కనిపించని కుట్రలు
త్రికాలమ్
గోరటి వెంకన్న పాటలోని ‘కనిపించని కుట్రలు’ పల్లెల్లోనే కాదు రాజధాని నగరాలలోనూ చాలాకాలంగా జరుగుతున్నాయి. మౌనంగా నేరాన్ని అనుమతించడం, ఆమోదించడం లేదా ప్రోత్సహించడం పెద్ద నేరం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేతల చేతలను జాగ్రత్తగా గమనించాలి. మాటలకూ, చేతలకూ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించే నాయకులను ప్రతిఘటించాలి. రాజ్యాంగ భిక్ష కారణంగా ఉన్నత పదవులలో కుదురుకున్నవారు దాన్నే తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినప్పుడు ప్రశ్నించకపోవడం, నిరోధించకపోవడం రాజ్యాంగానికి ద్రోహం చేసినట్టు. ప్రజాస్వామ్యానికి పాడె కట్టినట్టు. చెట్టు ఎక్కి మొదలు నరుక్కున్నట్టు.
ఇప్పుడు అదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ప్రతిపక్ష శాసనసభ్యులను పదవులతోనో, ఇతర వాగ్దానాలతోనో ఆకర్షించి కండువాలు కప్పుతున్న పార్టీ అధ్యక్షులను మందలించవలసినవారు మందలించకపోవడం, ప్రశ్నించవలసినవారు ప్రశ్నించకపోవడం, ప్రతిఘటించవలసినవారు ప్రతిఘటించకపోవడం ఆత్మహత్యాసదృశం. ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ రేపు ప్రతిపక్షంలో ఉండవచ్చు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి చేస్తున్న నేరం రేపు మరో ముఖ్యమంత్రి చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వెబ్‌సైట్‌లో మార్చి 31న నమోదు చేసిన తాజా సమాచారం ప్రకారం ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీలో 66 మంది శాసనసభ్యులు ఉన్నారు. అందులో ఫిరాయించినవారు 21 మంది. నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి హఠాన్మరణం తర్వాత మిగిలినవారు 20 మంది. వారంతా ఈ రోజు కూడా చట్టరీత్యా వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులే. మంత్రులుగా ప్రమాణం చేసిన ఆ నలుగురు సైతం వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులుగానే మంత్రివర్గంలో ఉన్నారు. సాంకేతికంగా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయకత్వంలోని మంత్రివర్గం టీడీపీ, బీజేపీ, నలుగురు వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులతో కూడిన సంకీర్ణం. రాజ్యాంగాన్ని ఇంత బాహాటంగా, ఇంత నిస్సిగ్గుగా భ్రష్టుపట్టిస్తుంటే పెద్దలెవ్వరూ వారించకపోవడం దురదృష్టం. రాజ్యాంగాన్ని పరిరక్షించవలసినవారు కానీ అవినీతినీ, అక్రమాలనూ ఎత్తిచూపించి అధిక్షేపించవలసిన పత్రికలు కానీ, వార్తాచానళ్ళు కానీ, జోక్యం చేసుకోవలసిన న్యాయవ్యవస్థ కానీ మౌనంగా ఉండటం నిశ్శబ్ద కుట్ర కాక ఏమౌతుంది?
ఫిరాయింపుల నిరోధక చట్టం వైఫల్యం
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఫిరాయింపులను నిరోధించలేకపోతున్నది. అధికారపార్టీతో సభాపతులు కుమ్మక్కుకావడంతో చట్టం తెల్లబోతున్నది. ఫిరాయింపుదారులకు ముఖ్యమంత్రులు ఎటువంటి ప్రలోభాలు చూపించారో అందరికీ తెలుసు. వారిపై అనర్హత వేటు వేయాలంటూ బాధిత పక్షం పెట్టుకున్న అర్జీపైన చర్య తీసుకోకుండా మాసాల తరబడి మౌనంగా ఉంటున్న సభాపతుల నిర్వాకం తెలుసు. విశేషాధికారాలను సభాపతులు దుర్వినియోగం చేస్తున్నారని తెలిసినా నిరోధించడానికి అవసరమైన అధికారంలేదని న్యాయవ్యవస్థ భావించి మౌనంగా ఉంటున్నది. నిత్యజీవన సమరంలో ఊపిరాడక పెనుగులాడుతున్న పౌరులకు నాయకుల బారినుంచి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవడానికి అవసరమైన తీరిక కానీ, శక్తి కానీ లేదు. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నిస్తే పోలీసులు ఉక్కుపాదం మోపుతారు.
రాజీవ్‌గాంధీ, వాజపేయి ప్రభుత్వాలు చేసిన గొప్ప సంస్కరణ అపçహాస్యం అవుతోంది. టెన్త్ షెడ్యూల్ కాగితాలకే పరిమితం. 70 సంవత్సరాల స్వాతంత్య్రం, ప్రజాస్వామ్య పాలన అనంతరం రాజ్యాంగ పథాధికారులే రాజ్యాంగాన్ని కుళ్ళబొడుస్తుంటే ప్రజలు నిస్సహా యంగా ప్రేక్షకపాత్ర పోషించవలసిరావడం విలువల పతనానికి సంకేతం. చట్టసభల అధిపతుల నిర్ణయాలనూ, నిర్ణయరాహిత్యాన్నీ న్యాయవ్యవస్థ ప్రశ్నించవచ్చునని 1991లోనే నాటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య ‘కిహోటో హోలాహన్ వర్సెస్ జచిల్సు’ కేసులో స్పష్టం చేశారు. ఫిరాయింపుదార్లపై చర్య తీసుకోవడం విషయంలో శాసనసభ స్పీకర్ కానీ శాసనమండలి అధ్యక్షుడు కానీ క్వాసై జుడీషియల్ ట్రిబ్యూనల్ అధిపతిగా వ్యవహరించాలని జస్టిస్ వెంకటాచలయ్య తన చరిత్రాత్మకమైన తీర్పులో చెప్పారు.
రాజ్యాంగనైతికత ఏదీ?
రాజ్యాంగం ప్రసాదించిన పదవులలో ఉన్నవారు రాజ్యాంగ నైతికతను విస్మరించరాదంటూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ గ్రీస్ చరిత్రకారుడు గ్రోతేను ఉటంకించారు. రాజ్యాంగ నైతికతను రాజ్యాంగం పట్ల అపరిమితమైన విధేయత కలిగి ఉండటంగా, రాజ్యాంగాధికారాన్ని శిరసావహించడంగా గ్రోతే నిర్వచించారు. రాజ్యాంగం అన్నది న్యాయసూత్రాలతో కూడిన అస్థిపంజరం. దానికి కండ, నెత్తురు ప్రసాదించి చైతన్యవంతం చేసేది రాజ్యాంగ నైతికత అని అంబేడ్కర్ వివరిస్తూ అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ ఉదాహరణ చెప్పారు. వాషింగ్టన్ నాటి అమెరికా సమాజంలో కేవలం ఒక నాయకుడు, అధ్యక్షుడు మాత్రమే కాదు. దైవసమానుడు. ఆయన పోటీ చేస్తే పదిసార్లు ఏకగ్రీవంగా గెలుపొందగలడు. అంతటి ప్రజాదరణ ఉండేది.
కానీ రెండోసారి అధ్యక్ష పదవిని స్వీకరించమంటే నిరాకరిస్తూ, ‘మనం ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం వెనుక లక్ష్యాన్ని మీరు విస్మరిస్తున్నారు. వంశ పారంపర్యంగా వచ్చే రాచరికాన్ని, వంశ పారంపర్య పాలకులను, నియంతను మనం వద్దనుకున్నాం. ఇంగ్లండ్ రాజుతో సంబంధాలు తెంచుకొని ఇక్కడికి వచ్చి స్వాతంత్య్రం ప్రకటించుకున్న తర్వాత కూడా మీరు నన్నే ఆరాధించి రెండోసారి నేనే అధ్యక్షుడుగా ఉండాలని కోరుతున్నారంటే మీ సూత్రాలు ఏమైపోయినాయి? (My dear people, you have forgotten the purpose for which we made this Constitution. We made this Constitution because we did not want a hereditary monarchy and we did not want a hereditary ruler or a dictator. If after abandoning and swerving away from the allegiance of the English king, you come to this country and stick to worship me year after year and term after term, what happens to your principles?).. వాషింగ్టన్ అతి బలవంతం మీద రెండోసారి అధ్యక్షుడుగా ఉండటానికి ఒప్పుకున్నారు. మూడోసారి అడిగితే ఆగ్రహించి ససేమిరా అన్నారు. మన రాజ్యాంగ సూత్రాలు సైతం ఇంచుమించుగా అమెరికా రాజ్యాంగాన్ని పోలినవే. జరుగుతున్నది ఈ సూత్రాలకు పూర్తి విరుద్ధంగానే.
మంత్రి పదవిని లంచంతో పోల్చవచ్చా?
వ్యక్తులతో నిమిత్తం లేదు. వ్యవస్థ ప్రధానం. ఫిరాయింపుల నిరోధక చట్టం విఫలమైన మాట వాస్తవం. ఫిరాయించడంలో, ఫిరాయింపులను ప్రోత్సహించడంలో అవినీతి ఉంది కనుక అవినీతి నిరోధక చట్టంతో ఈ జాడ్యాన్ని అరికట్టవచ్చునా? ఇది రాజనీతిజ్ఞులూ, న్యాయకోవిదులూ, మేధావులూ, సామాజిక కార్యకర్తలూ, ప్రజాస్వామ్యప్రియులూ ఆలోచించవలసిన ప్రశ్న. లంచం ఇవ్వడం నేరం. పుచ్చుకోవడం నేరం అని అవినీతి నిరోధక చట్టం 7వ సెక్షన్ (It bars public servants from taking gratification other than legal remuneration), 8వ సెక్షన్ (Taking gratification, in order, by corrupt or illegal means, to influence public servant)స్పష్టం చేస్తున్నాయి. పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగులూ, చట్టసభల సభ్యులూ. ప్రభుత్వ ఉద్యోగిని లంచం తీసుకోవడానికి ఒప్పించడం కూడా నేరమే అంటోంది ఈ చట్టంలోని 9వ సెక్షన్ (Taking gratification, for exercise of personal influence with public servant).
పార్టీ ఫిరాయించినవారికి పదవి ఇస్తామంటూ ఎర చూపడం, పదవి ఇవ్వడం లంచం ఇవ్వడంగా పరిగణించవచ్చునా అన్నది అనుమానం. అందుకే ఇది ధర్మాగ్రహం నుంచి పుట్టుకొచ్చిన ఒకానొక ప్రతిపాదనపైన చర్చ అని విన్నవించుకోవడం. అవినీతి నిరోధక చట్టంలో gratification అనే మాట ఉంది. అంటే సంతృప్తిపరచడం. డబ్బు కానీ తత్సమానమైన తృప్తినిచ్చేది ఏదైనా వస్తువు కానీ పదవి కానీ హోదా కానీ లంచంగానే భావించాలి (The word gratification is not restricted to pecuniary gratifications or to gratifications estimable in money). ప్రతిపక్షం నుంచి ఫిరాయిస్తే పదవులు ఇస్తామంటూ అధికారపక్షం వాగ్దానం చేయడం ‘గ్రాటిఫికేషన్’ కిందికే వస్తుందని అనుకోవచ్చు. పార్టీ అధ్యక్షుడు పబ్లిక్ సర్వెంట్ కాదు. కానీ ముఖ్యమంత్రీ, మంత్రులూ, ఎంఎల్‌ఏలూ పబ్లిక్ సర్వెంట్లే.
పదవ షెడ్యూలు కింద నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. మొత్తం సభ్యులలో మూడింట రెండువంతుల మంది గంపగుత్తగా పార్టీ మారాలనుకుంటే అది పార్టీ చీలిక అవుతుంది. ఫిరాయింపు కాదు. కానీ అంతకంటే తక్కువమంది మారితే ఫిరాయింపు అవుతుందని సభాపతికీ, ముఖ్యమంత్రికీ, ఫిరాయించినవారికీ తెలుసు. వీరిలో ఎవ్వరికీ చట్ట భీతి లేదు. అటువంటివారి చేత మంత్రులుగా ప్రమాణం చేయించిన గవర్నర్ కూడా తప్పు చేసినట్టే లెక్క. వారు ఫిరాయింపుదారులని గవర్నర్‌కీ తెలుసు. వారి రాజీనామా లేఖలు చూసిన తర్వాతనే ప్రమాణం చేయించానంటూ ఆయన సమర్థించుకుంటున్నారు. కానీ అది చెల్లదు. ఆ రాజీనామాలను స్పీకర్ ఆమోదించిన తర్వాత చేయిస్తే గవర్నర్‌ను తప్పుపట్టడానికి అవకాశం లేదు.
రాజీనామాలను స్పీకర్ ఆమోదించలేదనీ, ఆమోదించే ఉద్దేశం కూడా లేదనీ అందరికీ తెలుసు. తెలంగాణ స్పీకర్‌కి కిందటి నవంబరులోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశించిన సుప్రీంకోర్టు ఆ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని నిర్ణయించింది. ఫిరాయింపుదారుల ఉత్తుత్తి రాజీనామాలను ఆమోదించకుండా, అనర్హత వేటు వేయాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు సమర్పించిన పిటిషన్‌పైన చర్య తీసుకోకుండా ఒక నేరం జరగడానికి మౌన సహకారం అందించిన సభాపతికి సైతం నేరంలో భాగస్వామ్యం ఉంటుంది.
ప్రమాణం పవిత్రత ఏదీ?
రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానంటూ గవర్నర్, రాజ్యాంగం ప్రకారం పనిచేస్తానంటూ ముఖ్యమంత్రి ప్రమాణం చేశారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానంటూ ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయించి అనర్హత వేటుకు గురికావలసిన ఎంఎల్‌ఏ చేత మంత్రిగా ప్రమాణం చేయించమని గవర్నర్‌ను ఎట్లా కోరతారు? గవర్నర్ ఎట్లా ప్రమాణం చేయిస్తారు? రాజ్యాంగానికి విధేయంగా ఉంటానంటూ ప్రమాణం చేసిన ఎంఎల్‌ఏ రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కి వ్యతిరేకంగా మంత్రిగా ప్రమాణం చేస్తూ ఆ హోదాలో రాజ్యాంగానికి విధేయంగా ఉంటానంటూ ఎట్లా చెబుతారు? స్వవచోఘాతం, ఆత్మవంచన, పరవంచన. అవినీతి నిరోధక చట్టం ప్రకారం అందరూ నేరం చేసినట్టే లెక్క.
కానీ గవర్నర్‌నూ, రాష్ట్రపతినీ ఎవ్వరూ ప్రాసిక్యూట్ చేయరాదని సంవిధానం స్పష్టం చేస్తున్నది. 360, 360(1) అధికరణలు వారికి రక్షణ కల్పిస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రికీ, స్పీకర్‌కూ, మంత్రులుగా చేరిన ఫిరాయింపుదారులకూ ఎటువంటి రక్షణా లేదు. వారిని ప్రాసిక్యూట్ చేయవలసిందిగా ఎవరైనా పిటిషన్ దాఖలు చేస్తే న్యాయమూర్తి ఎట్లా స్పందిస్తారో చూడాలి. పార్టీ ఫిరాయించడం అవినీతి పని. అవినీతికి పాల్పడినవారినీ, అందుకు ప్రోత్సహించినవారినీ, మౌన సహకారం అందించినవారినీ ఉపేక్షిస్తే సంవిధానం శక్తిహీనమై ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిపోతుంది.
సభాపతికి దఖలు పరచిన విశేషాధికారాలను కుదించి, కాలపరిమితి విధించి, ఫలానా గడువులోగా ఫిరాయింపుదారులపైన అనర్హత వేటు వేయాలంటూ నిర్దేశించాలి. గడువు ముగియగానే వారు అనర్హులు కావాలి. ఈ మేరకు మరో రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా చట్టంలో ఉన్న లొసుగును అధిగమించడం ఒక్కటే మార్గం. ఫిరాయింపుదారులపైన అనర్హత వేటు వేసే అధికారం న్యాయవ్యవస్థకో, ఎన్నికల సంఘానికో ఇవ్వడం కంటే సభాపతినే నిబంధనల మార్పుతో నియంత్రిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి సమర్పించిన వినతిపత్రం ఆధారంగా రాష్ట్రపతి ప్రధానితో సమాలోచన జరిపి సుప్రీంకోర్టు అభిప్రాయం కోరడం ద్వారా సవరణ ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. చేయరాని పనులన్నీ చేసి, అవినీతిని అందలం ఎక్కించిన తర్వాత ఫిరాయింపులపైన జాతీయ స్థాయి చర్చ జరగడం మంచిదేనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారంనాడు వ్యాఖ్యానించడం కపట రాజకీయానికి పరాకాష్ఠ.
కె. రామచంద్రమూర్తి