
పరిచయ పత్రం
పూర్తిగా రచనతోనే జీవిక సాగించిన అతికొద్దిమంది తెలుగు రచయితల్లో యామినీ సరస్వతి ఒకరు.
స్మృతి
పూర్తిగా రచనతోనే జీవిక సాగించిన అతికొద్దిమంది తెలుగు రచయితల్లో యామినీ సరస్వతి ఒకరు. 1960ల్లో మొదలుపెట్టి, 90ల చివరిదాకా విరివిగా రాశారు. స్మృతి పరిమళం, ఎడారి కోయిల, బహుదూరపు బాటసారి, అహల్య, నింగిలోని సిరిమల్లి, వెన్నెల బొమ్మ, కీర్తిరథం, మధుకీల లాంటి యాబై నవలలతోపాటు, కథ, గేయం, శతకం లాంటి భిన్న ప్రక్రియల్లో ఆయన రచనావ్యాసంగం సాగింది. తాండ్రపాపారాయుడు, విశ్వనాథ నాయకుడు లాంటి సినిమాలకూ, కొన్ని భక్తి సీరియల్స్‌కూ రచన చేశారు. ఆయన నాటీ హోం, ఎలమావి తోట లాంటి నవలల్ని సినిమాలుగా తీసే ప్రయత్నాలు జరిగినా ఫలవంతం కాలేదు.
యామినీ సరస్వతి అసలు పేరు దొర్నిపాటి వేంకట సుబ్బారావు. తొలుత కొన్నాళ్లు టీచర్ ఉద్యోగం చేశారు. మంజుల పేరుతో సాహిత్య మాసపత్రిక నడిపారు. 2001లో ఆయనకు సూరన సారస్వత సంఘం, నంద్యాల వారు చేయబూనిన షష్టిపూర్తి కార్యక్రమం కోసం తన పరిచయాన్ని ఇలా వివరంగా రాసిచ్చారు. దానికి ‘పరిచయ పత్రం’ అని పెట్టుకున్నారు. దాన్ని యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాం. సౌజన్యం: యామినీ సరస్వతి పెద్ద కుమారుడు దొర్నిపాటి సిద్ధేశ్వరరావు. ఫోన్: 9010345221
యామినీ సరస్వతి
1–1–231/1, కల్లేపల్లి కాంపౌండ్, చిక్కడపల్లి, హైదరాబాద్–20
ఫోను: 27677513.
పుట్టిన తేదీ: 3–8–1941
చదువు: బి.ఎస్సీ.
అభిరుచులు: సాహిత్య వ్యవసాయం, వ్యవసాయం, జ్యోతిషం
పుట్టిన ఊరు: కర్నూలు జిల్లా గోస్పాడు మండలం జిల్లెళ్ల గ్రామం.
ఉద్యోగం: కొన్నాళ్లు కర్నూలు జిల్లా పరిషత్ పాఠశాలలు శిరువెళ్ల, నొస్సం, పెద్దపాడు గ్రామాల్లో లెక్కల మేస్టారుగా.
సద్యోగం: 1962 మార్చి 15న ప్రారంభించిన నవలా, కథారచనం
తొలి కథ: ఆ క్షణం (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1963లో ప్రచురణ)
తొలి నవల: అతివ అభిజాత్యం– ఉజ్జ్వల పబ్లిషర్స్ కర్నూలు వారి ప్రచురణ 1964
తొలి గేయకావ్యం: శ్రీ వేంకటేశ్వర వైభవం– వసంతబాలలో ధారావాహికంగా 1972లో ప్రచురణ
తొలి శతకం: ‘ఎలుక’ శతకం. 1964–65 మధ్య
తొలి సినిమా మాటల రచన: తాండ్రపాపారాయుడు 1985
తొలి టి.వి.(హిందీ) సీరియల్: విశ్వామిత్ర– దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్మాణం–దర్శకత్వంలో. 1989–90
తొలి తెలుగు టి.వి. రచన: వీర సాత్రాజితి– ప్రజానటి జమున నిర్మాణ దర్శకత్వంలో 1987
తొలి సాహితీ వ్యాసం: ఉదయం వారపత్రికలో ‘సరస్వతీ మహల్’ పేర– 1987
తొలి గేయ రచన: 1955లో.
తొలి పౌరాణిక నవలా రచన: జయ జయ వీరాంజనేయ. 1988–మయూరిలో ఇప్పటిదాకా సుమారు 100–150 కథలు వివిధ ప్రసిద్ధ వార, మాస, దిన పత్రికల్లో ప్రచురితం. పాదాభివందనం, సరస్వతీ మహల్ కథాసంపుటాలు. సుమారు 50 నవలలు నేరుగా, అనుబంధాలుగా, ధారావాహికంగా ప్రచురితం. యామినీ విలాసం సాహితీ పరిచయ వ్యాసాలు ‘నయనాలప్ప’ శివ ప్రాశస్త్య పారాయణ శతకం. పేరు ప్రఖ్యాతి తెచ్చినవి: ‘సద్గురు సాయి’– ఆంధ్రభూమిలో ధారావాహికంగా 76 వారాలు వెలువడిన షిర్డీ సాయినాథుని దివ్యచరిత్ర ‘శివలీలలు’ ఈటీవీలో 76 వారాలు నడిచిన వారి తొలి పౌరాణిక ధారావాహిక.