
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి కటాఫ్ ఏరియాలోని డిగిజాన్‌బాయి, పెపర్‌మెట్ల, తదితర గ్రామాల్లో సీపీఐ మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లోని గ్రామాల్లో గురు, శుక్రవారాల్లో దినోత్సవం జరుపుకున్నారు. పలుచోట్ల మావోల బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. ఆదివాసీలను చైతన్యం చేసేందుకు గ్రామాల్లో జననాట్య మండలి వారిచే గీతాలు ఆలపించే కార్యక్రమాలు మావోలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు అవగాహన కల్పించేందుకు సభలు ఏర్పాటు చేస్తున్నారు. మావో అగ్రనేతలు మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో దళారి, దోపిడీ వ్యవస్థలు ఉండకూడదన్నారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, వారికి తగిన బుద్ధి చెప్పాలని చూసించారు. కొండ ప్రాంతాల్లో ఖనిజ సంపదలు దోచుకునేందుకు ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని, ఇటువైపు కన్నెత్తి చూడకుండా మిగతా గిరిజనులు ఆందోళనలు చేపట్టాలని కోరారు. కొండలను, అడవులను నాశనం చేస్తే ఆదివాసీల జీవనం దుర్భరంగా మారుతాయని ఆవేదన చెందారు.
అలాగే మావోలను ఆణచివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జవాన్లతో ముమ్మరంగా కూంబింగ్‌లు జరుపుతున్నాయని తెలిపారు. సుమారు 8 వేల మంది బీఎస్‌ఎఫ్ జవాన్లు, సీఆర్‌పీఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారన్నారు. వీరికి పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపడుతున్నారని, కాని గిరిజనులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వాపోయారు. అధిక ఆదివాసీ గ్రామాలకు రోడ్డు సదుపాయం లేకపోవడం దారుణమన్నారు. తాగునీటి సదుపాయం అంతంతమాత్రమేనని, మురుగుకాలువలు పూర్తిగా లేవని పేర్కొన్నారు. రోడ్లు, విద్య, ఆరోగ్యం, తాగునీరు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాని చెప్పారు. కొండకోనల్లో గిరిజనులు దుర్భర జీవనం సాగిస్తున్నారని, కూంబింగ్‌కు వచ్చిన జవాన్లు ఆదివాసీలపై దాడులు చేస్తున్నారని ఆవేదన చెందారు. పలువురిని మావో ఇన్‌ఫార్మర్లుగా చేసి హతమార్చుతున్నారని ఆరోపించారు. జవాన్ల చర్యలను గిరిజనులు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విప్లవం వర్థిల్లాలని, దోపిడీ అరికట్టాలని కోరారు. మల్కన్‌గిరి జిల్లాలో వేలమంది జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నా మావోలు తమ ఉనికిని చాటుకుంటున్నారని మావో అగ్రనేతలు తెలిపారు. ఈ సభలకు మావోయిస్టు అగ్రనేతలు ఉదయ్, తదితరులు పాల్గొన్నారు. సభల్లో అధిక సంఖ్యలో గిరిజనులు, మావో చిన్న కేడర్ పాల్గొన్నారు.