
జయపురం : ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కాకితో కబురంపితే చాలు.. వచ్చి ఆదుకుంటానని మాట ఇచ్చిన ఎమ్మెల్యే అదే మాటపై నిలబడ్డారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని 5 కి.మీ. దూరం జోలీలో మోసుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చి మానవత్వాన్ని, తన బాధ్యతను చాటుకున్నారు. ఒడిశా రాష్ట్రం నవరంగపూర్ జిల్లా పపడహండి సమితి కుసుముగుడకు చెందిన జెమ బెహర నిండు గర్భిణి. ఆమె సోమవారం ఉదయం నుంచి పురిటి నొప్పులతో బాధపడుతోంది. అయితే ఆ గ్రామానికి రహదారి లేనందున అంబులెన్స్ రాలేని పరిస్థితి. ఈ విషయం తెలిసిన డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన జోలీలో గర్భిణిని ఉంచి వారితో పాటు జోలీని మోసుకుంటూ తీసుకెళ్లి ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. తమ కోసం దిగొచ్చి జోలీ మోసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment