
సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. గతం కంటే భిన్నంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతంలో సహకార సంఘం అధికారులే ఎన్నికలు నిర్వహించేవారు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పీఏసీఎస్‌లకు లేఖ రాసినట్టు డీసీవో చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు.
ఎలక్షన్ అథారిటీ ఏర్పాటు...
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు స్టేట్ కో–ఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. జిల్లాలో 20 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వాటిలో సుమారు 42, 530 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మృతి చెందిన వారు, అప్పులు చెల్లించనని వారు, భూములు అమ్మకాలు చేసినవారు వారి ఓట్లు తొలగించగా 32, 420 మంది ఉన్నారని జిల్లా సహకార అధికారి సీహెచ్. చంద్రప్రకాశ్‌రెడ్డి తెలిపారు.
ముగిసిన పదవీకాలం.
2013 ఫిబ్రవరి 4న సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈనెల 4తో సంఘాల ప్రజాప్రతినిధులు పదవీ కాలం ముగిసింది. పీఏసీఎస్ చైర్మన్లు పర్సన్ ఇన్‌చార్జీలుగా వ్యవహరించనున్నట్లు డీసీవో ప్రకటించారు.
20 పీఏసీఎస్‌లు
జిల్లాలో పెద్దపల్లి, అప్పన్నపేట, కూనారం, శ్రీరాంపూర్, పొత్కపల్లి, పత్తిపాక, నందిమేడారం, సుల్తానాబాద్, సుద్దాల, కనుకుల చిన్నకల్వల, గర్రెపల్లి, ఎలిగేడ్, ధూళికట్ట, జూలపల్లి, మేడిపల్లి, మంథని, ముత్తారం, కమాన్‌పూర్, కన్నాల, పీఏసీఎస్‌లు ఉన్నాయి.
ఆధార్ తప్పనిసరి
వ్యవసాయ పట్టాదారునితో పాటు ఓటర్లుగా నమోదు చేసుకున్న వారందరూ పీఏసీఎస్‌లలో ఆధార్‌కార్డుతో పాటు రెండు పాస్ ఫొటోలను జతచేసి ఎన్నికల అధికారికి అందేలా ఈనెల 20లోగా సంఘాల సీఈవోలు ఎన్నికల కార్యాలయంలో అందజేయాలని ఆదిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పీఏసీఎస్ సీఈవోలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
21వ తేదీలోపు జాబితా సమర్పించాలి
ఈ నెల 21వ తేదీలోపు ఓటర్ల జాబితా రాష్ట్ర ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉందని డీసీవో తెలిపారు. జాబితాను సిద్ధం చేసి సంబంధిత డీసీవోలకు ఆయా పీఏసీఎస్‌ల సీఈవోలు అప్పగించాలని ఉత్తర్వులు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment