‘‘ఇజ్రాయిల్‌లో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో నాకు ‘గంధర్వ’ ఆలోచన పుట్టింది. యాంటీ ఏజింగ్ (వయసు ఎక్కువైనా యంగ్‌గా ఉండేలా) ఉన్న వ్యక్తి కథే ‘గంధర్వ’. వాస్తవానికి 90 శాతం దగ్గరగా ఉండేలా ఈ సినిమా తీశాను’’ అన్నారు దర్శకుడు అఫ్సర్. సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఎస్‌కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. సుభాని నిర్మించిన ఈ సినిమా జూలై 1న రిలీజవుతోంది.
ఈ సందర్భంగా చిత్రదర్శకుడు అఫ్సర్ మాట్లాడుతూ– ‘‘వాస్తవానికి దగ్గరగా ఉండాలని ‘గంధర్వ’ కథపై రెండేళ్లు పరిశోధన చేశాను. ఈ కథను ముగ్గురు హీరోలకు చెప్పాను.. కానీ, నేను కొత్తవాడిని కావడంతో చాన్స్ ఇవ్వలేదు. మరో ఇద్దరు ‘కథ మాకు ఇవ్వండి.. వేరే దర్శకుడితో తీస్తాం’ అన్నారు. నేను ఒప్పుకోలేదు. సందీప్‌కి కథ చెప్పగానే ఓకే అన్నాడు. 1971లో భారత్–బంగ్లాదేశ్ యుద్ధం నేపథ్యంలో కథ సాగుతుంది. అయితే ఆర్మీ నేపథ్యం ఐదు నిమిషాలే ఉంటుంది. ప్రస్తుతం రెండు కథలు రెడీగా ఉన్నాయి. ఓ పెద్ద నిర్మాణ సంస్థలో ఒక సినిమా త్వరలో ప్రారంభమవుతుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment