నగరంలో పబ్లిక్ టాయిలెట్ల వ్యవస్థ ఇప్పటికీ అస్తవ్యస్తంగానే ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులుఎదుర్కోక తప్పడం లేదు. ఇక మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారికి సంబంధించిన టాయిలెట్లు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేవు. దీంతో మహిళా ఉద్యోగులు, చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు, ఇతర ప్రాంతాల నుంచి సిటీకి వచ్చిన వారు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో మొబైల్ షీ టాయిలెట్స్ అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగర శివార్లలోని ఐటీ, ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే మహిళల సౌకర్యార్థం ‘మొబైల్ షీ టాయిలెట్’ను ఏర్పాటు చేసేందుకు జలగం అసోసియేట్స్ ముందుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనంపైఅత్యాధునిక హంగులతో మొబైల్ టాయిలెట్‌ను ఏర్పాటు చేసి..దీన్ని రద్దీ కూడళ్లలో ఉంచుతారు.అన్ని అనుమతులు లభిస్తే ఇవి కొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
పబ్లిక్ టాయిలెట్ల కొరత..
జీహెచ్‌ఎంసీ పరిధిలో పబ్లిక్ టాయిలెట్ల సమస్య వేధిస్తోంది. సులబ్ కాంప్లెక్స్‌లు, స్వచ్ఛ టాయిలెట్లలో నిర్వహణ లోపం కారణంగా అక్కడికి వెళ్లే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. షీ టాయిలెట్లు ఏర్పాటు చేసినా పనిచేయడం లేదని మహిళలు పేర్కొంటున్నారు. సరైన అవగాహనం లేకపోవడంతో మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, హోటళ్లలోని టాయిలెట్లకు వెళ్లలేకపోతున్నారు. లూ కేఫ్‌లు కొన్నిచోట్ల పెట్టినా అంతటా అందుబాటులో లేవు. వాటిలో కార్పొరేట్ లుక్ ఉండటంతో టాయిలెట్‌లోకి ఉచితంగా వెళ్లలేమనే భావన మహిళల్లో కలుగుతోంది. ఇలా పబ్లిక్ టాయిలెట్లు అక్కడక్కడా ఉన్నా అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు.
సుష్మా ఆలోచనతోనే..
సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన జలగం సుధీర్, సుష్మా కల్లెంపూడి దంపతులు అమెరికాలో ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్లుగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ‘సంపాదనకు విరామం.. సమాజానికి సహాయం’ అనే నినాదంతో ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్‌కు తిరిగి వచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పొల్యూషన్ తగ్గించేందుకు జలగం సుధీర్ గ్రీన్ ఎనర్జీ పేరిట ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రమోట్ చేసే ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో సుష్మాకు ఓ ఆలోచన తట్టింది. తాను చదువుకున్న రోజులతో పాటు ఉద్యోగం చేస్తున్నప్పుడు టాయిలెట్లు లేక హైదరాబాద్‌లో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మొబైల్ షీ టాయిలెట్ రూపకల్పన చేస్తే బాగుంటుందని ఆలోచనకు వచ్చారు. ఈ క్రమంలో జలగం అసోసియేట్ మొబైల్ షీ టాయిలెట్‌ను తయారు చేశారు. ఇప్పటికే కొన్నిచోట్ల డెమోలు కూడా ఇచ్చారు.
జీహెచ్‌ఎంసీకి ప్రతిపాదన..
మొబైల్ షీ టాయిలెట్లను ప్రవేశపెట్టాలని జలగం అసోసియేట్ ఇటీవల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్‌ను సంప్రదించారు. మొబైల్ షీ టాయిలెట్ల ప్రతిపాదనను పరిశీలించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆయన సూచించారు. దీంతో జలగం అసోసియేట్స్ ప్రతినిధులు జీహెచ్‌ఎంసీ అధికారులను కలిశారు. జీహెచ్‌ఎంసీతోపాటు ఆర్టీఏ, పోలీసుల అనుమతులు ఇప్పించాలని, నీటిని నింపుకోవడం, వ్యర్థాలను వదిలే ఔట్‌లెట్లను కల్పించాలని కోరారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,200 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారని, షీ టాయిలెట్‌ను వారు నిర్వహించేలా చర్యలు తీసుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రతిపాదించారు. ఈ క్రమంలో జలగం అసోసియేట్స్ ప్రతినిధులు వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరిని కలిశారు. మొబైల్ షీ టాయిలెట్ గురించి వివరించారు. ఒకట్రెండు నెలల్లో జీహెచ్‌ఎంసీ అధికారుల సమక్షంలో షీ టాయిలెట్ డెమో ఇవ్వనున్నామని వారు తెలిపారు. జీహెచ్‌ఎంసీ సానుకూలంగా స్పందిస్తే ఇక మొబైల్ షీ టాయిలెట్ కొద్దిరోజుల్లోనేఅందుబాటులోకి రానుంది.
ప్రైవేట్ సంస్థలకు..
స్వచ్ఛ భారత్‌లో భాగంగా మొబైల్ షీ టాయిలెట్‌ను ప్రమోట్ చేయాలని జలగం అసోసియేట్ ఇప్పటికే ఎన్‌ఎండీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, వీ హబ్, ఇన్ఫోసిస్ సంస్థలను సంప్రదించింది. ఆర్డర్ ఇస్తే మొబైల్ షీ టాయిలెట్ తయారు చేస్తామనడంతో కంపెనీలు సానుకూలంగా స్పందించాయని జలగం అసోసియేట్స్ ప్రతినిధులు చెప్పారు.
మొబైల్ షీ టాయిలెట్ ఇలా..
♦ ఎలక్ట్రిక్ వెహికల్‌లో మొబైల్ షీ టాయిలెట్‌ఏర్పాటుకు దాదాపు రూ.10 లక్షలు ఖర్చు అవుతుంది.
♦ చైనా మాన్యుఫ్యాక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఖర్చుతగ్గే అవకాశం ఉంది.
♦ వాహనంపై 40 లీటర్ల కెపాసిటీ వాటర్‌ట్యాంక్‌ఉంటుంది. అడుగు భాగంలో 40 లీటర్ల కెపాసిటీ సెప్టిక్ ట్యాంకు ఉంటుంది.
♦ వాహనం లోపల వాష్‌బేసిన్‌తో పాటు టాయిలెట్ ఉంటుంది.
♦ వాష్ బేసిన్‌లో వాడిన నీళ్లు ఫ్లష్ ట్యాంక్‌లోకి వెళ్తాయి. ఆ నీటిని టాయిలెట్ ఫ్లష్‌కు వాడతారు.
♦ ప్రతి ఫ్లష్‌కు 4 లీటర్ల నీరు వాడాల్సి ఉంటుంది. వ్యాక్యూమ్ టెక్నాలజీతో కేవలం అర లీటరు నీరు మాత్రమే ఫ్లష్‌కు పోతుంది.
♦ మొబైల్ షీ టాయిలెట్ వద్ద శానిటరీ ప్యాడ్‌లతోపాటు మహిళలకు సంబంధించిన ఇతర వస్తువుల సేల్ కౌంటర్ ఏర్పాటు చేయవచ్చు.
అనుభవం నుంచి ఆలోచన..
చదువుకున్నప్పుడు, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు పబ్లిక్ టాయిలెట్లు లేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అనుభవంలోంచే మొబైల్ షీ టాయిలెట్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. గతంలో తయారు చేసి డెమో ఇచ్చాం. మరిన్ని హంగులతో ఎల్‌బీ నగర్, సూర్యాపేటలో రెండు టాయిలెట్లను తయారు చేస్తున్నాం. జీహెచ్‌ఎంసీ అధికారులు అనుమతులు ఇప్పిస్తే కొద్ది నెలల్లోనే జీహెచ్‌ఎంసీ పరిధిలో టాయిలెట్ అందుబాటులోకి రానుంది. మొబైల్ షీ టాయిలెట్‌తో స్వచ్ఛ భారత్ లక్ష్యంతో నెరవేరడంతో పాటు మహిళలకు గౌరవం లభిస్తుంది. – సుష్మా కల్లెంపూడి, వ్యవస్థాపకురాలు,సీఈఓ, జలగం అసోసియేట్స్
Comments
Please login to add a commentAdd a comment