
తెంపుకోచ్చిన నీలిమలు కొన్ని
కవిత
1
నీలాంటిదే
వొక నింగి నీలిమని
నేనూ తుంచి తెచ్చుకుంటాను
నిదానంగా కొమ్మని వొంచి పూవుని తెంపినట్టే.
ఎందుకనిపిస్తుందో
ఎప్పుడూ
నాదే నాదే అయిన వొక ఆకాశం కావాలనీ,
నాదే
నాదే అయిన వొక పూవు కావాలనీ.
2
నాదీ నీదీ
నీదీ నాదీ అనుకున్న అనుక్షణం
తెలుసు కదా, తెలుసు కదా
యెన్ని ఆకాశాలు చేజారిపోయాయో,
పొద్దుటి పూలలా.
యెన్ని పూలు వాలిపోయాయో సాయంత్రపు మట్టిలోకి.
3
అయినా
యెందుకో తెంపుకొస్తూనే వుంటాం,
నీ పూలు నువ్వూ
నా ఆకాశాలు నేనూ.
అఫ్సర్