Delhi assembly polls
-
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న ఆప్
సాక్షి, న్యూఢిల్లీ : ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు సాటిరారు వేరెవరు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ‘సరి–బేసు’ సంఖ్య విధానాన్ని ఆయన తీసుకొచ్చారు. సామాన్య మానవుల సంక్షేమాన్ని ఆలోచించి ఢిల్లీలో విద్యుత్ ఛార్జీలను సగానికి సగం తగ్గించి అందర్ని ఆశ్చర్యపరిచారు. ఢిల్లీ మెట్రో, నగర ప్రభుత్వ బస్సు సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తున్నట్లు సోమవారం నాడు ప్రకటించి మరోసారి ఆశ్చర్యపరిచారు. మహిళలు వేధింపులకు గురికాకుండా ఉండేందుకుగాను వారికి ప్రభుత్వ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకరావడానికే తానీ నిర్ణయం తీసుకున్నానని అరవింద్ కేజ్రివాల్ చెప్పుకున్నారు. 2020లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పొంచి ఉన్న నేపథ్యంలో అరవింద్ కేజ్రివాల్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశం అయింది. దీన్ని పొగిడిన వారు, తెగిడిన వారూ ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ పరిధిలోని ఏడు సీట్లను బీజేపీ గెలుచుకోవడం, కాంగ్రెస్ రెండోస్థానం, ఆప్ మూడో స్థానంలో వచ్చిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకుగాను 67 సీట్లను గెలుచుకున్న ఆప్ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోకపోవడం, కేవలం 18.1 శాతం ఓట్లకు మాత్రమే పరిమితమవడం ఆందోళనకర పరిణామమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసమే మహిళలకు ఇంత పెద్ద రాయతీ ప్రకటించారని విమర్శకులు అంటున్నారు. తానీ నిర్ణయం తీసుకున్నా, తీసుకోకపోయినా విజయం సాధించే పరిస్థితిలోనే ఉన్నానని కేజ్రివాల్ చెబుతున్నారు. అభివద్ధి ప్రాజెక్ట్‌లపై దృష్టి లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన మరుసటి రోజే కేజ్రివాల్ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, నగరమంతటా సీసీటీవీ కెమేరాల ఏర్పాటు, మొహల్లా క్లినిక్‌ల విస్తరణ గురించి చర్చించారు. ఆయన అంతకుముందు రోజు పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసిన సరళి గురించి వివరిస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఎలాంటి వ్యూహాన్ని అనుసరించారో తెలియజేశారు. లోక్‌సభ ఎన్నికలు నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ మధ్య పోటీగా నడిచాయని, వాటికి కేజ్రివాల్‌కు సంబంధం లేదని, అందుకని తమను ఓటర్లు పట్టించుకోలేదని ఆయన వివరించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందుకు విరుద్ధంగా ఉంటాయని తమ పనితీరును చూసి ఓటర్లు ఓట్లు వేస్తారని కార్యకర్తలకు కేజ్రివాల్ భరోసా ఇచ్చారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కావాలనే ఏకైక నినాదం మీద ఎన్నికలకు పోవడం వల్ల తాము ఓడిపోయామని ఆప్ సీనియర్ నాయకులు అంటున్నారు. -
కేజ్రీవాల్ విజయంపై కేసీఆర్ హర్షం
హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆయన ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ప్రజలు ఆలోచిస్తున్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విజయాన్ని గమనిస్తే ప్రజలు అవినీతి రహిత పాలనను కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని కేసీఆర్ అన్నారు. -
'కేజ్రీవాల్ ఓ నక్సలైట్.. గెలిచినా పదవిలో ఉండలేరు'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ని ఓ నక్సలైట్ అంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి అభివర్ణించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే, కేజ్రీవాల్ సంవత్సరం లోపే సీఎం పదవిని మళ్లీ వదిలేస్తారని విమర్శించారు. కేజ్రీవాల్ నక్సలైట్ స్వభావం కలిగిన వ్యక్తి అని, ఆయన సహచరులు అందరూ నక్సలైట్ ఉద్యమంతో సంబంధం ఉన్నవారు కావడంతో ప్రభుత్వాన్ని నడపలేరని సుబ్రమణ్య స్వామి తెలిపారు. ఈ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జీరో అయిందన్నారు. సంప్రదాయక కాంగ్రెస్ ఓటర్లందరూ ఆప్ వైపు మొగ్గు చూపారని, ఈ ఎన్నికల ఫలితాలు మోదీపై ఏ విధమైన ప్రభావాన్ని చూపవని తెలిపారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కేజ్రీవాల్‌కి అనుకూలంగా వెల్లడైన నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి పైవిధంగా పేర్కొన్నారు. -
సామాన్యుడా... స్వాగతం!
సామాన్యుని ప్రపంచవ్యాప్త జైత్రయాత్ర ఢిల్లీకి చేరింది. మోదీ నాయకత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నది ఆ సామాన్యుడే. అభివృద్ధి పేరిట సామాన్యుని కడుపు కొట్టి సంపన్నులకు పెట్టే ‘అభివృద్ధి’వాదులకు, జనాభాలో సగంగా ఉన్న పేద వర్గాలకు నచ్చే ‘చిల్లర మల్లర’ ‘జనాకర్షక’ విధానాల సమర్థకులకు మధ్య సంకుల సమరంగా ఢిల్లీ ఎన్నికలు మారాయి. ‘కొందరి అభివృద్ధి కోసం అందరికీ దారిద్య్రం’ ఇక చెల్లదంటూ సాగుతున్న ఈ ప్రతిఘటన సిరిజా లేదా ఆప్‌ల జయాపజయాలతో, సాఫల్యవైఫల్యాలతో నిమిత్తం లేకుండా ముందుకు సాగే చారిత్రక ధోరణి. కొన్ని దశాబ్దాల కిందటి మాట. రెండు ప్రపంచ యుద్ధాలు ముగిసిన తొలి రోజులు. ఆసియా, ఆఫ్రికా దేశాలు అనేకం వలస సంకెళ్లు తెంచుకొని స్వతం త్రంగా అడుగులు వేయడం నేర్చుకుంటున్న రోజులు. రెండు ఆలోచనా స్రవంతులు, రెండు అభివృద్ధి నమూనాలు మరో ప్రపంచయుద్ధం స్థాయిలో ఘర్షించాయి. ఒకటి సంపదను సృష్టించడం మా తెలివైన బుర్రలకే సాధ్యమనే పెట్టుబడిదారీ నమూనా. రెండవది, సామాన్య శ్రామిక జనమే సంపదకు సృష్టికర్తలనే సోషలిస్టు నమూనా. సంపదలన్నీ ప్రజలందరికీ సమానంగా చెందాల్సిందేనంది సోషలిస్టు నమూనా. ‘సంపదను కాదు, దారిద్య్రాన్ని పంచుతారు అందరికీ’ అంటూ కేపిటలిస్టు, సోషలిస్టును ఎద్దేవా చేశాడు. స్వయంకృతాపరాధాలతో నిలకడగా సరైన సమాధానం చెప్పలేక సోషలిస్టు నీళ్లు నమిలాడు.. క్రమంగా చతికిలపడ్డాడు. విజయగర్వంతో కేపిటలిస్టు ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. కాల చ క్రం గిర్రున తిరిగింది. భూగోళం మీద అపారమైన సంపద పోగుపడింది. నాడు ఏడంతస్తుల మేడ ఓ కల. నేడు నూరంతస్తుల భవనం వాస్తవం. నాడు శ్రీమంతుడు అంటే లక్షాధికారి, మహా అయితే కోటీశ్వరుడు. ఆ వర్గం మధ్యతరగతిలోకి చేరింది. బిలియనీర్లు అవతరించారు. ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల(ఆరువేల కోట్ల రూపాయలకు పైగా)విలువైన సంపదకంటే ఎక్కువ ఉన్నవారు ఈ క్లబ్లో చేరుతారు. అలాంటి వారు ప్రపంచంలో రెండువేల మందికి పైగా ఉన్నారని ‘హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్’ (2015) ప్రకటించింది. అందులో 97 మంది భారతదేశంలో ఉన్నారు. ప్రపంచంలో మనది మూడో స్థానమట. తొలి రెండు స్థానాలు అమెరికా, చైనాలవి. అయితే ఇది అధికారికంగా అంత సొమ్మును చూపగలిగిన ‘తెల్ల’ బిలియనీర్ల జాబితా మాత్రమే. అలా చూపలేని ‘నల్ల’ నయ్యలు మన దేశంలో అంతకు అనేక రెట్లు ఉంటారని అంచనా. 1980కి పూర్వం మొత్తం ప్రపంచదేశాల జీడీపీ(ఏదాదిలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల మొత్తం విలువ) కంటే నేటి అమెరికా ఒక్క దేశం జీడీపీయే ఎక్కువ. ఇప్పుడు మొత్తం ప్రపంచ దేశాల జీడీపీ లక్ష బిలియన్ డాలర్ల (అరవై కోట్ల కోట్ల రూపాయలు)కు చేరువైందని అంచనా. ప్రపంచ సంపద అపారంగా పెరిగిందనేది కళ్ల ముందట కనిపిస్తున్న వాస్తవం. అయితే అదే మేరకు ప్రజల మధ్య సంపద పంపిణీ హేతుబద్ధంగా ఉందా? ప్రపంచ పర్యావరణ సమతుల్యత ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో, అంతకంటే ఘోరంగా ఆర్థిక, సామాజిక సమతుల్యత దెబ్బతిన్నదనే నిజా లను తాజా గణాంకాలు చాటి చెబుతున్నాయి. ‘ఆక్స్‌ఫామ్’ (ఆక్స్ఫర్డ్ కమిటీ ఆన్ ఫేమిన్) అనే అంత ర్జాతీయ సంస్థ ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని ఈ మధ్యనే ప్రకటించింది. ప్రపంచ జనాభాలోని ఒక శాతం మంది చేతిలో 99 శాతం సంపద పోగుబడనుంది. మిగిలిన 99 శాతం ప్రజలు ఒక శాతం సంపదను పంచుకోబోతున్నారు. ఒక ఏడాదిలోపునే ప్రపంచం ఈ మైలురా యిని చేరుకుంటుందట. సగటున రోజుకు రెండు డాలర్లకంటే తక్కువ సంపాదన ఉన్నవారు ప్రపంచంలో 300 కోట్ల మంది ఉన్నారని ‘వరల్డ్ బ్యాంక్ డెవలప్మెంట్ ఇండికేటర్స్’ (2008) నివేదిక వెల్లడించింది. దుర్భర దారిద్య్ర పరిస్థితుల కారణంగా ప్రతిరోజూ 22 వేల మంది పిల్లలు మృత్యు వాత పడుతున్నారని ‘యూనిసెఫ్’ నివేదిక వెల్లడిస్తోంది. డయేరియాతో (అతిసార వ్యాధి) ఏటా 18 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. 110 కోట్ల మందికి తాగునీటి వసతి లేదు. 260 కోట్లమందికి పారిశుద్ధ్య సదుపాయం లేదు. వ్యక్తిగత వస్తు వినియోగం లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అత్యంత సంపన్నులైన 20 శాతం మంది ప్రపంచం అంతటా ఉత్పత్తవుతున్న మొత్తం వినిమయ వస్తు సామగ్రిలో 76.6 శాతాన్ని వినియోగిస్తుంటే, అత్యం త పేదలైన 20 శాతం మంది కేవలం ఒకటిన్నర శాతం వినియోగిస్తున్నారు. 30 కోట్ల జనాభా ఉన్న అమెరికా ప్రజలు కాస్మెటిక్స్ మీద ఏటా చేసే ఖర్చు 50 వేల కోట్ల రూపాయలు. కాగా, నూట పాతిక కోట్ల జనాభాగల మన దేశ తాజా బడ్జెట్లో తాగు నీటికీ, పారిశుద్ధ్యానికి సంయుక్తంగా కేటాయించినది 15 వేల కోట్ల రూపాయలు. 75 కోట్ల ఐరోపా ఖండ ప్రజలు కాలక్షేపంగా ఐస్‌క్రీమ్‌లు లాగించేయడానికి ఏటా 70 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే, మన కేంద్ర బడ్జెట్ ప్రాథమిక విద్యారంగం కోసం కేటాయించినది రూ. 40 వేల కోట్లు. విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు వంటి కనీస వసతులు అందని తీవ్ర పేదరికంలో 30 కోట్ల మంది భారతీయులు ఇప్పటికీ బతుకులీడుస్తున్నారని నాలుగు రోజుల కిందటే విడుదలైన సహస్రాబ్ది అభి వృద్ధి లక్ష్యాలపై ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ఇలా పేద, ధనిక వర్గాల మధ్య అంతరం అనంతంగా పెరుగుతూనే ఉంది. పెట్టుబడిదారీ వర్గ ప్రవక్తలైన ప్రపంచ బ్యాంకు, ఐఎమ్‌ఎఫ్‌ల అభీష్టం (ఫండ్-బ్యాంకు విధానాల) మేరకు ప్రపంచంలో సంపద సృష్టి బాగానే జరి గింది. కానీ అది కొద్ది మంది సంపన్నులదిగా కేంద్రీకృతమైంది. ‘అభివృద్ధితో ఆకలి, పేదరికాల నిర్మూలన’ అన్న పెట్టుబడిదారీ ప్రవక్తల ప్రవచనాలు ఆచర ణలో పేదల మధ్య దారిద్య్రం పంపిణీగానే మిగిలాయి. పేద, బడుగు దేశాల వృద్ధి సైతం సంపన్న దేశాలకే మేలు చేసింది. ఈ పరిణామానికి ప్రధాన బాధ్యత ‘ఫండ్-బ్యాంకు’ ప్రవక్తలదే. వర్ధమాన దేశాల్లో అవి అమలు చేసిన రుణ నిబంధనలు అవాంఛనీయ స్థాయి ప్రైవేటీకరణకు దారులు వేసి పేద వర్గాలకు, సామాన్యులకు కనీస వసతులను సైతం దూరం చేశాయి. ఆ ఆర్థిక, సామాజిక విధానాలనే నయా ఉదారవాద విధానాలనే హాస్యాస్పదమైన పేరుతో పిలుస్తున్నారు. వాటి ఫలితంగానే చివరకు ప్రపంచ జనాభాలో ఒక శాతం చేతిలో 99 శాతం సంపద అనే అమానవీయ దశకు పెట్టుబడిదారీ ‘అభివృద్ధి’ చేరింది. అవధులు దాటిన ఆ అమానవీయతే, దురాశే ప్రపం చాన్ని 2008 నుంచి కనీవినీ ఎరుగని సంక్షోభంలోకి నెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మానవాళి కథ మరో మలుపు తిరగడమూ ప్రారంభమైంది. పెట్టుబడిదారీ సంపద సృష్టి యజ్ఞంలో తీవ్ర దురన్యాయానికి, వంచ నకు గురయిన సామాన్యుడు నెమ్మదిగా శిరసెత్తి ప్రశ్నించడం మొదలు పెట్టా డు. సొమ్మసిల్లిన గత సోషలిస్టు ఉద్యమాలే స్ఫూర్తిగా ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట ప్రారంభించాడు. తోచిన ప్రత్యామ్నాయాన్ని నిర్మించుకుంటూ ‘నయా ఉదారవాద’ దండయాత్రకు ఎదురునిలిచి పోరాడటం మొదలు పెట్టాడు. ప్రపంచ బ్యాంకు-ఐఎమ్‌ఎఫ్‌ల దౌష్ట్యానికి తొలి సమిధలైన లాటిన్ అమెరికా దేశాల నుంచే సామాన్యుని ప్రతిఘటన ప్రారంభమైంది. వెనిజు లాకు చెందిన హ్యూగో చావేజ్ నాయకత్వం ఇచ్చిన ఉత్తేజంతో చిలీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే, బొలీవియా, నికరాగ్వా తదితర పన్నెండుకుపైగా వామ పక్ష ప్రభుత్వాలు అలా ఆవిర్భవించినవే. గ్లోబలైజేషన్ శకంలో బ్యాంక్-ఫండ్ ప్రవచనాలకు ప్రత్యామ్నాయమే లేదనే మూఢ మేధావులు ఆ ప్రభుత్వాలను మూణ్ణాళ్ల ముచ్చటేనని శాపనార్థాలు పెట్టారు. ఇదిగో నేడు, రేపు కుప్పకూలు తాయని జోస్యాలు చెప్పారు. నేడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు చౌకగా తాగు నీరు, విద్యుత్తు, రవాణా తదితర ప్రజోపయోగ సర్వీసులను వాగ్దానం చేయ డాన్ని ఈసడిస్తున్నట్టే లాటిన్ అమెరికన్ వామపక్ష ఆర్థిక విధానాలను హేళన చేశారు. వెక్కిరించిన పెట్టుబడిదారీ విధానం 2008లో వెల్లకిలా పడి మరి లేవలేదు. అక్కడి నుంచి ప్రారంభమైన సామాన్యుని ప్రతిఘటనా యాత్ర ఇప్పుడు ప్రపంచమంతటికీ విస్తరిస్తున్నట్టు కనబడుతున్నది. ‘‘రొట్టె ముక్క, ఉపాధి, స్వేచ్ఛ’’ల కోసం ఎలుగెత్తిన అల్పులే మధ్య ప్రాచ్యాన్ని ఊపే సిన అరబ్బు వసంతంగా పుష్పించారు. దగాపడి ఓడినా, పెట్టుబడి కోట అమెరికాలో ‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమానికి ఊపిరులయ్యారు, ‘యూరో’ కాటుకు విలవిల్లాడుతున్న ఐరోపా సామాన్యుల ఆగ్రహమే స్పెయిన్, సైప్రస్, పోర్చుగల్‌ల నుండి జర్మనీ రాజధాని బెర్లిన్ వరకు అడుగడుగునా ప్రత్యక్ష మైంది. గడచిన కొద్దిరోజులుగా ఆస్ట్రేలియా నుంచి కూడా సామాన్యుని గళం ప్రపంచమంతా ప్రతి ధ్వనించేలా వినబడుతోంది. విక్టోరియా, క్వీన్స్లాండ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలనిచ్చిన సామాన్యుడు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. అడవులు, భూములు, కొండలు, గనులు వగైరా ప్రజా ఆస్తులను అడ్డగోలుగా అమ్మేసుకుంటున్న ప్రభుత్వ దుర్నీతిని వీధుల్లోకి వచ్చి ప్రశ్నించిన సామాన్యుడు ఎన్నికల్లో పాలక పార్టీని మట్టి కరిపించి లేబర్ పార్టీకి పట్టం కట్డాడు. గ్రీస్‌లో ‘సిరిజా’కు బ్రహ్మరథంపట్టి పొదుపుచర్యల పేరిట పెట్టుబడిదారీ ప్రభుత్వాలు సామాన్యులపై వేటు వేయడం ఇక సాగ దని ప్రకటించాడు. సామాన్యుని ప్రపంచవ్యాప్త జైత్రయాత్ర ఇప్పుడు ఢిల్లీ వీధులకు చేరిం ది. ఎదురు లేదనుకున్న నరేంద్ర మోదీ నాయకత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఘనత ఆ సామాన్యుడిదే. ఢిల్లీ నగరం నిట్టనిలువునా చీలిపో యింది. అభివృద్ధి పేరిట సామాన్యుని కడుపు కట్టి, కొట్టి సంపన్నులకు పెట్టే ‘అభివృద్ధి’ సమర్థకులకు, జనాభాలో దాదాపు సగభాగంగా ఉన్న పేద వర్గాల ‘చిల్లర మల్లర’ ‘జనాకర్షక’ విధానాల సమర్థకులకు మధ్య సంకుల సమరం గా ఢిల్లీ ఎన్నికలను మార్చింది. మోదీ ‘అభివృద్ధి’ మైకం వీడి మధ్య తరగతి ఏ కొద్దిగా మొగ్గినా ఆమ్ ఆద్మీ విజయఢంకా మోగడం ఖాయం. ఫలితాల మాట ఎలా ఉన్నా, ఈ రోజున ఢిల్లీలో సామాన్యుడు మోహరించిన తీరు భారత రాజకీయాల్లో నూతన రుతు ఆగమనానికి సంకేతం. ‘కొందరి అభి వృద్ధి కోసం అందరికీ దారిద్య్రం’ అనే దురన్యాయం ఇంకానా? ఇక సాగదం టూ సాగే ఈ సామాన్యుని రాజకీయ ప్రతిఘటన సిరిజా లేదా ఆప్‌ల జయాప జయాలతో, సాఫల్యై వెఫల్యాలతో నిమిత్తం లేకుండా ముందుకు సాగే చారి త్రక ధోరణి. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై ఎవ్వని యందు డిందు... ఆ సామాన్యుండెవ్వడు వాని నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్! muralivardelli@yahoo.co.in -
ఢిల్లీ భవితవ్యం తేల్చనున్న 311 మంది సెంచూరియన్లు
న్యూఢిల్లీ: ఈ నెల 7 న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఒక విశేషం ఉంది. అదేంటంటే ఈ ఎన్నికల్లో 311 మంది వందేళ్లు వయసు దాటిన తాతలు, బామ్మలు ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికల్లో వీరు కూడా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని తహతహలాడుతున్నారు. చూద్దాం వీరి అభ్యర్థులు ఏ మేరకు విజయం సాధిస్తారో... -
కిరణ్‌బేడీ ఎందుకు జంకుతున్నారు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ : తమతో చర్చకు బీజేపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ జంకుతున్నారని ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. శనివారం న్యూఢిల్లీలో ఆప్ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. అనంతరం కేజ్రీవాల్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కేంద్రమంత్రులంతా తమ పనులు మానేసి ఢిల్లీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేప్పారు. ఈ సారి సీఎం అయితే గతంలోని 49 రోజుల పాలన కంటే మరింత మెరుగైన పాలన అందిస్తానని ఆయన న్యూఢిల్లీ ప్రజలకు భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు సగానికి సగం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఆడిత్ తర్వాత నిర్థిష్ట ఛార్జీ ఫిక్స్ చేస్తామన్నారు. ఆప్‌ను చూసి బీజేపీ భయపడుతోందని విమర్శించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఆప్ తన మేనిఫెస్టోలో 70 అంశాలతో కూడిన యాక్షన్ ప్లాన్‌తో విడుదల చేసింది. -
కేజ్రీవాల్ పై దాడి
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై గుర్తు తెలియన వ్యక్తి కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశాడు. వాయవ్య ఢిల్లీలోని సుల్తాన్ పూరా మాజ్రాలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో కేజ్రీవాల్ ఎటువంటి గాయాలు కాలేదని ఆప్ వాలంటీరు ఒకరు తెలిపారు. దుండగులు విసిరిన కోడిగుడ్లు, రాళ్లు కేజ్రీవాల్ ప్రసంగిస్తున్న వేదిక వద్ద పడడంతో ఆయనకు ఏం కాలేదన్నారు. సుల్తాన్ పూరా మాజ్రాలో కేజ్రీవాల్ పై దాడి జరగడం ఇది రెండోసారి. -
బీజేపీలో చేరిన లవ్లీ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ హోం మంత్రి బూటా సింగ్ తనయుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అర్విందర్ సింగ్ లవ్లీ తన మద్దతుదారులతో కలిసి మంగళవారం బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు నచ్చి బీజేపీలో చేరినట్టు ఆయన తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో లవ్లీకి టిక్కెట్ ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడంతో ఆయన బీజేపీ చేరారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. 2008లో దియోలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అర్విందర్ సింగ్, 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఓటమి చవిచూశారు. -
గెలిచే అవకాశముందా?!
న్యూఢిల్లీ: తాము పోటీ చేయదలచుకున్న నియోజకవర్గాల్లో ఓటర్ల నాడి తెలుసుకొనేందుకు పలువురు భారతీయ జనతా పార్టీ ఆశావహులు వ్యక్తిగత సర్వేలు చేయించుకుంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన 67 మందిలో అత్యధికులు తమ నియోజకవర్గాల్లో విజయావకాశాలపై సర్వే చేయించుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. స్వల్ప తేడాతో గెలిచిన లేదా ఓడిన అభ్యర్థులు ఇందుకోసం కొన్ని ప్రైవేటు సంస్థలను రంగంలోకి దింపినట్టు తెలిసింది. ఈ సర్వే ద్వారా తమ పట్ల ఓటర్లలో ఏదైనా సానుకూల ప్రభావం కనిపిస్తే తమకు టికెట్ దక్కే అవకాశాలు అధికంగా కాగలవని వారు భావిస్తున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో గెలిచిన లేదా ఓడిపోయిన కొందరు అభ్యర్థుల స్థానంలో వేరొకరిని రంగంలోకి దింపాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ సర్వేకు తెర తీసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదే పదే యువతకు ప్రాధాన్యతనిస్తామని ప్రకటిస్తుండడంతో పార్టీ దృష్టిలో వయోవృద్ధులుగా ముద్రపడిన వారు కూడా ఈ సర్వే చేయించుకుంటున్నారని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ బీజేపీ నేత చెప్పారు. ఈ సర్వే కోసం అభ్యర్థులు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సర్వే ఫలితాలు సానుకూలంగా వస్తే, తనకు స్థానికుల మద్దతు ఉం దని పార్టీ ముందు చెప్పుకునేందుకు కూడా ఇది పనికి వస్తుందని వారు భావిస్తున్నారు. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున 31 మంది శాసనసభ్యులుగా విజయం సాధించిన సంగతి తెల్సిందే. వీరిలో ముగ్గురు ఆ తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నికయ్యారు. కనీసం ఆరు సీట్లలో స్వల్ప ఓట్ల తేడాతో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు గెలవటమో, ఓడటమో జరిగింది. దీంతో గత ఎన్నికల్లో ఓడిన వారితో పాటు గెలిచిన అభ్యర్థులు కూడా ఈ సర్వే చేయించుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బలంగా వీచిన ఆప్ గాలుల వల్లే తాము ఓటమి చెందామనిక్రితంసారి ఓడిన వారు చెప్పారు. అయితే ఈ ఏడాది కాలంలో పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని, ఈసారి తమకు గెలిచే అవకాశాలు మెరుగుపడ్డాయని వారు భావిస్తున్నారు. అయితే ఓటర్లలో తమపట్ల ప్రతికూలత కనిపిస్తే మౌనం వహించాలని కూడా వారు ముందుగానే నిర్ణయించుకున్నారు. కేంద్ర నాయకత్వం తమ ప్రాభవాన్ని గుర్తించే ఏదో ఒక సీటును కేటాయించకపోతుందా అన్న ఆశతో ఎదురు చూసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజల నాడిని తెలుసుకొనేందుకు ఈ సర్వేలు దోహదపడగలవని, ఓ అభ్యర్థి సొంతంగా సర్వే చేయించుకుంటే వచ్చే నష్టమేమీ లేదని దక్షిణ ఢిల్లీ ఎంపీ, బీజేపీ నాయకుడు రమేశ్ బిధూడీ అన్నారు. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ సర్వేలకు ప్రాధాన్యతనిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. కేవలం కొద్ది వేల రూపాయల ఖర్చుకు భయపడి తమకు లభించబోయే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టంలేని అభ్యర్థులందరూ ఒకరి తరువాత ఒకరు ఈ సర్వేలు చేయించుకుంటున్నారు. -
‘ఆప్’కు మద్దతుగా విదేశీ ఫోన్ కాల్స్
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దఇవ్వాలని కోరుతూ అమెరికా నుంచి దేశ రాజధానిలోని పౌరులకు భారీగా ఫోన్లు, సందేశాలు రావటంపై విచారణకు ఆదేశించాలని కోరు తూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు స్పందిం చింది. దీనిపై ప్రతిస్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ జస్టిస్ ప్రదీప్ నంద్రాజోగ్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు అనుకూలంగా అమెరికాకు చెందిన ఓ బృందం నిర్వహించిన పాత్రపై విచారణ జరపాలని న్యాయవాది ఎం.ఎల్.శర్మ పిటిషన్ దాఖలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశాల నుంచి నిధులు సమకూరుతున్నట్లు ఆయ న దాఖలు చేసిన పిటిషన్ ఇదే కోర్టులో పెండింగ్‌లో ఉంది. అమెరికాకు చెందిన ‘ఫోర్డ్ ఫౌండేషన్’ దీర్ఘకాలంగా కేజ్రీవాల్ ఆయన సహాయకులకు ఆర్థికంగా అండదండలు అందిస్తోందని పిటిషనర్ ఆరోపిం చారు. భారత్‌లో ఎన్నారైల పేరుతో వారు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా గత నవంబర్, డిసెంబర్ నెలల్లో లాస్ఏంజిల్స్ నుంచి నగరానికి చెందిన ఓటర్లకు ఆరు లక్షలకు పైగా ఫోన్ కాల్స్, 300 ఎస్సెమ్మెస్‌లు వచ్చాయన్నారు. ఇందుకు రూ.10 కోట్లకుపైగా వెచ్చించారన్నారు. హోంశాఖ, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫోన్ కాల్స్ రావటం దేశ భద్రతకు ముప్పని వాదించారు. ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యాన్ని భారత రాజ్యాంగం అనుమతిస్తుందో లేదో చెప్పాలని కోరారు. -
గుడ్ బై..: షీలా దీక్షిత్
సాక్షి, న్యూఢిల్లీ: పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా అధికారంలో కొనసాగిన షీలాదీక్షిత్‌కు ఘోర పరాభం ఎదురైంది. విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై నడిపించిన ఆమెకే ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ ఫలితాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిన ఈ దుస్థితికి ఆ పార్టీ నేతలందరూ కారణమైనప్పటికీ ఓటమిని షీలా హుందాగా అంగీకరించారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా ఉండడాన్ని గమనించిన షీలాదీక్షిత్ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత ఆమె విలేఖరులతో మాట్లాడూతూ ఢిల్లీ ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని చెప్పారు. 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతునిచ్చినందుకు ఆమె ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గెలుపోటములను విశ్లేషిస్తూ విలేఖరులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి ఆమె నిరాకరించారు. వాటికి తరువాత సమాధానమిస్తానంటూ దాటవేశారు. అయితే ఓటర్ల మూడ్ ను కనిపెట్టడంలో విఫలమయాృరా అన్న ప్రశ్నకు మాత్రం కాస్త అసహనంగా, మరికొంత వెటకారంగా.. ‘బేవకూఫ్హూనా’ ( తెలివితక్కువదాన్ని కదా) అని జవాబిచ్చి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. నిజానికి ప్రచారానికి పార్టీ పెద్దలు ముఖం చాటేసినా, స్థానిక నాయకులే సహకరించకపోయినా ఆమె తన లక్ష్యంవైపే పయనించారు. పార్టీని గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేశారు. దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా కీర్తిప్రతిష్టలు మూటగట్టుకున్న ఆమెకు కేంద్రంలో పార్టీ అవలంబిస్తున్న విధానాలు కూడా ప్రతికూలంగా మారాయి. ఎన్నికల బాధ్యతను పూర్తిగా ఆమె భుజాలపైకే నెట్టడం, దీర్ఘకాలంగా ఆమెకే ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తుండడంతో అవకాశం రాని స్థానిక నేతలు సహకరించకపోవడం వంటివే రాజధానిలో కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయి. వీటికి తోడు కొత్తగా పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రత్యేకించి షీలాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. -
'ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా నిర్ణయించ లేదు'
ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని బీజేపీ తెలిపింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది అని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా హర్ష వర్ధన్ ను ప్రకటించారనే వార్తలు మీడియాలో వస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రకటన చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మీడియా అడిగిన ప్రశ్నలకు గడ్కారీ జవాబిచ్చారు. త్వరలోనే పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది అని ఆయన తెలిపారు. క్లీన్ ఇమేజ్ ఉన్న నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో హర్ష వర్ధన్ పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఢిల్లీలో ఆరోగ్య శాఖ మంత్రిగా హర్ష వర్ధన్ సేవలందించారు. కాంగ్రెస్ తరపున ప్రస్తుత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రివాల్ పేర్లు ఖరారైన సంగతి తెలిసిందే.