అత్యంత స్వార్థపరులకు అత్యున్నత పురస్కారాలా? | The highest honor of the most selfish ? | Sakshi
Sakshi News home page

అత్యంత స్వార్థపరులకు అత్యున్నత పురస్కారాలా?

Published Sun, Jul 24 2016 1:58 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

అత్యంత స్వార్థపరులకు అత్యున్నత పురస్కారాలా?

అత్యంత స్వార్థపరులకు అత్యున్నత పురస్కారాలా?

తరచుగా ప్రభుత్వం వ్యక్తుల కీర్తిప్రతిష్టల ఆకర్షణకులోనై వారికి పురస్కారాలను ఇవ్వాల్సి వస్తుంటుంది. దీనికి ఇక స్వస్తి పలికాలి. సేవాతత్పరతను ప్రదర్శించిన వారికి మాత్రమే జాతీయ పురస్కారాల ప్రదానం జరగాలి. భారతరత్న వంటి పురస్కారాలను అందుకుంటున్న వ్యక్తులు తాము ప్రజలకు చేసిన సేవకు గాక, తమ ప్రతిభకుగానూ వాటిని పొందడం పరిహాసాస్పదం.
 
 మన దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. క్రికెటర్లకు, బాలీవుడ్ ప్రముఖులకు  ఉన్న కీర్తిప్రతిష్టలు, ప్రతిభ కారణంగా వారికి ఆ పురస్కా రాన్నిఇవ్వడం తప్పని నా అభిప్రాయం. అలా చేయడం ద్వారా ఆ పురస్కారానికి ఉన్న విలువ తరిగి పోవడమే కాదు, దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. రాజ్యసభకు నామినేట్ చేసిన క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖుల విషయంలో కూడా అలాంటిదే జరుగుతుందని నేనంటాను. సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్‌లు ఇద్దరి ఉదారణనే తీసుకుందాం. ఆ ఇరువురిలో ఎవరూ భారత రత్న పురస్కారాన్ని అందుకోదగినవారు కారు. ఇద్దరూ దానివల్ల తమకు వచ్చిన ఖ్యాతిని దుర్వినియోగపరచినవారే.
 
 సచిన్, తన ఒకప్పటి వ్యాపార భాగస్వామిని రక్షణ మంత్రి వద్దకు తీసుకు వెళ్లి, అతనికి సంబంధించిన ఒక వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరినం దుకుగానూ వార్తలకెక్కారు. అది, రక్షణ శాఖకు చెందిన ఒక ప్రాంతానికి సమీపం లోని ఒక వాణిజ్య సముదాయం నిర్మాణానికి సంబంధించిన సమస్య. ఆ వ్యవ హారంలో తనకు ఎలాంటి వ్యాపార ప్రయోజనాలూ లేవని సచిన్ ప్రకటిం చారు. బహుశా ఉండకపోవచ్చు. కానీ, వ్యాపార సంబంధమైన ప్రయోజనాల వంటి చిల్లరమల్లర విషయాలను మంత్రుల ముందు ఉంచడమేనా భారతరత్నల పని?
 
 ఈ విషయాన్ని సరైన కోణం నుంచి చూడాలంటే... సచిన్ రాజ్యసభలో తన మొట్టమొదటి ప్రశ్నను అడగడానికి మూడేళ్లు పట్టిందని తెలుసుకోవాలి. ఆయన రాజ్యసభలో మూడేళ్లు గడిపారంటున్నానూ అంటే అందులో ఎక్కువ సేపు సభకు బయటనే ఉన్నారని అర్థం. రాజ్యసభకు సచిన్ హాజరు 6 శాతం మాత్రమేనని, ఆయన ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదని డిసెంబర్ 2015 నాటి ఒక నివేదిక వెల్లడించింది. అయినాగానీ, ఆయనకు తన స్నేహితులను, వ్యాపార భాగస్వాము లను రక్షణ మంత్రి వద్దకు తీసుకెళ్లి, వారి ఒప్పందాలను ముందుకు నెట్టడానికి మాత్రం సమయం ఉన్నదా? అలాంటి వ్యక్తికి భారతరత్నను ఇచ్చారనేది నాకు ఆమోదయోగ్యంకానిదిగా కనిపిస్తోంది. భారతరత్నను అందుకున్న తర్వాత కూడా సచిన్ బీఎండబ్ల్యూ వంటి బ్రాండ్‌లకు మద్దతు తెలుపుతూనే ఉన్నారు. ఇది, ప్రజా జీవితంలోని వ్యక్తులకు, ప్రత్యేకించి సచిన్  అంతటి సంపన్నవంతులకు తగిన పనేనా? ఇది అత్యంత అవమానకరం, ఆ పురస్కారాన్నే న్యూనపరచేది.
 
 అలాంటి వ్యక్తులకు భారతరత్నను ఇచ్చినప్పుడు ఆవశ్యకంగా మనం వారి ప్రతిభను గుర్తించి ఇస్తున్నాం. అంతేగానీ పౌర పురస్కారాలను ఇవ్వడంలోని అసలు లక్ష్యమైన ప్రజాసేవను గుర్తించి మాత్రం కాదు. సచిన్, తనకు ఒక ఫెరారీ కారు బహుమతిగా లభిస్తే, దానికి దిగుమతి సుంకం మినహాయింపును కోరారు. ఒక కోటీశ్వరుని ఆట వస్తువుల కోసం ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేయాలి? చివరకు ఓ కోర్టు జోక్యం చేసుకుని ఆయన దిగుమతి సుంకాన్ని చెల్లిం చేలా చేయాల్సి వచ్చింది. బాంద్రాలో తాను ఒక పెద్ద భవంతిని నిర్మిస్తున్నపుడు సచిన్ పరిమితికి మించి దాన్ని నిర్మించడానికి ప్రభుత్వ అనుమతిని కోరారు. అందుకు అతన్ని ఎందుకు అనుమతించాలి? మనలో ఎవరమూ అడగని దాన్ని లేదా అలాంటి ఇతర ఉపకారాలను చేయాలని కోరడం అతని స్వార్థపరత్వం. ఈ ఏడాది జూన్ 13న ‘బెంగాల్ స్కూలుకు రూ. 76 లక్షలు విరాళం ఇచ్చిన సచిన్ టెండూల్కర్’ అనే పతాక శీర్షికలను పత్రికలు ప్రచురించాయి. ఆ కథనమేమిటో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. తీరా చూస్తే, సచిన్ ప్రకటించిన ‘విరాళం’ ఆతని సొంత డబ్బు కాదు, తన రాజ్య సభ ఎంపీ నిధి నుంచి ఇచ్చినది అని తేలింది. అంటే అది దేశం డబ్బే. అదసలు ‘విరాళమే’ కాదు.
 
 మాజీ ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ మహ్మద్ ఆలీ అన్యాయా నికి, జాతివిద్వేషాలకు వ్యతిరేకంగా నిలకడగా, ధైర్యంగా చేపట్టిన వైఖరి కార ణంగా ఎన్నో పౌర పురస్కారాలను అందుకున్నారు. ఆయన తన విశ్వాసాల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధపడ్డారు. సచిన్, మహ్మద్ అలీ వంటి క్రీడాకారుడు కాదు. అలాంటి సమస్యలకు సంబంధించి సచిన్ అర్థవంతమైన కృషి ఏమైనా చేసినట్టు ఎప్పుడైనా విన్నారా? లతా మంగేష్కర్‌కు 2001లో భారతరత్న ఇచ్చారు.
 
 ఆ తర్వాత కొన్నేళ్లకు ఆమె ముంబై పొద్దర్ రోడ్డులోని తన ఇంటికి ఎదురుగా ఫ్లైఓవర్‌ను నిర్మిస్తే దుబాయ్‌కు వెళ్లిపోతానని అన్నారు. ఆమె, ఆమె చెల్లెలు ఆశా భోస్లే దాన్ని ఎంత సమర్థవంతంగా అడ్డుకున్నారంటే ఇప్పటికీ దాన్ని నిర్మించనే లేదు. రాజ్యసభ హాజరు విషయంలో లతా మంగేష్కర్‌ది అత్యంత అధ్వానమైన రికార్డని 2012 ఏప్రిల్‌లో వెలువడ్డ ఒక నివేదిక తెలిపింది. ఆమెకు, సచిన్‌కు ఈ దేశం పట్ల ఉన్న పూర్తి నిరాసక్తతను ఇది తెలియజేస్తుంది. దీన్ని తృణీకార భావమని కూడా నేనంటాను. ఒక భారతరత్న ప్రవర్తించాల్సింది ఇలాగేనా? తమ వ్యక్తిగత అవ సరాలను, స్వార్థపరత్వాన్ని చాలామంది అవసరాలకన్నా ఉన్నతంగా నిలప డమేనా చేయాల్సింది? అలాంటి వ్యక్తులు వారు చేసిన సేవకు గాక, వారి ప్రతి భకు పురస్కారాలను పొందడం పరిహాసాస్పదం.
 
 వారి ప్రతిభకు సంబంధించినంతవరకు వారు తగినంత ప్రతిఫలాన్ని పొందలేదా? వారు చాలా చాలా సంపన్నులయ్యారు. బాగుంది, సరైనదే. వారు డబ్బును, కీర్తిని సంపాదించుకున్నారు సరే, దానితోపాటు మరింత ప్రజాప్రయో జనకర స్ఫూర్తిగల నడవడికను కూడా ప్రదర్శిస్తే మన గౌరవాన్ని కూడా సంపా దించుకోగలిగేవారు. అందుకు బదులుగా వారు ఆ విషయంలో ఎలాంటి పట్టింపూ చూపలేదు. పార్లమెంటుకు హాజరుకావడాన్ని సైతం వారు ఖాతరు చేయలేదు (సచిన్ ఎన్నిసార్లు ఒక మ్యాచ్‌కు లేదా వ్యాపార ప్రకటన షూటింగ్‌కు హాజరు కాలేకపోయి ఉంటారు?).
 
తరచుగా ప్రభుత్వం వ్యక్తులకున్న కీర్తిప్రతిష్టల ఆకర్షణకు లోనై అలాంటి వారికి పురస్కారాలను ఇవ్వాల్సివస్తుంటుంది (తరచుగా వాటి కోసం చాలా తీవ్ర స్థాయిలో లాబీయింగ్ జరుగుతుంటుంది). దీనికి ఇక స్వస్తి పలికాలి. వ్యక్తులకున్న ప్రతిభాప్రపత్తులను, వారి సేవాతత్పరతను వేరు చేసి చూడగలగాలి. సేవాతత్పరతను ప్రదర్శించినవారికి మాత్రమే జాతీయ పురస్కారాల ప్రదానం జరగాలి.
 - ఆకార్ పటేల్
 వ్యాసకర్త కాలమిస్టు, రచయిత  aakar.patel@icloud.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement