koppolu Prabhakar Reddy
-
మహోన్నత నాయకత్వం
విలక్షణ నాయకుడు వై.ఎస్.ఆర్. విపక్షాలు సైతం కొనియాyì న వ్యక్తిత్వం ఆయనది! ఇచ్చిన మాట తప్పని నైజం. ‘పేదల కోసమే పాలన’ అన్నది ఆయన సిద్ధాంతం. అన్నదాతకు ఆపద్బాంధవుడు. విద్య, వైద్యం, ఉద్యోగం అందరికీ అందుబాటులోకి తెచ్చి, అసమానతలను రూపుమాపిన క్రాంతదర్శి. జన జీవితంతో ఆయన మమేకం అయ్యారు. జయాపజయాలకు అతీతంగా పాలన సాగించారు. ఏం చేసినా అది ప్రజల కోసమే! ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా అది ప్రజా సంక్షేమం కోసమే! తెలుగు నేలను సస్యశ్యామలం చేయటానికి జలయజ్ఞం తలపెట్టారు. విశ్వసనీయతే తన సైన్యంగా విమర్శలను తిప్పికొట్టారు. తెలుగు ప్రజల గుండె చప్పుడుగా ఆదర్శప్రాయుడైన ప్రజా నాయకుడిగా నిలబడ్డారు. నేడు ఆయన జయంతి.అధికారం కోసం వెన్నుపోటుకైనా వెనుకాడని నేతలుండొచ్చు. పదవి కోసం ఎలాంటి వంచనకైనా నిస్సిగ్గుగా సిద్ధపడే పార్టీలుండొచ్చు. కానీ జయాపజయాలతో సంబంధం లేకుండా, జన జీవితంతోనే పెనవేసుకున్న నాయకత్వాన్ని వైఎస్ రక్తంలోనే చూస్తాం. అందుకే వైఎస్ఆర్ అనే మూడక్షరాలు తెలుగువాడి గుండె గొంతుకయ్యాయి. దశాబ్దకాలం దాటినా వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలోని పున్నమి వెలుగులే పేదవాడి చిరునవ్వుగా మారాయి. ఎంత పెద్ద ఆపదొచ్చినా పెద్దాయన ఉన్నాడనేది వైఎస్ పాలనలో ప్రజలకు ఉన్న నమ్మకం. మాటిస్తే మడమ తిప్పడనేది వైఎస్‌పై జనానికి ఉన్న విశ్వాసం. మేలు చేసేటప్పుడు వైఎస్ రాజకీయాలు చేయడనేది విపక్షాలే ఒప్పుకున్న నిజం. ఓ బ్యూరోక్రాట్‌గా నేను ఆయన్ని దగ్గర్నుంచీ చూశాను. ప్రజల కోసమే బతికిన విలక్షణ నాయకుడే వైఎస్ఆర్లో నాకు కన్పించాడు. కార్యకర్తలే కుటుంబం అనుకున్న గొప్ప వ్యక్తిత్వం వైఎస్‌లోనే చూశాను. దశాబ్దాల రాజకీయ అనుభవం కావచ్చేమో... ప్రజలకు ఏం కావాలో నిక్కచ్చిగా నిర్ణయించే సామర్థ్యం వైఎస్‌కే సొంతం. ఆయన పాలనలో ఎన్నో ఘటనలు... ఇంకెన్నో జ్ఞాపకాలు... మరెన్నో మరపురాని ఘట్టాలు..!విన్నాడు... ఉన్నానని ధైర్యమిచ్చాడు!పాదయాత్ర వైఎస్‌ను పూర్తిగా ప్రజల పక్షానికి చేర్చింది. ఊరూవాడా జనం గుండె చప్పుళ్ళు విన్నాడు. అప్పుడే ‘నేనున్నా’ననే భరోసా ఇచ్చాడు. వాళ్ళ కోసం ఏమైనా చేయాలనే పట్టుదల ఆయనలో బహుశా అప్పుడే మొదలైందేమో! పాలనలో అది స్పష్టంగా కన్పించింది. పేదవాడికి పెద్ద జబ్బొస్తే ఊపిరి పోవడమే వైఎస్ వచ్చే నాటికి ఉన్న పరిస్థితి. ముద్ద పెట్టే పొలం, తలదాచుకునే ఇల్లు అమ్మేసి వైద్యం చేయించుకునే దయనీయ పరిస్థితి అది. ఇది వైఎస్ మనసును చలించేలా చేసింది. సీఎంగా పగ్గాలు చేపట్టాక ఈ పరిస్థితే ఉండకూడదని ఆశించారు. చిన్న అర్జీ తీసుకొస్తే చాలు ఎన్ని లక్షలైనా వైద్యం కోసం ఇవ్వాలని ఆదేశించారు. ఇలా రోజుకు రూ. 1.20 కోట్లు ఖర్చయ్యేది. ఇదంతా ఖజానాకు భారం అని బ్యూరోక్రాట్స్ చెప్పబోతే వారించారాయన. ‘పేదవాడి ఆపద తీర్చలేకపోతే ఎందుకయ్యా? బేవరేజ్ మీద సెస్ 1 నుంచి 2 శాతానికి పెంచితే సరిపోదా?’ అంటూ తేలికగా చెప్పేవారు. పనుల్లో బిజీగా ఉండి, రాత్రి 8 గంటలకు ఇంటికొచ్చినా.. ‘సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులన్నీ క్లియర్ అయ్యాయా?’ అని అడిగేవారు. పేదవాడిపై ఇంత ప్రేమ ఎంతమందికి ఉంటుంది? గ్రేట్ అన్పించేది. ఇలా ఎంతకాలం సీఎం ఆఫీసుకు పేదవాళ్ళు అర్జీలు పట్టుకుని రావాలి? శాశ్వత పరిష్కారం లేదా? వైఎస్ వేసిన ఈ ప్రశ్నల్లోంచే ‘ఆరోగ్య శ్రీ’ పథకం ఆవిర్భవించింది. దీనిపైనా విపక్షాలు విమర్శలు చేశాయి. విషయం ఏమిటంటే విమర్శించిన విపక్ష నేతలే ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం! వాళ్ళే వైఎస్ తమకు ప్రాణ భిక్ష పెట్టారని చెప్పటం!తప్పు చేయను... ఏం చేసినా మీ కోసమే!ఇది వైఎస్ గట్టిగా నమ్మిన సిద్ధాంతం. జలయజ్ఞం పేరుతో భారీగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. ప్రతీ ప్రాజెక్టుపైనా విపక్షాలు రాద్ధాంతం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన అనుసరించిన విధానం విపక్షాల నోటికి తాళం వేసింది. ప్రతీ ప్రాజెక్టు దగ్గరకు విపక్ష నేతలను పిలిపించి, వాస్తవాలు అర్థమయ్యేలా చెప్పే ఏర్పాటు చేయడం వైఎస్ విజ్ఞతకు నిలువుటద్దం. ‘‘నేను తప్పు చేయనయ్యా... ఏం చేసినా ప్రజలకోసమేనయ్యా...’’ అని వైఎస్ చెప్పిన ఈ మాటలను ప్రజలు విశ్వసించారు. కాలగర్భంలో కలిసిన పోలవరం ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేసినా... పోతిరెడ్డిపాడుతో వరద జలాలు వాడుకునే ప్రయత్నం చేసినా ఆయనకు ప్రజాభిష్టమే లభించింది. ప్రాణహిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు ‘ఇక మిమ్మల్ని విమర్శించలేను’ అంటూ జి. వెంకటస్వామి కృతజ్ఞతా పూర్వకంగా అనడం ఇప్పటికీ చాలామంది గుర్తు చేస్తారు. ఒక ప్రాంతం కాదు... ఒక పార్టీ కాదు... ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేసి తీరాల్సిందే అనేది వైఎస్ సిద్ధాంతం. అద్భుతమైన తెలివితేటలుండీ ఆర్థిక ఇబ్బందులతో చదవలేని పేదలకు ఫీజు రీ–ఎంబర్స్మెంట్ తీసుకొచ్చిన వైఎస్ వల్ల... డాక్టర్లు, ఇంజనీర్లు అయిన పేదవాళ్ళున్నారు. అలా కొత్త వెలుగులు విరజిమ్ముతున్న జీవితాలు ఎన్నో! పేదవాడి నోటికాడికి ముద్ద చేర్చాలన్న లక్ష్యంతో రూ. 5.30 కిలో బియ్యం ధరను రూ. 2కు తగ్గించాలని భావించారు. దీన్ని బ్యూరోక్రాట్స్ వ్యతిరేకించారు. ‘‘మీ అభ్యంతరాలు మీరు చెప్పండి... కానీ ఇది అమలు చేయడం నా బాధ్యత’’ అంటూ... నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డ గొప్ప వ్యక్తి వైఎస్ అనడం అతిశయోక్తేమీ కాదు.తిరుగులేని నిర్ణయాలువైఎస్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు అంతర్జాతీయ పరిణామాల వల్ల మిర్చి ధర ఒక్కసారిగా పడిపోయింది. ఆ సమయంలో మిర్చి రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. జిల్లాల నుంచి అందిన ఈ సమాచారంతో వైఎస్ అప్పటికప్పుడే అధికారులను సమావేశపర్చారు. మార్కెట్లో రూ. 800 క్వింటాలున్న మిర్చిని, రూ.1500కు కొనాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నిర్ణయంతో కొన్ని వేల మంది మిర్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూశాం. ఇలాంటిదే మరో ఘటన. నిజామాబాద్‌లో రైతులు పండించే ఎర్ర జొన్నలు పంజాబ్, హర్యానాలకు సరఫరా అవుతాయి. వీటిని సేకరించే దళారులకు కేజీకి రూ. 12 వస్తే, రైతుకు వచ్చేది రూ. 4. రైతులకు ఎక్కువ ధర చెల్లించే ఓ దళారికి అవసరమైన బ్యాంకు లోన్ ఇప్పించడంలో అధికారులు కాదన్నా, వైఎస్ఆర్ నిర్ణయం తీసుకుని రైతులకు మేలు చేయడాన్ని ఇప్పటికీ అక్కడి రైతులు మరిచిపోరు. మరొక సందర్భం – వైఎస్ఆర్ హయాంలో దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరిగాయి. ప్రతీ సిలిండర్‌కు రూ. 50 సబ్సిడీ ప్రకటించారు. రూ. 50 సబ్సిడీ ఇవ్వడం మామూలు విషయమేమీ కాదు. ఆర్థిక భారం పడుతుందని అధికారులు, ఆర్థిక మంత్రి చెప్పినా ‘ప్రతీ ఇంట్లో మేలు జరుగుతుంది కదా’ అని తన నిర్ణయంతో ముందుకు వెళ్లారు వైఎస్ఆర్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వేసేప్పుడు స్వపక్షం నుంచే అనేక రకాల ఒత్తిడి వచ్చింది. ఇవేవీ లెక్క చేయలేదు. 150 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును అంత ధైర్యంగా చేపట్టడం వల్ల రాజధాని రూపురేఖలే మారాయి. హైదరాబాద్ విమానాశ్రయం పరిశీలనకు వెళ్ళినప్పుడు ఓ ముఖ్య విషయం ఆయన దృష్టికి వచ్చింది. విమానాల హబ్ ఏర్పాటు వల్ల అనేక రకాల అభివృద్ధి ఉంటుంది, దీనికి టాక్స్‌ను 14 నుంచి ఒక్క శాతానికి తగ్గించాలన్న విజ్ఞప్తి అది. అప్పటికప్పుడే ఆయన దానిపై అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల విమానాశ్రయం ఆర్థిక పురోగతే మారింది.విశ్వసనీయతే ఆయన సైన్యంఇంటిలిజెన్స్ కన్నా ముందే వైఎస్‌కు రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలిసేది. ఒకసారి గుంటూరు దగ్గర రైలు ప్రమాదం జరిగితే అధికారుల కన్నా ముందే ఆయన అప్రమత్తమయ్యారు. ఆయనే అందరికీ ఫోన్లు చేసి బాధితులకు అండగా ఉండమని చెప్పారు. ప్రతీ ఊళ్ళో ఆయనకు నెట్వర్క్ ఉండేది. ఏ జిల్లాకు వెళ్ళినా కనీసం 40 మంది కార్యకర్తలతో ఆయన విడిగా మాట్లాడేవారు. ఏ అర్ధరాత్రయినా ఆయనకు వాళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు. విషయం చెప్పేవాళ్లు. ఆయన కూడా వినేవాడు. దీంతో కచ్చితమైన సమాచారం వచ్చేది. చుట్టూ ఉన్న కోటరీపై ఆయన ఎప్పుడూ ఆధారపడేవాడే కాదు. ఎంత పెద్ద ఆందోళన జరిగినా రైతులు, ప్రజలపై తుపాకులు ఎక్కు పెట్టొద్దని స్పష్టమైన సంకేతాలు ఇచ్చేవాడు. నిజామాబాద్‌లో ఎర్రజొన్నల వివాదం సందర్భంగా, ముదిగొండలో కాల్పుల సందర్భంగా... ‘రైతులకు ఏమైనా జరిగిందా?’ అంటూ ఆయన పడ్డ కంగారు మాటల్లో చెప్పలేనిది. విపక్ష నేతలను అసెంబ్లీలోనూ పేర్లు పెట్టి పిలిచే స్వతంత్రం... చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా– మళ్ళీ సెక్యులర్ మాటలు చెప్పినా తేలికగా కొట్టిపారేసే ధైర్యం... ఓడిపోయినా ప్రతీ క్షణం ప్రజా క్షేత్రంలోనే ఉండే గొప్ప నైజం... వైఎస్ ఉన్నతిని పెంచాయి. ఈనాటికీ ఏ నేతకూ లేని ప్రజాదరణను తెచ్చి పెట్టింది. వైఎస్ మన మధ్య లేకపోవచ్చు. సడలని విశ్వాసం... చెదిరిపోని ప్రజల కలల స్వప్నంలో పథకాల రూపంలో ఎప్పటికీ ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. కొప్పోలు ప్రభాకర్ రెడ్డి వ్యాసకర్త రిటైర్డ్ ఐఏఎస్ అధికారి(వై.ఎస్.ఆర్. సీఎంగా ఉన్నప్పుడు సీఎంవో కార్యదర్శి) -
సంక్షేమమే శ్వాసగా..
విశ్లేషణ నేడు వైఎస్ ఆరవ వర్ధంతి ఏ అధికారికైనా వైఎస్‌తో పరిచయమైతే, క్రమంగా అదో అనుబంధమయ్యేది, ఆయన ఆశయాలతో మమేకమయ్యేలా చేసేది. తప్పు ఎక్కడ జరిగింది... ఎలా సరిదిద్దుకోవాలని సమీక్షించడమే తప్ప వైఫల్యాలకు ఏ ఒక్క అధికారిని బలి చేసి ఎరుగరు. పొరపాట్లను కప్పిపుచ్చుకునే యత్నం ఆయన ఎన్నడూ చేయలేదు. అధికారులకూ అదే చెప్పేవారు. ముందే ప్రణాళికలు, వెంటనే అమలు, ప్రజావసరాల కోసం ఢిల్లీపై ఒత్తిడి... ఇదే వైఎస్ ప్రధాన ఎజెండా. వైఎస్ పాలనలో ఏనాడూ రైతు విత్తు కోసం, ఎరువు కోసం ఇబ్బంది పడలేదు. తన పెదవులపైన ఆ చెరగని చిరునవ్వును అట్టడుగు పేదవర్గాల మొహా ల్లోనూ చూడాలనేదే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకాంక్ష. 30 ఏళ్ళ రాజకీయ జీవితం నేర్పిన పాఠాలే కావచ్చు, జనంతో మమేకమైన జీవన విధానమే కావచ్చు... ఆయన పాలనలో పేదవాడి సంక్షే మానికే పెద్దపీట. ప్రభుత్వ పథకాలకు, అధికారులకు అదే ఆయన మార్గ నిర్దేశన. వైఎస్‌తో కలసి పనిచేసిన ప్రతి అధికారికీ ఇది చిరస్మరణీయమైన అనుభవమే. ముఖ్యమంత్రిగా ఆయన సచివాలయానికే పరిమితం కాలేదు. జనం నాడి తెలుసుకుని, వారి ఆకాంక్షలనే పథకాలుగా మలచాలని పరిత పించే వారు. వైఎస్ రోజూ ఉదయం 10 గంటలకే అధికారులతో భేటీ అయ్యే వారు. క్రితం రోజు పరిస్థితులపై వారితో సమీక్ష. అది ఏ ఒక్క ప్రాంతానికీ పరిమితమయ్యేది కాదు. మారుమూల కుగ్రామాల సమస్యలను సైతం పత్రి కల ద్వారా తెలుసుకునే వారు. అప్పటికప్పుడే పరిష్కార మార్గాల కోసం ఆదే శాలిచ్చేవారు. ఈ క్రమంలో అధికారుల మనోగతానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం వైఎస్ నైజం. ఏ ప్రభుత్వ వ్యతిరేక ఘటనో, వైఫల్యమో ఎదురైతే అధికారులు ఆందోళన చెందడం సహజం. కానీ వైఎస్ ఏ ఒక్క అధికారిని బలి చేసిన దాఖలాలు లేవు. తప్పు ఎక్కడ జరిగింది... ఎలా సరిదిద్దుకోవాలి.. అని మాత్రమే సమీక్షించేవారు. జనం కోసం మనం.. పేదల కోసం ఉన్నత విద్య ‘ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి. వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి. అప్పుడే వాళ్ళ రుణం తీర్చుకోగలం. లేకపోతే ఈ పోస్టులో మనం ఉండటమే వృథా’ ఓ అంతర్గత సమావేశంలో సీనియర్ అధి కారులతో సీఎంగా వైఎస్ అన్న మాటలు ఇప్పటికీ గుర్తు. నన్నే కాదు, ఇంకా ఎందరో అధికారులను ఆ మాటలు కట్టిపడేశాయి. మాటలకే పరిమితంగాక, ఎన్ని కష్టాలెదురైనా వాటిని కార్యరూపంలో పెట్టేవారు. అంతర్జాతీయంగా పట్టున్న మోన్శాంటో విత్తన సంస్థపై ఆయన చేసిన పోరాటమే దీనికి ఉదా హరణ. ప్రధాని సహా అన్ని వైపుల నుంచి కేసులు పెట్టొద్దని ఒత్తిడులు వచ్చా యి. అయినా ఆయన రైతు పక్షానే నిలిచారు. వైఎస్ పోరాటం ఫలితంగా మోనోశాంటో దిగివచ్చి, రైతు కోరిన ధరకే విత్తనాలు అందించక తప్పలేదు. హైదరాబాద్ ఐఐటీ ఏర్పాటుపై వివాదంలోనూ ఆయన అధికారుల అభి ప్రాయాలకే విలువనిచ్చారు. ఐఐటీని బాసరలో పెట్టడం వల్ల మౌలిక వస తుల సమస్య ఉంటుందన్న వారి వాదనతో ఏకీభవించారు. విమర్శలను కూడా లెక్కజేయక హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడది అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో ముందుకెళ్తోంది. రవీంద్రభారతి వేదిక సాక్షిగా ఓ మహిళ కళ్ళ నుంచి వెలువడిన ఆనంద భాష్పాలు వైఎస్ పాలన గొప్పతనానికి సంకేతం. హనుమాన్ జంక్షన్లో కూలి పనిచేసుకునే ఆ తల్లి కుమారుడు ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ఇంజ నీరింగ్ చేశాడు. నెలకు రూ.60 వేల జీతంతో ఉద్యోగం పొందాడు. ‘జీవి తాంతం కష్టపడ్డా నాకు 60 వేలు రాలేదు’ అంటూ ఆమె వైఎస్‌కు కృతజ్ఞతలు చెప్పింది. ఇలాంటి పథకాన్ని అమలు చేస్తున్నందుకు యావత్ ప్రభుత్వ యం త్రాంగం ఆ రోజు ఉప్పొంగిపోయింది. 2004కు ముందు ఇంజనీరింగ్ విద్య పేదలకు అందని ద్రాక్ష. పేద విద్యార్థుల్లో పది శాతం కూడా ఉన్నత విద్యకు వెళ్ళలేని దుస్థితి ఉండేది. అధికారిక సమీక్షల్లో వైఎస్ దీన్ని తరచూ ప్రస్తావిం చేవారు. సరస్వతీ కటాక్షానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదు అనే వారు. ఈ ఆలోచన నుంచే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వచ్చింది. ఇం టికో ఇంజనీరు తయారైతే ఉద్యోగాల పరిస్థితేంటి? అనే విమర్శలూ వచ్చా యి. వాటిని రాజకీయ విమర్శలుగా వైఎస్ కొట్టిపారేయలేదు. నిజమే! ఏం చేయాలి? అధికారుల సలహాలు కోరారు. ‘జవహర్ నాలెడ్జ్ సెంటర్’ ఏర్పా టు అలాగే తెరమీదకొచ్చింది. ఎక్కడెక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసేవారికి ఆఖరి ఆరు నెలల్లో బహుళజాతి సంస్థల్లో పనిచేసేలా శిక్షణ నిచ్చి, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఆరితేరేలా చేసి, ప్రపంచ స్థాయి నిపుణులకు తీసిపోని తర్ఫీదును ఇస్తారు. అనుకున్నట్టే మంచి ఫలితాలొచ్చాయి. తెలుగు జాతి గర్వించదగ్గ ఇంజనీరింగ్ నిపుణులుగా దేశ విదేశాల్లో వారు పని చేస్తు న్నారు. ఒకప్పుడు బెంగళూరు, ఢిల్లీకే పరిమితమైన ఐటీ నైపుణ్యం ఆంధ్ర ప్రదేశ్‌కు సొంతమైంది. అది కూడా అట్టడుగు, బడుగు, బలహీనవర్గాల యువతతో సాధ్యమైంది. ఆత్మీయతే ఆభరణం.. ప్రజా ప్రయోజనమే ధ్యేయం ఏ అధికారికైనా వైఎస్‌తో పరిచయమైతే, క్రమంగా అది అనుబంధమవుతుం ది, ఆయన ఆశయాలతో మమేకమయ్యేలా చేస్తుంది. ఇది నా స్వీయానుభ వం. వైఎస్ 1978లో పులివెందుల శాసనసభ్యునిగా గెలిచారు. అప్పుడు నేను కడప జిల్లాలో ప్రభుత్వ అధికారిని. పులివెందుల కో ఆపరేటివ్ స్టోర్స్ ఎన్ని కల్లో వైఎస్ వర్గం గెలుపు ఖాయమని తేలింది. దీంతో ప్రత్యర్థి వర్గం ఎన్నిక లను నిలిపివేయాలని కోరితే కోర్టు ఒప్పుకోలేదు. ఫలితాలను ప్రకటించ వద్దని ఉత్తర్వులు ఇచ్చింది. పోలింగ్ సమయంలో వైఎస్ బూత్‌లోకి రావ డానికి వైరి పక్షం అభ్యంతరం చెప్పింది. వద్దని నేను వారించాను. అదే ఆయ నతో నా తొలి పరిచయం. ఆయన నా మాటను మన్నించారు. విపక్ష నేతగా ఉండగా నేను ఆయనను కలసిన ప్రతిసారీ సలహా తీసుకునేవారు. ముఖ్య మంత్రి అయినాక ఏడాదికి సీఎం కార్యాలయంలో కార్యదర్శిగా తీసుకు న్నారు. పూర్వ పరిచయం ఉన్నా ప్రజాజీవితానికి ఏమాత్రం ఇబ్బంది ఎదు రైనా మందలించేవారు. నిజామాబాద్‌లో విత్తనాల కోసం రైతులు ఆందోళన చేసినప్పుడు ఇదే జరిగింది. రైతుల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టాలనే తన ఆదేశాలను పాటించకపోవడం వల్లనే ఇలా జరిగిందని నిలదీశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రజలపైకి తుపాకీ గురిపెట్టొద్దు. అన్ని సంద ర్భాల్లోనూ పోలీసులకు వైఎస్ తు.చ. తప్పకుండా ఇచ్చే ఆదేశాలివి. ముది గొండ కాల్పులకు ఆయన కలత చెందడం స్పష్టంగానే కనిపించింది. ఆ రోజంతా వైఎస్ గంభీరంగానే ఉన్నారు. ఈ వైఖరి వల్లే కావచ్చు ఆయన పాల నలో పెద్దగా హింసాత్మక ఘటనలు జరగలేదు. ముందే ప్రణాళికలు, వెను వెంటనే వాటి అమలు, ప్రజల అవసరాలను బట్టి ఢిల్లీపై ఒత్తిడి ఇవే వైఎస్ ఎజెండాలోని ప్రధానాంశాలు. అధికారులూ ఇదే ధోరణితో ఆయన మనసుకు చేరువయ్యేవారు. 2004లో రూ.1,500 ఉన్న మిర్చి మద్దతు ధర 2009 నాటికి రూ.3,000కు చేరింది. పత్తి, వరి రైతులు ఏనాడూ వైఎస్ పాలనలో దెబ్బతిన లేదు. రైతు విత్తు కోసం, ఎరువు కోసం ఇబ్బంది పడలేదు. ఏ రాత్రయినా ‘సహాయనిధి’ సంతకం పేదల ఆరోగ్యం విషయంలో వైఎస్ అధికారులను నిద్రపోనివ్వలేదు. సీఎం సహాయనిధి ఫైళ్లను ఏ రోజుకు ఆ రోజే క్లియర్ చేసేవారు. ఎంత అర్ధరాత్ర యినా ఫైళ్ళు ఇంటికి తెప్పించుకుని మరీ క్లియర్ చేసేవాళ్ళు. పేదలు లక్షలు పెట్టి వైద్యం చేయించుకోలేరు. వాళ్ళ ప్రాణం అత్యంత విలువైంది. కాబట్టి ఈ విషయంలో అశ్రద్ధ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలుండేవి. అసెంబ్లీ సమావే శాల్లో వైఎస్ ఆషామాషీగా మాట్లాడేవారు కారు. సంబంధిత అధికారుల ద్వారా వాస్తవాలు తెలుసుకునేవారు. ఒక్కోసారి గంటల తరబడి సబ్జెక్టును చదివేవారు. పొరపాట్లను కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేయలేదు. అధికారు లను సైతం అలా చేయవద్దని చెప్పేవారు. అందుకే ఆయన సభలోనూ గుండె ధైర్యంతో మాట్లాడేవారు. ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చేవారు. కొప్పోలు ప్రభాకర్ రెడ్డి (వ్యాసకర్త విశ్రాంత ఐఏఎస్ అధికారి, మొబైల్: 9849199226)