ప్రసంగిస్తున్న అంగజాల రామకృష్ణ
జయపురం: తెలుగు కార్టూన్ జయపురంలో జన్మించిందని గర్వంగా చెప్పుకుంటున్నామని పలువురు వక్తలు ఆనందం వ్యక్తం చేశారు. జయపురంలో జన్మించిన తలిశెట్టి రామారావు కార్టూన్‌కు శ్రీకారం చుట్టి వ్యంగ్య చిత్ర శకానికి ఆద్యులయ్యారని పలువురు వక్తలు కొనియాడారు.
తలిశెట్టి రామారావు 122వ జయంతి సందర్భంగా ఆదివారం రాత్రి స్థానిక 180 డిగ్రీ సభాగృహంలో భారతి సాహిత్యవేదిక జయపురం వారు నిర్వహించిన కార్యక్రమంలో పలువురు వక్తలు వ్యంగ్య చిత్ర పితామహుడు తలిశెట్టి రామారావు ప్రతిభను కొనియాడారు.
ఆయన పాలనా దక్షునిగా, సాహితీ వేత్తగా, రచయితగా, న్యాయవాదిగా, చిత్రకారునిగా, వ్యంగ్య చిత్ర పితామహునిగా సమాజానికి అనేక సేవలు అందించడమే కాకుండా తెలుగు వ్యంగ్య చిత్రాలను సమాజానికి అందించిన మహానీయుడు అని పలువురు వక్తలు పేర్కొన్నారు.
వచ్చే ఏడాది నుంచి పోటీలు
ఈ సందర్భగా ప్రతి ఏడాదీ వ్యంగ్య చిత్ర దినోత్సవం రోజున వ్యంగ్య చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించాలని కొంతమంది సూచించగా సభికులు హర్షధ్వానాలతో మద్దతు పలికారు. వచ్చే ఏడాది నుంచి వ్యంగ్య చిత్రకళా ప్రదర్శన నిర్వహించాలని, అలాగే వ్యంగ్య చిత్ర పోటీలు నిర్వహించి ఉత్తమ చిత్రకారులను సన్మానించి ప్రోత్సహించాలని కొంతమంది సూచించగా నిర్వాహకులు అంగీకారం తెలిపారు.
హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన తెలుగు వ్యంగ్య చిత్ర దినోత్సవంలో జయపురం నివాసి ఆరిశెట్టి సుధాకర్‌కు సన్మానం అందుకున్న సందర్బంగా సభికులు ఆనందం వ్యక్తం చేస్తూ సుధాకర్‌కు అభినందనలు తెలిపారు.
భారతి సాహిత్య వేదిక నిర్వాహకుడు కె.వి.రమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కవి తాజుద్దీన్, కార్యక్రమ నిర్వహణకు కారకుడైన అంగజాల రామకృష్ణ, సీనియర్ పాత్రికేయుడు వి.భాస్కర రావు, ఉపాధ్యాయుడు మౌళి, కె.నాగేశ్వర రెడ్డి, పి.రోజా తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment