
కోల్‌కతా: ఇటీవలే అధికార తృణమూల్ కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చిన ముకుల్ రాయ్ తన ఎమ్మెల్యే పదవికి తక్షణం రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత సువేందు అధికారి (బీజేపీ) సోమవారం డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా రాజీనామా చేయకపోతే ముకుల్ రాయ్‌పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. నాలుగేళ్ల కిందట తృణమూల్‌ను వీడి... బీజేపీలో చేరిన సీనియర్ నేత ముకుల్ రాయ్ కమలం పార్టీలో జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తన సీనియారిటీని పట్టించుకోకుండా ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన సువేందుకు ప్రతిపక్ష నేత పదవిని కట్టబెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. దాంతో కొద్దిరోజుల కిందట తృణమూల్ కాంగ్రెస్‌లోకి తిరిగివచ్చారు.
అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ టికెట్‌పై ఉత్తర క్రిష్ణానగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ‘ఉత్తర క్రిష్ణానగర్ ఎమ్మెల్యే ఇటీవలే పార్టీ మారారు. ఆయన 24 గంటల్లోగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే బుధవారం స్పీకర్‌కు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేస్తాం’ అని ముకుల్ రాయ్ పేరు ఎత్తకుండానే సువేందు అన్నారు. కాగా మరోవైపు సువేందు నేతృత్వంలో 50 మంది పైచిలుకు ఎమ్మెల్యేలు సోమవారం రాజ్‌భవన్‌లో బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌ను కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, అరాచకం రాజ్యమేలుతోందని బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మహిళలపై దాడులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. దాడులు జరగొచ్చనే భయంతో 17 వేల మంది బీజేపీ కార్యకర్తలు ఇళ్లు విడిచి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారని సువేందు అన్నారు.
చదవండి: సువేందు అధికారి ఢిల్లీ పర్యటన.. కారణం ఇదేనా!