
చెన్నై : ఓవైపు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని నేతలు, ఇతర రంగాల సెలబ్రిటీలు వీలు చిక్కినప్పుడు పరామర్శిస్తున్నారు. మరోవైపు తమ అభిమాన నేత కరుణ ఇంకా కోలుకోలేదన్న దిగులుతో చనిపోతున్న డీఎంకే కార్యకర్తల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడం పార్టీ వర్గాలను కలవరపరుస్తోంది. తన తండ్రి ఇంకా కోలుకోలేదన్న బాధతో మృతిచెందిన డీఎంకే అభిమానుల సంఖ్య బుధవారం నాటికి 21కి చేరుకుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్షనేత స్టాలిన్ తెలిపారు.
డీఎంకే మద్దతుదారులు, అభిమానుల మృతి తనను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన తండ్రి కరుణ త్వరలోనే కోలుకుంటారని.. ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. చనిపోతున్న అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరిగి పోవడం తనను మరింతగా బాధిస్తోందని స్టాలిన్ పేర్కొన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని కూడా సూచించారు. కరుణ కోలుకోవాలంటూ కొందరు డీఎంకే కార్యకర్తలు అనేకచోట్ల ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో విజయ్, తదితరులు కరుణానిధిని పరామర్శించిన వారిలో ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి కొద్దిరోజులుగా చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వృద్ధాప్య రుగ్మతలతో సతమతం అవుతున్న కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించడంతో గతనెల 28న ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment