సంక్షేమానికి నిధుల క్షామం | No money for welfare schemes in india | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి నిధుల క్షామం

Published Thu, Mar 5 2015 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

సంక్షేమానికి నిధుల క్షామం

సంక్షేమానికి నిధుల క్షామం

సామాజిక న్యాయం, సామాజిక సామరస్య సూత్రాల ఆధారంగా సమాజంలోని అంతరాలను తొలగించడానికి కృతనిశ్చయంతో ఉన్నామని బీజేపీ ఎన్నికల ప్రణాళిక పేర్కొంది. కానీ మోదీ ప్రభుత్వ బడ్జెట్ అందుకు పూర్తి విరుద్ధంగా సాగింది. బలహీన, బడుగువర్గాల సంక్షే మం పట్ల గతంకన్నా మరింత అధ్వాన వైఖరిని చేపట్టింది. కార్పొరేట్ కుబేరులకు పెద్దపీట వేసి, పేద, అణగారిన వర్గాలకు అన్యాయం చేసింది. ప్రణాళికా వ్యయంలో కోత విధించి రాష్ట్రాల నిధుల వాటాను పెంచడం పేదల సంక్షేమ పథకాల మీద తీవ్ర దుష్ర్పభావం చూపబోతున్నది.
 
 
 ‘‘వివిధ కులాల, తెగల సమూహమే భారతదేశం అనే విషయాన్ని నేను నొక్కి చెప్పదలచుకున్నాను. ఈ సామాజిక సమూహాల ప్రగతిలో, స్థాయిలో తారతమ్యాలున్నాయి. వీరందరినీ ఒకే స్థాయిలోకి, సమానత్వంలోకి తేవాల నుకుంటే వారి వారి అవసరాలనుబట్టి విభిన్నమైన చర్యలు తీసుకోవాల్సి ఉం టుంది.’’ 1939 ఫిబ్రవరి, 21న బొంబాయి ప్రెసిడెన్సీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాల్లో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అన్న మాటలివి.
 
 దేశ సామాజిక స్థితిగతులనుబట్టి బడ్జెట్ రూపకల్పన జరగాలంటూ 75 ఏళ్ల క్రితం అంబేద్కర్ పలికిన హితవును మనం మరిచామో, మననంలో ఉంచుకున్నామో పరిశీలించాల్సి ఉంది. ఇటువంటి స్ఫూర్తితోనే భారత రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక రక్షణలను కల్పించారు. 4వ షెడ్యూల్‌లోని ఆదేశిక సూత్రాలలో పొందుపరచిన అంశాలు కూడా అవే. భారత రాజ్యాం గం ఒక వ్యక్తి అభిప్రాయం కాదు. నాడు దేశమంతటికీ ప్రాతినిధ్యం వహిం చిన రాజ్యాంగ సభ చర్చించి రూపొందించినది.
 
 అందులోని 38, 46 ఆర్టికల్స్ ప్రకారం వెనుకబడిన వర్గాలకు, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఆర్థిక రంగాల్లో ప్రత్యేక హక్కులను కల్పించాలని పేర్కొన్నారు. అంతే కాకుండా దీనిని ప్రభుత్వం ఒక బాధ్యతగా నిర్వర్తించాలని ఆదేశించారు. వాటి ఆధారం గానే గత 65 ఏళ్లుగా అరకొరగానైనా కొన్ని పథకాలు అమలు జరుగు తున్నాయి. వాటి కోసం ప్రత్యేక బడ్జెట్ రూపకల్పన కూడా చేస్తున్నారు. ప్రత్యేక మంత్రిత్వశాఖల ద్వారా ఆ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలలో ప్రధాన పాత్రను పోషిస్తున్నది.
 
 సంక్షేమానికి చెల్లుచీటీ
 నరేంద్ర మోదీ ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ బలహీన, బడుగువర్గాల సంక్షే మం పట్ల గతంకన్నా మరింత అధ్వాన వైఖరిని చేపట్టింది. సంపన్న కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేసింది. పేద, అణగారిన వర్గాలకు తీరని అన్యాయం చేసింది. పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడానికి ఉద్దేశించిన సమగ్ర శిశు అభివృద్ధి పథకానికి (ఐసీడీఎస్) నిధుల కేటాయింపులో సగం కోత విధించారు. గత ఏడాది రూ.16,000 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.8,000 కోట్లకు తగ్గిం చారు. ఇది ముఖ్యంగా పేద మహిళలు, పిల్లలపై తీవ్ర దుష్ర్పభావాన్ని కలిగిస్తుంది.
 
 తల్లి తీసుకునే ఆహారాన్ని బట్టే పిల్లల ఎదుగుదల ఉంటుంది. ముఖ్యంగా మెదడు ఎదుగుదలలో సగం తల్లి గర్భంలోనే జరుగుతుందని, మిగిలిన సగభాగం మూడేళ్ల వయసులోపు జరుగుతుందని తేలింది. ఇప్పుడు ఐసీడీఎస్ బడ్జెట్‌ను సగానికి సగం తగ్గించడంవల్ల కొన్ని కోట్ల మంది శిశువులు, మహిళలపై ఆ ప్రభావం పడక తప్పదనేది కఠోర వాస్తవం. అదే విధంగా బడిపిల్లల మధ్యాహ్న భోజన పథకానికి నిధులను కూడా రూ.13,000 కోట్ల నుంచి రూ.9,000 కోట్లకు కుదించారు. మధ్యాహ్న భోజన పథకం మంచి ఫలితాలను ఇస్తున్న సమయమిది. పేద పిల్లలు ఇంట్లో సరైన తిండిలేక, సమయానికి బడికి రాక క్రమంగా బాలకార్మికులుగా మారిపోతు న్నారు.
 
 దానికి విరుగుడుగా వచ్చిన ఈ పథకం అమలు వల్ల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెబుతు న్నాయి. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ రంగం కూడా ఇదే విధమైన వివక్షకు గురైంది. వైద్యం, ఆరోగ్యం ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలకు అందని ద్రాక్షగా ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో సాధారణ జ్వరాలతో చనిపోయే దుస్థితికి మనం తలదించుకోకతప్పదు. అటువంటి ముఖ్యమైన రంగానికి నిధులను రూ.35,163 కోట్ల నుంచి రూ.29,653 కోట్లకు తగ్గిం చారు. విద్యారంగానికి ఆసరాగా ఉంటున్న సర్వశిక్షా అభియాన్‌కు రూ.6,000 కోట్ల కోత విధించారు. ఫలితంగా విద్యారంగంలో, ముఖ్యంగా ప్రాథమిక విద్యలో మౌలిక సదుపాయాల కల్పనకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థుల స్కాలర్‌షిప్పులకు కేటాయింపులు పెరగలేదు. ఇది దళిత, ఆదివాసీ విద్యార్థుల విద్యావకాశాలపై తీవ్ర చెడు ప్రభావం చూపవచ్చు. ఉన్నత విద్యలో పరిశోధనా విద్యార్థులకు అందించే రాజీవ్‌గాంధీ ఫెలో షిప్పులలో తీవ్ర కోత పడే అవకాశం ఉంది.
 
 కొండెక్కిన సామాజిక న్యాయం
 ఇక ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా రూపొందించే సబ్ ప్లాన్ విషయంలో పెద్ద కుట్ర జరిగింది. గత ఏడాదితో పోలిస్తే కేటాయింపుల్లో 50 శాతం కోత పెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో గానీ, ఎకనమిక్ సర్వేలో గానీ దళితులు, ఆది వాసీల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. పైగా బీజేపీ ఎన్నికల ప్రణాళికలో వెలిబుచ్చిన అభిప్రాయాలకు, వాస్తవంగా జరుగుతున్నదానికి పొంతనలేదు.
 
 ‘‘సామాజిక న్యాయం, సామాజిక సామరస్య సూత్రాల ఆధారంగా సమాజంలోని అంతరాలను తొలగించడానికి బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ఆర్థికన్యాయం, రాజకీయ సాధికారతతో కూడిన సామాజిక న్యాయం మరింత శక్తివంతమయ్యేందుకూ, అస్తిత్వ రాజకీయాల తాత్కాలిక ఉపశమ నాలకు బదులుగా సమాజంలోని అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీల సమగ్రాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. విద్య, వైద్యం, ఉపాధి విష యాలలో సమానావకాశాలను అందించడానికి సమతుల్యతను పాటిస్తాం’’ అని ఆ పార్టీ 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించుకున్నది. కానీ ఆచరణలో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. గతంలో ఉన్న అవకాశాలను కూడా తగ్గించింది.
 
 కుబేరులకు వరాల వాన
 ఈ కోతలకు కారణమేమిటి? భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంటే పారి శ్రామిక, వాణిజ్య రంగాల మీద ఎక్కువ భారం పడాలి. కానీ అది జరగలేదు. పైగా దాదాపు రూ. 5,89,285 కోట్లు పారిశ్రామిక, వాణి జ్య వర్గాలకు పన్నుల రద్దు ద్వారానో, ప్రోత్సాహకాల పేరుతోనో లాభం చేకూరింది. ఆ వర్గాలకు ఇలా కానుకగా అందించినది బడ్జెట్ మొత్తంలో 30 శాతం! అంటే మోదీ ప్రభుత్వం ఆ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
 
 పైగా ఆరున్నర దశాబ్దాలుగా పనిచేస్తున్న ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం మరో మోసానికి తెరలేపింది. దాని స్థానంలో ‘నీతి ఆయోగ్’ పేరుతో మరొక కొత్త సంస్థను ఆరంభించింది. ‘నీతి ఆయోగ్’ సిఫారసు ప్రకారం రాష్ట్రాలకు కేంద్ర రాబడిలోని వాటాను గణనీయంగా పెంచింది. దీని వలన ప్రణాళికా వ్యయంలో రూ.1,09,000 కోట్ల రూపా యల కోత పడింది. ఫలితంగా వివిధ సామాజిక రంగాలకు గణనీయంగా బడ్జెట్ తగ్గింది. విద్యారంగానికి కేటాయింపులు తగ్గడానికి కారణం రాష్ట్రాల వాటా పెరగడమేనని కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ బహిరంగంగానే ప్రకటించారు.
 
 రాష్ట్రాల నిధులు పెంపు... సంక్షేమానికి ముప్పు
 ప్రణాళికా వ్యయం తగ్గించడం ద్వారా రాష్ట్రాల వాటాని పెంచడం వాంఛనీ యం కాదు. ఇది సామాజిక సంక్షేమ రంగం మీద, పేదల సంక్షేమ పథకాల మీద తీవ్ర ప్రభావం చూపబోతున్నది. గత అనుభవాల దృష్ట్యా చాలా రాష్ట్రాలు తమ బడ్జెట్‌లలో సామాజిక రంగానికి పెద్ద ఎత్తున నిధుల కోత విధిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, నిర్మాణరంగంపై కేంద్రీకరణ పేరిట కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
 
 కేంద్ర నిధులలో రాష్ట్రాల వాటా భారీగా పెరిగినా అవి వాటిని అలాగే ఖర్చు చేస్తాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు కూడా నిర్లక్ష్యం చేయడంతో సంక్షేమ రంగం పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్పుల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తూవస్తోంది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రంగం మీద ఖర్చు చేయకపోతే ఉన్నత విద్య చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం లేకుండా పోయే ప్రమాదం ఉంది.
 
 అపసవ్య దిశలో మోదీ సర్కారు
 రాజ్యాంగ రచన సమయంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై చాలా చర్చ జరి గింది. రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇస్తూనే కేంద్రం శక్తివంతం కావాలని, నిపుణులు సూచించారు. ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల భవిష్యత్తును రాష్ట్రాల చేతుల్లో పెట్టకూడదని, దానివల్ల ఆధిపత్య కులాలు అణగారిన వర్గాలను ఎదగనీయకుండా అడ్డుపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ వర్గాల సంక్షే మం, అభివృద్ధి ప్రధానంగా కేంద్రం బాధ్యతగా ఉండాలని, దానివల్ల ఒకే జాతీయ విధానం ఏర్పడి, నిష్పక్షపాతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల హక్కుల రక్షణ సాధ్యమవుతుందని రాజ్యాంగ రచనా సభ అభి ప్రాయపడింది. ప్రస్తుత మోదీ ప్రభుత్వ పాలన సరిగ్గా దానికి అపసవ్య దిశగా సాగుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో జరిగిన ఈ అన్యాయాన్ని మోదీ ప్రభు త్వం సరిదిద్దుకునేలా అన్ని వర్గాలు, పార్టీలు, సంస్థలు కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-మల్లేపల్లి లక్ష్మయ్య
 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ నం: 9705566213)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement