రాజువయ్యా..!
డేట్‌లైన్ హైదరాబాద్
ఒక్కోసారి అనుమానం కలుగుతుండేది. కట్టకట్టుకుని మీడియా ఇంతగా చెబుతూంటే డాక్టర్ వైఎస్ అంత ధీమాగా ఎలా చెబుతారని! ఎక్కడో లెక్కలు తప్పుతున్నాయేమోననిపించేది. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఒకటి రెండు పత్రికలు మాత్రమే రాసిన ట్టు గుర్తు. అయినా వైఎస్ విశ్వాసం చెక్కు చెదరలేదు. ఆ వార్తల గురించి ప్రస్తావిస్తే; ‘ఫలితాలు వచ్చాక మాట్లాడదాం, మీ మీడియా వార్తల గురించి!’ అనేవారు.
డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి నాడు ప్రతిపక్ష నేత. 2004 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఈసారి, అంటే ఆ ఎన్నికల తరువాత, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఇక రాజకీయాలు విరమించుకోవచ్చునని సన్నిహితుల దగ్గర అప్పటికే చాలాసార్లు అన్నారు. కానీ అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పాదయాత్రతో ఆయనకు ప్రజల నాడి తెలిసింది. అందుకే పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. లెక్కపెట్టి 175 స్థానాలు గెలుస్తాం అని చెబుతున్నారు. మీడియా మాత్రం మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రావ డం ఖాయమని ఘోషిస్తూనే ఉంది. పత్రికలూ, టీవీ చానళ్లూ సర్వేలు చేయిం చాయి. కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నదని సర్వేలలో తెలిసినా అధికారంలో ఉన్న తెలుగుదేశం ఆగ్రహానికి వెరచో, అనుగ్రహం కోసమో ఆ ఫలితాలను బయటపెట్టని మీడియా సంస్థలూ ఉన్నాయి. ఒక ఆంగ్ల దినపత్రిక అయితే తెల్లవారితే ఓట్ల లెక్కింపు అనగా కాంగ్రెస్‌కు వస్తాయని సర్వేలో తేలిన 175 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తున్నాయని పతాకశీర్షికలో అచ్చేసి అభాసు పాలైంది కూడా.
ఒక్కోసారి అనుమానం కలుగుతుండేది. కట్టకట్టుకుని మీడి యా ఇంతగా చెబుతూంటే డాక్టర్ వైఎస్ అంత ధీమాగా ఎలా చెబుతారని! ఎక్కడో లెక్కలు తప్పుతున్నాయేమోననిపించేది. 2004లో కాంగ్రెస్ అధికా రంలోకి వస్తుందని ఒకటి రెండు పత్రికలు మాత్రమే రాసిన ట్టు గుర్తు. అయినా వైఎస్ విశ్వాసం చెక్కు చెదరలేదు. ఆ వార్తల గురించి ప్రస్తావిస్తే; ‘ఫలితాలు వచ్చాక మాట్లాడదాం, మీ మీడియా వార్తల గురించి!’ అనేవారు. అదేరోజు మళ్లీ ప్రచారానికి వెళ్లిపోయారు. ఆ రోజుల్లోనే ఆంధ్రప్రభ యాజమాన్యం మారింది. ఆ పత్రికను సొంతం చేసుకున్నాయన కాకినాడ శాసనసభ స్థానా నికి కాంగ్రెస్ అభ్యర్థి. పాత యాజమాన్యం కింద పని చేసిన జర్నలిస్ట్‌లకూ నాన్ జర్నలిస్ట్‌లకూ చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఆయనతో మాకు వివాదం నడుస్తున్నది. కొత్త యజమాని మొండి వైఖరితో ఉన్నాడు. కార్మి కులు రోడ్డున పడ్డారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ నుంచి కొంత మందిమి కాకినాడ చేరుకున్నాం.
ఆరోజు రాజశేఖరరెడ్డి అక్కడ ప్రచారానికి వచ్చారు. ఆయన సమక్షం లోనే తేల్చుకోవాలనుకున్నాం. ఆయన ప్రచార రథం వెళ్లే దారిలోనే ఒక హోట ల్లో దాగి ఉన్నాం. సరిగ్గా వైఎస్ ప్రచార రథం రాగానే ఒక్క ఉదుటున రోడ్డు మీదికి వచ్చి ఆ వాహనానికి అడ్డంగా పడుకుని నినాదాలు మొదలుపెట్టాం. రథం మీద రాజశేఖరరెడ్డి, ఆయన పక్కన పత్రిక కొత్త యజమాని, కాంగ్రెస్ అభ్యర్థి. ప్రచారానికి అడ్డొచ్చామని రాజశేఖరరెడ్డి ఆగ్రహిస్తారేమోనని మాలో కొంతమంది సందేహించారు. ఆయన గురించి తెలిసిన వాళ్లం కాబట్టి మా నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, నేనూ మరి కొంతమంది ధీమాగానే రోడ్డు మీద పడుకున్నాం. వైఎస్ ఏదో చెప్పగానే సూరీడు మా దగ్గరకొచ్చి శ్రీనివాస్‌రెడ్డినీ, నన్నూ సార్ పిలుస్తున్నారని చెప్పాడు. మేం రథం దగ్గరికి వెళ్లాం. మీదికి రమ్మన్నారు. ఆయనే మా చేతికి మైకు ఇచ్చి, మీ సమస్య ఏమిటో చెప్పండి అన్నారు. మేమిద్దరం మాట్లాడాం.
కార్మికులకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పాం. వాళ్ల రథం మీద నుంచే, వారి పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా, ఆ నియోజకవర్గ ప్రజలనుద్దేశించి మాట్లాడటం నాకైతే ఎప్పటికీ ఊహకు అం దని విషయం. వైఎస్‌లో ఏమీ మార్పులేదు. ఆ అభ్యర్ధి మా మాటలకు ఏదో జవాబు ఇస్తానంటే కూడా అవసరం లేదని మైకు తీసుకుని ఎన్నికలైన వెం టనే సమస్య పరిష్కరించే బాధ్యత తనదని ప్రకటించారు. ఫలితాలు వచ్చా యి. వైఎస్ అన్నట్టే అన్ని స్థానాలూ వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అంత తీరికలేని స్థితిలో కూడా కాకినాడలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. శాసన సభ్యుడిగా ఎన్నికైన ఆ యజమానిని పిలిపించి కార్మికుల సమస్య పరిష్కరిం చారు. ఇది నేను కాకినాడ వీధుల్లో జర్నలిస్ట్ యూనియన్‌కు ఇచ్చిన హామీ. నెరవేరి తీరాల్సిందేనని ఆనాటి సమాచారశాఖ కమిషనర్ రమణాచారిని పిలిచి స్వయంగా చెప్పారు కూడా. నిజానికి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఈ చిన్న విషయం గుర్తుంచుకోనవసరం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే రాజకీయ నాయకులు చాలా అరుదు. అందుకే ఇదంతా చెప్పడం.
ముఖ్యమంత్రి అయ్యాక రాజశేఖరరెడ్డి కొన్ని పత్రికల యాజమాన్యా లతో తీవ్రంగా విభేదించారు. ఆ పత్రికలు కూడా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని టీడీపీ ఓటమిని జీర్ణించుకోలేని విధంగా వెంటబడి కాం గ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయడం ప్రారంభించాయి. అందుకే ‘ఆ రెం డు పత్రికలూ..’ అంటూ విమర్శిస్తూ ఉండేవారు వైఎస్. కానీ వాటిలో ఉద్యో గాలు చేస్తున్న జర్నలిస్ట్ మిత్రులను ఏ నాడూ చిన్నచూపు చూడలేదు. అన్ని వర్గాలకు ఇచ్చినట్టే, వైఎస్ మొదటిసారి అధికారంలోకి రాగానే జర్నలిస్ట్‌ల సంక్షేమానికి కూడా కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. మెడిక్లెయిమ్ పాలసీ, ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాలు- ఇట్లా.
పత్రికలు ఏం రాస్తున్నాయి, న్యూస్ చానళ్లు ఏం చూపిస్తున్నాయి అనే అంశంతో సంబంధం లేకుండా పాత్రికేయుల సంక్షేమానికి ప్రతిపాదన ఆయ న ముందు పెట్టడం ఆలస్యం, ఆమోదం పొందుతూ ఉండేది. కృష్ణ మాదిగ ఆధ్వర్యంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసిన రాతలకు కినుక వహించి ఆ పత్రిక కార్యాలయం మీద దాడి చేశారు. ఆ దాడిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్‌ల యూనియన్ పిలుపు మేరకు మేమంతా ఎంఆర్‌పీఎస్ దాడిని వ్యతిరేకిస్తూ ఆందోళన జరి పాం. ఆ పత్రిక సంపాదకుడిని పోలీసులు అరెస్టు చెయ్యడానికి వస్తే అడ్డుకు న్నాం. రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లో కూర్చుని నిరసన తెలిపాం. నేనప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఎంఆర్‌పీఎస్ ఆందోళన వెనక ప్రభుత్వం ఉందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ైచైర్మన్‌గా నాది కేబినెట్ మంత్రి హోదా. ప్రభుత్వానికి ఇది కొంత ఇబ్బంది కలిగించే విష యమే.
అప్పటికే ఒకరిద్దరు అధికారులూ, కాంగ్రెస్ నాయకులూ ముఖ్య మంత్రికి నామీద ఫిర్యాదు కూడా చేశారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం న్యాయం కాదనిపించి ముఖ్యమంత్రిని కలిసి, నేను రాజీనామా చేస్తానని చెప్పాను. ఆయన తన సహజసిద్ధమైన చిరునవ్వుతో ‘ఎందుకు స్వామి?’ అన్నారు. విషయం చెప్పాను. ‘నువ్వు యూనియన్ నాయకుడివి. ఇట్లా కాకుండా భిన్నంగా ప్రవర్తిస్తావని నేను ఎట్లా అనుకుంటాను? వెళ్లి నీపని చేసుకో!’ అని కాగితం తిరిగి నా చేతికిచ్చి కాఫీ ఇచ్చి పంపేశారు. ఆ తరువాత చాలా రోజులకు ఆయన ‘మిస్టర్ చీఫ్ మినిస్టర్’ కార్యక్రమం రికార్డింగ్ సం దర్భంగా కలిసినప్పుడు అధికారులకు చెప్పారాయన ఈ విషయం. ప్రజా జీవితంలో రాజశేఖరరెడ్డితో కలసి నడిచిన వాళ్లు ఇలాంటి అనుభవాలు ఇంకా ఎన్నో పంచుకోగలరు. 1978లో మొదటిసారి ఆయన శాసనసభకు ఎన్నికైన నాటి నుంచి మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రెండుసార్లు పీసీసీ అధ్యక్షు డిగా, ప్రతిపక్ష నాయకుడిగా, చివరికి ముఖ్యమంత్రిగా-వరుసగా రెండవ సారి ఎన్నికయ్యే వరకూ రాజకీయాలలో ఆయన తనదైన ప్రత్యేక ముద్ర కన బరచడం నేను జర్నలిస్ట్‌గా చూశాను. రిపోర్టు చేశాను. ఆపదలో ఉన్నవారు ఎవరైనా తన, మన అని చూడకుండా ఆదుకోవడంలో ఆయన ఎన్నడూ వెను కాడలేదు. కాకినాడ అనుభవం, ఆంధ్రజ్యోతి మీద దాడి వ్యవహారం ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే. జర్నలిస్టు ఉద్యమంలో ఆయనతో ఉన్న ఇటువంటి అనుభవాలు అనేకం ఏకరువు పెట్టొచ్చు. రాజశేఖరరెడ్డి వంటి విలక్షణ వ్యక్తిత్వం గల నాయకులు రాజకీయాలలో చాలా తక్కువ. ఒక దానికి ఒకటి ముడి పెట్టకుండా దేనికి దాన్ని వేర్వేరుగా చూడటం, ఆ పద్ధతిలోనే ఆ సమస్యను పరిష్కరించే యత్నం చేయడం డా॥వైఎస్ నుంచే నేర్చుకోవాలి.
(నేడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి)
datelinehyderabad@gmail.com
దేవులపల్లి అమర్