కోల్‌కతా: కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ ‘ఆపరేషన్ ఆకర్ష’కు పదునుపెట్టింది. ప్రత్యర్థి పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు మొదలుకొని సీనియర్ నేతలు, చిన్నాచితక నాయకుల్ని సైతం కమలం గూటికి రప్పించుకుంటోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీలోకి జోరుగా వలసలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక, పక్కన ఉన్న కర్ణాటకలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. 15మంది రెబెల్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని.. రాజీనామా అస్త్రలతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారుకు కమల దళం ఎసరు తెచ్చింది. అటు గోవాలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలాన్ని విసిరి.. ఆ పార్టీ శాసనసభాపక్షాన్ని తమలో విలీనంచేసుకొని.. నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీజేపీ మంత్రి పదవులు ఇచ్చింది.
ఇక, త్వరలో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోనూ ‘ఆపరేషన్ ఆకర్ష’ను ముమ్మరం చేసి.. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిర పరచాలన్నది కమలనాథుల వ్యూహమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా లోటస్ పార్టీ ‘ఆపరేషన్ ఆకర్ష’ ఏ ఒక్క రాష్ట్రానికీ పరిమితం కావడం లేదు. బెంగాల్‌లోనూ ఇది ముమ్మరంగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తోపాటు సీపీఎం ఎమ్మెల్యేలు పలువురు కమలం గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత పెద్దసంఖ్యలో టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు కూడా.. ఈ నేపథ్యంలో బీజేపీ బెంగాల్ సీనియర్ నేత ముకుల్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో త్వరలో ఏకంగా 107 మంది ఎమ్మెల్యేలు చేరబోతున్నారని బాంబ్ పేల్చారు.
సీపీఎం, కాంగ్రెస్, టీఎంసీకి చెందిన 107మంది ఎమ్మెల్యేలు కమలం కండువా కప్పుకోనున్నారని, ప్రస్తుతం వీరి జాబితా సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ఈ చేరికలు ఉంటాయని ముకుల్ రాయ్ శనివారం కోల్‌కతాలో మీడియాతో తెలిపారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో ఏకంగా 17 ఎంపీ స్థానాలు గెలుపొంది.. బీజేపీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ కంచుకోటల్ని బద్దలుకొడుతూ.. గణనీయమైనరీతిలో బీజేపీ అక్కడ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరింత గట్టి సవాలు విసిరేందుకు పెద్ద ఎత్తున ఆ పార్టీ వలసల్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది.
బాంబ్ పేల్చిన సీనియర్ నేత.. 107మంది ఎమ్మెల్యేలు జంప్!
Published Sat, Jul 13 2019 6:17 PM | Last Updated on Sat, Jul 13 2019 8:01 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment