
ఇదో విషాద సందేశం
‘మూడో పెళ్లి చేసుకుంది. ఇంకేమవుతుంది?’ అన్నాడు ఓ పురుషుడు. మహిళ కాబట్టి మూడో పెళ్లి చేసుకుంటే, ఆమె గుణపాఠం నేర్చుకోవలసిందే. నిజానికి, సునందదే కాదు, ఆమె భర్త శశిథరూర్‌ది కూడా మూడో వివాహమే. కానీ ఆ అంశం ప్రస్తావనకు రాదు.
వార్తలలోని వ్యక్తులను, ప్రత్యేకించి మహిళల జీవితాల ను భూతద్దాలలో చూపించి ఏవిధంగా అవమానపరుస్తారో చెప్పే మరో ఉదాహరణ సునందా పుష్క ర్ విషాదాంతం. చదువు, దానితోపాటు ఆర్థికశక్తి ఉన్నాయి. వాటితో వచ్చే ఆత్మవిశ్వాసమూ ఉంది. ఢిల్లీ, దుబాయ్ ఎలిట్ తరగతిలో గుర్తింపు ఉంది. అయినా ఆమె జీవితం విషాదాంతమైంది.
ఈ వార్త ప్రసారం అవుతున్న సమయంలోనే ఓ వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, అంతకు మించి పురుషుడు, ‘సానుభూతి ఎందుకు? మూడో పెళ్లి చేసుకుంది. ఇంకేమవుతుంది?’ అన్నాడు. మహిళ కాబట్టి మూడో పెళ్లి చేసుకుంటే, ఆమె గుణపాఠం నేర్చుకోవలసిందే. నిజానికి, సునందదే కాదు, ఆమె భర్త శశి థరూర్‌ది కూడా మూడో వివాహమే. కానీ ఆ అంశం ప్రస్తావనకు రాదు.
మొదటి రెండు పెళ్లిళ్లు విఫలం కావడానికి సునంద బాధ్యత ఎంతో, ఆ భర్తల బాధ్య త కూడా అంతే. శశిథరూర్ తన మీద బహిరంగంగా ప్రేమను ఒలకబోసిన తరువాత కూడా అనేక పర్యాయాలు వేరే మహిళలతో వ్యవహారాలు నడిపాడనీ, పాకిస్థానీ జర్నలిస్టు మొదటి మహిళేమీ కాదనీ సునంద బాధ. ఇది కూడా ఎవరికీ పట్టినట్టు లేదు. ‘మగాడన్నాక ఇలాంటివి సహజం’ అని నీతులు బోధించే స్త్రీమూర్తులకి దేశంలో లోటు లేదు. కానీ మగయినా, ఆడయినా జీవిత భాగస్వాములు వేరే వారితో నడిపే సంబంధాలు రెండోవారి ఆత్మగౌరవాన్నీ, విశ్వాసాన్నీ దెబ్బతీస్తాయి.
మూడో పెళ్లయినా, ఇది కాకపోతే మరో పెళ్లి అనుకునే నిత్య పెళ్లికొడుకు ఎన్నికలు అయిపోగానే విడాకులు ఇస్తానని బెదిరించడం, ఆమెలో మూడో పెళ్లినయినా నిలుపుకోలేకపోతున్నానన్న ఆందోళన కనిపిస్తాయి. దీనితో ఇద్దరి మధ్య ఘర్షణలో హింస. సునంద శరీరంపై కమిలిన గుర్తులు గృహహింసకు అత్యాధునిక నాగరీకుడు శశిథరూర్ కూడా అతీతుడు కాదనే చెబుతున్నాయి. ఇప్ప టి వరకు వచ్చిన వార్తలను బట్టి సునంద అధిక మోతాదులో ఓ ఔషధం తీసుకోవడం వల్ల మరణించిందని భావించాలి. ఇది హత్యా, ఆత్మహత్యా అన్నది అసలు ప్రశ్న కాదు.
శశిథరూర్ ఆమెను భౌతికంగా చంపి ఉండకపోవచ్చు కూడా. అయినా ఆమె మరణానికి అతడే ప్రధాన బాధ్యుడు. ఆ ఇద్దరి పెళ్లి సమయంలో ఓ కుంభకోణంపై చర్చ జరిగింది. క్విడ్‌ప్రోకోకు సంబంధించిన ఆరోపణలవి. మం త్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే చర్య తీసుకోవచ్చు. స్త్రీని దేవతగా పేర్కొ నే బీజేపీ కూడా సునంద మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది. సునంద మోజులో పడి శశిథరూర్ అలా చేశారని బీజేపీ వ్యాఖ్యానించింది. అప్పటికే సునంద లాభసాటి రంగాలలో పెట్టుబడి పెట్టే సామర్థ్యం కలిగినదన్న సంగతిని ఆ పార్టీ విస్మరించింది. తన సంపాదన కోసమే శశిథరూర్ సునందను అడ్డం పెట్టుకున్నాడేమోనని ఎవరూ అనలేదు.
ఆ వ్యవహారం నుంచి సునంద తరువాత వెనక్కి తగ్గింది. శశిథరూర్ రాజకీయ జీవితాన్ని రక్షించడానికే అలా చేశానని తరువాత చెప్పింది. సునంద ఏ తప్పు చేయని ముత్యమన్న వాదన ముఖ్యం కాదు. ఒకే తప్పుకి రెండు రకాల ప్రమాణాలెందుకు? నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి, లేదా తప్పును సరిదిద్దుకోవడానికి మగాడికి ఉన్న అవకాశం స్త్రీకీ ఉండాలి కదా! అసలే ఎన్నికల వేళ. సునంద ఉదంతం ద్వారా ఎలా లాభపడాలో ఆలోచిస్తూనే ప్రతిపక్షం మొసలి కన్నీళ్లు కారుస్తోంది. చర్చ లేకుండా ఎంత తొందరగా ఈ ఉదంతానికి ఎలా స్వస్తి పలకగలమో యోచిస్తోంది అధికారపక్షం. ఆరోపణలూ, ప్రత్యారోపణలూ మధ్య ఈ మరణం నాటకాన్ని రక్తి కట్టించి, ఎలా రేటింగ్స్ పెంచుకోవచ్చోనని మీడియా ఆత్రుత పడుతోంది. నష్టపోయిన జీవితం గురించి గానీ, కనీస మర్యాదలు ఉల్లంఘించడం గురించి కానీ ఎవరికీ పట్టింపు లేనే లేదు.
శశిథరూర్ కావచ్చు, స్నూపింగ్ కేసులో నరేంద్రమోడీ కావచ్చు. అధికారంలో ఉన్నవారు దుర్వినియోగానికి పాల్పడితే ఆ తప్పులని వెలికితీసి ఉతికి ఆరేయాల్సిందే. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చవలసిందే. ఇది ప్రజాప్రయోజనం. కానీ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా, వారి వ్యక్తిగత అంశాలను చర్చకు పెట్టడం, వారి జీవిత భాగస్వాముల ప్రైవేటు జీవితాన్ని రచ్చ చేయడం, వారి సన్నిహితులు కాబట్టి బురద చల్లడం సమర్థనీయం కాదు.
ఏ చర్చయినా ప్రజాప్ర యోజనం గీటురాయిగా జరగాలి. స్త్రీలు, అం దునా స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన స్త్రీల పట్ల సమాజం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది. నాగరీకులుగా చలామణి అవుతున్న మగాళ్లలో మధ్యయుగ భావాలు ఒక వాస్తవమే. సాధికారత సాధించినట్టు కనిపించినా ఏదో ఒక దశలో ఒత్తిళ్లకూ దాడులకూ కుంగిపోవ డం మహిళల్లో ఇప్పటికీ కనిపిస్తున్నదే. వీట న్నిటి కలయికే సునంద మరణం. ప్రసిద్ధుల అర్థాంగులు వ్యక్తిత్వం లేకుండా వార్తల్లోకి రాకుండా మగాళ్ల నీడలుగా బతికితేనే క్షేమమ న్న సంకేతాన్ని సునంద మరోసారి పంపింది.