సంక్షేమమే శ్వాసగా..
విశ్లేషణ
నేడు వైఎస్ ఆరవ వర్ధంతి
ఏ అధికారికైనా వైఎస్‌తో పరిచయమైతే, క్రమంగా అదో అనుబంధమయ్యేది, ఆయన ఆశయాలతో మమేకమయ్యేలా చేసేది. తప్పు ఎక్కడ జరిగింది... ఎలా సరిదిద్దుకోవాలని సమీక్షించడమే తప్ప వైఫల్యాలకు ఏ ఒక్క అధికారిని బలి చేసి ఎరుగరు. పొరపాట్లను కప్పిపుచ్చుకునే యత్నం ఆయన ఎన్నడూ చేయలేదు. అధికారులకూ అదే చెప్పేవారు. ముందే ప్రణాళికలు, వెంటనే అమలు, ప్రజావసరాల కోసం ఢిల్లీపై ఒత్తిడి... ఇదే వైఎస్ ప్రధాన ఎజెండా. వైఎస్ పాలనలో ఏనాడూ రైతు విత్తు కోసం, ఎరువు కోసం ఇబ్బంది పడలేదు.
తన పెదవులపైన ఆ చెరగని చిరునవ్వును అట్టడుగు పేదవర్గాల మొహా ల్లోనూ చూడాలనేదే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకాంక్ష. 30 ఏళ్ళ రాజకీయ జీవితం నేర్పిన పాఠాలే కావచ్చు, జనంతో మమేకమైన జీవన విధానమే కావచ్చు... ఆయన పాలనలో పేదవాడి సంక్షే మానికే పెద్దపీట. ప్రభుత్వ పథకాలకు, అధికారులకు అదే ఆయన మార్గ నిర్దేశన. వైఎస్‌తో కలసి పనిచేసిన ప్రతి అధికారికీ ఇది చిరస్మరణీయమైన అనుభవమే. ముఖ్యమంత్రిగా ఆయన సచివాలయానికే పరిమితం కాలేదు. జనం నాడి తెలుసుకుని, వారి ఆకాంక్షలనే పథకాలుగా మలచాలని పరిత పించే వారు. వైఎస్ రోజూ ఉదయం 10 గంటలకే అధికారులతో భేటీ అయ్యే వారు. క్రితం రోజు పరిస్థితులపై వారితో సమీక్ష. అది ఏ ఒక్క ప్రాంతానికీ పరిమితమయ్యేది కాదు. మారుమూల కుగ్రామాల సమస్యలను సైతం పత్రి కల ద్వారా తెలుసుకునే వారు. అప్పటికప్పుడే పరిష్కార మార్గాల కోసం ఆదే శాలిచ్చేవారు. ఈ క్రమంలో అధికారుల మనోగతానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం వైఎస్ నైజం. ఏ ప్రభుత్వ వ్యతిరేక ఘటనో, వైఫల్యమో ఎదురైతే అధికారులు ఆందోళన చెందడం సహజం. కానీ వైఎస్ ఏ ఒక్క అధికారిని బలి చేసిన దాఖలాలు లేవు. తప్పు ఎక్కడ జరిగింది... ఎలా సరిదిద్దుకోవాలి.. అని మాత్రమే సమీక్షించేవారు.
జనం కోసం మనం.. పేదల కోసం ఉన్నత విద్య
‘ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి. వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి. అప్పుడే వాళ్ళ రుణం తీర్చుకోగలం. లేకపోతే ఈ పోస్టులో మనం ఉండటమే వృథా’ ఓ అంతర్గత సమావేశంలో సీనియర్ అధి కారులతో సీఎంగా వైఎస్ అన్న మాటలు ఇప్పటికీ గుర్తు. నన్నే కాదు, ఇంకా ఎందరో అధికారులను ఆ మాటలు కట్టిపడేశాయి. మాటలకే పరిమితంగాక, ఎన్ని కష్టాలెదురైనా వాటిని కార్యరూపంలో పెట్టేవారు. అంతర్జాతీయంగా పట్టున్న మోన్‌శాంటో విత్తన సంస్థపై ఆయన చేసిన పోరాటమే దీనికి ఉదా హరణ. ప్రధాని సహా అన్ని వైపుల నుంచి కేసులు పెట్టొద్దని ఒత్తిడులు వచ్చా యి. అయినా ఆయన రైతు పక్షానే నిలిచారు. వైఎస్ పోరాటం ఫలితంగా మోనోశాంటో దిగివచ్చి, రైతు కోరిన ధరకే విత్తనాలు అందించక తప్పలేదు. హైదరాబాద్ ఐఐటీ ఏర్పాటుపై వివాదంలోనూ ఆయన అధికారుల అభి ప్రాయాలకే విలువనిచ్చారు. ఐఐటీని బాసరలో పెట్టడం వల్ల మౌలిక వస తుల సమస్య ఉంటుందన్న వారి వాదనతో ఏకీభవించారు. విమర్శలను కూడా లెక్కజేయక హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడది అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో ముందుకెళ్తోంది.
రవీంద్రభారతి వేదిక సాక్షిగా ఓ మహిళ కళ్ళ నుంచి వెలువడిన ఆనంద భాష్పాలు వైఎస్ పాలన గొప్పతనానికి సంకేతం. హనుమాన్ జంక్షన్‌లో కూలి పనిచేసుకునే ఆ తల్లి కుమారుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల ఇంజ నీరింగ్ చేశాడు. నెలకు రూ.60 వేల జీతంతో ఉద్యోగం పొందాడు. ‘జీవి తాంతం కష్టపడ్డా నాకు 60 వేలు రాలేదు’ అంటూ ఆమె వైఎస్‌కు కృతజ్ఞతలు చెప్పింది. ఇలాంటి పథకాన్ని అమలు చేస్తున్నందుకు యావత్ ప్రభుత్వ యం త్రాంగం ఆ రోజు ఉప్పొంగిపోయింది. 2004కు ముందు ఇంజనీరింగ్ విద్య పేదలకు అందని ద్రాక్ష. పేద విద్యార్థుల్లో పది శాతం కూడా ఉన్నత విద్యకు వెళ్ళలేని దుస్థితి ఉండేది. అధికారిక సమీక్షల్లో వైఎస్ దీన్ని తరచూ ప్రస్తావిం చేవారు. సరస్వతీ కటాక్షానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదు అనే వారు. ఈ ఆలోచన నుంచే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వచ్చింది. ఇం టికో ఇంజనీరు తయారైతే ఉద్యోగాల పరిస్థితేంటి? అనే విమర్శలూ వచ్చా యి. వాటిని రాజకీయ విమర్శలుగా వైఎస్ కొట్టిపారేయలేదు. నిజమే! ఏం చేయాలి? అధికారుల సలహాలు కోరారు. ‘జవహర్ నాలెడ్జ్ సెంటర్’ ఏర్పా టు అలాగే తెరమీదకొచ్చింది. ఎక్కడెక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసేవారికి ఆఖరి ఆరు నెలల్లో బహుళజాతి సంస్థల్లో పనిచేసేలా శిక్షణ నిచ్చి, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఆరితేరేలా చేసి, ప్రపంచ స్థాయి నిపుణులకు తీసిపోని తర్ఫీదును ఇస్తారు. అనుకున్నట్టే మంచి ఫలితాలొచ్చాయి. తెలుగు జాతి గర్వించదగ్గ ఇంజనీరింగ్ నిపుణులుగా దేశ విదేశాల్లో వారు పని చేస్తు న్నారు. ఒకప్పుడు బెంగళూరు, ఢిల్లీకే పరిమితమైన ఐటీ నైపుణ్యం ఆంధ్ర ప్రదేశ్‌కు సొంతమైంది. అది కూడా అట్టడుగు, బడుగు, బలహీనవర్గాల యువతతో సాధ్యమైంది.
ఆత్మీయతే ఆభరణం.. ప్రజా ప్రయోజనమే ధ్యేయం
ఏ అధికారికైనా వైఎస్‌తో పరిచయమైతే, క్రమంగా అది అనుబంధమవుతుం ది, ఆయన ఆశయాలతో మమేకమయ్యేలా చేస్తుంది. ఇది నా స్వీయానుభ వం. వైఎస్ 1978లో పులివెందుల శాసనసభ్యునిగా గెలిచారు. అప్పుడు నేను కడప జిల్లాలో ప్రభుత్వ అధికారిని. పులివెందుల కో ఆపరేటివ్ స్టోర్స్ ఎన్ని కల్లో వైఎస్ వర్గం గెలుపు ఖాయమని తేలింది. దీంతో ప్రత్యర్థి వర్గం ఎన్నిక లను నిలిపివేయాలని కోరితే కోర్టు ఒప్పుకోలేదు. ఫలితాలను ప్రకటించ వద్దని ఉత్తర్వులు ఇచ్చింది. పోలింగ్ సమయంలో వైఎస్ బూత్‌లోకి రావ డానికి వైరి పక్షం అభ్యంతరం చెప్పింది. వద్దని నేను వారించాను. అదే ఆయ నతో నా తొలి పరిచయం. ఆయన నా మాటను మన్నించారు. విపక్ష నేతగా ఉండగా నేను ఆయనను కలసిన ప్రతిసారీ సలహా తీసుకునేవారు. ముఖ్య మంత్రి అయినాక ఏడాదికి సీఎం కార్యాలయంలో కార్యదర్శిగా తీసుకు న్నారు. పూర్వ పరిచయం ఉన్నా ప్రజాజీవితానికి ఏమాత్రం ఇబ్బంది ఎదు రైనా మందలించేవారు. నిజామాబాద్‌లో విత్తనాల కోసం రైతులు ఆందోళన చేసినప్పుడు ఇదే జరిగింది. రైతుల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టాలనే తన ఆదేశాలను పాటించకపోవడం వల్లనే ఇలా జరిగిందని నిలదీశారు.
ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రజలపైకి తుపాకీ గురిపెట్టొద్దు. అన్ని సంద ర్భాల్లోనూ పోలీసులకు వైఎస్ తు.చ. తప్పకుండా ఇచ్చే ఆదేశాలివి. ముది గొండ కాల్పులకు ఆయన కలత చెందడం స్పష్టంగానే కనిపించింది. ఆ రోజంతా వైఎస్ గంభీరంగానే ఉన్నారు. ఈ వైఖరి వల్లే కావచ్చు ఆయన పాల నలో పెద్దగా హింసాత్మక ఘటనలు జరగలేదు. ముందే ప్రణాళికలు, వెను వెంటనే వాటి అమలు, ప్రజల అవసరాలను బట్టి ఢిల్లీపై ఒత్తిడి ఇవే వైఎస్ ఎజెండాలోని ప్రధానాంశాలు. అధికారులూ ఇదే ధోరణితో ఆయన మనసుకు చేరువయ్యేవారు. 2004లో రూ.1,500 ఉన్న మిర్చి మద్దతు ధర 2009 నాటికి రూ.3,000కు చేరింది. పత్తి, వరి రైతులు ఏనాడూ వైఎస్ పాలనలో దెబ్బతిన లేదు. రైతు విత్తు కోసం, ఎరువు కోసం ఇబ్బంది పడలేదు.
ఏ రాత్రయినా ‘సహాయనిధి’ సంతకం
పేదల ఆరోగ్యం విషయంలో వైఎస్ అధికారులను నిద్రపోనివ్వలేదు. సీఎం సహాయనిధి ఫైళ్లను ఏ రోజుకు ఆ రోజే క్లియర్ చేసేవారు. ఎంత అర్ధరాత్ర యినా ఫైళ్ళు ఇంటికి తెప్పించుకుని మరీ క్లియర్ చేసేవాళ్ళు. పేదలు లక్షలు పెట్టి వైద్యం చేయించుకోలేరు. వాళ్ళ ప్రాణం అత్యంత విలువైంది. కాబట్టి ఈ విషయంలో అశ్రద్ధ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలుండేవి. అసెంబ్లీ సమావే శాల్లో వైఎస్ ఆషామాషీగా మాట్లాడేవారు కారు. సంబంధిత అధికారుల ద్వారా వాస్తవాలు తెలుసుకునేవారు. ఒక్కోసారి గంటల తరబడి సబ్జెక్టును చదివేవారు. పొరపాట్లను కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేయలేదు. అధికారు లను సైతం అలా చేయవద్దని చెప్పేవారు. అందుకే ఆయన సభలోనూ గుండె ధైర్యంతో మాట్లాడేవారు. ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చేవారు.
కొప్పోలు ప్రభాకర్ రెడ్డి
(వ్యాసకర్త విశ్రాంత ఐఏఎస్ అధికారి, మొబైల్: 9849199226)