
న్యూఢిల్లీ : నర్మదా నది తీరం చుట్టూ దాదాపు ఆరు నెలలపాటు ప్రయాణించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వచ్చే శనివారం నుంచి ఆయన తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి పెట్టుకున్నారు. తనకు ఒక మొబైల్ టాయిలెట్‌ను, అదనపు భద్రతను, అంబులెన్స్‌ను ఇవ్వాలని కోరారు. అయితే, అంబులెన్స్, భద్రతను ఇచ్చేందుకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంగీకరించారు.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల తన యాత్ర గురించి దిగ్విజయ్ మాట్లాడుతూ తన యాత్రలో 'కాంగ్రెస్ జెండాలు, పోస్టర్లు, బ్యానర్లు, నినాదాలు ఉండవని స్పష్టం చేశారు. నర్మద పరిక్రమ పేరిట తాను పాదయాత్ర నిర్వహించాలని 1998లో ఒకసారి నర్మదా నది ఒడ్డు నుంచి అనుకున్నానని చెప్పారు. ఈ పాదయాత్ర ద్వారా దాదాపు 230 అసెంబ్లీ నియోజవర్గాల్లో దిగ్విజయ్ పర్యటించనున్నారు. ఇది పార్టీ అజెండా కాదని, తాను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. మొత్తం 3,400కిలో మీటర్లు ఆయన యాత్ర చేయనున్నారు.