పర్యావరణ రక్షణా, దేశ భద్రతా?
విశ్లేషణ
పర్యావరణ రక్షణ, అమృత్ మహల్‌కవాల్స్‌భూముల్లో ఆదివాసులు, పక్షుల జీవజాతుల రక్షణకు సంబంధించిన సమాచారం అడిగితే అది దేశ భద్రతకు సంబంధించిన రహస్యం అని ఎలా చెప్పగలరు?
కర్ణాటకలో అమృత్ మహల్ కవాల్స్ ప్రాంతంలో వేలాది ఎకరాలను పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చేశారు. అందువల్ల అక్కడి ఆదివాసులకు మంచినీటి ప్రాంతాలకు వెళ్లే దారులు మూసేసే విధంగా గోడలు కట్టుకున్నారు. వలస పక్షులు భయపడి అక్కడ వాలడం లేదు. జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్‌జీటీ) నేలను, నీటిని, పక్షులను, జీవజాతిని, మనుషుల హక్కులను కాపాడే చర్యలు తీసుకోవాలని వివరమైన ఆదేశాలు జారీ చేసింది. కాని ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కర్ణాటక పర్యావరణ ప్రేమికులు సమాచార హక్కు కింద ఏ చర్య తీసుకున్నారో చెప్పమని అడిగారు. భారతదేశ భద్రత సమస్య అని జవాబు. అందుకని సమాచారం ఇవ్వ లేదు.
సౌర విద్యుత్త్తు పర్యావరణ భద్రత విషయంలో ఇంకా అనుమానాలు ఉన్నాయనీ కనుక ఆ పరిశ్రమలకు విచ్చలవిడిగా భూములు, ముఖ్యంగా హరిత క్షేత్రాలు ఇవ్వడం గురించి పునరాలోచించాలని ఎన్‌జీటీ సూచించింది. కర్ణాటక పరిశ్రమల సంస్థ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ వారికి భూములు కేటాయించారు. ఆ భూముల్లో గుడులకు వెళ్లేందుకు అక్కడి ప్రజలను అనుమతించాలని, పూజలు చేసుకోనివ్వాలని ఎన్ జీటీ ఆదేశించింది. కలువెహళ్లి అనే గ్రామంలో ఉన్న పొలాలకు చేరుకునేందుకు గ్రామప్రజలకు అడ్డుగా ఉన్న కంచెను మరో చోటికి తరలించాలని ఆదేశించింది. ఖుదాపురా నుంచి తమ గొర్రెల ఫారంను చేరుకోవడానికి ప్రజలకు వెసులుబాటు కలిగించాలని బాబా అణు విద్యుత్కేంద్రం ఐఐఎస్‌సీని ఆదేశించింది. ఉల్లార్తి అనే గ్రామస్తులకు నీటి సమస్య ఏర్పడడానికి ఇస్రో నిర్మాణాలు కారణమైనందున వారికి నీటిని సరఫరా చేయాలని ఇస్రోను ఎన్‌జీటీ ఆదేశించింది.
హరిత క్షేత్రం పర్యావరణ వ్యవస్థలో బస్టర్డ్ జాతి పక్షులకు ఇతర జీవజాతులకు జీవించే పరిసరాలు ఉంటాయి. వాటిని రక్షించకపోతే ఆ పక్షులు రావు. ఉన్న జీవరాశి కూడా బతకజాలదు. వీటన్నిటినీ బలిపెట్టి సాధించే అభివృద్ధి అభివృద్ధేనా? ‘ప్రాజెక్టు బస్టర్డ్’ వంటి ప్రాజెక్టులు ప్రారంభించాలని కూడా ఎన్‌జీటీ సూచించింది. అమృత్ మహల్ కవాల్స్‌లో మిగిలిన భూములనైనా రక్షించండి అని కూడా ఎన్‌జీటీ కోరింది. కర్ణాటక ప్రభుత్వం అందుకు చర్యలు చేపట్టాలన్నది. తుది చర్యలు ఏమిటో చెప్పాలని, పర్యావరణ సమృద్ధిని పునర్ వ్యవస్థీకరించడానికి చర్యలు తీసుకున్నారా? అని అడిగింది. ఇవి కాకుండా బాబా కేంద్రం, ఇస్రో పర్యావరణ కాలుష్య నివారణ మండలి అనుమతులను ఎందుకు తీసుకోలేదని కూడా అడిగింది. వారి అనుమతి ఇచ్చే సమయంలో పర్యావరణ రక్షణ షరతులను ఖచ్చితంగా అమలు చేయాలని కూడా కాలుష్య నియంత్రణ మండలిని, పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది.
పూజల కోసం గుడులకు వెళ్లేందుకు ప్రజలను అనుమతించే నోటిఫికేషన్లు స్థానిక కన్నడ భాషలో ప్రచురించారా అని అడిగింది. సంప్రదాయ వేడుకలలో ఆ ప్రజలు పాల్గ్గొనేందుకు వెసులు బాటు కలిగించిన దాఖలాలు చూపాలని కూడా ఆదేశించింది.
మరి ఏ చర్యలు తీసుకున్నారు అని సమాచార హక్కు కింద డేవిస్ జార్జి థామస్ అడిగారు. కొన్ని సంస్థలు జాతీయ భద్రతకు చెందిన పనులను నిర్వహిస్తున్న విషయం నిజమే కాని ఈ చర్యలు తీసుకున్నారా లేదా అనే చర్యానివేదికను కోరినప్పుడు ఆ సమాచారం వెల్లడిస్తే జాతీయ భద్రతకు ముప్పు అనే వాదాన్ని పర్యావరణ మంత్రిత్వ శాఖ లేవనెత్తింది.
పర్యావరణ రక్షణ, అమృత్ మహల్ కవాల్స్ భూముల్లో ఆదివాసులు, పక్షుల జీవజాతుల రక్షణకు సంబంధించి అడిగితే అది దేశ భద్రతకు సంబంధించిన రహస్యం అని ఏ విధంగా చెప్పగలరు? పర్యావరణ పరిరక్షణకు హరిత న్యాయస్థానం ఆదేశాలను పాటించడానికి వీల్లేదని, ఆ ఆదేశాలను పాటిస్తే దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని నిజంగానే భావిస్తే ఆ విషయం హరిత న్యాయస్థానానికి నివేదించి వారి ఆదేశాలు సవరించాలని కోరాల్సింది. అదేమీ చేయన ప్పుడు, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆ ఆదేశాలను పాటించిందో లేదో తెలపాలని, అందుకు సంబంధిం చిన చర్యానివేదిక ఇవ్వాలని అడిగితే దేశభద్రతకు ముప్పు అని ఎలా చెబుతారంటూ కమిషన్ ప్రశ్నిం చింది. కేవలం సమాచార నిరాకరణకే నియమాలను నిరాధారంగా వాడుకోవడం సమంజసం కాదు. అయినా ఇస్రో, బార్క్ వంటి జాతీయ సంస్థల విధి నిర్వహణలో జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలుంటే వాటిని బయట పెట్టకుండానే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఎన్‌జీటీ జారీ చేసిన ఆదేశా లను ఎంతవరకు పాటించాలో తెలియ జేయాలని కమి షన్ రెండో అప్పీలు విచారణ తరువాత ఆదేశించింది.
ఏ సమాచారం వెల్లడిస్తే జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది? అమృత్ మహల్ కవాల్స్ భూముల్లో నివసించే వారి సౌకర్యాలను రక్షించారో లేదో చెప్పడానికి దేశ భద్రతకు సంబంధం ఏమిటి అని వివరించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భం ఉంటే ఆ సమాచారం ఇవ్వకుండానే మిగిలిన చర్యల వివరాలు చెప్పే వీలుందా అని పరిశీలించాలి. ఇదేమీ లేకుండా కేవలం ఒక సాకుగా వాడి ఇంత కీలకమైన సమాచారం ఇవ్వకుండా నిరాకరించినందుకు పది వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఆదేశించింది.
మాడభూషి శ్రీధర్
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com