
మరణం లేని మనిషి
అతడు మనిషి మనుషులకెవరికి అతనిగురించి తెలియదని
అతడు మనిషి మనుషులకెవరికి అతనిగురించి తెలియదని
అతనిగురించి చెప్పాలి?!
మనిషే అతని బలమూ
అతని బలహీనతా
మనుషుల్ని కలవరిస్తూ పుట్టి
మనుషుల్ని పలవరిస్తూ పోయిన
మాగిన మానవ జీవితమాయనది
భూమిమీద ఉన్న మనుషులు చాలనట్లు
నిరంతరం తనతో ఉండడానికి
మనుషులు నిండిన పుస్తకాలను తన ఇంటినిండా పరచుకున్నాడు
ఆయన ఇంటినిండా మనుషులు
అది ఒక కమ్యూన్-
అక్కడ ఆయన ఒక అతిథేయ బాటసారి-
విప్లవ పరివ్రాజకుడు
‘మనోడే మంచోడే’ కానివాళ్లు
ఆయనకెవరైనా ఉన్నారా? మగవాళ్లనే కాదు-
మనుషులైతే చాలు మనవాళ్లే మంచివాళ్లే
ఆశ్చర్యమెందుకు- నిజంగానే
ఆయన ఒక కమ్యూనిస్టు-
పుట్టిందీ పెరిగిందీ చేపట్టిందీ
కన్నదీ అంతా విప్లవమే అయిన
కమ్యూనిస్టు
దివిసీమ నుంచి విశాఖసముద్రం దాకా
శ్రీకాకుళం నుంచి దండకారణ్యం దాకా
తెలంగాణ పోరాట నెత్తుటి
చాలుపెట్టిన రైతు
బతుకంతా పంటయినవాడు
మనుషుల్ని విడిచి ఆయన ఎక్కడికి పోగలడని
ఆపన్నులను ఆదుకోవడానికి మరణానంతరమూ
ఆసుపత్రికి వెళ్లిన విజయ అడుగుజాడల్లో
తానూ ఆసుపత్రికి వెళ్లాడు
అంతే
- చలసానికి నీ వరం
(నేడు విశాఖపట్నంలో చలసాని ప్రసాద్ సంస్మరణ సభ జరుగుతున్న సందర్భంగా...)
- స్మృతి కవిత