ఇది ఒక రసాభాస!
దీనివల్ల ఏ నిల్వదారుడైనా నష్టపడ్డాడా అంటే, లేదనే జవాబు వస్తోంది. పాత కరెన్సీ బంగారంలోకి, వజ్రవైఢూర్యాలలోకి, భూమిలోకి తర్జుమా అయి సురక్షి తంగా ఉంది. దీనివల్ల ముందు తరాల వారికి లంకెబిందెలు దొరుకుతాయి.
అక్షర తూణీరం
పాత సంవత్సరం శుభ్రంగా, కడిగిన ముత్యంలా వెళ్లిపోయింది. సంవత్సరం చివరా ఖర్లో నరేంద్ర మోదీ దేశానికి తలంటి పోశారు. ఉగ్రవాదం, నల్లధనం, లంచగొండితనం లాంటి చెత్తాచెదారాలన్నీ పాత నోట్ల రద్దుతో తొలగిపోయాయని మోదీ చెబుతున్నారు. సామాన్యులకి, అసామా న్యులకి కూడా అంతా అయోమయంగానే ఉంది. ఎందు కంటే, రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ కూడా ఈ నిర్ణయం ఇచ్చే సత్ఫలితాలను ఇతమిత్థంగా చెప్పలేకపోతున్నారు. ప్రధాని వత్తాసుదారులు మాత్రం గొప్ప సాహసంగా అభివర్ణిస్తూ మైకుల్లో బాకాలూదుతున్నారు. నిజానికి ఈ ఆర్థిక ఆంతర్యం వాళ్లకేమీ అర్థం కాలేదు.
‘రాజుగారు– దేవతావస్త్రాలు’ కథలోలాగా మోతాదుకి మించిన పవర్ ఒకచోట గూడుకట్టుకున్నప్పుడు లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా ఒక మహా నాటకం నడుస్తూ ఉంటుంది. అందరూ పాత్రధారులై, కొందరు సూత్ర ధారులై ఆ ‘ఫార్స్’ నడుస్తూ ఉంటుంది. కోట్లాది మంది నటీనటులతో రంగస్థలం కిటకిటలాడుతూ ఉంటుంది. వాళ్లలో కొందరు నిజంగానే బాధతో ఏడుస్తున్నారో, బాధ నటిస్తున్నారో తెలియదు. అరుపులు, కేకలు, ఏవో నినాదాలు వినవస్తాయి. అవి ఎవరైనా రాసిచ్చినవా, సొంతమా? విషాద సన్నివేశాన్ని భంగపరుస్తూ ఒక పాత్ర వెకిలి నవ్వు నవ్వుతూ కనిపిస్తుంది. ఇలాంటి ఎన్నో రసాభాసలతో దేశం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
ఈ ప్రపంచంలో ప్రజలు అమాయకులు. వారిపై స్వారీ చేసే నేతలు తెలివైనవారు. వారికి సాయపడే అధికారులు గడుసువారు. ఈ మహారణ్యంలో అమా యకులకు దిశానిర్దేశం చేస్తామని కంకణం కట్టుకున్న మీడియా, తరచూ దిక్సూచి దిక్కులు మార్చి చూపిస్తూ ఉంటుంది. న్యాయవ్యవస్థ కేసుల గోదాములో బందీగా పడి ఉంది. ఇవన్నీ ఇలా ఉండగా దేశంలోకి స్వర్ణయుగం వచ్చి దిగిందని ప్రచారం ఒక ఉద్యమంలా సాగుతోంది. స్వర్ణయుగం అంటే ఇదే కాబోలని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
పాత నోట్ల రద్దుతో ఎవరికి ప్రయోజనం అన్నది అంతుపట్టని ప్రశ్న. దీనివల్ల ఏ నిల్వదారుడైనా నష్టపడ్డాడా అంటే, లేదనే జవాబు వస్తోంది. పాత కరెన్సీ బంగారంలోకి, వజ్రవైఢూర్యాలలోకి, భూమిలోకి తర్జుమా అయి సురక్షితంగా ఉంది. దీనివల్ల ముందు తరాల వారికి అమూల్యమైన లంకెబిందెలు దొరుకు తాయి. ఆ బిందెల్లో బంగారు కణికలు,వజ్రవైఢూర్యాలు నిక్షిప్తమై ఉంటాయి. నాకు తెలిసి తీవ్రంగా నష్టపో యింది మా అత్తగారు. ఆవిడ కొన్నేళ్లుగా వత్తుల బుట్టలో దాచుకున్న ఇరవై పెద్దనోట్లు చిత్తుకాగితా లైపోయాయి. చిన్న చిన్న నోట్లను పోగుపెట్టి, వాటిని ఓ పెద్ద నోటు చేసి పత్తిబుట్టలో పదిల పరిచేది. పాపం! ఆవిడకే రాజకీయాలు తెలియవు. సంకురాత్రి వస్తోం దని, ఆ పొదుపు సొమ్ముని బయటకు తీసింది. ఒక్క సారి ఇంటిల్లిపాది ఘొల్లుమన్నాం. ఆఖరికి రిజర్వ్ బ్యాంక్ కూడా చేతులెత్తేసింది. అందరం ఆ పెద్దావిడని ఓదార్చే ప్రయత్నం చేశాం. పరిపరివిధాలుగా మేం ధైర్యవచనాలు పలుకుతుండగా ఆవిడ నోరు విప్పి, ‘‘నాదేం పోయిందిరా! ఏదో పండక్కి తలాకాస్తా ఇద్దా మనుకున్నా! పోయింది మీకే!’’అంటూ వెక్కిరించింది.