
మృతుడు రాజు
మల్యాల(చొప్పదండి): నడుస్తున్న ట్రాక్టర్ పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి బాలుడు మృతిచెందిన ఘటన మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అట్ల అంజవ్వ, నారాయణరెడ్డి దంపతులు కూలీపని చేస్తుంటారు. వీరికి ఒక్కగానొక్క కొడుకు రాజు(15) ఉన్నాడు. ఐదోతరగతి వరకు చదివిన రాజు ట్రాక్టర్‌పై కూలీపనికి వెళ్తుండేవాడు. గురువారం ఉదయం ట్రాక్టర్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించేలోపు మార్గంమధ్యలో మృతిచెందాడు.
మానవత్వం చూపిన సైనికుడు..
రాజు గాయపడడం చూసిన స్థానికులు ఆస్పత్రికి తరలించేందుకు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ఆర్మీసైనికుడు దూడ తిరుపతి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. మల్యాల వ్యవసాయ మార్కెట్ సమీపంలోకి చేరుకోగా, అక్కడి నుంచి 108లోకి తరలించారు. రాజు అప్పటికే మృతిచెందాడని సిబ్బంది నిర్ధారించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లి అంజవ్వ రాజు మృతదేహంపై పడి ఏడ్చిన తీరు అందరినీ కలచివేసింది. తల్లి అంజవ్వ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదుచేసినట్లు ఎస్సై నీలం రవి తెలిపారు.