చరిత్రలో దాగిన స్వరాలు వినిపిస్తున్న జేమ్స్ | James notes that are hidden in the history of rounds | Sakshi
Sakshi News home page

చరిత్రలో దాగిన స్వరాలు వినిపిస్తున్న జేమ్స్

Published Sun, Oct 18 2015 3:06 AM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

చరిత్రలో దాగిన స్వరాలు వినిపిస్తున్న జేమ్స్

చరిత్రలో దాగిన స్వరాలు వినిపిస్తున్న జేమ్స్

మ్యాన్ బుకర్ పురస్కారం
 
 నవలలోని పాత్రల్లో చిన్నవాళ్లు, ముసలివాళ్లు, స్త్రీలు, పురుషులు, జమైకా దేశస్థులు, అమెరికన్లు అందరూ ఉండటం వలన, వాడిన భాష కూడా అనేక రకాల యాసలతో, మాండలికాలతో వినపడుతూ ఉంటుంది.
 
 ‘కళ్లు తిప్పుకోలేని సుందర ప్రదేశం’గా క్రిస్టోఫర్ కొలంబస్‌చే కొనియాడబడ్డ జమైకా ఇవాళ ప్రపంచ సాహిత్యంలో ఎప్పటికీ వినిపించే ఒక తీపి కబురయింది. వలసవాదుల పాలన నుండి 1962లో స్వేచ్ఛను పొందిన జమైకా, పశ్చిమ దేశాలలోనే పటిష్టమైన నీటి పంపిణీ వ్యవస్థను, గోల్ఫ్ కోర్సును కలిగిన మొదటిదేశంగా పేరొందిన జమైకా... మనకు తెలిసిన జమైకా. చరిత్ర చెప్పిన జమైకా. కానీ, బానిసలను తయారుచేయడమే కాక, ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న జమైకా, అతి భయంకరమైన నేర వ్యవస్థను ఇతర దేశాలకు ఎగుమతి చేసిన జమైకా... మనకు తెలియని జమైకా. చరిత్ర చెప్పని జమైకా.

కాల ప్రయాణంలో మరుగున పడిపోయిన సంక్షోభాలను, వాటిల్లోంచి వినిపించే స్వరాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్న జమైకా రచయిత మార్లోన్ జేమ్స్ A Brief History Of Seven Killings నవలకు 2015 సంవత్సరానికిగాను బుకర్ పురస్కారం వచ్చిన సందర్భంగా ఆ నవలను, జేమ్స్ శైలిని పరిశీలించడమే ఈ వ్యాస ఉద్దేశం.

 1970లో పుట్టిన మార్లోన్ జేమ్స్ మొదటి నవల John Crow's Devill జమైకా గ్రామాలలో 1957లో చోటు చేసుకున్న రెండు ప్రత్యర్థి గ్రూపుల ఘర్షణలు వస్తువుగా 2005లో తీసుకువచ్చాడు. 2009లో, 18వ శతాబ్దంలో చెరకు ఉత్పత్తి దారులు పెంచి పోషించిన బానిస వ్యవస్థ మీద లిలిత్ అనే స్త్రీ బానిస పాత్రను కేంద్రంగా చేసుకుని The Book of Night Women రాసాడు.

 ప్రతి నాలుగు సంవత్సరాలకు అక్షరమై పలకరిస్తున్న జేమ్స్ రచనా వస్తువు ప్రధానంగా జమైకా చారిత్రక, రాజకీయ, సాంఘిక పరిస్థితుల నేపథ్యమే. చాలాకాలం జమైకా హింసాత్మక గతాన్ని ఎలా చెప్పాలా? అనే సంఘర్షణకు లోనైన జేమ్స్, డెబ్భైవ దశకపు సంక్షోభాన్ని A Brief History Of Seven Killings ఒక మహాకావ్యమై వినిపించాడు. ‘‘నేను చరిత్ర గురించి చెప్పాలనుకోవడం లేదు, అవినీతి గురించి చెప్పాలనుకోవడం లేదు, స్వలింగ సంపర్కం గురించి చెప్పాలనుకోవడం లేదు. I love my country to death but I also remember how much of our history is paid for in blood...’’ అన్నాడు జేమ్స్. 1976లో జమైకా రాజధాని కింగ్‌స్టన్‌లో ప్రఖ్యాత గాయకుడు బాబ్ మార్లేపై జరిగిన హత్యాప్రయత్నాన్ని ప్రధానంగా ఇందులో జేమ్స్ చిత్రించాడు.

 1962లో బ్రిటిష్ ప్రభుత్వం జమైకాకు స్వాతంత్య్రాన్ని ప్రకటించి వెళ్లిపోయాక, జమైకాలో ఆర్థిక పరిస్థితి క్షీణించడం ప్రారంభమైంది. ఈ సమయంలోనే రెండు ప్రధాన రాజకీయ పార్టీలలో పీపుల్స్ నేషనల్ పార్టీ, సోవియట్ యూనియన్ బలపరుస్తున్న క్యూబాతోనూ, జమైకా లేబర్ పార్టీ అమెరికా గూఢచార సంస్థ సీఐఏతోనూ గట్టి బంధాలను ఏర్పాటు చేసుకొని, వాటి ద్వారా మిలిటెంట్లను తీసుకొచ్చి జమైకాలోని సామాన్య జీవనాన్ని, శాంతిని తమ సొంత ప్రయోజనాల కోసం భంగపరుస్తున్న సందర్భంలో, దీనికి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్న బాబ్‌మార్లే వంటి వాళ్లపై జరుగుతున్న దాడుల వెనుక ఉన్న అపస్వరాలను జేమ్స్ అక్షరబద్ధం చేశాడు.

ఈ దాడిని చిత్రిస్తున్నట్టు కనబడినా, మరొకపక్క షోవర్‌పాస్ అనే గ్యాంగ్‌స్టర్ యధార్థ జీవిత కథ ఆధారంగా నేర ప్రపంచం 60లలో కింగ్‌స్టన్‌లో ఎలా ప్రారంభమై ఎలా అమెరికా వరకు వ్యాప్తి చెందిందో, ఎనభైలలో న్యూయార్క్‌లోనూ, మయామీలోనూ ఎంతటి విధ్వంసాలను సృష్టించిందో చెప్పడం ఆశ్చర్యమనిపిస్తుంది. నవలలోని పాత్రల్లో చిన్నవాళ్లు, ముసలివాళ్లు, స్త్రీలు, పురుషులు, జమైకా దేశస్థులు, అమెరికన్లు అందరూ ఉండటం వలన, వాడిన భాష కూడా అనేక రకాల యాసలతో, మాండలికాలతో వినపడుతూ ఉంటుంది. బహుశా ఈ ప్రత్యేకత వల్లనే బుకర్ ప్రైజ్ కమిటీ ఛైర్మన్ మైఖేల్ ఉడ్- ‘‘ఫైనల్‌కు చేరిన ఆరు నవలల నుంచి మేము జేమ్స్ పుస్తకాన్ని ఎంపిక చేసుకోవడానికి ఏమాత్రం కష్టపడలేదు. ఒక విధంగా ఏకగ్రీవమైన నిర్ణయమిది. నవలలో ఎన్నో స్వరాలు వస్తూ వుంటాయి, పోతూ వుంటాయి, వాటి ప్రత్యేకతలను కాపాడుకుంటూ వుంటాయి. వాటి పని అవి చేస్తూ కథనంలో ఇమిడిపోవడమే గొప్పదనం’’ అనడం జేమ్స్‌కు ఒక క్రెడిట్‌గా భావించాలి.

 అనేక పాత్రలు ఉన్న ఈ నవలలో నీనా బర్జస్ ఒక మరపురాని పాత్ర. బహుశా జేమ్స్‌లోని ప్రత్యేకత ఒక ‘లిలిత్’ను, ఒక ‘నీనా’ను పాఠకులకు అందివ్వడమే. మొత్తం నవలనంతా ఆమె స్వరం పట్టుకునే ఉంటుంది. మార్లేపై జరిగిన దాడికి ఆమె మొదటి సాక్షి. ఆ తరువాత ఆమె ఎలా తన పేరుని, చిరునామాని మార్చుకుని, జమైకాకి దూరంగా అమెరికాకి వెళ్లిపోయిందో చెప్పడంలో నీనా పాత్రలోని విశిష్టతను పాఠకుడు పసిగడతాడు. కథకి దూరంగా తిరుగుతున్నట్టు కనిపించే నీనా సమాంతరంగా జమైకా సమాజపు వర్తమాన పరిస్థితిని వ్యాఖ్యానించే పాత్రగా కనపడడం కూడా ఈ నవలలోని ప్రత్యేకత. ‘Two years since the election'' she says "Jamaica never gets worse or better, it just finds new ways to stay the same. You can't change the country, but may be you can change yourself’’ అనే నీనా ద్వారా గొప్ప వాస్తవాన్ని మనం తెలుసుకోవచ్చు.

 తన మొదటి నవల సమయంలో టోనీ మార్సన్‌తోనూ, రెండవ నవల సమయంలో టెరాన్‌టిన్‌తోనూ పోల్చినప్పుడు ఇబ్బంది పడ్డ జేమ్స్, తనపై చార్లెస్ డికెన్స్ ప్రభావం ఉన్నట్లు పేర్కొన్నాడు. కథను చెప్పడంలోనూ, ఆశ్చర్యాన్ని బిగించడంలోనూ, ముగింపు అనిశ్చితిగా ఉంచడంలోనూ డికెన్స్ స్టైల్ కొనసాగించాడు. ఇంకొక విలక్షణత ఏమిటంటే నవలలోని వ్యంగ్య వైభవం. హింసలోనూ, సామూహిక అపశబ్దాలలోనూ సౌందర్యాన్ని వెతకడంలో విఫలయత్నం చేసిన రచయితగా జేమ్స్ మనకు కనపడతాడు. అంటే హింసలోనూ, అపస్వరాలలోనూ ఎప్పటికీ సౌందర్యముండదనే నిజాన్ని చెప్పడమే!
 
నండూరు రాజగోపాల్ 9848132208

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement