సాక్షి, న్యూఢిల్లీ : ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు సాటిరారు వేరెవరు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ‘సరి–బేసు’ సంఖ్య విధానాన్ని ఆయన తీసుకొచ్చారు. సామాన్య మానవుల సంక్షేమాన్ని ఆలోచించి ఢిల్లీలో విద్యుత్ ఛార్జీలను సగానికి సగం తగ్గించి అందర్ని ఆశ్చర్యపరిచారు. ఢిల్లీ మెట్రో, నగర ప్రభుత్వ బస్సు సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తున్నట్లు సోమవారం నాడు ప్రకటించి మరోసారి ఆశ్చర్యపరిచారు. మహిళలు వేధింపులకు గురికాకుండా ఉండేందుకుగాను వారికి ప్రభుత్వ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకరావడానికే తానీ నిర్ణయం తీసుకున్నానని అరవింద్ కేజ్రివాల్ చెప్పుకున్నారు.
2020లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పొంచి ఉన్న నేపథ్యంలో అరవింద్ కేజ్రివాల్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశం అయింది. దీన్ని పొగిడిన వారు, తెగిడిన వారూ ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ పరిధిలోని ఏడు సీట్లను బీజేపీ గెలుచుకోవడం, కాంగ్రెస్ రెండోస్థానం, ఆప్ మూడో స్థానంలో వచ్చిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకుగాను 67 సీట్లను గెలుచుకున్న ఆప్ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోకపోవడం, కేవలం 18.1 శాతం ఓట్లకు మాత్రమే పరిమితమవడం ఆందోళనకర పరిణామమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసమే మహిళలకు ఇంత పెద్ద రాయతీ ప్రకటించారని విమర్శకులు అంటున్నారు. తానీ నిర్ణయం తీసుకున్నా, తీసుకోకపోయినా విజయం సాధించే పరిస్థితిలోనే ఉన్నానని కేజ్రివాల్ చెబుతున్నారు.
అభివద్ధి ప్రాజెక్ట్‌లపై దృష్టి
లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన మరుసటి రోజే కేజ్రివాల్ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, నగరమంతటా సీసీటీవీ కెమేరాల ఏర్పాటు, మొహల్లా క్లినిక్‌ల విస్తరణ గురించి చర్చించారు. ఆయన అంతకుముందు రోజు పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసిన సరళి గురించి వివరిస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఎలాంటి వ్యూహాన్ని అనుసరించారో తెలియజేశారు. లోక్‌సభ ఎన్నికలు నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ మధ్య పోటీగా నడిచాయని, వాటికి కేజ్రివాల్‌కు సంబంధం లేదని, అందుకని తమను ఓటర్లు పట్టించుకోలేదని ఆయన వివరించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందుకు విరుద్ధంగా ఉంటాయని తమ పనితీరును చూసి ఓటర్లు ఓట్లు వేస్తారని కార్యకర్తలకు కేజ్రివాల్ భరోసా ఇచ్చారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కావాలనే ఏకైక నినాదం మీద ఎన్నికలకు పోవడం వల్ల తాము ఓడిపోయామని ఆప్ సీనియర్ నాయకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment