సాయిబాబాకు ప్రాణాపాయం | Vasantha writes on saibaba | Sakshi
Sakshi News home page

సాయిబాబాకు ప్రాణాపాయం

Published Thu, Apr 6 2017 2:09 AM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

సాయిబాబాకు ప్రాణాపాయం

సాయిబాబాకు ప్రాణాపాయం

ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబా అడవిబిడ్డల హక్కుల గురించి మాట్లాడారు. దళితులపై అకృత్యాల గురించి గొంతెత్తి నినదించారు. రాజ్యం పౌరుల సర్వ హక్కులనూ హరించి వేస్తుంటే చూస్తూ ఊరుకోక పోవడమే ఆయన నేరం.

‘‘సాయిబాబాని మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో కలిసాను. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు కనిపించింది. ఆయన ప్రాణానికే ప్రమాదం ఉందనిపించింది. జైలు అధికారులు ఎటువంటి వైద్య సౌకర్యాలను, అందిం చడం లేదు. పైగా తప్పుడు వైద్య నివేదికలనిచ్చి, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు నమ్మబలుకుతు న్నారు. సాయిబాబా బీపీ కూడా నార్మల్‌గా లేదు. లాయర్ల ద్వారా పంపిన మందులను సైతం అత్య వసర పరిస్థితుల్లో మాత్రమే ఆయనకు అందిస్తు న్నారు. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు కిడ్నీల్లో రాళ్ళు, ఛాతీ నొప్పి, శ్వాస సంబంధమైన సమస్యతో పాటు గాల్‌బ్లాడర్‌లో, పాంక్రియాటిక్‌ నొప్పులు, ఆయనను తీవ్రంగా బాధిస్తున్నాయి. ప్రాసై్టట్‌ సమస్య వల్ల మూత్ర విసర్జన కూడా కష్ట సాధ్యం అవుతోందని చెప్పారు. ఒకనెల జైలు జీవితంలో మూడుసార్లు తీవ్రమైన పాంక్రియాటిక్‌ నొప్పి వచ్చింది. వైద్యుల సలహా మేరకు ప్రతి రోజు ఆయన గుండె సంబంధమైన పాంక్రియా టిక్‌ నొప్పికి సంబంధించిన మందులు వాడాలని సూచిం చినప్పటికీ ఆ మందులను ఇంత వరకు ఆయనకు అందించలేదు. ఇంత అనారోగ్యం కారణంగా ఆయన జైల్లో ఇచ్చే ఆహారాన్ని తీసుకోలేక పోతున్నారు.

బయట జరుగుతున్న ఘట నలకు సంబం«ధించిన వార్తలను చదివే, చూసే అవ కాశాన్ని ఇవ్వడం లేదు. అరుదుగా పత్రికలు ఇచ్చి నప్పటికీ ఉద్యమ వార్తలను కత్తిరించి ఇస్తున్నారు. నేను స్వయంగా రాసిన ఉత్తరాలను కూడా ఆయనకు అందించడం లేదు. రాజ్యం సాయిబాబా జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టింది. తక్షణమే ఆయనను ఢిల్లీ జైలుకి తరలించాలి. లేదా హైదరాబాద్‌కి తరలించి సరైన వైద్యం అందించాలి.’’

‘‘చేతులకు చెప్పులేసుకొని సైకిల్‌ మీద వెళ్తుంటే ఆశ్చర్యంగా చూసేదాన్ని. 15 ఏళ్ళప్పుడేర్పడిన మా పరిచయం ప్రేమగా ఎదిగి సమానత్వం దిశగా ఎదు గుతున్న క్రమంలో ఈ సమాజంలో ఆదివాసీలపై, దళితులపై, స్త్రీలపై, మైనారిటీలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అవే చెప్పులు తొడిగిన చేతుల్తో ఎన్నో వేదికలెక్కారు సాయిబాబా. ఈ సమాజం మార్పుకోసం ఎంతో తపించారు. అడవి బిడ్డల హక్కుల గురించి మాట్లాడారు. దళితులపై అకృత్యాల గురించి గొంతెత్తి నినదించాడు. పౌరు లను రక్షించాల్సిన రాజ్యమే వారి సర్వహక్కులనూ హరించి వేస్తుంటే చూస్తూ ఊరుకోకుండా ఉండడమే ఆయన చేసిన నేరమయ్యింది. ‘‘90 శాతం వైక ల్యంతో ఉన్నా ఆయనపట్ల ఉదారంగా వ్యవహరిం చలేం. ఆయన మేధోపరంగా గొప్పవాడు. నిషేధిత మావోయిస్టు్ట పార్టీకి సలహాదారుడు. కాబట్టి ఆయన కీశిక్ష సరిపోదు అంటూ గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు ఆయనకి కఠిన శిక్షను విధించింది. ఇదెక్కడి న్యాయం?’’ అని ఈ నెల మూడవ తేదీన హైదరా బాద్‌లో జరిగిన సాయిబాబా, తదితరుల విడుదల సభలో మాట్లాడాను.

ప్రొఫెసర్‌ సాయిబాబా, ప్రశాంత్‌ రాహి (జర్న లిస్ట్‌), హేమ్‌ మిశ్రా (జెఎన్‌యులో పరిశోధక విద్యార్థి), పాండు నరోత్, మహేశ్‌ టిర్కిలకు జీవిత శిక్ష వేసింది. వీరితో పాటు విజయ్‌ టిర్కికి 10 సంవ త్సరాల జైలు శిక్షను విధించింది, భారతదేశంపై యుద్ధం చేయడానికి కుట్ర పన్నారనీ, నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయనీ, వీరి పైన మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ. మరో మనిషి సాయం లేకుండా కదల్లేని మనిషి ఏ ప్రభుత్వాన్ని కూల్చడానికైనా చేసే కుట్ర ఏముంటుంది?

సాయిబాబాని ఇంటినుంచి ఓ ఇసుకబస్తాని విసిరేసినట్టు పోలీసు వాహనంలో విసిరేస్తే వీల్‌ చైర్‌ విరిగిపోయింది. ఆ విరిగిపోయిన కుర్చీలో కదల్లేని స్థితిలో 72 గంటల పాటు పోలీసులు బంధించి తీసుకెళ్ళారు. మధ్యలో మూత్ర విసర్జన అత్యవసరమని చెప్పినా అనుమతించకుండా అత్యంత అమానవీయంగా పోలీసులు వ్యవహ రించారు. సాయిబాబాకి మందులివ్వ కుండా, కనీసం కదలనైనా లేని వ్యక్తిని అత్యంత వేడిగా ఉండే నరకప్రాయ మైన అండాసెల్‌లో ఉంచడం ద్వారా ఈ ప్రభుత్వం ఏం సాధించదల్చుకుందో అర్థం కాదని మేధావులు వాదిస్తున్నారు. ‘‘అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కలిసే అవకాశాన్ని సైతం ఇవ్వకుండా నన్నూ, నా కుమార్తెను వే«ధిస్తున్న స్థితి తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. ఉదయం ములాఖత్‌కి పెట్టు కుంటే సాయంత్రం 5గంటల 45 నిముషాలకు లోప లికి పిలుస్తారు. అది కూడా జాలీ ములాఖత్‌. మధ్యలో గ్లాస్, ఆ తర్వాత జాలీ. అంత దూరంలో ఆయన్ను కూర్చోబెడతారు.

తను నించుంటే తప్ప నేను చూడలేను. కానీ తను నించోలేడు. మూడు చక్రాల బండిలో తను, అంత దూరంలో నేను. కనీసం మాట్లాడింది వినిపించదు. ఎలాగోలా ఆయన్ను దూరం నుంచి చూసే ప్రయత్నంలో ఉండగానే  6 గంటలకు టకటకమని కొట్టుకుంటూ వచ్చి టైం అయిపోయిందని తరిమేస్తారు’’. సాయి బాబా విడుదల కోసం ప్రపంచ దేశాల నుంచి 20,000 ఉత్తరాలొచ్చాయని ప్రభుత్వమే చెప్పింది.  ఆమ్నెస్టీ ఇంటర్‌నేషనల్‌తో సహా ప్రపంచ మేధావు లంతా సాయిబాబా విడుదలను కోరుతున్నారు. ప్రభుత్వం సాయిబాబాపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకొని, ఆయన్ను, అయనతో పాటు అరెస్టయిన వారందరినీ విడుదల చేయాలి. ఇది ప్రజాస్వామికవాదుల డిమాండ్‌ కూడా.
-వసంత, ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా సహచరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement