మందులకు ధరల వాపు | Liquor prices can be stocked under control | Sakshi
Sakshi News home page

మందులకు ధరల వాపు

Published Fri, Mar 25 2016 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

మందులకు ధరల వాపు

మందులకు ధరల వాపు

సామాన్య ప్రజలకు మందులు కొనే స్తోమత ఉండాలంటే, వాటి ధరల అదుపుతోనే అది సాధ్యమవుతుంది. ఆరోగ్య రక్షణ మాంద్యాన్ని అడ్డుకోవడానికి పశ్చిమ దేశాల స్వేచ్ఛా విపణులలో కూడా పటిష్టమైన ధరల అదుపు వ్యవస్థలను అమలు చేస్తున్నారు. కెనడాకు పేటెంట్ హక్కులు ఉన్న ఔషధాల ధరల సమీక్షా వ్యవస్థ  ఉంది. ఈజిప్ట్ మొత్తం ఔషధాలు అన్నింటినీ ధరల అదుపు వ్యవస్థ పరిధిలోకి తెచ్చింది. లెబనాన్‌లో పేటెంట్ ఔషధాల ధరలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.
 
 రోజుకు కేవలం రూ. 250/- సంపాదించుకునే ప్రభుత్వోద్యోగి, లేదా సాధారణ కార్మికుడు దీర్ఘకాలంపాటు వేధించే ట్యుబర్‌క్యులోసిస్ (టీబీ/ క్షయ) వంటి వ్యాధికి గురైతే దుర్భర దారిద్య్రం బారిన పడక తప్పదు. ఆ వ్యాధి నివారణకు అవసరమైన వైద్యానికీ, అందుకు ఉపయోగించే మిశ్రమ ఔషధాలకీ అయ్యే ఖర్చు రమారమీ రూ. 1.2 నుంచి 1.5 లక్షలు. ఈ మొత్తం అలాంటి వ్యాధి పీడితుల నాలుగైదేళ్ల పొదుపు మొత్తంతో సమానం. నిజానికి మధుమేహం వంటి ఒక వ్యాధికి గురైనా వారి నెలవారీ ఆదాయంలో ఎక్కువ భాగం దాని మందులకే ఖర్చు చేయవలసి ఉంటుంది. అనేక ఇక్కట్లతో సతమతమవుతున్న భారతీయ వినియోగదారుడంటే అంతర్జాతీయ ఔషధ తయారీ సంస్థలు బంగారుగుడ్లు పెట్టే బాతు మాదిరిగా చూస్తున్నాయి.
 
 మార్టిన్ షెక్రెలి ఆధ్వర్యంలో నడిచే ట్యురింగ్ ఫార్మాసూటికల్స్ తయారు చేసే ఔషధం డారాప్రిమ్‌ను కొనుగోలు చేస్తున్న పాపానికి ఆ సంస్థ వినియోగదారుడిని దారుణంగా శిక్షిస్తోంది. హెచ్‌ఐవీ రోగుల కోసం ఉపయోగించే ఈ మందు ధరను ట్యురింగ్ ఫార్మాసూటికల్స్ కేవలం 20 డాలర్ల నుంచి 750 డాలర్లకు పెంచేసింది. ఇంత దారుణమైన పెంపు ఔషధ పరిశ్రమ పాలిట కూడా పెద్ద భారమే (హెచ్‌ఐవీఎంఏ, సెప్టెంబర్ 2015). గ్లెన్‌మార్క్ అనే ఔషధాల తయారీ సంస్థ రెండు కేన్సర్ నిరోధక ఔషధాలను నెలవారీ ఈఏంఐల ద్వారా కొనుగోలు చేసే సౌకర్యాన్ని భారతదేశంలో ప్రకటించింది.
 
 అవే అబిరాప్రో(250 ఎంజీ, 120 ప్యాక్, ధర రూ. 39,990), ఎవర్మిల్ (10 ఎంజీ, పది ట్యాబ్లెట్ల ప్యాకెట్ ధర రూ. 29,965). కేన్సర్ వ్యాధి నిరోధించడానికి ఉపయోగించే మరో ఔషధం గ్లివెక్. దీని మౌలిక ధర రూ. 8,500  నుంచి లక్షరూపాయలకు చేరింది. కొత్తగా వచ్చిన హెపటైటిస్ సి ఔషధం- సొవాల్డి, దీని ధర మాత్ర ఒక్కంటికి వేయి డాలర్లు. చెవిలో ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించే కార్టిస్‌పోరిన్ అనే ఔషధాన్ని 1975లో గ్లాక్సో వెల్‌కమ్ సంస్థ మెరుగు పరచి తయారుచేసింది. దీని ధరను 10 డాలర్ల నుంచి 195 డాలర్లకు పెంచింది. అయితే ఈ ఔషధం అసలు తయారీదారు ఎండో హెల్త్ సొల్యూషన్స్ ఈ ధర పెంపును ‘హేతుబద్ధం, సముచితం’ అని సమర్థించింది (డేవిడ్ లాజరస్, ఫిబ్రవరి 2016). కాగా చైనాలో ఐదు సంస్థలు కుమ్మక్కయి అలోప్యూరినాల్ ట్యాబ్లెట్ల ధరలు పెంచేసినందుకు ఆ దేశ గుత్తాధిపత్య నిరోధక వ్యవస్థ వాటి మీద జరిమానా విధించింది (ఎన్‌డీఆర్‌సీ 2015).
 
 ఇతర వ్యవహారాలు కూడా ఆందోళన కలిగించే రీతిలో ఉన్నాయి. వాలంటరీ లెసైన్స్ (వీఎల్) వ్యవహారంలో 11 భారతీయ జనరిక్ (సాధా రణ) ఔషధాల తయారీ సంస్థలకు, గైలీడ్ సైన్స్‌కు మధ్య జరుగుతున్న ఒప్పం దాలలో నిర్ణయిస్తున్న ధరలపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు ఔషధాల దిగుమతుల మీద కస్టమ్స్ సుంకం మినహాయింపును పునరుద్ధరించాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయమే ఆ ఔషధాలకి ఉన్న గిరాకీని బహిరంగపరుస్తున్నది. అందువల్ల ఆ ఔషధాల ద్వారా జరిగే వైద్యం సంవత్సరం పాటు యథేచ్ఛగా సాగుతుంది. అంటే తీవ్ర అస్వస్థత ఇప్పుడు ఔషధ సంస్థలకు బంగారు గని వంటిదన్నమాట.
 
 పేదలకు సంబంధించి భారతదేశంలో ఆరోగ్య రక్షణ చాలా అస్తవ్యస్తంగా సాగుతోంది. ఆరోగ్యం కోసం చేసే వ్యయంలో 80 శాతం వరకు సొంతంగా వ్యక్తులు తమ జేబు నుంచి పెట్టుకుంటున్నదే. మళ్లీ ఇందులో 70 శాతం ఔట్ పేషెంట్‌గా మందులు కొనుగోలు చేయడానికి వ్యయం చేయాలి (క్రీస్.ఎ, కొత్వానీ. ఎ, కుట్జిన్. జె, పిళ్లై. ఎ 2004). అందుబాటులో ఉన్న మందులు ఏవి అన్న అంశం మరీ అందోళన కలిస్తున్నది. అంటే మందులు కొనుగోలు చేసే స్తోమత ఎంతవరకు? దేశ రాజధాని ఢిల్లీలో కొనగలిగిన ఔషధాల అందుబాటు 48.8 శాతమే (అనితా కొత్వానీ, 2013). పారాసిటామల్ వంటి మౌలిక ఔషధాన్ని కొనుగోలు చేసే స్తోమతను అసంఘటిత రంగంలోని ఒక కార్మికుడు సాధించుకోవాలంటే గంట పాటు (ఇదే ఇంగ్లండ్‌లో అయితే పది నిమిషాలు) శ్రమించాలి (ఆలిండియా డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్, 2015).
 
 భారతదేశంలో ఔషధాల ధరల నిర్ణాయక వ్యవస్థ ఏర్పడింది. 1962 నాటి  ఔషధాల (ధరల పట్టిక ప్రదర్శన)ఆదేశం వాటి ధరలను నిరోధించింది. హాతీ కమిటీ నివేదిక (1975) మరో మైలురాయి. ఈ నివేదికను బట్టే ఔషధ విధానం (1979) రూపొందింది. జాతీయ ఔషధ అథారిటీ, ప్రత్యేక ఔషధాల ధరలను క్రమబద్ధీకరించే వ్యవస్థ కూడా ఆ నివేదికతోనే అమలులోకి వచ్చాయి. తయారీ, ఆవిష్కరణలలో  కొన్ని మినహాయింపులు ఇచ్చి  ఔషధాల ధరల అదుపు ఆదేశం-డీపీసీఓ (2013) భారత జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలోకి 348 ఔషధాలను తీసుకువచ్చింది (ఎస్. శ్రీనివాసన్, ఈపీడబ్ల్యూ, 2014). కొన్ని లొసుగులు అలాగే ఉండిపోయాయి. పారాసిటామల్ తయారీలో 358 విధానాలను ధరల అదుపు వ్యవస్థ కిందకు తీసుకురాగా, ఈ ఔషధానివే  2714 సంయోగాలను (మార్కెట్‌లో వీటి వాటా 80 శాతం) వదిలిపెట్టింది (శౌరీరంజన్ శ్రీనివాసన్ 2013). ధరల అదుపు ఉన్నప్పటికీ, దేశీయ మార్కెట్‌లో 18 శాతం మందులే డీపీసీఓ 2013 పరిధిలోకి వస్తాయి. ఇది చాలా తక్కువగానే ప్రభావితం చేయగలుగుతోంది.
 
 జాతీయ ఔషధాల ధరల నిర్ణాయక వ్యవస్థ 50 నాన్ షెడ్యూల్డ్ ఔషధాల ధరల మీద నియంత్రణను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడంతో సామాన్య ప్రజానీకానికి ఆ ఔషధాల అందుబాటు మిథ్యగా మారింది (ఎస్. శ్రీనివాసన్, ఈపీడబ్ల్యు, 2014). నిజానికి భారతీయ ఔషధ పరిశ్రమ సరైన పోటీ లేని వాతావరణంతో బాధపడుతోంది. వినియోగదారులు తమ తక్షణ అవసరం నుంచి బయటపడడానికి ఎక్కువ ధర ఉన్న ఔషధాలనే కొనుగోలు చేస్తున్నారు. దేశంలో ఔషధాల ధరల నిర్ణాయక వ్యవస్థను మార్చవలసిన తరుణం వచ్చింది.

 సామాన్య ప్రజలకు మందులు కొనే స్తోమత ఉండాలంటే, వాటి ధరల అదుపుతోనే అది సాధ్యమవుతుంది. ఆరోగ్య రక్షణ మాంద్యాన్ని అడ్డుకోవ డానికి పశ్చిమ దేశాల స్వేచ్ఛా విపణులలో కూడా పటిష్టమైన ధరల అదుపు వ్యవస్థలను అమలు చేస్తున్నారు. కెనడాకు పేటెంట్ హక్కులు ఉన్న ఔషధాల ధరల సమీక్షా వ్యవస్థ  ఉంది.
 
 ఈజిప్ట్ మొత్తం ఔషధాలు అన్నింటినీ ధరల అదుపు వ్యవస్థ పరిధిలోకి తెచ్చింది. లెబనాన్‌లో పేటెంట్ ఔషధాల ధరలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. అదే లెబనాన్ నేషనల్ డ్రగ్ ఇండెక్స్. వీటి గురించి ఆలోచించడంతో పాటు మనం కేంద్రీకృత సేకరణ విధానాన్ని ప్రోత్సహించాలి. మందులు కొనుగోలు విషయంలో తమిళనాడు అనుసరిస్తున్న విధానాన్ని అనుసరించాలి. వైద్యులను, అధికారులను లోబరుచుకోవడానికి, తమ సంస్థల నుంచి ఔషధాలను కొనుగోలు చేయించే ఉద్దేశంతో ఏర్పాటు చేసే హాలిడే పర్యటనలు, కానుకలు సమర్పించుకోవడం వంటి అనైతిక చర్యలను నిరోధించడం చాలా అవసరం.
 
 ఆలిండియా డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్ సూచించినట్టు అత్యవసర ఔషధాల జాబితాను రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. అలాగే తజక స్తాన్‌లో అమలవుతున్నట్టు అత్యవసర ఔషధాల మీద వ్యాట్‌ను తొలగించే అంశాన్ని కూడా ఆలోచించవచ్చు. దేశంలో అందరూ భరించగలిగే ఆరోగ్య రక్షణ అవసరం. ఇందుకు బీమా విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది, తోడ్పడుతుంది.  చౌకగా లభించే ఇన్‌పేషెంట్ బీమాను ప్రభుత్వం తీసుకురావాలి. అలాగే ఆస్పత్రి నుంచి విడుదలై వెళ్లిన తరువాత అయ్యే ఖర్చును కూడా ఇందులో జత చేయాలి. తక్కువ ఖర్చుతో రోగ నిర్ధారణ విధానం, జనరిక్ ఔషధాల దుకాణాల ఏర్పాటు (రాజస్తాన్‌లో ఏర్పాటు చేసిన లైఫ్ లైన్ దుకాణాల వంటివి), తక్కువ ఖర్చుతో వైద్యం అందుకుని  బయటపడే ఆస్పత్రులను, అంటే సామాన్యులు కూడా భరించగలిగిన వైద్యాన్ని (వాత్సల్య ఆస్పత్రుల వంటివి) కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలి.
 
భారతదేశంలో ఔషధాలు ఇప్పటికీ అధిక ధరలతో, సామాన్యుల స్తోమతకు అందనంత దూరంగానే  ఉన్నాయి. ఇది వాస్తవం. భారతదేశం ఇంకా పేద దేశమే. ఇలాంటి పేద దేశంలో మందులు, వైద్యం కోసం ప్రజలు అప్పుల పాలుకావడం, ఈ పరిణామంతోనే లక్షలాది మంది మళ్లీ పేదరికంలో మగ్గిపోవలసి రావడం రెండో పెద్ద వాస్తవం. సరికొత్త విధానాలను అమలులోకి తీసుకురావడం ద్వారా అన్ని రకాల ఔషధాలను అందుకోగల స్తోమతను సామాన్య జనానికి కూడా కలిగించవచ్చు.
 (వ్యాసకర్త మేనకా గాంధీ కుమారుడు, బీజేపీ ఎంపీ)
 - వరుణ్‌గాంధీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement