mobile toilets
-
మొబైల్ షీ టాయిలెట్లపై పర్యవేక్షణ
హైదరాబాద్: గ్రేటర్ అంతటా మొబైల్ షీ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని, అలాగే ఆయా వాహనాలు ఉన్న స్థానం, నిర్వహణ సేవల పర్యవేక్షణ కోసం వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించాలని సేఫ్ సిటీ ప్రాజెక్ట్ బృందం నిర్ణయించింది. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ నోడల్ అధికారి, హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన శనివారం టీఎస్పీఐసీసీసీలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఉమెన్ సేఫ్టీ అదనపు డీజీ శిఖా గోయల్, రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ట్రై కమిషనర్లలో కొత్త భరోసా కేంద్రాల ఏర్పాటుపై సమీక్షించారు. అలాగే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపర్మెంట్ ఆఫ్ ఉమెన్ (సీడీఈడబ్ల్యూ), పెలికాన్ సిగ్నళ్లు, సీసీటీవీ కెమెరాలతో సహా సేఫ్టీ సిటీ ప్రాజెక్ట్‌లోని పలు అంశాలపై చర్చించారు. -
సిద్దిపేటలో షీ మొబైల్ టాయిలెట్
సాక్షి, సిద్దిపేట: సభలు, సమావేశాలు జరిగే చోట, రద్దీగా ఉండే ప్రాంతాల్లో మరుగుదొడ్డి సౌకర్యంలేక మహిళలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సిద్దిపేట మున్సిపాలిటీ షీ బయో మొబైల్ టాయిలెట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రూ.20 లక్షల వ్యయంతో ఈ మొబైల్ టాయిలెట్ బస్‌ను రూపొందించారు. ఈ బస్‌ను నాలుగు విభాగాలుగా విభజించారు. ఇందులో తల్లులు పిల్లలకు పాలిచ్చేందుకు వీలుగా ప్రత్యేక గదిని సైతం ఏర్పా టు చేశారు. బస్‌లో నాలుగు టాయిలెట్లు, వెయిటింగ్ కోసం కుర్చీలు ఉంటాయి. త్వరలోనే ఈ బస్‌ను ప్రారంభించనున్నారు. -
మొబైల్ టాయిలెట్లు.. మొదటిసారిగా ట్రాన్స్‌జెండర్లకూ సౌకర్యం
సాక్షి, బంజారాహిల్స్: నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు రద్దీ ప్రాంతాల్లో టాయిలెట్లు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అందుబాటులో టాయిలెట్లు లేకపోవడంతో పాటు పిల్లలకు పాలు ఇచ్చే సందర్శకులు, రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్లే వారు పడుతున్న ఇబ్బందులు గమనించిన జీహెచ్ఎంసీ మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా నెక్లెస్ రోడ్లో మొబైల్ టాయిలెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల నెక్లెస్ రోడ్‌కు వచ్చే వేలాది మంది పర్యాటకులతో పాటు ఇక్కడ వ్యాపారాలు కొనసాగించే మహిళలకు ఎంతగానో ఉపయోగం చేకూరనుంది. ఇప్పటి వరకు టాయిలెట్లు అందుబాటులో లేకపోవడంతో పడుతున్న ఇబ్బందులకు ఈ నిర్ణయంతో తెరపడినట్లైంది. ►నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్సులను మొబైల్ టాయిలెట్లుగా మార్చారు. ►నగరంలోని ఏడు ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ►వీటిలో ప్రత్యేకంగా స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ►మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్లకు కూడా ఈ మొబైల్ టాయిలెట్లలో సౌకర్యం కల్పించారు. ►ఇప్పటికే 30 మొబైల్ టాయిలెట్లు నగర వ్యాప్తంగా అందుబాటులో ఉండగా... ఖైరతాబాద్ జోన్‌కు కొత్తగా మరో ఐదు మొబైల్ టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారు. ►రద్దీ ప్రాంతాలు, సభలు, సమావేశాలు జరుగుతున్న ప్రాంతాల్లో, సందర్శనా స్థలాల్లో, పర్యాటక ప్రాంతాల్లో, పార్కుల వద్ద ఈ మొబైల్ టాయిలెట్లను ఉపయోగిస్తారు. ►వీటిలో మహిళలకు రెండు, పురుషులకు ఒకటి, ట్రాన్స్‌జెండర్స్‌కు ఒకటి చొప్పున నాలుగు యూరినల్స్‌ను ఏర్పాటు చేశారు. ►ఇక పాలిచ్చే మహిళలకు ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ►ఈ మొబైల్ టాయిలెట్ వెనుకాల స్నాక్స్, కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిల్స్ విక్రయానికి గాను ఒక షాపును ఏర్పాటు చేశారు. ►సోలార్ పవర్ విధానం కల్పించిన ఈ మొబైల్ టాయిలెట్ నిర్వహణను ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చారు. ►ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇవ్వడం ద్వారా ఈ మొబైల్ టాయిలెట్ ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ►నిరుపయోగ ఆర్టీసీ బస్సులను మొబైల్ టాయిలెట్లుగా రూపొందించిన నేపథ్యంలో ఇక్కడ విజయవంతమైతే మరిన్ని బస్సులను మొబైల్ టాయిలెట్లుగా తయారు చేయనున్నారు. ►బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజ గుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, లక్డీకాపూల్, రవీంద్రభారతి తదితర ప్రాంత్లాలో కూడా నిరుపయోగ ఆర్టీసీ బస్సులను మొబైల్ టాయిలెట్లుగా మార్చే దిశలో కసరత్తు జరుగుతుంది. ఇందు కోసం ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ►ఈ మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు హర్షణీయమని మహిళలు అంటున్నారు. ►మరిన్ని చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చదవండి: God Of Mischief: లోకి గురించి మీకు ఈ విషయాలు తెలుసా! -
సంచార బయో టాయిలెట్లుగా ఆర్టీసీ పాత బస్సులు
సాక్షి, హైదరాబాద్ : ప్రయాణికుల సేవలో అలసి మూలపడిపోయిన పాత బస్సులు ఇక కొత్త అవతారమెత్తనున్నాయి. పట్టణాల్లో జనసమ్మర్థం ఉండే ప్రాంతాల్లో సంచార బయో టాయిలెట్లుగా మారబోతున్నాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో కొన్ని ప్రారంభించగా.. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ ప్రాంగణంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఈ సంచార బయో టాయిలెట్లను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో పురపాలక శాఖ వీటిని ఏర్పాటు చేయబోతోంది. ఆర్టీసీ వద్ద నిరుపయోగంగా ఉన్న పాత బస్సులను బయో టాయిలెట్లుగా మార్చి అన్ని పట్టణాల్లో అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. పట్టణాల్లోని బహిరంగ ప్రాంతాల్లో టాయిలెట్లు లేక జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు చాలా అవస్థ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం సమయంలో ఈ అంశంపై మంత్రి కేటీఆర్ దృష్టి సారించారు. దేశంలోని కొన్ని ఇతర పట్టణాల్లో పాత బస్సులను సంచార శౌచాలయాలుగా మార్చి వినియోగిస్తున్న విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ వద్ద పాత బస్సులు ఉండటంతో వాటిని ఇలా వినియోగించవచ్చని నిర్ణయించి అధికారులతో చర్చించారు. దాదాపు 700 బస్సుల వరకు సిద్ధంగా ఉన్నాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. నగరంలోని కొన్ని ముఖ్య ప్రాంతాల్లో విధుల్లో ఉండే ఆర్టీసీ మహిళా సిబ్బంది కోసం ఛేంజ్ ఓవర్ గదులుగా పాత బస్సులను వాడాలన్న నిర్ణయాన్ని ఆర్టీసీ తీసుకుంది. ప్రయోగాత్మకంగా కొన్నింటిని రూపొందించి అందుబాటులోకి తెచ్చింది. అదే తరహాలో ఇప్పుడు పాత బస్సులను సంచార మరుగుదొడ్లుగా మార్చారు. ఒక్కో బస్సులో నాలుగు టాయిలెట్లు.. ఒక్కో బస్సులో నాలుగు టాయిలెట్లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఇందులో ఒకటి ఇండియన్ మోడల్, మూడు వెస్ట్రన్ మోడల్ ఉంటాయి. పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఈ బయో టాయిలెట్లను త్వరలో రూపొందించబోతున్నారు. ఇప్పటికే నగరంలో ఆర్టీసీ సిబ్బంది కోసం రూపొందించిన సంచార శౌచాలయాలను చూసిన మంత్రి పువ్వాడ, అలాంటివి ఖమ్మంలో ఏర్పాటు చేయా లని నిర్ణయించి అధికారులను ఆదేశించారు. -
పోలీసు మహిళా సిబ్బంది కోసం మొబైల్ టాయిలెట్లు
సాక్షి, హైదరాబాద్: బందోబస్తు విధుల్లో ఉండే పోలీసు మహిళా సిబ్బంది కోసం ఆ శాఖ ప్రత్యేకంగా మొబైల్ రెస్ట్‌రూమ్స్, టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు మొదట 17 వాహనాలను సిద్ధం చేసింది. వీటిని ప్రస్తుతం మేడారం జాతర విధుల్లో ఉన్న పోలీసు మహిళా సిబ్బంది కోసం అందుబాటులో ఉంచబోతున్నారు. శుక్రవారం వీటిని హోంమంత్రి మహమూద్ అలీ జెండా ఊపి ప్రారంభించారు. త్వరలో వీటి సంఖ్యను 25కు పెంచుతామని, బందోబస్తు విధుల్లో ఉండే మహిళా సిబ్బందికి వీలుగా ఆయా ప్రాంతాల్లో ఉంచుతామని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ప్రత్యేకంగా ఇందుకు వాహనాలను సమకూర్చుకుని వాటిని మొబైల్ టాయిలెట్లుగా రూపొందించారు. -
నగరంలో త్వరలో మొబైల్ షీ టాయిలెట్స్
నగరంలో పబ్లిక్ టాయిలెట్ల వ్యవస్థ ఇప్పటికీ అస్తవ్యస్తంగానే ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులుఎదుర్కోక తప్పడం లేదు. ఇక మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారికి సంబంధించిన టాయిలెట్లు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేవు. దీంతో మహిళా ఉద్యోగులు, చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు, ఇతర ప్రాంతాల నుంచి సిటీకి వచ్చిన వారు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో మొబైల్ షీ టాయిలెట్స్ అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగర శివార్లలోని ఐటీ, ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే మహిళల సౌకర్యార్థం ‘మొబైల్ షీ టాయిలెట్’ను ఏర్పాటు చేసేందుకు జలగం అసోసియేట్స్ ముందుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనంపైఅత్యాధునిక హంగులతో మొబైల్ టాయిలెట్‌ను ఏర్పాటు చేసి..దీన్ని రద్దీ కూడళ్లలో ఉంచుతారు.అన్ని అనుమతులు లభిస్తే ఇవి కొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. పబ్లిక్ టాయిలెట్ల కొరత.. జీహెచ్ఎంసీ పరిధిలో పబ్లిక్ టాయిలెట్ల సమస్య వేధిస్తోంది. సులబ్ కాంప్లెక్స్‌లు, స్వచ్ఛ టాయిలెట్లలో నిర్వహణ లోపం కారణంగా అక్కడికి వెళ్లే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. షీ టాయిలెట్లు ఏర్పాటు చేసినా పనిచేయడం లేదని మహిళలు పేర్కొంటున్నారు. సరైన అవగాహనం లేకపోవడంతో మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, హోటళ్లలోని టాయిలెట్లకు వెళ్లలేకపోతున్నారు. లూ కేఫ్‌లు కొన్నిచోట్ల పెట్టినా అంతటా అందుబాటులో లేవు. వాటిలో కార్పొరేట్ లుక్ ఉండటంతో టాయిలెట్లోకి ఉచితంగా వెళ్లలేమనే భావన మహిళల్లో కలుగుతోంది. ఇలా పబ్లిక్ టాయిలెట్లు అక్కడక్కడా ఉన్నా అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. సుష్మా ఆలోచనతోనే.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన జలగం సుధీర్, సుష్మా కల్లెంపూడి దంపతులు అమెరికాలో ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్లుగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ‘సంపాదనకు విరామం.. సమాజానికి సహాయం’ అనే నినాదంతో ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్‌కు తిరిగి వచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పొల్యూషన్ తగ్గించేందుకు జలగం సుధీర్ గ్రీన్ ఎనర్జీ పేరిట ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రమోట్ చేసే ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో సుష్మాకు ఓ ఆలోచన తట్టింది. తాను చదువుకున్న రోజులతో పాటు ఉద్యోగం చేస్తున్నప్పుడు టాయిలెట్లు లేక హైదరాబాద్‌లో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మొబైల్ షీ టాయిలెట్ రూపకల్పన చేస్తే బాగుంటుందని ఆలోచనకు వచ్చారు. ఈ క్రమంలో జలగం అసోసియేట్ మొబైల్ షీ టాయిలెట్‌ను తయారు చేశారు. ఇప్పటికే కొన్నిచోట్ల డెమోలు కూడా ఇచ్చారు. జీహెచ్ఎంసీకి ప్రతిపాదన.. మొబైల్ షీ టాయిలెట్లను ప్రవేశపెట్టాలని జలగం అసోసియేట్ ఇటీవల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్‌ను సంప్రదించారు. మొబైల్ షీ టాయిలెట్ల ప్రతిపాదనను పరిశీలించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆయన సూచించారు. దీంతో జలగం అసోసియేట్స్ ప్రతినిధులు జీహెచ్ఎంసీ అధికారులను కలిశారు. జీహెచ్ఎంసీతోపాటు ఆర్టీఏ, పోలీసుల అనుమతులు ఇప్పించాలని, నీటిని నింపుకోవడం, వ్యర్థాలను వదిలే ఔట్లెట్లను కల్పించాలని కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,200 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారని, షీ టాయిలెట్‌ను వారు నిర్వహించేలా చర్యలు తీసుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రతిపాదించారు. ఈ క్రమంలో జలగం అసోసియేట్స్ ప్రతినిధులు వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరిని కలిశారు. మొబైల్ షీ టాయిలెట్ గురించి వివరించారు. ఒకట్రెండు నెలల్లో జీహెచ్ఎంసీ అధికారుల సమక్షంలో షీ టాయిలెట్ డెమో ఇవ్వనున్నామని వారు తెలిపారు. జీహెచ్ఎంసీ సానుకూలంగా స్పందిస్తే ఇక మొబైల్ షీ టాయిలెట్ కొద్దిరోజుల్లోనేఅందుబాటులోకి రానుంది. ప్రైవేట్ సంస్థలకు.. స్వచ్ఛ భారత్‌లో భాగంగా మొబైల్ షీ టాయిలెట్‌ను ప్రమోట్ చేయాలని జలగం అసోసియేట్ ఇప్పటికే ఎన్ఎండీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, వీ హబ్, ఇన్ఫోసిస్ సంస్థలను సంప్రదించింది. ఆర్డర్ ఇస్తే మొబైల్ షీ టాయిలెట్ తయారు చేస్తామనడంతో కంపెనీలు సానుకూలంగా స్పందించాయని జలగం అసోసియేట్స్ ప్రతినిధులు చెప్పారు. మొబైల్ షీ టాయిలెట్ ఇలా.. ♦ ఎలక్ట్రిక్ వెహికల్లో మొబైల్ షీ టాయిలెట్ఏర్పాటుకు దాదాపు రూ.10 లక్షలు ఖర్చు అవుతుంది. ♦ చైనా మాన్యుఫ్యాక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఖర్చుతగ్గే అవకాశం ఉంది. ♦ వాహనంపై 40 లీటర్ల కెపాసిటీ వాటర్ట్యాంక్ఉంటుంది. అడుగు భాగంలో 40 లీటర్ల కెపాసిటీ సెప్టిక్ ట్యాంకు ఉంటుంది. ♦ వాహనం లోపల వాష్బేసిన్తో పాటు టాయిలెట్ ఉంటుంది. ♦ వాష్ బేసిన్లో వాడిన నీళ్లు ఫ్లష్ ట్యాంక్‌లోకి వెళ్తాయి. ఆ నీటిని టాయిలెట్ ఫ్లష్‌కు వాడతారు. ♦ ప్రతి ఫ్లష్‌కు 4 లీటర్ల నీరు వాడాల్సి ఉంటుంది. వ్యాక్యూమ్ టెక్నాలజీతో కేవలం అర లీటరు నీరు మాత్రమే ఫ్లష్‌కు పోతుంది. ♦ మొబైల్ షీ టాయిలెట్ వద్ద శానిటరీ ప్యాడ్లతోపాటు మహిళలకు సంబంధించిన ఇతర వస్తువుల సేల్ కౌంటర్ ఏర్పాటు చేయవచ్చు. అనుభవం నుంచి ఆలోచన.. చదువుకున్నప్పుడు, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు పబ్లిక్ టాయిలెట్లు లేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అనుభవంలోంచే మొబైల్ షీ టాయిలెట్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. గతంలో తయారు చేసి డెమో ఇచ్చాం. మరిన్ని హంగులతో ఎల్బీ నగర్, సూర్యాపేటలో రెండు టాయిలెట్లను తయారు చేస్తున్నాం. జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఇప్పిస్తే కొద్ది నెలల్లోనే జీహెచ్ఎంసీ పరిధిలో టాయిలెట్ అందుబాటులోకి రానుంది. మొబైల్ షీ టాయిలెట్‌తో స్వచ్ఛ భారత్ లక్ష్యంతో నెరవేరడంతో పాటు మహిళలకు గౌరవం లభిస్తుంది. – సుష్మా కల్లెంపూడి, వ్యవస్థాపకురాలు,సీఈఓ, జలగం అసోసియేట్స్ -
'నాకో టాయిలెట్, అంబులెన్స్ ఇవ్వండి'
న్యూఢిల్లీ : నర్మదా నది తీరం చుట్టూ దాదాపు ఆరు నెలలపాటు ప్రయాణించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వచ్చే శనివారం నుంచి ఆయన తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి పెట్టుకున్నారు. తనకు ఒక మొబైల్ టాయిలెట్‌ను, అదనపు భద్రతను, అంబులెన్స్‌ను ఇవ్వాలని కోరారు. అయితే, అంబులెన్స్, భద్రతను ఇచ్చేందుకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంగీకరించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల తన యాత్ర గురించి దిగ్విజయ్ మాట్లాడుతూ తన యాత్రలో 'కాంగ్రెస్ జెండాలు, పోస్టర్లు, బ్యానర్లు, నినాదాలు ఉండవని స్పష్టం చేశారు. నర్మద పరిక్రమ పేరిట తాను పాదయాత్ర నిర్వహించాలని 1998లో ఒకసారి నర్మదా నది ఒడ్డు నుంచి అనుకున్నానని చెప్పారు. ఈ పాదయాత్ర ద్వారా దాదాపు 230 అసెంబ్లీ నియోజవర్గాల్లో దిగ్విజయ్ పర్యటించనున్నారు. ఇది పార్టీ అజెండా కాదని, తాను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. మొత్తం 3,400కిలో మీటర్లు ఆయన యాత్ర చేయనున్నారు. -
మహా ఏర్పాట్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మహాజాతరలో కోటి మంది భక్తులు సమ్మక్క, సారలమ్మను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. ఇప్పటికే 25లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని చెప్పారు. మేడారం ఏర్పాట్లపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు రద్దీ ఎంత ఉన్నా ప్రతీ భక్తుడు ప్రశాంతంగా దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రోడ్లు వెడల్పు చేయడం వల్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. జాతర పరిసర ప్రాంతాల్లో కూడా భక్తుల రద్దీకి తగ్గట్లు విస్తరణ పనులు చేసినట్లు తెలిపారు. దర్శనం తర్వాత బయటకు వచ్చేందుకు రెండు దారులు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. భక్తులకు అమ్మవార్ల ప్రసాదం అమ్మవార్ల దర్శనం అనంతరం భక్తులు బయటకు వచ్చే మార్గంలో ప్రసాదం అందించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక సిబ్బంది సుమారు 40 వరకు కౌంటర్ల ద్వారా ప్రసాదం అందిస్తారన్నారు. క్యూలైన్లలో నిలబడే భక్తుల కోసం మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. జాతరలో మంచి నీటిని పూర్తిస్థాయిలో క్లోరినేషన్ చేసి అందజేస్తున్నామని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణం జాతరలో భక్తుల అవసరాలకు తగ్గట్లు టాయిటెట్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. వీటితోపాటు జనం ఎక్కువ సంఖ్యలో గుడారాలు ఏర్పరుచుకున్న చోట మొబైల్ టాయిలెట్స్ అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పారిశుద్ధ్యం విషయంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. మద్యం అమ్మకాలపై నజర్ జాతరలో 22 మద్యం దుకాణాల ఏర్పాటుకు అ నుమతి ఇచ్చామన్నారు. మద్యం వ్యాపారులు అడ్డగోలుగా ధరలు పెంచకుండా, సిండికేట్ వ్యాపారంతో ఇబ్బందులు లేకుండా ఉండేం దుకు బృందాలు ఏర్పాటు చేస్తున్నా మన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తే లెసైన్స్ రద్దు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం మేడారంలోని 60 పడకల ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించనున్నట్లు తెలి పారు. వైద్యాధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని, 104 వాహనం సంచార వైద్య సేవలు అందిస్తుందన్నారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ కవర్లను పూర్తిస్థాయిలో నిషేధించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అధికారులు ప్రత్యేక బృందాలుగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తారన్నారు. ఆటోలకు అనుమతి లేదు మేడారం వెళ్లే రహదారులు విస్తరించి ఉన్నందున వాహనాలు వేగంగా వచ్చే అవకాశం ఉం దని, అలాంటి సమయంలో ఆటోలతో ఇబ్బందులు ఎదురవుతాయని, దీంతో మంగళవారం నుంచి జాతర ముగిసే వరకు మేడారం వెళ్లేందుకు ఆటోలను అనుమతించమని వరంగల్ రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం కూ డా ఇబ్బందికరమేనని, ఈ విషయంలో వాహనదారులే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. జాతరకు సంబంధించి ప్రధానమైంది ట్రాపిక్ సమస్య అని, దానిని అదిగమించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ కోసం 24 స్థలాలు ఏర్పాటు చేశామని, అ డ్డంగా ఉన్న వాహనాలను తొలగించేందుకు నాలుగు క్రేన్లు, జేసీబీలు సిద్ధంగా ఉంచామన్నారు. డ్రైవర్లు మద్యం తాగొద్దు జాతరకు వాహనాలు తీసుకొచ్చే డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు న డపొద్దని అన్నారు. జంగాలపల్లి, పస్రాతోపాటు మరికొన్ని చోట్ల ప్రత్యేక పోలీసు గస్తీ బృందాలు బ్రీతింగ్ అనలైజర్స్తో పరీక్షలు చేస్తారని, డ్రైవర్లు తాగినట్లు గుర్తిస్తే వాహనం అక్కడే నిలిపివేస్తామని తెలిపారు. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేవారికి నిద్రమత్తు తొలగించేందుకు పస్రాతోపాటు కొన్నిచోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఐస్‌లో తడిపిన కాటన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. చల్లని బట్టతో కళ్లు తుడుచుకోవడం వల్ల మరో 40 కిలోమీటర్ల వరకు నిద్రమత్తు రాకుండా ఉంటుందని అన్నారు. ఇది ఈసారి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.