలో ఉందని, జీఈఏసీ అనుమ తించిన తరువాత సమాచారం ఇస్తారని అధికారులు అన్నారు. అనుమతించిన తరువాత సమాచారం ఇస్తే ఏం ప్రయోజనం? అంతకు ముందు సమాచారం ఇస్తే దానికి ఎందుకు అనుమతించ కూడదనో అభ్యంతరాలను తెలియజేసే అవకాశం ప్రజలకు వస్తుంది.
తమకు నిర్ణయ వివరాల సారాంశం ఇవ్వాలని మాత్రమే అను మతి ఉందని, పూర్తి వివరాలు ఇవ్వడానికి వీల్లేదని జి.ఇ.ఎ.సి. మెంబర్ సెక్రటరీ మధుమిత బిస్వాస్ కమిషన్‌కు విన్నవించారు. అదీగాకుండా క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతేనే తాము వివరాలు ఇస్తామని అన్నారు. సారాంశం ఇచ్చినపుడు వివరాలు ఎందుకు ఇవ్వకూడదో వారు చెప్పలేదు. ప్రయోగాలు విజయవంతమైతే ఇస్తాం విఫలమైతే ఇవ్వబోము అనే వాదానికి ఆధారం లేదు. సమాచార హక్కు చట్టం కింద ఇటువంటి మినహాయింపులేమీ లేవు. ఫలితంతో సంబంధం లేకుండా ప్రయోగాల వివరాలు ఇవ్వవల సిందే. కోరిన సమాచారం రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటో అది ఏ మినహాయింపు కింద సమర్థనీయమో రుజువు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ సంస్థపైన ఉంటుంది.
అసలు ఈ సమాచారం ముందుగా సెక్షన్ 4 ఆర్టీఐ చట్టం కింద తమంత తాముగా ఇవ్వవలసిన అవసరం ఉంది. జన్యుమార్పిడి ఆవాలు కొనుక్కోవలసింది జనం. తిని బాధపడవలసింది జనం. వారికి ఈ జన్యుమార్పిడి ఆవాలలో భద్రత ఉందో లేదో వివరిం చాల్సిన అవసరం ఉంది. ఏ దశలోనైనా సరే ఈ వివరాలు ఇస్తే ఎవరైనా అభ్యంతరాలు చెప్పడానికి వీలుంటుంది. పర్యావరణ రక్షణలో ప్రమాదాలను కూడా చర్చించే వీలుంటుంది.
జన్యుమార్పిడి ఆవాలు తయారు చేసిన కంపెనీ వారికి పేటెంట్ హక్కులున్నాయని, ముందే సమాచారం ఇస్తే వారి పేటెంట్ హక్కులు భంగపడతాయని కూడా పర్యావరణ అధి కారులు వాదిం చారు.
పేటెంట్ హక్కును గుర్తించినప్పటికీ, దాని అర్థం సమాచారం ఎవ్వరికీ ఇవ్వకూడదని కాదు. నిజానికి పేటెంట్ కోరుకునే వ్యక్తి లేదా కంపెనీ తాము పేటెంట్ సాధించిన పరిశోధన సమాచారాన్ని సమా జానికి అందుబాటులో ఉంచడానికి ఒప్పుకుం టుంది. అందుకు ప్రతి ఫలంగా ఆ సమాచారాన్ని వినియోగించి ఎవరైనా పారిశ్రామిక ఉత్పత్తి చేయకుండా ప్రభుత్వం నిరోధిస్తుంది. కనుక పేటెంట్ హక్కు కేవలం పారిశ్రామిక ఉత్పత్తులు అనధికా రికంగా ఇతరులు సాగించకుండా నిలిపివేస్తుంది. అంతేగానీ పేటెంట్ సమాచారాన్ని రహస్యంగా దాచడం పేటెంట్ లక్షణం కాదు. ఒకవేళ మినహాయింపు వర్తిస్తుందనుకున్నా ప్రజాశ్రేయస్సు కోసం ఇవ్వవచ్చునని సెక్షన్ 8(1) (2) వివరిస్తున్నాయి.
దేశాల హద్దులు దాటి జన్యుమార్పిడి ఆహార పదార్థాలు విస్తరణ విష యంలో తొలి అంతర్జాతీయ ఒప్పందం జీవ వైవిధ్యంపైన కార్టెజెనా ప్రొటోకాల్ ప్రకారం వీటిపైన ఆంక్షలు, నిషేధాలు విధించే అవ కాశం ఉంది. జీవవైవిధ్యంపైన ఈ కొత్త జన్యుమార్పిడి పదార్థాల ప్రభావం, ప్రజల ఆరోగ్యంపైన పడే ప్రమాద అవకాశాలను, సంక్షోభ సమయంలో చేయవలసిన పనుల వివరాలను రహస్యా లుగా భావించకూడదని ఈ ఒప్పందం వివరిస్తున్నది. కనుక ఈ ఒప్పందంతో పాటు, ఆర్టీఐ చట్టం, పర్యావరణ చట్టాన్ని అనుస రించి జన్యుమార్పిడి ఆవాల ప్రయోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం జనం ముందుంచాల్సిందే.
(కవితా కురుగంటి వర్సెస్ భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఇఐఇ/అ/అ/2015/901798లో 1.4.2016 నాడు ఇచ్చిన తీర్పు ఆధారంగా)
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్, professorsridhar@gmail.com