పట్నవాసం రైతుకు శాపం
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాగు భూములను వ్యవసాయేతర అవసరాలకు మరల్చే ధోరణి వేగంగా పెరుగుతోంది. ఇలా ఉపాధి కోల్పోతున్న రైతాంగం గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేసి, పొట్ట చేతపట్టుకొని వలసపోవడం ఆగడం లేదు. 1960-70లలో జరిగిన వలసలకు భిన్నంగా నేటి వలసలు వ్యవసాయరంగం క్షీణత వల్ల జరుగుతున్నవి. ఈ వలసలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఉపాధి, జీవన భద్రతలు కాదుగదా తలదాచుకునే నీడ దొరకడం సైతం వారికి గగనమవుతోంది. గ్రామాల్లో బతకలేక నగరాల్లో ఇమడనూ లేక సతమతమవుతూ నానా యాతనలు పడాల్సి వస్తోంది.
గాంధీజీ నిర్వచించిన గ్రామ స్వరాజ్యం ఇప్పుడొక నినాదం మాత్రమే. ఆచరణలో గ్రామాన్ని, స్వరాజ్యాన్ని కూడా కార్పొరేట్ యంత్రం మింగేసింది. దేశానికి పట్టుగొమ్మలైన పల్లెసీమలు పొట్టచేత పట్టి, తట్టనెత్తినబెట్టి కూటి కోసం, కూలికోసం పట్టణాలకు తరలి వెళుతున్నాయి. అటు దేశ ఆర్థిక వ్యవస్థకు, ఇటురాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు ఆలంబన, జవం, జీవమూ అయిన వ్యవసాయం రోజు రోజుకీ కుంచించుకు పోతున్నది. జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా నానాటికీ దిగజారుతోంది. స్థూల జాతీయాదా యంలో (జీడీపీ) వ్యవసాయం, దాని ఆధారిత రంగాల వాటా 1960-1961లో 47.6 శాతంగా ఉండేది. క్రమంగా అది 1970-71లో 41.7 శాతం, 1980-81లో 35.7 శాతం, 1990-1991లో 29.5 శాతం, 2000-2001లో 22.3 శాతం, 2010-11లో 14.4 శాతానికి పడిపోయింది.
సాగు భూములకు ‘వృద్ధి’ గండం
ఆధునికత పేరిట, అభివృద్ధి పేరిట సాగు భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడటం పెచ్చు పెరిగిపోతోంది. దీంతో సాగు భూమి విస్తీర్ణం రోజు రోజుకూ తగ్గిపోతున్నది. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి దాదాపు ఒకేలా కనబడుతున్నది. ఆశ్చర్యకరంగా శ్రీకాకుళం జిల్లాలో సైతం వ్యవసాయేతర అవసరాలకు ఎక్కువగా వాడటం వల్ల సాగు విస్తీర్ణం పెద్ద ఎత్తున పడిపోయింది. కర్నూలు జిల్లాలోనూ అదే పరిస్థితి. అందుబాటులో ఉన్న జిల్లాలవారీ లెక్కల ప్రకారం శ్రీకాకుళంలో 33 శాతం, కర్నూలులో 37 శాతం, తూర్పు గోదావరిలో 25 శాతం, విశాఖలో 20 శాతం, నెల్లూరులో 25 శాతం, కరీంనగర్‌లో 27 శాతం, రంగారెడ్డిలో 29 శాతం, మెదక్‌లో 15 శాతం సాగు భూమి వ్యవసాయేతర అవసరాలకు బదలాయించినట్టు ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
ఇతర జిల్లాల్లోనూ ఇంచు మించు ఇదే పరిస్థితి. రెండు రాష్ట్రాల్లో కలిపి కనీసం 30 లక్షల ఎకరాల భూమిని వ్యవసాయం నుంచి వేరే అవసరాలకు మరల్చారు. 30 సంవత్సరాల క్రితం 80-85 శాతంగా ఉన్న గ్రామీణ జనాభా 60 శాతానికి పడిపోయింది. అంటే గత 30 ఏళ్లలో 20 శాతం జనాభా పల్లెలను వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇంకా చాలా మంది వ్యవసాయాన్ని వదిలి గ్రామాల్లోనే రకరకాల ఇతర పనులకు మారిపోయారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల ఎకరాల భూమి వ్యవసాయానికి దూరమైందంటే కొన్ని లక్షల మంది శ్రామికులు వ్యవసాయ రంగాన్ని వీడినట్టేనని అర్థం. సాగులో ఉన్న ఒక ఎకరం భూమి ఎనిమిది మందికి ఉపాధిని కల్పిస్తుందని నిపుణుల అంచనా. అంటే రెండు రాష్ట్రాల్లో కలిపి వ్యవసాయంపై ఆధారపడ్డవారిలో దాదాపు 2 కోట్ల 40 లక్షల మంది ఉపాధిని కోల్పోయారు. ఇంత భారీ ఎత్తున ఉపాధిని కోల్పోయిన రైతాంగ ప్రజానీకం కోసం మనం ఏ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నామనేదే ప్రశ్న.
పదేళ్ల క్రితం యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల కొంత తాత్కాలిక ఊరట కలిగిన మాట నిజమే. నేటి ఎన్డీయే ప్రభుత్వం దానిని సైతం మార్చడానికి ప్రయత్నిస్తోంది. గ్రామీణ ఉపాధి కల్పన సమస్యను యూపీఏ గానీ, ఎన్డీయే గానీ రాజకీయ దృష్టితో చూస్తున్నాయే తప్ప ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాదు.
గ్రామీణాభివృద్ధిలో వ్యవసాయాభివృద్ధి విడదీయరాని భాగమనే సమగ్ర దృష్టితో పాలకులు ఈ సమస్యను చూడటం లేదు. కాబట్టే గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేసి ప్రజలు పొట్ట చేతపట్టుకొని వలస వెళ్లిపోవడం ఆగడం లేదు. దీంతో నగరాల మీద ఒత్తిడి పెరిగి నిరుద్యోగ సమస్య తీవ్రమౌతోంది. పట్టణాలకు తరలివస్తున్న వారికి కనీస సదుపాయాల్లేవు సరికదా తలదాచుకునే స్థలం కూడా లేని దుస్థితి ఏర్పడింది.
భరోసాలేని వలస బతుకులు
1960-70లలో గ్రామాల నుంచి పట్టణాలకు జరిగిన వలసలకూ, 1990 తరువాత జరిగిన వలసలకు చాలా తేడా ఉన్నది. 1960-70లలో గ్రామాల నుంచి పట్టణాలు చేరిన వారికి సుస్థిరమైన ఉపాధికి లేదా ఉద్యోగానికి హామీ ఉండేది. ఆ దృష్టితో చూస్తే వారికి జీవన భద్రత ఉండేది. అందుకే ఆ రోజుల్లో పదో పరకో సంపాదించుకోవచ్చనే ఆశతో ఎంతో ఇష్టంగా గ్రామాల నుంచి వలస వెళ్లిపోయారు. ముఖ్యంగా గనులు, రైల్వేలు తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో గౌరవప్రదమైన ఉపాధిని పొందారు. ఆ కుటుంబాల స్థితిగతుల్లోనూ గణనీయమైన మార్పు వచ్చింది. మా అనుభవంలో సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికులుగా చేరినవారి కుటుంబాల్లో ఈ రోజు ఉన్నత చదువులు చదివి అత్యున్నతమైన ఉద్యోగాలు పొందిన వాళ్లున్నారు. సింగరేణి కార్మికుడి కొడుకే ఈ రోజు సింగరేణి డెరైక్టర్ స్థాయికి ఎదగగలిగారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా కాగలిగారు.
వ్యవసాయం క్షీణించడం వల్ల జరుగుతున్న నేటి వలసలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. పూట గడవక పట్టెడన్నం కోసం సుదూర తీరాలకు వెళ్లి శవాలుగా తిరిగి వస్తున్న దయనీయ స్థితికి ఉదాహరణలు రెండు రాష్ట్రాల్లోనూ కోకొల్లలు. కారణం వలస వచ్చిన వాళ్లకు నగరాల్లో స్థిరమైన వృత్తి, ఉద్యోగం దొరకక పోవడం, జీవన భద్రతకు భరోసా లేకపోవడమే. పైగా ఉపాధి, కులంతో ముడిపడి ఉంటోంది. ఆధిపత్య కులాలకున్న ఉద్యోగ భద్రత మిగిలిన కులాలకు ఉండటం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగాలు, వ్యాపారాలలో సైతం ఆధిపత్య కులాలకు ఉన్న భరోసా వెనుకబడిన కులాలకు ఉండటం లేదు. వెనుకబడిన కులాల వారు చిన్నాచితకా ఉద్యోగాలతో సరిపెట్టుకోవాల్సిందే.
ఇక దళితులు, గిరిజనులైతే మట్టి పని, చెత్తపని వంటి కఠినమైన, హేయమైన పనులతో సంతృప్తి చెందాల్సిందే. రైల్వే లైన్ల పక్కన, మురికి కాల్వల పక్కన, ప్లాస్టిక్ కాగితాల గుడిసెల్లో జీవించే దయనీయమైన స్థితి వలస కార్మికులకు సర్వసాధారణంగా మారిపోయింది. వారి జీవితాలకు భరోసా లేదు, వారి ఆడపిల్లలకు భద్రత లేదు. విద్య సంగతి ఇక చెప్పనవసరం లేదు. ఆరోగ్యం గగన కుసుమమే. గ్రామాల్లో బతకలేక నగరాల్లో ఇమడనూ లేక సతమతమవుతూ నానా యాతనలు పడాల్సి వస్తోంది.
రోజు కూలీలు వృద్ధి రథ చక్రాలు
ఎటువంటి భరోసా, భద్రతలేని కూలీల సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతున్నది. ఈ పరిస్థితిని ఉద్దేశపూర్వకంగానే పెంచుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. పరిశ్రమాధిపతులకు, వ్యాపారులకు కావాల్సింది భద్రత, భరోసా లేని కూలీలే. పనికి ఎలాంటి హామీ లేని కూలీ సైన్యాన్ని పెంచితేనే అతి తక్కువ కూలి రేట్లకు శ్రామికులు లభిస్తారనే అభిప్రాయం బలంగా ఉంది. ఇలాంటి కూలీ సైన్యాన్ని అంతర్జాతీయంగా ‘‘పుట్ లూజ్ లేబర్’’ అని అంటున్నారు.
ఈ దుస్థితి వల్ల కూలీలు, కార్మికులు, ఉద్యోగులు వేతనాలు, సౌకర్యాల కోసం పోరాడే శక్తిని కోల్పోతారు. ఇప్పుడు జరుగుతున్నది ఇదే. ఉద్యోగాల్లో ఎవరిని చేర్చుకున్నా, ఎవరిని తీసేసినా అడిగే నాథుడు లేడు. ఇప్పుడున్న కార్మిక చట్టాలను సైతం మార్చి యజమానులకు, పరిశ్రమాధిపతులకు మరింత ప్రయోజనం చేకూర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశా ల్లోనే బిల్లును ప్రవేశపెట్టనుంది. పర్యవసానాలు కార్మికులపైన ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారిపై చాలా తీవ్రంగా ఉంటాయనేది వాస్తవం.
ముంచుకొస్తున్న ‘కార్పొరేట్’ ముప్పు
దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులలో భాగంగానే భూ వినియోగం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల ఫలితాలను కూడా చూడాలి. వ్యవసాయం పనికిరాదని, అందులోనూ చిన్న కమతాల సాగు లాభదాయకం కాదని ఇటీవల విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఆ వాదనతో చిన్న, సన్నకారు రైతాంగంపై భూములను వదులుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారు. ప్రభుత్వాలు వ్యవసాయాభివృద్ధి కన్నా ఇతర రంగాలపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకర్తిస్తున్నాయి.
వ్యవసాయాభివృద్ధి గురించి మాటలే తప్ప, ఆచరణలో దానిని పరిరక్షించడానికి, అభివృద్ధి చేయడానికి జరుగుతున్న కృషి స్వల్పమే. ఒకవేళ కొన్ని పథకాలను రూపొందించినా వాటికి అరకొరగానే నిధులను కేటాయిస్తున్నారు. ఫలితాలు కూడా అలాగే అంతంత మాత్రంగానే ఉంటు న్నాయి. ఈ పరిస్థితిలో వ్యవసాయాభివృద్ధి ముసుగులోనే మరో ధోరణి ముందుకొస్తోంది. ఇప్పటికే రైతుల నుంచి కారుచౌకకు కొట్టేసి, కంచెలేసిన వందలాది ఎకరాల భూముల్లో కూలీలు లేని, ఆధునిక కార్పొరేట్ వ్యవసాయం దిశగా భూయజమానులు పావులు కదుపుతున్నారు.
నయా జమీందారీ వ్యవస్థకు మరో రూపమైన మనుషులు లేని కార్పొరేట్ వ్యవసాయం మన రెండు రాష్ట్రాల్లోనూ త్వరత్వరగా ముందుకు వస్తోంది. ఈ ప్రమాదాన్ని మనం గుర్తించాలి. మానవ వనరులు పుష్కలంగా ఉన్న మన దేశంలో ఇటువంటి వ్యవసాయ యాంత్రీకరణ మానవ హననంగా భావించక తప్పదు. అందుకే వ్యవసాయ రంగం నుంచి దూరం అవుతున్న దాదాపు 40 శాతం పైగా జనాభాకి బతుకుపై భరోసా కల్పించాలంటే వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడుకోవటం తప్ప మరో మార్గం లేదు.
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మొబైల్ నం: 9705566213)