
చేతులు కాలాక ఆకులు?
స్వైన్‌ఫ్లూ ప్రాణాంతకం కాదని, భయపడాల్సిన పనే లేదని అధికార యంత్రాంగం అభయమిస్తుండగా, అటు నిండు ప్రాణాలు గాలిలో కలసిపోవడం కొనసాగింది. స్వైన్‌ఫ్లూ మరణాల్లో ముందున్న గుజరాత్, రాజస్థాన్‌ల నుంచి తెలుగు రాష్ట్రాల వరకు అడుగడుగునా ప్రాణాంతక, ప్రమాదకర అంటువ్యాధుల నివారణ, నియంత్రణలో మన ప్రజారోగ్య వ్యవస్థ వైఫల్యం బట్టబయలైంది. ఈ నేపథ్యంలో సదా సన్నద్ధతను చూపగల సమర్థ ప్రజారోగ్య వ్యవస్థ, సమగ్ర జాతీయ అంటువ్యాధుల విధానం తక్షణ అవసరం.
దేశవ్యాప్తంగా భయాందోళనలను రేకెత్తించిన స్వైన్‌ఫ్లూ మహమ్మారి ఇప్పు డిప్పుడే నెమ్మదిస్తోంది. మళ్లీ తిరిగి వచ్చిపడదని అనుకోలేం. 2009లో హెచ్1ఎన్1 వైరస్ (స్వైన్‌ఫ్లూ) మొదటిసారి మనల్ని గడగడలాడించింది. 2010 ఆగస్టు నాటికి అది దేశవ్యాప్తంగా 1,833 మందిని బలిగొన్నదని అధికారిక అంచనా. అప్పట్లోనే ‘టామిఫ్లూ’ అనే వ్యాధి చికిత్స ఔషధమూ, వ్యాధి నిరోధక వ్యాక్సిన్ వాడుకలోకి వచ్చాయి. అంతా ఆదమరచి ఉండగా మరోమారు విరుచుకుపడ్డ ఆ మహమ్మారి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 25,000 మందికి సోకి, 1,370 మందిని హతమార్చింది. తెలంగాణలో 63 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 15 మంది మరణించినట్టు అంచనా. ఈ దఫా ఇటు వైద్య నిపుణులు, అధికార యంత్రాంగం స్వైన్‌ఫ్లూ ప్రాణాంతకం కాదని, భయపడాల్సిన పనే లేదని అభయమిస్తుండగా, అటు నిండు ప్రాణాలు గాలిలో కలసిపోవడం కొనసాగింది.
స్వైన్‌ఫ్లూ మరణాల్లో ముందున్న గుజరాత్, రాజస్థాన్‌ల నుంచి తెలుగు రాష్ట్రాల వరకు అడుగడుగునా ప్రాణాం తక, ప్రమాదకర అంటువ్యాధుల నివారణ, నియంత్రణలో మన ప్రజారోగ్య వ్యవస్థ వైఫల్యం బట్టబయలైంది. మరోవంక మరింత ప్రమాదకరమైన ఎబోలా అంటువ్యాధి ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాం టి అంటువ్యాధులనైనా సకాలంలో నివారించడంలో, నియంత్రించడంలో సదా సన్నద్ధతను చూపగల సమర్థవంతమైన ప్రజారోగ్య వ్యవస్థ నిర్మాణం, సహేతుక, సమగ్ర జాతీయ అంటువ్యాధుల విధానం తక్షణ అవసరం. లేక పోతే చేతులు కాలాక ఆకుల కోసం తడుములాట తప్పదు.
మహమ్మారి పాతదే
జలుబు, తుమ్ముల రూపంలో మనుషులలో కనిపించే ఇన్‌ఫ్లుయెంజా వైరస్ లలో ‘ఏ’ రకానికి చెందిన హెచ్1ఎన్1... 1918లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి సోకగా పది కోట్ల మంది మరణించారు. బర్డ్‌ఫ్లూ పేరుతో ఏ/హెచ్5ఎన్1 వైరస్ 2006లో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో కోళ్ల ఫారాలను చావుదెబ్బ తీసింది. 2008, 2009లలో అది పశ్చిమ బెంగాల్, అస్సాంలలోని పెరటి పెంపకం కోళ్లకు సైతం సోకింది. అయితే వ్యాధి కనిపించిన ప్రాంతానికి 3 కిలో మీటర్ల పరిధిలోని కోళ్లనన్నిటినీ పెద్ద ఎత్తున వధించడం ద్వారా అప్పట్లో అది మనుషులకు వ్యాప్తి చెందకుండా నిరోధించ గలిగాం. కానీ బర్డ్‌ఫ్లూ వల్ల అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 262 మంది మృతి చెందారు. అది పక్షులను ఆశ్రయించి బతికే వైరస్ కాగా హెచ్1ఎన్1 మనుషు లలో వేగంగా వ్యాపించే అత్యంత ప్రమాదకర వైరస్. అభివృద్ధి చెందిన ఉత్తర అమెరికాలో సైతం ఇటీవల దాని వల్ల 833 మంది మరణించారు. ఈ దృష్ట్యా మన జాతీయ అంటువ్యాధుల విధానంపై చర్చకు ప్రాధాన్యం ఉంది.
ఆర్థిక వ్యవస్థపై దుష్ర్పభావం
స్వైన్‌ఫ్లూ లేదా ఎబోలా లేక మరేదైనా ప్రమాదకరమైన అంటువ్యాధి ప్రబలితే ఆర్థిక వ్యవస్థ హఠాత్ దుష్ర్పభావానికి గురవుతుంది. ప్రాణ నష్టానికి తోడు సామాజిక, ఆర్థిక విపరిణామాలు, అపరిమిత నష్టం సంభవిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మందులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రి సౌకర్యాల కోసం ప్రభు త్వం భారీగా వ్యయం చేయాల్సివస్తుంది. దేశీయ వైమానిక, టూరిజం రం గాల రాబడి హఠాత్తుగా పడిపోతుంది. ప్రజలు మార్కెట్లకు, ఉద్యోగాలకు వెళ్లడం తగ్గిస్తారు. దీంతో వినియోగదారుల డిమాండు క్షీణిస్తుంది. ‘సార్స్’ అంటువ్యాధి వల్ల 2003లో చైనా స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) 1,500 కోట్ల డాలర్లు, ప్రపంచ జీడీపీకి 3,300 కోట్ల డాలర్లు నష్టం వాటిల్లిందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ప్రమాదకర అంటువ్యాధి ప్రబలితే, దానికదే ప్రపంచ ఆర్థిక తిరోగమనానికి, రాజకీయ అస్థిరతకు, ఆరోగ్యపరమైన సంక్షో భానికి, భయోత్పాతానికి దారి తీయవచ్చు.
అలాంటి ప్రజాసంక్షోభ సమ యాల్లో సహేతుక, ఆచరణయోగ్య ప్రజారోగ్య చట్టం, మౌలిక వసతులు ఉండటం అవసరం. అప్పుడే స్థానిక, అంతర్జాతీయస్థాయిల్లో ప్రజారోగ్యపర మైన అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ చర్యల చట్టపరమైన పరిధులు స్పష్టం గా ఉంటాయి. అలాంటి అత్యవసర పరిస్థితి ఉత్పన్నం కావడానికి ముందూ, తర్వాతా చేపట్టే చర్యలపై ఆచరణలో ఫలితాలనిచ్చేవిగా తేలిన సూచనలు ఉండటం అవసరం. పని ప్రదేశాల్లో వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వవచ్చా? ఇచ్చేట్టయితే ఏ నిర్దిష్ట వయో బృందాన్ని ఎంపిక చేసుకోవాలి? స్కూళ్ల మూసి వేత వ్యాధి వ్యాప్తిని అరికట్టగలుగుతుందా? ఫలితంగా పిల్లల సంరక్షణ ఖర్చులు పెరిగినా, వైద్య వ్యయాలు తగ్గుతాయా? అమెరికాలోని అన్ని కే-12 స్కూళ్లను రెండు వారాలు మూసేయడానికి 520 నుంచి 2,360 కోట్ల డాలర్ల వ్యయం అవుతుందని అంచనా. ప్రతి వానాకాలం, చలికాలం ఇలాంటి చర్యలు చేపట్టగలమా? ఇలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలంటే తగు ఆధారాల ప్రాతిపదికపై రూపొందిన ప్రజారోగ్య విధానం అవసరం.
జాతీయ అంటువ్యాధుల విధానం
మనకు ఇప్పటికే అంటువ్యాధుల సంసిద్ధత చట్టం (1897), పశుసంపద దిగుమతి చట్టం (1898), ఔషధాలు, సౌందర్యసాధనాల చట్టం (1940) వగైరా చట్టాలున్నాయి. ఇవన్నీ స్వభావరీత్యా ‘పోలీసు పని’ చేసేవే తప్ప ప్రజారోగ్యంపై దృష్టిని కేంద్రీకరించినవి కావు. ప్రమాదకర అంటువ్యాధి ప్రబ లినప్పుడు వైద్యపరంగా సంఘటితంగా ప్రతిస్పదించే వైఖరి కొరవడుతోంది. జిల్లా కలెక్టర్ మొత్తం ప్రభుత్వ చర్యలన్నిటికీ సమన్వయకర్తకాగా, చీఫ్ మెడి కల్ ఆఫీసర్ సహాయక పాత్రకు పరిమితం కావాల్సి ఉంటోంది. నిజానికి వారి విధులను, బాధ్యతలను ఇతరులకు బదలాయించడాన్నిస్పష్టంగా నిర్వచిం చాల్సి ఉంది. అంటువ్యాధుల చట్టం (1897) 117 ఏళ్లనాటి కాలంచెల్లినది. అది భారీ ఎత్తున ప్రబలే అంటువ్యాధులకు, అత్యవసర పరిస్థితులకు తగినది కాదు. పైగా అది వ్యాధి తీవ్రతవల్ల సామాజిక, ఆర్థికవ్యవస్థ విచ్ఛినమై తలెత్త గల అత్యవసర పరిస్థితులతో వ్యవహరించలేదు. అలాగే మానవ హక్కుల అంశాన్ని అది విస్మరించింది. ఇక మునిసిపల్ స్థాయిలో ఈ లోటుపాట్లు మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ప్రజారోగ్యపరమైన అన్ని చట్టాలను తక్షణం ఒకే చట్టం కిందికి తేవాల్సి ఉంది. ప్రభుత్వ చర్యల అమలులో ఎలాం టి ఆటంకాలు లేకుండా అది హామీని కల్పించాలి. ప్రజారోగ్య వ్యవస్థ సమర్థ వంతమైన ప్రభావాన్ని చూపగలగడానికి సరిపడే చట్టాలు ఉండాలి. వాటి అమ లును నియంత్రించే సంస్థ కూడా విడిగా ఉండాలి. బ్రిటన్‌లో ‘‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ క్లినికల్ ఎక్స్‌లెన్స్’’ వ్యాధి నియంత్రణ చర్యల అమలులో అనుసరించాల్సిన ప్రమాణాలను, ఏకరూపతను నిర్దేశిస్తుంది, దాన్ని పోలిన ‘‘ప్రజారోగ్య ప్రమాణాల సంస్థ’’ మనకూ అవసరం. ‘‘జాతీయ ఆరోగ్య బిల్లు-2009’’ త్వరితగతిన అమలులోకి తెచ్చే విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులకు జాతీయాభివృద్ధి మండలి ఉపయోగపడుతుంది.
పంచముఖ వ్యూహం
అంటువ్యాధులు ప్రబలిన పరిస్థితుల నియంత్రణకు, రూపుమాపడానికి మన దేశం పంచముఖ వ్యూహంతో కూడిన ప్రణాళికను అనుసరించాలి. 1. మను షులలో వ్యాధులు ప్రబలే అకాశాలను తగ్గించడం ద్వారా వైరస్ లేదా రోగ వాహకులు తయారుకాకుండా నిరోధించవచ్చు. 2. వ్యాధి ప్రభావిత జిల్లాల, స్థానిక ఆరోగ్య అధికారులకూ, మంత్రిత్వశాఖకూ చికిత్సాపరమైన నమూ నాల సమాచారం అంతా అందుబాటులో ఉండేలా చూడాలి. అప్పుడే వేగంగా అంచనాలు వేయగలుగుతారు. అంటువ్యాధి ప్రబలినట్టు ప్రకటిం చిన వెంటనే వేగంగా దాని వ్యాప్తిని నిరోధించే చర్యల ప్రణాళికను రూపొం దించి, ముమ్మరంగా చర్యలు చేపట్టగలుగుతారు. తద్వారా వ్యాధి ఇతరులకు సోకడం తగ్గుతుంది. 4. స్థానిక వైద్య, ఆరోగ్య సదుపాయాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానించాలి. తద్వారా వ్యాధిని అరికట్టడానికి, నిర్మూలించడానికి ప్రణాళికలను రూపొందించి, పరీక్షించాలి. స్థానిక, ప్రపంచ శాస్త్రీయ పరిశోధన, అభివృద్ధి కృషిని సమన్వ యించి, టీకా మందులకు హామీని కల్పించాలి.
దాన్ని పరీక్షించి, త్వరితగతిన అందరికీ అందుబాటులో ఉండే ధరకు అందేలా చూడాలి. 5. ఎన్‌జీఓలను భూతాల్లా చూడటం మాని, పౌర సమాజాన్ని ఈ చర్యల్లో భాగస్వామిని చేయాలి. బ్రిటన్‌లోని జాతీయ అంటువ్యాధుల వ్యవస్థ ప్రభుత్వ విధానాల, ప్రణాళికల రూపకల్పనలో పౌర సమాజాన్ని భాగస్వామిని చేస్తుంది. తద్వారా ప్రజల సున్నిత భావాలను దృష్టిలో ఉంచుకొని వైద్యపరమైన ఎంపి కలకు వారి ముందు ఉంచడం సాధ్యమౌతుంది. పౌర సమాజం సలహాలు, సమాచారం తీసుకోవడం పౌర అశాంతిని తగ్గించడంలో కూడా తోడ్పడు తుంది. చట్టపరమైన వ్యవస్థలను, అలాంటి సంస్థలతో పూర్తిగా అనుసంధా నించడం.. ప్రజారోగ్య సంబంధ సంక్షోభ పరిస్థితుల్లో తగు ఆరోగ్య సేవలకు హామీని కల్పిస్తుంది.
(వ్యాసకర్త బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి మనేకా గాంధీ కుమారుడు)
ఈమెయిల్: fvg001@gmail.com
వరుణ్ గాంధీ