సనాతన సమతామూర్తి
సందర్భం
‘‘భగవద్రామానుజులు ఒక్కరే అంత్యజుల నుంచి బ్రాహ్మణుల వరకు అంద రికి భక్తి మార్గము సమా నమేయని, ప్రబోధిం చారు’’ అని స్వామి వివే కానంద పేర్కొన్నారు. ‘‘ఒకప్పుడు, ఒక వర్గానికే పరిమితమైన ‘‘మోక్షమార్గము’’ అన్ని వర్గాలకు, సమాన అర్హత గలదని శ్రీమద్రామానుజులు చాటి చెప్పి, అందరికి ద్వారాలు తెరిచారు’’ అని శ్రీ భారతీ దాసన్ తెలిపారు.
ఆళ్వారులు మొత్తం పండ్రెండుగురున్నారు. వారు వివిధ కులాలలో జన్మించిన వారైనా అపార విజ్ఞానం వల్లా, అమా యక ముగ్ధ భక్తి వల్ల అత్యంతాదర గౌరవాలకు పాత్రులయ్యారు. ఆ పండ్రెండుగురిలోనూ ఒక స్త్రీ ఉన్నది, ఒక అస్పృశ్యుడున్నాడు. కొందరు బ్రాహ్మ ణేతరులున్నారు. వారందరూ పరమ విశుద్ధ జీవి తాలు గడిపినవారు. అందుచేతనే ఆళ్వారుల మత ప్రబోధం కుల సంప్రదాయ పరిధులను అతి క్రమించి భక్తి మార్గాన్ని ప్రారంభించింది.
శ్రీ రామానుజుడు తమిళనాడులో శ్రీ పెరం బుదూరులో బ్రాహ్మణకులంలో క్రీ.శ. 1017లో జన్మించారు. నిమ్నవర్గాల ప్రజల స్థితి పట్ల ఎంతో ఆవేదన చెందాడు. అన్ని వర్గాల ప్రజలకు ఆచరణ యోగ్యమైన ఆధ్యాత్మిక ఉపాసనా పద్ధతులను సృష్టించారు. శ్రీ రామానుజుని గురువులు ఐదు గురు. నిమ్న వర్గీయుడైన మహాపూర్ణుడు అనే గురువు నుంచి వేదాలను, నాలియర ప్రబంధాన్ని (తమిళ వేదాన్ని) అధ్యయనం చేసి, వారివద్దే ‘వైష్ణవ దీక్ష’ను స్వీకరించాడు. శూద్రుడైన తిరుక్కో టియార్ నంబి (గోష్ఠిపూర్ణుడు)ని రెండవ గురు వుగా స్వీకరించి వారిని సేవించాడు.
రామానుజుడు కర్ణాటకలోని ‘మేలుకోట’ను కేంద్రంగా చేసుకుని కొన్ని సంవత్సరాలు గడిపాడు. అన్ని వర్ణాలకు చెందిన వారిని శిష్యులుగా స్వీకరించాడు. 1099లోనే అక్కడ తిరునా రాయణ పెరుమాళ్ళ వైష్ణవ మందిరంలో పంచములకు ప్రవేశార్హత కల్పించాడు. అనేక మందిరాలలో నిమ్న వర్గాల వారికి ప్రవేశం కల్పించి వైష్ణవ మతావలం బికులుగా చేశాడు.
శ్రీ రామానుజుడు అనేక దేవాలయాలను నిర్మించి, దేశమంతటా పర్యటించి ఆ దేవాలయా లలో అన్ని వర్గాల ప్రజలు ప్రధానంగా నిమ్న వర్గాల ప్రజలు దేవుని సేవించే విధంగా నూతన వ్యవస్థలను, పద్ధతులను ప్రారంభించాడు. ఆయన ప్రయత్నాలవల్ల వేదాలు, ఇతర ధార్మిక గ్రంథాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. అస్పృశ్యుల ఇండ్లలో బిక్షను స్వీకరించాడు.
తిరుప్పాణాళ్వారు అస్పృశ్యుడుగా జన్మించినం దువల్ల ఆలయంలో ప్రవేశించే అధికారం లేక కావేరీ తీరంలో నిలబడి భగవంతుణ్ణి ప్రార్థించేవారు. లోక సారంగముని ఒకనాడు ఆళ్వారును సమాధి స్థితిలో చూడటం తటస్థించినది. అది సమాధి స్థితి అని ఆయనకు తెలియక ఒక రాయి ఆళ్వారుపైకి విసి రారు. అది ఆయనకు తగిలి పెద్దగాయమై నెత్తురు కారింది. ఆ రాత్రి రంగనాథస్వామి, లోక సారంగ మునికి కలలో కనిపించి ఆళ్వారును భుజా లమీద మోసి ఆలయంలోకి తేవలసిందని ఆజ్ఞాపించారు. మరునాడు ఆళ్వారు ఎంత వద్దన్నా వినని లోక సారంగముని స్వామి ఆజ్ఞను శిరసావహించి రంగ నాథస్వామి ఆలయం వద్దకు తిరుప్పాణా ళ్వారును తన భుజాలపై మోసుకుంటూ తీసుకు వచ్చారు. రామానుజాచార్యులు దీన్ని పదేపదే ఉదహరించి భగవదనుగ్రహం కొన్ని ప్రత్యేక జాతుల వారికే పరిమితం కాదనేవారు.
మహిళలకు సముచిత స్థానం: కొంగు దేశంలో (ఇప్పటి కోయంబత్తూరు ప్రాంతం) పెద్ద కరువు వచ్చినందువల్ల కొంగు ప్రత్తి అనే ఒకామె శ్రీరం గానికి తరలి వచ్చింది. రామానుజుల దర్శనం చేసుకున్న తర్వాత అక్కడనే స్థిర నివాసం ఉండి పోయింది. సుదూర ప్రాంతాల నుంచి శ్రీరంగానికి వచ్చి మఠంలో ఉండిపోయిన స్త్రీలు చాలామంది ఉన్నారు. దీన్నిబట్టి పురుషులతో పాటు సమానంగా స్త్రీలనాదరించిన మతాచార్యులలో రామానుజులే ప్రథములని రుజువవుతోంది.
శ్రీరామానుజులు శ్రీరంగం కేంద్రంగా సుదీర్ఘ కాలం ధర్మప్రచారం చేసారు. ‘రామానందుడు’ వంటి అనేకమంది శిష్యులను తయారు చేసాడు. కాలానుగుణమైన మార్పులను చేస్తూ నిమ్న వర్గాల ప్రజలలో వైష్ణవ వ్యాప్తికి మాల, మాదిగ దాసరుల వ్యవస్థను ఏర్పరచారు. ఈ మాల మాదిగ దాసరులే హరినామ సంకీర్తన చేస్తూ సంక్రాంతి సందర్భంగా గ్రామంలోని అగ్రవర్ణాల ఇండ్లకు సైతం వచ్చిన పుడు ఈ హరిదాసులను ధర్మ ప్రచారకులుగా గౌరవించడం మనం ఎరిగినదే. శ్రీ రామానుజులు క్రీ.శ. 1137లో తన 120వ ఏట సమాధిని పొం దారు. శ్రీ రామానుజుల ప్రభావం కారణంగానే వేయి సంవత్సరాల క్రితమే పలనాడులో బ్రహ్మ నాయుడు చాపకూడు పద్ధతిని, మాచర్ల చెన్న కేశవ దేవాలయంలో అందరికీ ప్రవేశాన్ని కల్పించాడు. తిరుమల వంటి దేవాలయాల నిర్వహణలో అన్ని కులవృత్తుల వారికి స్థానం కల్పించిన ఘనత ఆయనదే. వెయ్యేళ్ల క్రితమే సమతా సందేశాన్ని ఆచరించి చూపిన మార్గంలో నడవడమే శ్రీ రామా నుజులపట్ల మనం అందించే సరియైన నివాళి.
(నేడు శ్రీరామానుజుల సహస్ర జయంతి)
- కె. శ్యామ్‌ప్రసాద్
(వ్యాసకర్త కన్వీనర్, సామాజిక సమరసతా వేదిక మొబైల్: 9440901360)