బాబు.. 'బాబ్లీ' డ్రామా | 35 times non-bailable warrant while TDP was in NDA | Sakshi
Sakshi News home page

బాబు.. 'బాబ్లీ' డ్రామా

Published Sat, Sep 15 2018 3:44 AM | Last Updated on Sat, Sep 15 2018 4:41 PM

35 times non-bailable warrant while TDP was in NDA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విచారణకు పలుమార్లు గైర్హాజరు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహారాష్ట్ర ధర్మాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు జారీ చేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్‌బీడబ్లు్య)పై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా స్పందిస్తున్న తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంతో న్యాయస్థానం ఇచ్చిన ఎన్‌బీడబ్లు్యపై చంద్రబాబు బృందం రాజకీయాలు చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలోనే ధర్మాబాద్‌ కోర్టు 2015 సెప్టెంబర్‌ 21న మొదటిసారి ఎన్‌బీడబ్లు్య జారీ చేసినప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలు నోరు విప్పలేదు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక కుట్ర జరుగుతోందంటూ గగ్గోలు పెడుతూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. బీజేపీతో నాలుగేళ్లు అంటకాగి బయటకు వచ్చేంత వరకు చంద్రబాబుపై కేసు ధర్మాబాద్‌ కోర్టులో 35 సార్లు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ దశలో విచారణకు వచ్చింది. అయితే అప్పుడు ఆ కేసు గురించి, వారెంట్‌ జారీ గురించి ఆయన స్పందించలేదు. ప్రధాని మోడీ కుట్ర చేస్తున్నారంటూ ఇప్పుడు ఆరోపణలకు దిగుతున్నారు.

2013 ఆగస్టు 31న విచారణ ప్రారంభం
బాబ్లీకి వ్యతిరేకంగా చంద్రబాబు, కొందరు టీడీపీ నేతలు ప్రాజెక్టు వద్ద ఆందోళన నిర్వహించడంపై మహారాష్ట్ర ధర్మాబాద్‌ పోలీసులు 2010లో పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. చంద్రబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, జి.కమలాకర్, సీహెచ్‌.ప్రభాకర్, ఎన్‌.నాగేశ్వర్, జి.రామ్‌నాయుడు అలియాస్‌ జీవీ నాయుడు, సీహెచ్‌ విజయరామారావు, ముజఫరుద్దీన్‌ అనరొద్దీన్, హన్మత్‌ షిండే, ఎస్‌.సోమోజు, ఏఎస్‌ రత్న సాయన్న, పి.సత్యనారాయణ, టి.ప్రకాశ్‌గౌడ్, ఎన్‌.ఆనందబాబులను నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో చంద్రబాబు ఏ 1గా ఉన్నారు. ధర్మాబాద్‌ పోలీసులు 2013లో చార్జిషీట్‌ దాఖలు చేశారు. దీనిపై ధర్మాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు 2013 ఆగస్టు 31న విచారణ ప్రారంభించింది. విచారణ ప్రాథమిక దశలో నిబంధనల ప్రకారం కేసులో నిందితులైన చంద్రబాబునాయుడు తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఆ తరువాత వ్యక్తిగతంగా హాజరు కావాలన్న ఆదేశాలను చంద్రబాబు తదితరులు బేఖాతరు చేశారు. కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావడం గానీ, హాజరు నుంచి మినహాయింపు కోరడం గానీ చేయలేదు. దీంతో నిబంధనల ప్రకారం న్యాయస్థానం చంద్రబాబు తదితరులకు తొలిసారి 2015 సెప్టెంబర్‌ 21న నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. అప్పటి నుంచి గత నెల 16వ తేదీ వరకు మొత్తం 37సార్లు ఈ కేసు విచారణకు వచ్చింది. ప్రతిసారి ఎన్‌బీడబ్లు్య (అన్‌రెడీ) పేరుతో కేసు విచారణకు వచ్చింది.
 
హోదా కోసం ఉద్యమించిన విపక్ష నేతలపై కేసులు...
దేశంలో చంద్రబాబుకే తొలిసారిగా ఎన్‌బీడబ్లు్య జారీ అయినట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ పోలీసులు కేసులు నమోదు చేయడం సర్వ సాధారణం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ తీవ్రస్థాయిలో ఆందోళనలు చేసిన పలువురు వైఎస్సార్‌ సీపీ నేతలపై పోలీస్‌స్టేషన్లలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర విభజన సమయంలో టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నేతలు రైల్‌రోకో కార్యక్రమం నిర్వహించారు. వీరిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వారంతా కోర్టు నోటీసులు అందుకున్నారు. వీరిలో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు అందుకున్న వారు కూడా ఉన్నారు. నోటీసులు, వారెంట్లు అందుకున్న వారంతా కోర్టుకెళ్లి వారెంట్లను రీకాల్‌ చేయించుకున్నారు. మంత్రుల హోదాలో ఇప్పటికీ విచారణ జరుగుతున్న రైల్వే కోర్టుకు హాజరవుతున్నారు. ఇదంతా కోర్టు విచారణ ప్రక్రియలో భాగం.

సానుభూతి స్కెచ్‌
ప్రజా వ్యతిరేకత, కాంగ్రెస్‌తో పొత్తు నుంచి దృష్టి మళ్లించే యత్నం 
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు మహారాష్ట్ర కోర్టు జారీ చేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌కు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు రోడ్లెక్కి చేస్తున్న విన్యాసాల వెనుక రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆరాటం ప్రస్ఫుటమవుతోంది. టీడీపీ నాయకుల ధర్నాలు, ఆందోళనలు, వినూత్న హంగామాల వెనుక చంద్రబాబు రచించిన పెద్ద పథకమే దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ సర్కారుపై ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతుండడం, కాంగ్రెస్‌తో పొత్తును సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఈ అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకు వారెంట్ల అంశాన్ని వాడుకుంటున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసినట్లు పేర్కొంటున్న చంద్రబాబు అదే రాష్ట్రానికి చెందిన మంత్రి సతీమణికి టీటీడీ బోర్డులో సభ్యత్వం కల్పించడం గమనార్హం. బీజేపీ సారథ్యంలోని మహారాష్ట్ర సర్కారుతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే తనకు వారెంట్ల వెనుక ఆ పార్టీ పెద్దల కుట్ర ఉన్నట్లు చంద్రబాబు ఆరోపించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు కోర్టు వారెంట్‌ ఎప్పుడో జారీ అయితే ఐక్యరాజ్యసమితిలో ఆయన ప్రసంగించకుండా అడ్డుకునేందుకే మోడీ వీటిని ఇప్పించినట్లు టీడీపీ నేతలు ఆరోపించడాన్ని చూసి అంతా విస్తుపోతున్నారు. 

తెలంగాణ ఎన్నికల్లో లబ్ధికి ఆరాటం
మూడు రకాలుగా లబ్ధి పొందే వ్యూహంతో చంద్రబాబు పార్టీ శ్రేణుల్ని, అనుకూల మీడియాను వారెంట్‌కు వ్యతిరేకంగా ఎగదోశారు. ఈ నోటీసుల్ని ప్రధాని మోడీయే ఇప్పించారనే ప్రచారం చేసుకోవడం, తనపై ఉన్న వ్యతిరేకతను బీజేపీపైకి మళ్లించి లబ్ధి పొందాలనుకోవడం బాబు మొదటి లక్ష్యం. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బాబ్లీపై వారెంట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి అక్కడ పూర్తిగా చతికిలబడిన టీడీపీకి ఆశలు కల్పించడం రెండో లక్ష్యంగా ఉంది. ఇక కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు వ్యవహారంపై రెండు రాష్ట్రాల ప్రజానీకం, పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో దీనిపై చర్చ జరగకుండా కప్పిపుచ్చేందుకు నోటీసుల అంశాన్ని వినియోగించుకోవడం చివరి లక్ష్యం. ఈ మూడు లక్ష్యాల సాధన కోసం నోటీసుల వ్యవహారాన్ని తనకు అనుకూలంగా పనిచేసే సినీనటుడి ద్వారా వ్యూహాత్మకంగా వెల్లడించారు. 

సోషల్‌ మీడియాలో విమర్శలు
చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ల జారీపై టీడీపీ నేతలు చేస్తున్న హంగామాపై సోషల్‌ మీడియాలో ఛలోక్తులు, విమర్శలు, సెటైర్లు వెల్లువలా వైరల్‌ అవుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే దీనిపై విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నట్లు నెటిజన్లతోపాటు అన్నివర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement