ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో 5 వేల ఆదివాసీ తెగలున్నాయి. 6,700 భాషలు మాట్లాడుతున్న వీరి జనాభా 40 కోట్ల పైమాటే. ఆదివాసీ తెగలు, భాషలు పలు కారణాలతో అంతరించిపోతున్న నేపథ్యంలో ఆదివాసుల సాంస్కృతిక జీవనాన్ని, వారి హక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపాలని ఐక్య రాజ్యసమితి 1993లో తీర్మానించింది. ఈ తీర్మానం అమలులో భాగం గా.. అడవులపై హక్కులు ఆదివాసులకే ఉన్నాయని 2010 జూలై 14న జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారు. అది ఇంతవరకు అమలు కాలేదు.
ఆదివాసీ ప్రపంచం అభివృద్ధి ముసుగులో అంతం కాబోతోంది.
మన దేశ పార్లమెంటులో 30 మంది ఆదివాసీ ఎంపీలు ఉన్నా ఆదివాసీ సమస్యలపై వారేనాడూ నోరు విప్పింది లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసులపై నరమేథం కొనసాగుతోంది. అంతర్యుద్ధం వంటి పరిస్థితుల మధ్యన ఆదివాసులు నలిగిపోతున్నారు. ఆదివాసులను పూర్తిగా అంతరింపజేసి వారి సమాధులపై సామ్రాజ్యాల నిర్మాణం జరుగుతున్న ఆధునిక చరిత్ర నేటికాలంలోనూ సాగుతోంది. రెడ్ ఇండియన్‌లను నిర్మూలించిన అమెరికా సంయుక్త రాష్ట్రాల పంథాలో ఆదివాసుల అంతానికి అన్ని దేశాలూ నడుం కట్టిన పరిణామాలను ఇప్పుడు ప్రతి దేశంలోనూ చూడవచ్చు. ఈ చరిత్రను మన దేశ పాలకులు కూడా అందిపుచ్చుకున్నారు. భారతదేశంలో సహజవనరులను, ఖనిజ సంపదనూ ధ్వంసం చేస్తున్న తరుణంలో దానికి వ్యతిరేకంగా మధ్యభారతం కేంద్రంగా ఉన్న ఆదివాసీలు నడిపే ప్రత్యామ్నాయ పరిపాలన (మావోయిస్టుల ఆధ్వర్యంలోని జనతన్ సర్కార్)లో భాగమైన ఆదివాసులు జల్, జంగిల్, జమీన్‌నూ ఉమ్మడి జీవన విధానాన్ని రక్షించుకోవటంలో తమ ప్రాణాలనే బలిపెడుతున్నారు.
మరోవైపున ఆదివాసుల రక్షణకు ఐరాస తీర్మానించిన విధానాలను వివిధ దేశాల ప్రభు త్వాలు పూర్తిగా పక్కనబెడుతున్నాయి. ఈ క్రమంలో ఆదివాసుల ఉమ్మడి జీవన వ్యవస్థ వార సత్వం ధ్వంసమైపోతోంది. మన దేశంలోనూ ఆదివాసీల హక్కులు, రాజ్యాంగ పరమైన రిజర్వే షన్లను అమలు చేయడంలో మన పాలకవర్గాలు తీవ్రంగా విఫలమయ్యాయి. రాచరికపు మహా సామ్రాజ్యాలు కూడా ఆదివాసుల విషయంలో చేయనంత మహా విధ్వంసాన్ని ఓపెన్ కాస్టుల పేర అత్యాధునిక రాజ్య వ్యవస్థ చేస్తోంది. ఆనకట్టలు, ప్రాజెక్టులు, మైనింగ్.. ఇలా దేశంలో ఏ భారీ నిర్మాణాలకు పూనుకున్నా బలవుతున్నది ఆదివాసీలే. నిత్యం వీరు ఎదుర్కొంటున్న ప్రా ణాంతక వ్యాధులకు చికిత్స లేదు. వీరి భాషకు గుర్తింపు లేదు.
ప్రాణాల కు విలువ లేదు. వారి చరిత్రకు గౌరవం లేదు. ఈ విధ్వంసకర అభివృద్ధి నుంచి తమ రక్షణకు ఆదివాసీ తెగలు ఏకమ వ్వాలి. మన దేశ మైనింగ్ మాఫియా దోపిడీలో ప్రతి ఆదివాసీ అనాథ అయితే ఓపెన్ కాస్టులు వారి శ్మశాన వాటికలు. ఈ శ్మశాన వాటికల్లో ఆదివాసులను తగులబె డుతున్న బహుళజాతి కంపె నీలకూ, వారికి వత్తాసుగా నిలుస్తున్న దళారీ పాలకవర్గాలకూ వ్యతిరేకంగా ఆదివాసులు చేస్తున్న పోరాటాలకు సకల వర్గాల ప్రజలూ అండగా నిలవాలి. ఆదివాసులు తమ అస్తిత్వాన్ని, మను గడను కోల్పోతే, ఈ సమాజానికీ, చరిత్రకీ, సంస్కృతికీ, సంప్రదాయాలకూ చాలా ప్రమాదం.
(రచయిత: వూకే రామకృష్ణ ) ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వ్యాసకర్త ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ, మొబైల్ : 9866073866