న్యూఢిల్లీ: నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో 75% పోలింగ్ నమోదైంది. మేఘాలయలో ఓటింగ్ ప్రశాతంగా ముగియగా నాగాలాండ్‌లో నాగా పీపుల్స్ ఫ్రంట్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు చనిపోయారు. నాగాలాండ్ రాష్ట్రం అకులుటో నియోజకవర్గం జున్‌హెబోటో జిల్లాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) అభిజిత్ సిన్హా తెలిపారు.
మోన్ జిల్లా టిజిట్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలోని పోలింగ్ స్టేషన్ సమీపంలో బాంబు పేలి ఒకరు గాయపడ్డారని చెప్పారు. సుధోస్డు, లాడిగఢ్‌లో పోలింగ్ స్టేషన్‌ల వద్ద ఉద్రిక్తతల కారణంగా ఎన్నిక నిలిపివేసినట్లు వివరించారు. క్రైస్తవ వ్యతిరేక పార్టీకి ఓటేయరాదంటూ మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని ఓ ప్రైవేట్ రేడియో స్టేషన్ జాకీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఎన్నికలకు మతం రంగు పులిమేందుకు యత్నించిన ఆ స్టేషన్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈనెల 18వ తేదీన ఎన్నికలు జరిగిన త్రిపురతోపాటు మేఘాలయ, నాగాలాండ్ ఓట్ల లెక్కింపు వచ్చే నెల 3న చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment