పట్టిసీమ ప్రహసనం | National project to make as Pattiseema | Sakshi
Sakshi News home page

పట్టిసీమ ప్రహసనం

Published Sun, Sep 13 2015 1:39 AM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM

పట్టిసీమ ప్రహసనం - Sakshi

పట్టిసీమ ప్రహసనం

మరి మూడేళ్ళలో (2018 కల్లా) జాతీయ ప్రాజెక్టుగా పోలవరం సాకారం అవుతుందంటూ ఘంటాపథంగా ప్రకటిస్తున్న చంద్రబాబునాయుడు పట్టిసీమను ఎందుకు కట్టవలసివస్తోందో ప్రజలకు వివరించకుండానే పనులు ప్రారంభించారు. వరదలో ఉన్న గోదావరి నీటిని వరదలో ఉన్న కృష్ణలోకి పంపుతామంటున్నారు. నీటిని నిల్వ చేసే వ్యవస్థలేని పట్టిసీమ ఎందుకనే ప్రశ్నకు సమాధానం లేదు.  
 
 ‘నది లేని చోట సైతం వంతెన నిర్మిస్తానంటూ వాగ్దానం చేసే రాజకీయ వాదులు ప్రపంచం అంతటా ఉంటారు’ అంటూ ప్రచ్ఛన్న యుద్ధంలో సోవి యట్ యూనియన్‌కు నాయకత్వం వహించిన ప్రధాని నికితా కృశ్చవ్ చమత్క రించాడు (పొలిటీషియన్స్ ఆర్ ది సేమ్ ఆల్ ఓవర్. దే ప్రామిస్ టు బిల్డ్ బ్రిడ్జ్ ఈవెన్ వేర్ దేర్ ఈజ్ నో రివర్). కృశ్చవ్ 1971లోనే స్టాలిన్ ఉన్న చోటికి వెళ్ళి పోయాడు. ఆ తర్వాత రెండు దశాబ్దాలకు సోవియట్ యూనియన్ పతనం ప్రచ్ఛన్న యుద్ధానికి చరమగీతం పాడింది. అమెరికా ఒకే ఒక అగ్రదేశంగా, మార్కెట్ ఎకానమీ ఒకే ఒక అభివృద్ధి నమూనాగా నిలిచాయి.
 
అనేక దేశాలలో పరిపాలనా వ్యవస్థలు మారిపోయాయి. డబ్బు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, డబ్బు అన్నిటినీ శాసించడం ఆనవాయితీగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు సంవత్సరాలకోసం రూ.1,300 కోట్లు ఖర్చు చేసి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తికి ఎందుకు ఎత్తుతున్నారో, కొత్త రాజధాని నిర్మాణం పేరుతో సింగపూరు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో, డబ్బు చేయడం తెలిసిన వ్యక్తులనే తన చుట్టూ ఎందుకు పెట్టుకున్నారో, భూమి స్వాధీనం చేసుకోవడంకోసం రైతులనూ, జాల ర్లనూ, ఇతరులనూ ఎందుకు వేధిస్తున్నారో అర్థం చేసుకోవాలంటే ఈ నేపథ్యం తెలుసుకోవాలి.
 
 ఒక పద్ధతి ప్రకారం సక్రమంగా ప్రారంభించిన పని సగం అయినట్టే (వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్) అని అంటారు. కానీ ప్రారంభించిన వెనువెంటనే పని పూర్తి కావడం కనికట్టు. ఇది హస్తవాసి కాదు. హస్తలాఘవం. మార్చి 29న పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి ఆరు మాసా లు పూర్తి కాలేదు. అప్పుడే ఆ స్కీమ్‌ను జాతికి అంకితం చేసేశారు. పట్టిసీమతో కానీ, పోలవరంతో కానీ ఏ మాత్రం ప్రమేయం లేకుండానే గోదావరి నీటిని తాడిపూడి ప్రాజెక్టు దగ్గర తోడి పోలవరం కుడి కాలువ ద్వారా బుడమేరులోకి పంపించి విజయవాడలో కృష్ణా బరాజ్‌లోకి పారించే విధంగా చాతుర్యం ప్రద ర్శించారు. పోలవరం కుడి కాలువలో గోదావరి నీరు కృష్ణా జిల్లాలోకి ప్రవేశిం చగానే నదుల అనుసంధానం జరిగిపోయిందంటూ తెలుగుదేశం పార్టీ కార్య కర్తలు కేరింతలు కొడుతూ సంబరం చేసుకుంటున్నారు. ‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్’ అంటూ సినీకవి చెప్పినట్టు జగమే మాయ అనుకుంటూ లేనిది ఉన్నట్టు భ్రమిస్తూ అవాస్తవ జగత్తులో విహరించేవారికి ఎదురేమున్నది?
 
 ఎన్నికలలో గట్టెక్కి అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత ప్రజలతో నిమిత్తం లేదు. ప్రజల పేరు మీద పాలకులు ఏమి చేసినా ప్రశ్నించకూడదు. ప్రతిపక్షం చట్టసభలలో నిలదీస్తే అచ్చన్నాయుడినీ, బుచ్చయ్య చౌదరినీ ప్రయోగిస్తారు. వీధులలో పోరాటం చేస్తే పోలీసు బలగంతో అణచివేస్తారు. మంత్రులకూ, అధికార పక్షానికి చెందిన శాసనసభ్యులకూ చంద్రబాబు నాయుడు వ్యూహాలలో, ఎత్తుగడలలో చాలావరకూ అంతుబట్టవు. ఒకటీ అరా చూచాయగా తెలిసినా వివరాలు అడిగే సాహసం చేయరు. కేంద్రంలో అధికారంలో ఉన్న మిత్రపక్షానికి రాష్ట్రంలో వెన్నెముక లేదు. వేగుల ద్వారా తన మంత్రిమండలి సభ్యుల గురించే కాకుండా దేశంలోని ముఖ్యమంత్రులకు సంబంధించిన సమాచారం సైతం తెప్పించుకుంటున్న ప్రధాని నరేంద్రమోదీ తప్పు జరుగుతున్నా, ప్రజాధనం వృధా అవుతున్నా అదుపు చేయరు. మిత్ర పక్షం ఆత్మరక్షణలో ఉండటమే మంచిదనే అభిప్రాయం.
 
 వారి ఆరాటంలో వారు నిర్విరామంగా ఉంటే ప్రత్యేక హోదా అంటూ, పోలవరం ప్రాజెక్టుకు నిధు లంటూ ఒత్తిళ్ళు ఉండవు. రాష్ట్రంలో ఏమి చేసుకున్నా చూసీచూడనట్టు పోవ డమే మేలన్నది మోదీ మనోగతం కావచ్చు. అందుకే ముఖ్యమంత్రి ఏది చేయ దలుచుకుంటే అది చేయగలుగుతున్నారు. కే ంద్రం పట్టించుకోదు. మం త్రివర్గంలో ప్రతిఘటన లేదు. శాసనసభాపక్షంలో ఎదురు లేదు. ప్రతిపక్షాన్ని ఆలకించే సమస్య లేదు. దబాయింపు రాజకీయం రాజ్యం చేస్తున్నప్పుడు నష్ట పోయేది ప్రజలే కాదు. పాలకులు కూడా. తప్పు తెలుసుకొని సవరించుకునే అవకాశం ఉండదు.
 
 అడుగు కదలని పోలవరం
 మరి మూడేళ్ళలో (2018 కల్లా) జాతీయ ప్రాజెక్టుగా పోలవరం సాకారం అవు తుందంటూ ఘంటాపథంగా ప్రకటిస్తున్న చంద్రబాబునాయుడు పట్టిసీమను ఎందుకు కట్టవలసి వస్తోందో ప్రజలకు వివరించకుండానే పనులు ప్రారంభిం చారు. వరదలో ఉన్న గోదావరి నీటిని వరదలో ఉన్న కృష్ణలోకి పంపుతా మంటున్నారు. నీటిని నిల్వ చేసే వ్యవస్థ లేని పట్టిసీమ ఎందుకనే ప్రశ్నకు సమాధానం లేదు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మిస్తే జలాశయం నుంచి కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకూ, ఎడమ కాలువ ద్వారా గోదావరి జిల్లాలకూ, విశాఖపట్టణం జిల్లాకూ నీరు భూమ్యాకర్షణశక్తి వల్ల ప్రవహిస్తుంది. ఇప్పటికే ఉన్న తాడిపూడి, పుష్కరం ఎత్తిపోతల స్కీమ్‌లు విద్యుచ్ఛక్తిని వినియోగించి గోదావరి నీటిని ఎత్తిపోయవలసిన అగత్యం అప్పుడు ఉండదు. పోలవరం కుడికాలువ ద్వారా నీరు కృష్ణా డెల్టాకు ప్రవహిస్తున్నప్పుడు పట్టిసీమ ఎత్తిపోతల అక్కర ఉండదు.
 
 నిజంగానే 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మా ణం పూర్తవుతుందని ముఖ్యమంత్రి విశ్వసిస్తుంటే పట్టిసీమపైన రూ.1,300 కోట్లు పోయడం దండగమారి పని. పోలవరం నిర్మాణం ఇప్పట్లో సాధ్యం కాదని ముఖ్యమంత్రికి స్పష్టంగా తెలిసి ఉంటే 2018 నాటికి పూర్తవుతుందని ప్రకటించడం వంచన. ఆత్మవంచనో, పరవంచనో తెలియని అయోమయ పరిస్థితిలో మనం ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విధానంలో పరస్పర విరుద్ధమైన అంశాలే కాకుండా అయోమయం కలిగించే అంశాలు కూడా ఉన్నా యని మాజీ ఇంజనీర్-ఇన్-ఛీఫ్ హనుమంతరావు వ్యాఖ్యానించింది ఇందుకే. ఏమి ఆశించి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారో తెలియదు. తెలిసిన వారు చెప్పరు.
 
 ఎవరికి తోచినట్టు వారు ఊహించుకోవలసిందే. తెలుగు దేశం ప్రభుత్వం పట్ల ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారో తెలుసుకోవడానికి శనివా రంనాడు బందరు సమీపంలో మంత్రిని ప్రజలు తరిమిన తీరూ, విజయనగరం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణం కోసం వందల ఎకరాలు సమీకరించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రతిఘటిస్తూ భోగాపురం మండలం రైతులు మండిపడుతున్న వైనం, శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు రేవు నిర్మాణం కోసం గ్రామాలు ఖాళీ చేయడానికి నిరాకరిస్తూ జాలర్ల కుటుంబాలు పోరాటం చేస్తున్న విధానం గమనిస్తే చాలు. తమ పట్ల నిర్లక్ష్యం, వివక్ష కొనసాగుతున్నాయను కుంటూ రాయలసీమ ప్రజలు రగిలిపోవడం చూస్తే అర్థం అవుతుంది పాలకుల పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో.
 
 దబాయింపు రాజకీయం
 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పట్టిసీమను తాగునీటికోసం, పరి శ్రమల వినియోగానికి నీరు అందించడంకోసం ఉద్దేశించినట్టే ఉన్నది. కృష్ణా డెల్టా గురించి కానీ రాయలసీమ గురించి కానీ ప్రస్తావన లేదు. ఇంత అస్ప ష్టంగా జీవో ఎందుకు ఇచ్చారని అడిగినవారిని అభివృద్ధి నిరోధకులటూ నింది స్తారు. రాయలసీమకు నీరివ్వడం ఇష్టం లేదా అంటూ దబాయిస్తారు. సంగతి చూస్తామంటూ తర్జని చూపిస్తూ బెదిరిస్తారు.
 
 దేశంలో ఎక్కడా ఎప్పుడూ ఇంత హాస్యాస్పదమైన, వివాదాస్పదమైన సందర్భం క నలేదు. వినలేదు. మనసులో ఒకటి చేతల్లో మరొకటి. చెప్పింది చేయరు. చేసేది చెప్పరు. శనివారంనాడు పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు పను లను పరిశీలించిన బీజేపీ బృందంలో కామినేని శ్రీనివాస్ అనే మంత్రివర్యుడు కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పట్ల బీజేపీ నాయకులు అసంతృప్తి వెలిబుచ్చారు. అదే విషయం మంత్రివర్గ సమావేశంలో సదరు మంత్రి చెప్పరు. ముఖ్యమంత్రికి నివేదించరు. అవకాశం ఉన్నప్పటికీ ప్రధాని దృష్టికి తీసుకొని వెళ్ళరు. మీడియాకు చెబుతారు. ఇది కేవలం రాజకీయ విన్యాసం. పోలవరం పనులు జరగకపోవడానికి ఎవరు కారణం?
 
 విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టు. కేంద్ర నిధులతో పనులు సమస్తం జరగాలి. తెలంగాణలోని అయిదు మండలాలనూ ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైతే కేంద్ర ప్రభుత్వం చేసింది కానీ పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయలేదు. అరుణ్‌జైట్లీ 2015-16 బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకోసం కేటాయించింది సిబ్బంది వేతనాలకు సరిపోదు. 25 వేల కోట్లు అవసరమైన ప్రాజెక్టు సంవ త్సరానికి వెయ్యి కోట్లు కేటాయిస్తే ఎన్నేళ్ళకు పూర్తవుతుంది? ఏయే పనులు జరగడం లేదని అసంతృప్తిగా ఉన్నారో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హరిబాబు, ఇతర నాయకులు ప్రజలకు తెలియజేయాలి. రాష్ట్రం చేయవలసిన పను లేమిటో, కేంద్రం చేయవలసిన పనులేమిటో వివరించాలి. ఎందుకు పనులు జరగడం లేదో చెప్పాలి.
 
 సుప్రీంకోర్టులో కేసులు
 పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు పూర్తిగా తొలగిపోలేదు. అనేక కేసులు ఇప్ప టికీ సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్నాయి. పర్యావరణ అనుమతిని రద్దు చేస్తూ నేషనల్ ఎన్విరాన్‌మెంట్ అపిలేట్ అథారిటీ 2007 డిసెంబరు 19 ఉత్తర్వు జారీ చేసింది. దాన్ని వైఎస్‌ఆర్ హయాంలో ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసి స్టే తెచ్చుకుంది. కానీ హైకోర్టులో విచారణ జరగలేదు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఈ కేసుకు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు పంపించారు. పోలవరానికి సంబంధించి ఇతర కేసులతో పాటు ఇది కూడా విచారణకు నోచుకోకుండా పడి ఉంది.
 
 పోలవరం పనులు చేసుకోవచ్చు నంటూ ఇటీవల కేంద్ర పర్యావరణశాఖ మంత్రి జావ్‌దేకర్ మౌఖికంగా చెప్పా రు. లిఖిత పూర్వకంగా ఎటువంటి అనుమతీ రాలేదు. ఎన్‌డీఏకి ఒడిశా ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ మద్దతు రాజ్య సభలో అవసరం. పోలవరం ప్రాజెక్టును పట్నాయక్ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో మొత్తం 26 గ్రామాలే మునిగిపోతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంటే వంద గ్రామాల దాకా మునుగుతాయని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వాదిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో రామన్‌సింగ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇటువంటి పరిస్థితులలో పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి ఎన్‌డీఏ ప్రభుత్వం విశేషంగా నిధులు అందించి ప్రోత్సహించే అవకాశాలు తక్కువ. ఈ విషయం తెలిసే ఏదో ఒక ప్రాజెక్టు నిర్మించి చూపించాలనే సంకల్పంతో పట్టిసీమను చంద్రబాబునాయుడు పట్టు కున్నారని అనుకోవాలి.
 
 నిజంగానే పోలవరం లేకుండా నదులు అనుసంధానం చేయాలని అను కున్నా పట్టిసీమతో పని లేదు. గోదావరి కుడి ఒడ్డున తాడిపూడి, ఎడమ ఒడ్డున పుష్కరం ఉన్నాయి. కొరవ ఉన్న పనులు పూర్తి చేసి తాడిపూడి స్థాయిని పెంచు కుంటే పట్టిసీమ లేకుండానే పోలవరం కుడికాలువకు గోదావరి నీరు పంప వచ్చు. కానీ ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టు 80 టీఎంసీల నీరు పంపడం అసా ధ్యం. తాడిపూడి సామర్థ్యం 1,100 క్యూసెక్కులు. కానీ ఇప్పుడు 600 క్యూసె క్కుల నీరు మాత్రమే ఎత్తిపోయగలుగుతున్నారు.
 
వారం రోజుల కిందట గోపా లపురం దగ్గర పోలవరం కుడికాలువలోకి పంపింది వర్షపు నీటితో కలిపి 600 క్యూసెక్కుల కంటే ఎక్కువ ఉండదు. 30 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించవల సిన కాలువలో ఇంత తక్కువ ప్రమాణం నీరు పంపితే అది పిల్ల కాలువ అవు తుంది. బుడ మేరు చేరేవరకూ నీటి పరిమాణం ఇంకా కొంత తగ్గిపోతుంది. పట్టిసీమలో 13 పంపులతో నీరు ఎత్తిపోయాలని సంకల్పించారు. మొదటి పంపు ఇంకా రావలసి ఉంది. దాని సామర్థ్యం 300 క్యూసెక్కులు ఉంటుంది. ఒక్క పంపు కూడా రాకుండా పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం, నదుల అనుసంధానం జరిగిపోయినట్టు సంబరాలు చేసుకోవడం ఆత్మవంచన కాక ఏమవుతుంది?
 - కె.రామచంద్రమూర్తి
 సాక్షి ఎడిటోరియల్  డైరెక్టర్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement