మట్టిలో ముని‘రత్నం’! | inspirational farmer | Sakshi
Sakshi News home page

మట్టిలో ముని‘రత్నం’!

Published Sun, Mar 16 2014 11:34 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

మట్టిలో ముని‘రత్నం’! - Sakshi

మట్టిలో ముని‘రత్నం’!

 భూమితో రైతుకుండేది తల్లీబిడ్డల అనుబంధం. ఎండనక, వాననక చెమటోడ్చే రైతన్న తన జీవనం సాఫీగా గడవడంతో పాటు సారవంతమైన భూమిని బిడ్డలకు వారసత్వంగా ఇవ్వాలనుకుంటాడు. సుసంపన్నమైన మన వ్యవసాయ సంస్కృతికి ఈ భావనే మూలాధారం. సాగులో రసాయనాల విషవలయాన్ని ఛేదించుకొని సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం దిశగా స్థిరంగా అడుగులు వేస్తున్న అన్నదాతల్లో పాలడుగు మునిరత్నం నాయుడు(64) ఒకరు.  పెద్దల నాటి వ్యవసాయం.. మధ్యలో రసాయనిక వ్యవసాయం, ఇప్పటి సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాల్లో బాగోగులు కళ్లకు కట్టే క్షేత్రస్థాయి స్వానుభవ సారం.. ఆయన మాటల్లోనే..
 
 మా ఊరు కస్తూరి వారి కండ్రిగ. చిత్తూరు జిల్లాలోని తిరుపతి రూరల్ మండలం. రైతు కుటుంబాలు పాతిక వరకు ఉంటాయి.  వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను పీయూసీ వరకు చదివినా.. వ్యవసాయమే నా జీవన విధానం. మాకు 4 ఎకరాల పొలం ఉంది. నా చిన్నప్పుడు మా పొలాల్లో వరి, వేరుశనగ, కూరగాయలు పండించేవాడు. 4 ఎనుములు(గేదెలు), కాడెద్దులు ఉండేవి. బావుల్లోంచి మోటలతో నీళ్లు తోడేవాళ్లు. బోర్లు లేవు. 1962లో కరెంటొచ్చింది. ఆకు తొక్కడం, పశువుల ఎరువుతోనే రెండు పంటలు వరి పండించే వాళ్లు. రసాయనిక ఎరువుల్లేకుండానే ఎకరానికి 25-30 బస్తాల (బస్తా 75 కిలోలు) ధాన్యం పండేవి. వేరుశనగ 30 మూటలు(మూట 40 కిలోలు) పండేవి. మా నాన్న 70 ఏళ్లు బతికాడు. జబ్బుల్లేవు. ఎప్పుడూ ఇంజక్షన్ ఎరుగడు. చనిపోవడానికి 20 రోజుల ముందు వరకు పనులు చేశాడు.  
 
 కండ్రిగ వంకాయలంటే ఎగబడి కొనేవారు..!

 నేను వ్యవసాయం మొదలు పెట్టాక క్రమంగా రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం పెరిగింది. 1982, 83ల నాటికి మా ఊళ్లో మొత్తం 30 ఎకరాల్లో వంకాయలు పండించేవాళ్లం. రోజూ 4-8 టన్నుల వంకాయలు మార్కెట్లకెళ్లేవి. మందుల వల్ల కాయ నిగారింపుతో మంచి ఆకర్షణీయంగా ఉండేది. ఆంధ్రా, తమిళనాడు మార్కెట్లలో ‘కండ్రిగ వంగ’ అనగానే వ్యాపారులు ఎగబడి కొనేవారు. కనీసం 14 ఏళ్లపాటు మా ఊరు వంకాయలకు తిరుపతి, మద్రాసు, కుంభకోణం, విజయవాడ, నెల్లూరు మార్కెట్లలో పెట్టింది పేరు. మా ఊరు అభివృద్ధికి కారణం వంగ సాగే. అప్పట్లో ఎకరానికి 5 బస్తాల ఎరువు వేసే వాళ్లం రూ. వెయ్యి- రూ. రెండు వేల వరకు పురుగుమందులకు ఖర్చయ్యేది. 2 నెలల పాటు ఎకరానికి రోజూ 10 బస్తాల వంకాయలు కోసేవాళ్లం. అయితే, క్రమంగా పరిస్థితి మారిపోయింది. అంతకంతకూ ఖర్చు పెరిగి, దిగుబడి తగ్గుతూ వచ్చింది. 2000వ సంవత్సరం నాటికే పరిస్థితిలో బాగా మార్పొచ్చింది. వంకాయల దిగుబడి సగానికి సగం తగ్గింది. 2004-05 నాటికి ఎకరానికి 20 బస్తాల ఎరువు వేసి, రూ. 10 వేలు పురుగుమందులకు ఖర్చు పెట్టినా.. రోజుకు 5 బస్తాలు వస్తే ఎక్కువ అన్నట్లు తయారైంది పరిస్థితి. చాలా మంది రైతులు వంగ సాగు మాని చెరకు, వరి వైపు మళ్లారు.
 
 సేంద్రియం నుంచి ప్రకృతి సాగు వైపు..
 కానీ, రసాయనిక ఎరువులు పోసి, పోసి భూములు కూడా నిస్సారమైపోయాయని గ్రహించి కొందరు రైతులం కలిసి సేంద్రియ సాగు వైపు మళ్లాం. చిత్తూరు జిల్లాలో తొలి వర్మీ కంపోస్టు యూనిట్ ఏర్పాటైంది మా గ్రామంలోనే. 2002 నుంచి సేంద్రియ సాగు చేస్తున్నా. 2006లో తిరుపతిలో సుభాష్ పాలేకర్ ద్వారా శిక్షణ పొందిన తర్వాత వర్మీకంపోస్టును వదిలేసి ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టా. వర్మీకంపోస్టు వాడినప్పటికన్నా ఘన జీవామృతం, జీవామృతం వాడితే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. రసాయనిక ఎరువులు వేసి ఎకరంలో వంగ సాగు చేస్తే.. 20 టన్నుల వరకు దిగుబడి వచ్చినా.. ఖర్చెక్కువ. రెండు నెలల్లో కాపు అయిపోతుంది కాబట్టి సగటు ధర తక్కువ వస్తుంది. నికరంగా రైతుకు మిగిలేది రూ. 30-40 వేలే. ప్రకృతి వ్యవసాయంలో ఎకరానికి 12 టన్నుల దిగుబడి వచ్చినా..  కాపు 3 నెలల పాటు ఉంటుంది. సగటున అధిక ధర వస్తుంది. ఖర్చులు బాగా తక్కువ. కాబట్టి, నికరంగా రైతుకు రూ. 60 వేలు మిగులుతుంది. రూ. లక్ష వరకు రావడానికి అవకాశం ఉంది.
 
 పొలంలో ఒకటికి నాలుగు పంటలు..

 ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వంగతోపాటు బీర, కాకర తదితర పంటలు పెడతాం. వంగ పూర్తయ్యేటప్పటికి కాకర వస్తుంది. ఒక పంట దిగుబడితో ఖర్చులు వచ్చేస్తాయి. మిగతా 2 పంటల దిగుబడి మిగులుతుంది. ఏడాది పొడవునా ఏదో ఒక పంట దిగుబడి వస్తూ.. ఆదాయాన్నిస్తూనే ఉంటుంది. ఇదే ప్రకృతి వ్యవసాయంలో మర్మం. నేను జూలైలో వంగ నాటుతా. పెళ్లిళ్లు, పండగల సీజన్‌లో వంకాయలు కోతకొస్తాయి. కాబట్టి మంచి ధర వస్తుంది. రసాయనిక వ్యవసాయం చేసే వాళ్లు వర్షాల వల్ల ఆకు మందం వచ్చి, పురుగొస్తుందని ఆలస్యంగా వేస్తారు. ఎప్పుడు పంట సాగుచేయాలో తెలివిగా ఆలోచించగలిగితే మంచి ధర రాబట్టుకోవచ్చు.
 
 రాబడి కాదు.. నికరాదాయం ఎంతన్నది ముఖ్యం!
 ఏ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులైనా తమకు ఖర్చులు పోను నికరంగా ఎంత ఆదాయం వస్తున్నదనే విషయాన్ని గమనించుకోవాలి. ప్రకృతి వ్యవసాయంలో వీలైనంత వరకు పనులు సొంతంగా చేసుకునే రైతు కుటుంబాలకు రాబడిలో 80% నికరాదాయంగా మిగులుతుంది. పొలం పనులను నా భార్య కుసుమకుమారి, నేను చేసుకుంటాం. అన్ని పనులూ కూలీలతో చేయించి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేసే వారికి రాబడిలో నికరాదాయం 20% మాత్రమే ఉంటున్నది. సేంద్రియ ఉత్పత్తులకు ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థ లేక మామూలు మార్కెట్లోనే అమ్మేస్తున్నాం. ప్రత్యేక మార్కెట్లుంటే.. నికరాదాయం 2, 3 రెట్లు కూడా వస్తుంది.
 
 చెరకు ఎకరానికి 100 టన్నుల దిగుబడి సాధ్యమే..!
 మా ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయంలో డ్రమ్‌సీడర్‌తో వరి సాగుచేస్తే ఎకరానికి 40-60 బస్తాల దిగుబడి వస్తోంది. రసాయనిక వ్యవసాయంలో పండుతున్నది 30-35 బస్తాలే. సేంద్రియ, రసాయనిక ఎరువులు కలిపి వేసే వాళ్లకు 35-45 బస్తాల వరకు వస్తోంది. రసాయనిక పద్ధతిలో చెరకు ఎకరానికి సగటున 35-55 టన్నులు పండుతోంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎకరానికి నిస్సందేహంగా 60-100 టన్నులు పండించొచ్చు. ఎవరైనా కావాలంటే వాళ్ల పొలంలో పండించి నిరూపిస్తా. నాకు రాను, పోను చార్జీలిస్తే చాలు.. ఫీజేమీ ఇవ్వనక్కర్లేదు! రసాయనిక వ్యవసాయం చేసి అప్పులపాలైన మా కుటుంబం ఈ రోజు పచ్చగా ఉందంటే ప్రకృతి వ్యవసాయం పుణ్యమే.
 
 ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు సేంద్రియ మార్కెట్లు ఏర్పాటుచేసి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తే.. రైతులతోపాటు వినియోగదారులకూ మేలు జరుగుతుంది.
 
 పాలడుగు మునిరత్నం నాయుడు (99895 09877), కస్తూరి కండ్రిగ, వేమూరు పోస్టు, తిరుచానూరు వయా. తిరుపతి రూరల్ మండలం, చిత్తూరు జిల్లా
 సేకరణ: పంతంగి రాంబాబు, ‘సాగుబడి’ డెస్క్
 ఫొటోలు: ఐ. సుబ్రమణ్యం, తిరుపతి
 
 పేడ ఉండలతో పురుగులకు చెక్!
 వేరుశనగ పంటకు పచ్చ శనగపురుగును ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సులభంగా అరికట్టవచ్చు. ఎకరానికి.. 25 కిలోల పేడ, 25 లీటర్ల పశువుల మూత్రం, 5 కిలోల వరిపొట్టు, 10 కిలోల బెల్లం బాగా కలిపి చిన్న ఉండలుగా చేయాలి. సాయంకాలం ఈ ఉండలను పొలంలో చల్లాలి. ఈ ఉండలు పురుగులను ఆకర్షిస్తాయి. ఈ ఉండలను తిన్న పురుగుల ఆకలి మందగించి.. క్రమంగా క్షీణించి.. చనిపోతుంది.
 
 పురుగుల రసం పిచికారీ పద్ధతి:  వేరుశనగ పంటలో పచ్చ శనగ పురుగులు ఉధృతంగా ఉంటే.. ఆ పురుగులను ఏరి, మిక్సీలో వేసి రుబ్బి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. లీటరు నీటిలో 5 మిల్లీ లీటర్ల ద్రావణం చొప్పున కలిపి పంటపై పిచికారీ చేసి.. ఈ పురుగును నియంత్రించుకోవచ్చు.
 
 పంది ముట్టె మాయం: వేరుశనగ పంటలో పందిముట్టె రోగం వల్ల 10-15 శాతం వరకు నష్టం జరుగుతుంటుంది. జీవామృతాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు వేరుశనగ మొక్కలు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. నత్రజని ఎరువులు వాడినప్పటికన్నా వేరుశనగ కాయల బరువు, సైజు పెరుగుతాయి.
 
సేంద్రియ కర్బనాన్ని పెంచే ‘రామబాణం’!
 భూసారాన్ని సత్వరం పెంపొం దించుకునేందుకు ‘రామబాణం’ పద్ధతిని పది సెంట్ల భూమిలో అమలు చేసి  2010 నుంచి మంచి ఫలితాలు పొందుతున్నాను. నిస్సారమైపోయిన భూమికి తిరిగి సహజ శక్తినిచ్చే ఈ పద్ధతిని బెంగళూరుకు చెందిన డా. పత్తిపాటి రామయ్య రూపాందించగా, వర్డ్ సంస్ధ కార్యదర్శి డా. గంగాధరం నాకు పరిచయం చేశారు. ఈ పద్ధతిలో అల్లం, ఇంగువ, బెల్లం, ఆవుపేడ తదితరాలను ఒక పద్ధతి ప్రకారం 40 రోజులు పొలంలో వేయాలి. ‘రామబాణం’తో భూమిలో సేంద్రియ కర్బనం 0.5% నుంచి 0.75%కు పెరగడం విశేషం. మట్టి పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణైంది. రామబాణం అమలు చేసిన పొలంలో పంట దిగుబడి ప్రకృతి వ్యవసాయంలో కన్నా 10% అదనంగా పొందుతున్నాను. పది సెంట్ల పొలంలో చెరకు, బెండ, మిర్చి తదితర పంటలు (ఒక పంట కాలం) సాగు చేయగా నిక రాదాయం రూ.10 వేలకు పైగా వచ్చింది.  ప్రకృతి వ్యవసా య దారుల సమాఖ్య, వర్డ్ సంస్థల ద్వారా రైతులకు శిక్షణ ఇస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement