
రేవంత్ టేపులు చెబుతున్న నిజాలు
దేశ రాజకీయాల్లో అనేక చర్చలకు కేంద్ర బిందువైన ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. ఈ సందర్భంగా అనేక నూతన అంశాలను చర్చలోకి తేవా ల్సిన అవసరం ఉంది. రేవంత్‌రెడ్డి సంభాషణ సారాంశాన్ని గమనిస్తే టీడీపీ ఎంత వ్యూహా త్మకంగా వ్యవహరిస్తున్నదో సామాన్యులకు సైతం తెలిసిపోతుంది. వాటి ఆధారంగా బీసీ లకు సంబంధించిన రాజకీయ భవిష్యత్తు గురించి ఆ పార్టీ ఏమ నుకుంటున్నదో విశ్లేషించడం అవసరం.
స్టీఫెన్‌సన్‌తో జరిపిన సంభాషణల్లో రేవంత్ తానే భవిష్యత్తు టీడీపీ అధ్యక్షుడినని, 2019 నాటికి తెలంగాణ సీఎం అభ్యర్థిగా కీలక భూమిక వహిస్తానని చెప్పుకోవడం కనబడుతుంది. తమది బీసీల పార్టీ అని, వారిని ఉద్ధరించింది తామేనని బాబు తరచూ చెబుతుంటారు. కానీ ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీని కాకుండా రేవంత్ సామాజిక వర్గానికి చెందిన వేం నరేందర్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంపికచేశారు. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్. రమణనో లేదా మరో సీనియర్ బీసీ నేతనో ఎంపికచేసి ఉండేవారు. ఇందుకు భిన్నంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పిం చాయి. కాంగ్రెస్ అన్ని ఒత్తిళ్లనూ తట్టుకుని, ఉద్దండులను సైతం పక్కన బెట్టి బీసీ వర్గాలకు చెందిన మహిళకు అవకాశం ఇచ్చింది.
తెలంగాణలో తాము అధికారంలోకొస్తే బీసీ ఉద్యమనేత ఆర్. కృష్ణయ్యను సీఎంను చేస్తామన్న బాబు...తదనంతర పరిణామాల్లో ఆయనకు ఏ పదవీ ఇవ్వలేదు. పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎర్రబెల్లిని, ఉప నేతగా రేవం త్‌ను నియమించారు. బీసీల విషయంలో బాబు ఆది నుంచీ ఇలాగే వ్యవహరిస్తున్నారు. రేవంత్ సంభాషణతో టీడీపీలో బీసీలకు భవిష్యత్తు లేదనే అంశం తేలిపోయింది. అధికారంలో ఉండగా ప్రకటించిన వ్యూహ పత్రాల్లోని హామీల్లో 2004లో దిగిపోయే వరకూ టీడీపీ ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. 2008లో వరంగల్ బీసీ గర్జనలో బీసీలకు 100 సీట్లు ఇస్తామని ప్రకటిం చి దాన్ని నిలుపుకోలేకపోయారు. అంతకన్నా ముందుకు వెళ్తే 1983లో అధికారంలోకొచ్చిన ఎన్టీఆర్ సైతం ఉమ్మడి రాష్ట్రంలో బీసీల రాజ్య స్థాపన దిశలో ఒక్క అడుగైనా ముందుకేయలేకపోయారు. 1985లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలేజీ హాస్టళ్లను రద్దుచేసి వేలాదిమంది ఉన్నత విద్యను అందుకోకుండా చేసిన ఘనత టీడీపీదే.
కాంగ్రెస్, టీడీపీల పదేళ్ల పాలనలో బీసీల ప్రగతి ఎలా ఉందో పరి శీలిద్దాం. 1994-2004 మధ్య టీడీపీ సర్కారు బీసీలకు కేటాయించింది రూ. 1,580 కోట్లు మాత్రమే. అంటే ఏడాదికి సగటున రూ. 158 కోట్లు. దివంగత నేత డాక్టర్ వైఎస్ పాలన నుంచీ పరిశీలిస్తే 2004-2014 మధ్య కాంగ్రెస్ సర్కారు సగటున ఏడాదికి రూ. 1,000 కోట్లు ఖర్చు చేసింది. టీడీపీ హయాంలో బీసీల స్కాలర్‌షిప్‌లు, మెస్ చార్జీలు ఎగ్గొడితే...వారు రక్తం అమ్ముకుని చదువుకున్నారు. అయితే, డాక్టర్ వైఎస్ అధికారంలోకొచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రారంభిం చడంతో లక్షలాది మంది బీసీ విద్యార్థులు ఉన్నత చదువులతో ప్రయోజ కులయ్యారు. పైగా బీసీ కుల ఆర్థిక ఫెడరేషన్‌ల కోట్లాది బకాయిలు రద్దుచేయడమే కాక వాటిని ఆర్థికంగా పరిపుష్టం చేశారు. అట్టడుగు బీసీ కులాలకు ప్రత్యేక ఫెడరేషన్‌లు నెలకొల్పారు.
అంతేకాదు...బీసీలకు 100 సీట్లు ఇస్తామన్న హామీ జోలికి పోకుండానే మెజారిటీ స్థానాలు వారికి ఇప్పించే ప్రయత్నం చేశారు. సామాజికంగా అత్యధిక ఓట్లు లేకున్నా, ఆర్థికంగా సరితూగలేకపోయినా దాసరి అనే అతి చిన్న బీసీ కులానికి చెందిన ఈ వ్యాసకర్తను 2009 ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ స్థానం నుంచి పోటీ చేయించారు. ఇలాంటి చరిత్ర బాబుకు ఉందా? ఉత్తరాది రాష్ట్రాల్లో బీసీలు డాక్టర్ లోహియా సిద్ధాం తం వెలుగులో 1967 నుంచీ అధికారంలోకి వస్తున్నారు. మన దగ్గర కూడా అందరూ మేల్కొని సంఘటితమైతే...టీడీపీపై భ్రమలు వీడితే సొంతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. టీడీపీ ఆంతర్యమేమిటో, ఆ పార్టీలో బీసీల భవిష్యత్తు ఏమిటో రేవంత్ చెప్పకనే చెప్పారు. దీన్ని గుర్తించి స్వశక్తితో ఎదగడానికి బీసీలు కృషిచేయాలి.
(వ్యాసకర్త బీసీ కమిషన్ పూర్వ సభ్యులు) మొబైల్: 98499 12948
డా॥వకుళాభరణం కృష్ణమోహనరావు