తిండిమీద ప్రభుత్వ పెత్తనమేమిటి? | why govt intrrupt about beef meat ? | Sakshi
Sakshi News home page

తిండిమీద ప్రభుత్వ పెత్తనమేమిటి?

Published Mon, Oct 12 2015 1:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

why govt intrrupt about beef meat ?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి, పేదరికం వంటి మౌలిక సమస్యలను పట్టించుకోకుండా అనవసరమైన సమస్యలు సృష్టిస్తూ ప్రజల్లో చీలికలు తేవటంలో మునిగి తేలుతోంది. ఏమి తినాలి, ఏ దుస్తులు ధరించాలి, ఎవరిని ప్రేమించాలి తదితర విషయాల్లో బీజేపీ, దాని యజమానులు యథేచ్ఛగా జోక్యం చేసుకుంటున్నారు. గతంలో గొడ్డు మాంసాన్ని నిషేధించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అన్ని రకాల మాంసాన్ని నిషేధించింది.
 
 మహారాష్ట్ర బాటలోనే రాజస్తాన్, గుజరాత్, హరియానా మరియు ఛత్తీస్‌గఢ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రా ల్లోనూ మాంసం విక్రయాలను నిషేధించారు. మాంస విక్రయదారుల నుం డి, మాంసాహారుల నుండి దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు కశ్మీర్‌లో కోర్టు జోక్యంతో జంతువధశాలలు మూసివేయాల్సి రావడంతో మాంసాహారుల ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి.
 
 మొత్తం మీద ఈ ఉదంతంతో కొన్ని విషయాలు చర్చనీయాంశమైనవి. పౌ రుల ఆహారం విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చా? కొన్ని ఆహార పదా ర్థాలపైన నిషేధం విధించే అధికారం ప్రభుత్వానికి ఉందా? అలా చేస్తే అది రా జ్యాంగ అధికరణ 21ని ఉల్లంఘించినట్లే అవుతుందని 2008లోనే సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకోవచ్చని న్యాయకోవిదులు చెబుతున్నారు.
 
 ఆల్కహాల్, జంక్‌ఫుడ్స్‌పైన ఆంక్షలు విధిస్తే ప్రజలు అర్థం చేసుకున్నారు. మాంసాహారం ఆరోగ్యానికి హానిక రమని ఎవరూ చెప్పలేదే? పైగా అది పుష్టికరమైందనీ గొడ్డు మాంసంలో ప్రొటీన్ లు పుష్కలంగా ఉంటాయని న్యూట్రిషన్ నిపుణులు చెప్పారు. కూరగాయల్లో కంటే కోడిగుడ్డులో పోషక విలువలు ఎక్కువ ఉంటాయనే విషయాన్ని ఇటీవల మధ్యప్రదేశ్‌లో బడిపిల్లల మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును నిషేధించిన సం దర్భంలో కొన్ని జాతీయ పత్రికలు వెలుగెత్తి చాటాయి.
 
 కనుక మాంసాహారాన్ని నిషేధించడం అనేది ప్రజల ఆరోగ్యం కోసం కాదు, అత్యధిక ప్రజల (భారతదేశంలో 70 శాతం మంది మాంసాహారులు, అందులో అన్ని మతాల వారూ ఉన్నారు) తిండి మీద ఆంక్షలు విధించడం మత దుర హంకారం కాదా? పౌరుల ఇష్టాయిష్టాల్లో, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసు కోవడం బీజేపీ ప్రభుత్వాల అహంకారానికి, మతాధిపత్యానికి నిదర్శనం. ఇష్టమైన తిండి తినే స్వేచ్ఛ కూడా బీజేపీ పాలనలో ఉండదన్నమాట!  
 
 మాంసాహారాన్ని ఒక్కరోజు నిషేధించినా వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లే. ఈ పోకడ ఇలాగే పోతుంటే క్రమంగా శాఖాహారులు, మాంసాహారుల మధ్యన ఘర్షణలు పెరిగే ప్రమాదముంది. దళిత, గిరిజనులు, ముస్లిం మైనార్టీలతో పాటు అన్ని కులాల్లోని పేదలకు చౌకగా లభించే మాంసాహారం కూడా దక్కకుండాపోతుంది. ముందుముందు ప్రతి హిందూ పండుగ నాడు కూడా మాంసాహారంపై నిషేధం విధించే ప్రమాదం ఉంది. ఇది ఎంత ప్రమాదాన్ని, సంక్షోభాన్ని కొనితెస్తోందో దాద్రిలో ముస్లింని కొట్టి చంపిన ఘటన స్పష్టం చేస్తోంది. ఈ విపరిణామాలను ప్రజలందరూ ఐక్యంగా ఎదిరించాలి.
 - నాగటి నారాయణ  ప్రధాన కార్యదర్శి, టీపీఈఆర్‌ఎం. 9490300577

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement