వాల్మీకి- బెర్నార్డ్ షా మధ్య భేదం
1983లో మరణించిన అంబటిపూడి వెంకటరత్నం రాసిన ‘వ్యాసతరంగాలు’ ఒకచోట కూర్చి వాటిని తాజాగా అందుబాటులోకి తెచ్చారు వారి కుమారుడు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇందులో సంస్కృతభాషా సంబంధ వ్యాసాలు, కవిత్వతత్త్వ విచార వ్యాసాలతోపాటు రచయిత ఎరిగిన చెళ్లపిళ్ల, వేలూరి, శ్రీపాద, విశ్వనాథ, గడియారం, మధునాపంతుల వ్యక్తిత్వచిత్రణ వ్యాసాలున్నాయి. డాక్టర్ ఐ.సచ్చిదానందం పరిష్కర్తగా వ్యవహరించిన ఈ పుస్తకంలోని(పేజీలు: 208; వెల: 100; ప్రతులకు: డాక్టర్ డి.నరేష్‌బాబు, శ్రీషిర్డి సాయిబాబా ట్రస్టు, జూలేపల్లె, గోస్పాడు మండలం, కర్నూలు జిల్లా-518674; ఫోన్: 9491416696) ఒక వ్యాసంలో వాల్మీకి-బెర్నార్డ్ షా మధ్య భేదాన్ని పట్టుకోవడంలో వెంకటరత్నం అంతరంగం తెలుస్తుంది:
ప్రాచ్యము, ఆద్యము ‘వాల్మీకి’ రచనము. పాశ్చాత్యము అధునాతనము ‘షా’ రచనము. ప్రపంచము ఇన్ని శతాబ్దములు నడచి వచ్చినది. జ్ఞానమును వృద్ధిచేసి కొనినది. బహుపథములు పరిశీలించినది. స్త్రీచే మోసపోవుచు అధఃపతితుడైన మహావీరుని జూపించినది పాశ్చాత్య కవిత. ఇక ప్రాచ్య కవిత కథా శిల్పమున అధునాతనము వలెనే తేజరిల్లినది. కాని, విశేషము గాంచుడు. స్త్రీ హృదయము పురుషోన్నతికి తోడుపడినది. పడిపోవువాని పెకైత్తినది. అజ్ఞానిని జ్ఞానిని చేసినది. ఇట్లున్నవి ఇరువురి రచనములు.
‘క్చ ౌజ ఈ్ఛట్టజీడ’ని అనువదించితిని. ‘చూడాల’ అను ఏకాంక రచనము జేసితిని. ఈ రెంటిని ఒక దాని చెంత నొకటి నిల్పిన ప్రాచ్య పాశ్చాత్య చిత్తములు, ప్రాచీనతా నవతలు, భారతీయ భారతీయేతరములు ఒక దాని వెంట నొకటిగా కథాంశము ‘కథా లక్ష్యములు’ కవి హృదయములు పొడకట్టినవి. హృదయము వాల్మీకికి నమస్కరించినది. షాను జూచి నవ్వినది.