ఎట్టకేలకు పట్టిసీమ పంప్ ప్రారంభం
సాక్షి, పోలవరం: పట్టిసీమ ఎత్తిపోతల పథకం హెడ్‌వర్క్స్ వద్ద 6వ నంబర్ వెల్‌కు అమర్చిన మోటార్ పంప్ స్విచ్‌ను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం మధ్యాహ్నం ఆన్ చేశారు. కేవలం ఒక మోటార్, ఒక పంప్‌తో మాత్రమే నీటిని విడుదల చేశారు. దీనిద్వారా కేవలం 354 క్యూసెక్కుల నీరు మాత్రమే పోలవరం కుడికాల్వలోకి వెళుతోంది. ఈ నెల 16న సాయంత్రం సీఎం చంద్రబాబు పంప్‌ల వద్ద ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
కానీ రెండురోజుల తర్వాత కేవలం ఒక పంప్‌ను ప్రారంభించగలిగారు. ముందుగా హెడ్‌వర్క్స్ వద్ద డయాఫ్రమ్ వాల్‌ను కట్‌చేసి గోదావరి నది నుంచి నీటిని వెల్‌లోకి మళ్లించారు. కొద్దిపాటి నీరు చేరగానే మంత్రి స్విచ్ ఆన్ చేయడంతో మోటార్‌లోకి గాలి చొరబడి కొద్దిసేపటికే ఆగిపోయింది. దీంతో అధికారులు డయాఫ్రమ్ వాల్ రంధ్రాన్ని వెడల్పు చేసి ఎక్కువ నీటిని వెల్‌లోకి మళ్లించారు. మళ్లీ మోటార్ వేశారు.
గాలి పట్టేయడం, గేట్‌వాల్ వద్ద నీరు లీకవడం, హెడ్‌వర్క్స్ వద్ద పైప్ లీకవ్వడాన్ని గుర్తించారు.మరమ్మతుల అనంతరం తిరిగి ప్రారంభించారు. మొత్తం మూడుసార్లు మోటార్ ఆన్ చేసిన తర్వాత పైపులైన్ నుంచి పోలవరం కుడి కాల్వ 1.50 కి.మీ. వద్ద డెలివరీ పాయింట్లోకి నీరు చేరింది. దీన్ని మంత్రితో పాటు అంతా ఉత్కంఠతో చూశారు.