కరోనాకు మించిన ప్రమాదకరమైనదిగా పరిగణిస్తున్న హెచ్5 ఎన్1(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) పలు దేశాలకు విస్తరిస్తోంది. పశువులు, పాల ద్వారా మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకుతోంది. అమెరికాలోని పలు నగరాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభంలో హెచ్5ఎన్1 వైరస్ కేసుల పెరుగుదలపై భారతదేశం కూడా అప్రమత్తమైంది. హెచ్5ఎన్1 వైరస్‌ను బర్డ్ ఫ్లూ అని కూడా అంటారు.
తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) బర్డ్ ఫ్లూ కారణంగా ప్రపంచంలోనే మొదటి మరణం నమోదయ్యిందని తెలిపింది. మెక్సికోలో 59 ఏళ్ల వ్యక్తి బర్డ్ ఫ్లూ కారణంగా మరణించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. అయితే ఆ వ్యక్తికి వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన ఈ ఏజెన్సీ వెల్లడించలేదు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు తదితర లక్షణాలతో బాధితుడిని ఆసుపత్రిలో చేర్చారు. అతను అప్పటికే దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం, మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధులతో బాధపడుతున్నాడు.
మే 23న ఈ కేసు గురించి తమకు మొదట తెలిసిందని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇది కరోనావైరస్ కంటే వంద రెట్లు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ అని వైద్య నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అందించిన నివేదికలో ప్రస్తుతానికి ఒకరి నుండి మరొకరికి హెచ్5ఎన్1 వైరస్ సోకిన సందర్భాలు కనిపించలేదు. అయినప్పటికీ ఈ వైరస్ విషయంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
ఈ వైరస్ సంక్రమించినప్పుడు దాని లక్షణాలు తేలికపాటి నుండి తీవ్ర స్థాయి వరకూ ఉంటాయి. ఈ నెల ప్రారంభంలో బర్డ్ ఫ్లూపై భారత ప్రభుత్వం ఒక సలహాను జారీ చేసింది. ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరింది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment